
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో లభ్యతగా ఉన్న నీటిలో ఆంధ్రప్రదేశ్ తనకు రావాల్సిన వాటాకు మించి వినియోగిస్తోందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. బోర్డు ఆదేశాలు లేకుండా పెద్ద ఎత్తున నీటిని వినియోగించరాదని ఏపీకి సూచించాలని కోరింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ బోర్డుకు లేఖ రాశారు. ప్రస్తుత వాటర్ ఇయర్‌లో కృష్ణా బోర్డు తెలంగాణకు 82.5 టీఎంసీలు, ఏపీకి 35 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించిందని చెప్పారు. అయితే అందుకు భిన్నంగా ఏపీ ఏకంగా 146 టీఎంసీల మేర నీటిని వినియోగించుకుందని తెలిపారు.
నిర్దిష్ట వాటాల ప్రకారం చూసినా, ఏపీకి గరిష్టంగా లభ్యత జలాల్లో 123.18 టీఎంసీలే దక్కుతాయని, అయితే 22.84 టీఎంసీలను ఏపీ అధికంగా వినియోగించిందని తెలిపారు. ప్రస్తుతం నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో వినియోగార్హమైన నీరు 163 టీఎంసీలు మాత్రమే ఉందని, ఈ నీటిని వచ్చే ఏడాది జూలై వరకు వీటిని వినియోగించాల్సి ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో భారీగా నీటి వినియోగం చేయకుండా ఏపీకి సూచించాలని ఆయన బోర్డును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment