సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. ఆగస్టు రెండో వారం నాటికిగానీ ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలానికి చేరడం లేదు. మరోపక్క కర్ణాటక సర్కార్ ఆల్మట్టి జలాశయం ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతున్న నేపథ్యంలో ఎగువ నుంచి వరద ప్రవాహం సెప్టెంబరు ఆఖరు నాటికిగానీ చేరే అవకాశం ఉండదు. ఫలితంగా కృష్ణాలో నీటి లభ్యత మరింత తగ్గడం ఖాయం. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను శ్రీశైలం జలాశయంలోకి ఎత్తిపోస్తే ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంతోపాటు అటు దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని ఆయకట్టును స్థిరీకరించవచ్చునని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు ఈనెల 28న హైదరాబాద్‌లో ఇద్దరు సీఎంలు సమావేశమవుతున్నారు. గోదావరి వరద జలాలను గరిష్టంగా వినియోగించుకోవడంపై అధ్యయనం చేసి ఆలోగా నివేదికలను సిద్ధం చేయాలని ఇరు రాష్ట్రాల అధికారులను ఆదేశించారు.
పలు ప్రతిపాదనలపై అధికారుల కసరత్తు
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్న నేపథ్యంలో గోదావరి జలాలను శ్రీశైలం జలాశయానికి తరలించే ప్రతిపాదనలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావుతోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తదితరులు గోదావరి జలాలను శ్రీశైలం జలాశయానికి మళ్లింపుపై సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. గోదావరిలో ఇంద్రావతి నది కలసిన తర్వాత బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు టీఎంసీలను శ్రీశైలంలోకి తరలించే ప్రతిపాదనపై ప్రధానంగా చర్చిస్తున్నారు. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) చేసిన ప్రతిపాదనల్లో ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్, అకినేపల్లి–నాగార్జునసాగర్ అనుసంధానాలను రీడిజైనింగ్ చేసి ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను శ్రీశైలం తరలించడం.. అకినేపల్లి నుంచి శ్రీశైలం జలాశయంలోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ మూడు ప్రతిపాదనల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని వినియోగించుకునే ప్రతిపాదనపై మొగ్గు చూపాలని ఇరువురు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. గోదావరి నుంచి రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు టీఎంసీలను శ్రీశైలం జలాశయంలోకి ఎత్తిపోస్తే తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటి ఎద్దడిని అధిగమించవచ్చని సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఆ 90 రోజులు నీటిని ఎత్తిపోస్తే..
ఏటా గోదావరిలో మూడు నుంచి నాలుగు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. ప్రాణహిత, ఇంద్రావతి ఉపనదుల ద్వారా గరిష్టంగా వరద జలాలు గోదావరిలోకి చేరుతున్నాయి. జూలై నుంచి అక్టోబర్ వరకూ ఏటా సగటున 90 రోజులపాటు గోదావరిలో గరిష్టంగా వరద ఉంటుంది. ఆ 90 రోజుల్లో నిత్యం సగటున నాలుగు నుంచి ఐదు టీఎంసీలను శ్రీశైలం జలాశయంలోకి ఎత్తిపోస్తే ఇటు ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా.. అటు తెలంగాణలో పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ఆయకట్టులను స్థిరీకరించవచ్చు. శ్రీశైలం జలాశయం నిండిన తర్వాత గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు తరలించి సాగర్ ఆయకట్టును స్థిరీకరించవచ్చు. అక్కడి నుంచి పులిచింతల మీదుగా ప్రకాశం బ్యారేజీకి నీటిని తరలించి కృష్ణా డెల్టా అవసరాలను తీర్చవచ్చునని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment