సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను వినియోగిస్తూ పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 203 పూర్తిగా అక్రమమని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధంగా, తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర భంగకరంగా ఉన్న ఈ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియ సహా ఎలాంటి ముందడుగు వేయకుండా ఏపీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కృష్ణా జలాలను ఆధారంగా చేసుకొని చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు ఏపీ నిర్ణయం తీవ్ర నష్టం చేస్తుందని పేర్కొంది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన సమా వేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మంగళవారం నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. ఇందులో ఏపీ తెచ్చిన జీవో అంశాలను లేఖలో పేర్కొంటూ, ఎక్కడెక్కడ ఉల్లంఘనలు జరిగాయో వివరించారు. శ్రీశైలం నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ చేపడుతున్న ఎత్తిపోతలతో పాటు, పోతిరెడ్డిపాడు విస్తరణను అడ్డుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
లేఖలోని ప్రధానాంశాలివీ..
(చదవండి: ‘మిగులు’ పంపకాలపై దృష్టి!)
- ఏపీ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను అతిక్రమించి ఈ ప్రాజెక్టులు చేపడుతోంది. ఇవి పూర్తిగా కొత్త ప్రాజెక్టులే. విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టరాదనే నిబంధనను ఏపీ తుంగలో తొక్కింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణతో పాటు శ్రీశైలంపై కొత్త ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన ప్రకటనకు సంబంధించి వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలతో గతంలోనే ఇరిగేషన్ ఈఎన్సీ బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై బోర్డు స్పందిస్తూ, కొత్త ప్రాజెక్టుల డీటైల్డ్ రిపోర్టులు బోర్డుకు సమర్పించాలని ఇదివరకే బోర్డు ఏపీని ఆదేశించింది.
- అసెంబ్లీలో ప్రకటించినట్టుగానే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు చేపట్టేందుకు మే 5న జీవో నం.203 జారీచేసింది. దీని ప్రకారం రూ.6,829.15 కోట్లతో శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను సంగమేశ్వరం నుంచి రోజుకు 3 టీఎంసీలు లిఫ్ట్ చేయనున్నారని తెలిపారు. ఇలా లిఫ్ట్‌చేసే నీటిని పోతిరెడ్డిపాడు నుంచి నాలుగు కి.మీ. దూరంలోని శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్‌కు లింక్ చేయనున్నారని పేర్కొన్నారు. శ్రీశైలం నుంచి అదనంగా కృష్ణా నీటిని పెన్నా బేసిన్‌కు తరలించేందుకు కాలువ క్యారింగ్ కెపాసిటీని ఏపీ పెంచుతోంది. కాబట్టి దీన్ని పూర్తిగా కొత్త ప్రాజెక్టుగా చూడాలి.
- పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తీసుకునే సామర్థ్యాన్ని రోజుకు 8 టీఎంసీలకు పెంచేలా పునర్వ్యవస్థీకరణ చట్టానికి పూర్తి విరుద్ధంగా, తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసేలా ఏపీ నిర్ణయం ఉంది.
- శ్రీశైలం రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి అదనపు నీటిని తీసుకునే ముందు మా రాష్ట్రానికి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. భారతదేశంలోని ఒక బాధ్యతాయుతమైన రాష్ట్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఎవరూ ఊహించరు.
- హైదరాబాద్ నగర తాగునీరు, మిషన్ భగీరథ అవసరాలతో పాటు పాత మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల తాగు, సాగునీటి అవసరాల కోసం తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం జలాశయంపైనే ఆధారపడుతోంది.
- ఏపీ కొత్త ప్రాజెక్టులతో నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్, ఏఎమ్మార్ ఎస్‌ఎల్‌బీïసీ, కల్వకుర్తి, డిండి, పాలమూరు– రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులు, శ్రీశైలం ఎడమగట్టు పవర్‌స్టేషన్‌లో విద్యుత్ ఉత్పాదనపై తీవ్ర ప్రభావం పడుతుంది. బేసిన్ అవతలి అవసరాలకు నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో తెలంగాణలోని కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు ప్రమాదంలో పడతాయి.
- పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బేసిన్ అవతలికి నీటిని తరలిస్తున్న ఏపీ వాటికి సరైన లెక్కలు కూడా చెప్పడంలేదు. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీలు లేకపోవడంతో ఏపీ ఎన్ని నీళ్లు తీసుకుంటుందో కూడా లెక్కలు లేవు. దీంతో ఆ రాష్ట్రం ఎక్కువ ప్రయోజనం పొందుతోంది. విచక్షణారహితంగా, ఇష్టారాజ్యంగా కృష్ణానీటిని బేసిన్ అవతలికి మళ్లిస్తోంది.
- వాస్తవంగా పోతిరెడ్డిపాడు ద్వారా 11,150 క్యూసెక్కుల నీటిని తీసుకునేందుకే అనుమతి ఉంది. కానీ, ఏపీ కుట్రపూరితంగా దాని కెపాసిటీని 44వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచడంతో పాటు పవర్ ఛానల్ ద్వారా మరో 5వేల క్యూసెక్కులు వినియోగిస్తోంది. ఈ కుట్రను తెలంగాణ.. ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లింది. దీంతో ప్రస్తుతం ఏపీ నిర్ణయం న్యాయ పరిధిలోకి వస్తుంది.
- ఆయా రాష్ట్రాల పరివాహకాన్ని పరిగణనలోకి తీసుకొని జలాల పంపిణీ ఉండాలన్న ప్రాథమిక సూత్రం మేరకు, ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 575 టీఎంసీ మేర కచ్చితంగా దక్కుతాయి. సమీప భవిష్యత్తులోనే ఈ నిర్ణయం వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఏపీ శ్రీశైలం జలాశయం నుంచి అదనపు జలాలను తీసుకెళ్లడం పూర్తిగా అన్యాయం.
- పునర్వ్యవస్థీకరణ చట్టం, 11వ షెడ్యూల్‌లోని 85(8)(డి) క్లాజ్–1 ప్రకారం చట్టబద్ధ అధికారాలున్న కృష్ణా బోర్డు.. ఏపీ చేపట్టిన ప్రాజెక్టులను సమర్థించడంగానీ, సిఫార్సు చేయడంగానీ సమర్థనీయం కాదు.
నేడు కృష్ణాబోర్డు చైర్మన్‌తో రజత్‌కుమార్ భేటీ
ఏపీ ప్రభుత్వం తెచ్చిన 203జీవోను సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఈ ప్రాజెక్టులపై కృష్ణాబోర్డు చైర్మన్‌ను నేరుగా కలిసి వివరించాలని నీటి పారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో రజత్‌కుమార్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు బోర్డు చైర్మన్‌తో భేటీ అయి, ఏపీ జీవోలపై ఫిర్యాదు చేయనున్నారు. ఏపీ చర్యలు తెలంగాణకు ఎలా భంగకరమో వివరించనున్నారు. కాగా కృష్ణా, గోదావరి బోర్డుల్లో అడ్మినిస్ట్రేటివ్ మెంబర్‌గా రజత్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. గతంలో ఈ స్థానంలో నీటి పారుదల శాఖ ఇన్‌చార్జి బాధ్యతలు చూసిన సీఎస్ సోమేశ్‌కుమార్ సభ్యుడిగా ఉండగా, ఆయన స్థానంలో ప్రస్తుతం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రజత్‌కుమార్ నియమితులు కావడంతో ఆయనను సభ్యుడిగా నియమించింది.
(చదవండి: ఏది పడితే అది పండించొద్దు: సీఎం కేసీఆర్)
Comments
Please login to add a commentAdd a comment