Krishna and Godavari rivers
-
‘గెజిట్’తో నదులు, ప్రాజెక్టుల స్వాధీనం చెల్లదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులు, వాటిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధమని ప్రముఖ న్యాయనిపుణుడు, మాజీ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలతో ఈ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్టు కేంద్రం చెపుతోందని, అయితే నదులు, వాటిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని ఈ చట్టం లో ఎక్కడా లేదన్నారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేసి, వాటి అధికార పరిధిని నిర్ణయించే అవకాశమే కేంద్రానికి ఉందన్నారు. గెజిట్ నోటిఫికేషన్‌పై తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం శనివారం ఇక్కడ నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బోర్డుల అధికార పరిమితిని నిర్వచించే సాకుతో గెజిట్ ద్వారా కేంద్రం రాష్ట్రాల అధికారాలను లాక్కుందని విమర్శించారు. దీనివల్లరూ.70 వేల కోట్ల అంచనాలతో తెలంగాణ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత అర్ధంతరంగా నిలిపివేయాల్సి వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టులు ఆగిపోతే రాష్ట్రం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. కేంద్రం తక్షణమే ఈ గెజిట్ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయసమ్మతంగా ఉండాలి: తెలంగాణ భౌ గోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నదీ జలాల్లో న్యాయమైన కేటాయింపులను జరపాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ ఎత్తిపోతల పథకాలతో నీళ్లను తీసుకోవాలంటే అధిక సమయం, వ్యయం అవుతుందని, అదే ఏపీలో కేవలం ప్రాజెక్టుల గేట్లను ఎత్తడం ద్వారా నీళ్లు వస్తాయని అన్నారు. కాగా, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం ఇంకా కొనసాగుతోందని, వీటిపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి విమర్శించారు. కేంద్రం తెచ్చిన గెజిట్ నోటిఫికేషన్ వల్ల హైదరాబాద్ సహా మొత్తం రాష్ట్రం తాగునీటి కోసం కటకటలాడాల్సి వస్తుందని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్‌రెడ్డిలు ఈ కార్యక్రమానికి సంధానకర్తలుగా వ్యవహరించారు. -
త్వరలో ‘అపెక్స్’ భేటీ!
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడమే లక్ష్యంగా అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో చర్చించి సమావేశం అజెండాను రూపొందించాలని కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లను కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆదేశించారు. గతేడాది జూలై 15న కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలును అజెండాలో ప్రధానంగా చేర్చాలని సూచించారు. గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, మదింపు అంశాన్నీ పొందుపరచాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాలు సూచించిన మేరకు మిగతా అంశాలను అజెండాలో చేర్చి ప్రతిపాదనలు పంపాలని నిర్దేశించారు. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో చర్చించి అజెండాను ఖరారు చేయనున్నారు. అనంతరం రెండు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌లతో చర్చించి వారు అందుబాటులో ఉండే రోజు అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని షెకావత్ నిర్వహించనున్నారు. అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశాన్ని 2016 సెప్టెంబరు 21న కేంద్రం నిర్వహించింది. రెండో భేటీ 2020 అక్టోబర్ 6న జరిగింది. మూడో భేటీని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభమయ్యేలోగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. -
ఇక బోర్డుల వంతు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల పరిధిపై సబ్‌కమిటీ స్థాయి భేటీలో ఏమీ తేలలేదు. బోర్డు పరిధిలో ఉండాల్సిన ప్రాజెక్టులపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం ఉంది. దీంతో తదుపరి నిర్ణయాలు పూర్తిస్థాయి బోర్డుల్లోనే తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే గోదావరి బోర్డు, మంగళవారం జరిగే కృష్ణా బోర్డు భేటీలు కీలకంగా మారాయి. ప్రాజెక్టుల అంశంతో పాటు సిబ్బంది నియామకం, నిధుల చెల్లింపు అం శాలపై వరుసగా జరగనున్న భేటీల్లోనే స్పష్టత రా నుంది. ఇక్కడ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలు జరగనుంది. గెజిట్ అమలుపై చర్చించేందుకు ఆదివారం ఉదయం జలసౌధలో గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే అధ్యక్షతన, మధ్యాహ్నం కృష్ణా బోర్డు తరఫున రవికుమార్ పిళ్లై అధ్యక్షతన భేటీలు జరగ్గా, తెలంగాణ తరఫున సీనియర్ ఇంజనీర్లు సుబ్రహ్మణ్య ప్రసాద్, విజయ్‌కుమార్, శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. ఒక్కో భేటీ సుమారు మూడు గంటలకుపైగా జరగ్గా, బోర్డు అధీనంలో ఉండాల్సిన ప్రాజెక్టులు, సిబ్బంది, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు, బోర్డు అభిప్రాయాలు, నిధుల చెల్లింపు తదితర అంశాలపై చర్చలు జరిగాయి. గోదావరి ఒక్కటే.. మిగతా వాటికి ఒప్పుకోం.. ఇక గోదావరి బోర్డు భేటీలో ప్రధానంగా ప్రాజెక్టుల పరిధిపై చర్చ జరిగింది. తెలంగాణ ముందు నుంచి చెబుతున్నట్లుగా రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న పెద్దవాగును మాత్రమే బోర్డు పరిధిలో ఉంచాలని కోరింది. అయితే ఏపీ మాత్రం శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ బ్యారేజీ వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోనే ఉంచాలని విన్నవించింది. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై పూర్తిస్థాయి భేటీలో చర్చిద్దామంటూ బోర్డు సర్దిచెప్పింది. ఇక పెద్దవాగు కింద 80% ఆయకట్టు ఏపీ పరిధిలో ఉన్నందున దాని నిర్వహణకయ్యే వ్యయంలో 80% ఏపీనే భరించాలని కోరగా, దీనికి సానుకూలత లభించినట్లు తెలిసింది. మిగతా నిధు లు, సిబ్బంది, వాటికిచ్చే ప్రత్యేక ప్రోత్సాహకాలపై సోమవారం జరిగే బోర్డు భేటీలో స్పష్టత రానుంది. విద్యుదుత్పత్తి కేంద్రాలపై తెలంగాణ అభ్యంతరం కృష్ణా బేసిన్లో జూరాల నుంచి పులిచింతల వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలో ఉంచాలన్న ప్రతిపాదనలపై ఇరురాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, సాగర్, పులిచింతల విద్యుత్కేంద్రాలు బోర్డుల పరిధిలో అక్కర్లే దని తెలంగాణ చెప్పినట్లు సమాచారం. జూరాల ప్రాజెక్టును సైతం బోర్డు పరిధిలోకి తేవడాన్ని తెలంగాణ తప్పుపట్టింది. శ్రీశైలం మీద ఆధార పడి ఉండే కల్వకుర్తి, నాగార్జునసాగర్ హెడ్ రెగ్యులేటర్, ఎడమ కాల్వ హెడ్‌రెగ్యులేటర్, సాగర్ పరిధిలోని వరద కాల్వ, ఆర్డీఎస్, దాని పరిధిలోని తుమ్మిళ్ల, సిద్ధనాపూర్ కాల్వ, ఆర్డీఎస్ హెడ్రెగ్యులేటర్లనే బోర్డు ఆధీనంలో ఉంచేందుకు సంసిద్ధత తెలిపినట్లు సమాచారం. ఇక ఏపీ బనకచర్లతోపాటు దానికింద ఉన్న ఔట్లెట్లు మినహా శ్రీశైలం పరిధిలోని హెచ్ఎన్ఎస్ఎస్, ముచ్చుమర్రి, హెడ్ రెగ్యులేటర్లు, పవర్‌హౌస్, పోతిరెడ్డిపాడు, సాగర్ కింది కుడి కాల్వ, పులిచింతలను బోర్డు పరిధిలో ఉంచేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఏపీ అధికారులు తెలంగాణ పవర్‌హౌస్‌లు తీసుకోవాల్సిందేనని గట్టిగా పట్టు బట్టినట్లు తెలిసింది. ప్రాజెక్టులపై ఒక్కో రాష్ట్రానిది ఒక్కో అభిప్రాయం కావడంతో బోర్డుల భేటీల్లో ఖరారు చేయాలని నిర్ణయించారు. -
10 రోజుల్లో ప్రాజెక్టుల వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బేసిన్లలోని ప్రాజెక్టుల వివరాలు, ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వివరాలను 10 రోజుల్లోగా తమకు సమర్పించాలని రెండు బోర్డులు తెలుగు రాష్ట్రాలను మరోసారి ఆదేశించాయి. అలాగే నిర్మాణంలోని ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన వివరాలు, వాటి బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీల జాబితా, వాటి నిర్వహణకు చేస్తున్న ఖర్చుల వివరాలను సైతం సమర్పించాలని కోరాయి. గెజిట్ నోటిఫికేషన్ల అమలుపై చర్చించేందుకు బోర్డులు ఏర్పాటు చేసిన సబ్ కమిటీలు శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో వేర్వేరుగా భేటీ అయ్యాయి. ఈ భేటీలకు బోర్డుల సభ్య కార్యదర్శులు డీఎం రాయ్‌పురే, బీపీ పాండేతోపాటు తెలంగాణ తరఫున అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు, ఏపీ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ప్రాజెక్టుల వివరాలను 10 రోజుల్లో ఇచ్చేందుకు తెలంగాణ అంగీకరించగా కొన్ని ప్రాజెక్టుల వివరాలపై ఏపీ అభ్యంతరం తెలిపింది. ముఖ్యంగా బనకచర్లకు సంబంధించి వివరాలు అవసరం లేదని ఏపీ ఇంజనీర్లు చెప్పినట్లు తెలిసింది. అయితే అన్ని వివరాలు సమర్పించాలని, అక్కర్లేని వాటిపై తదుపరి భేటీలో చర్చిద్దామని బోర్డు ఇంజనీర్లు చెప్పినట్లు సమాచారం. వచ్చే వారం కేంద్రం కొత్తగా నియమించిన ఇద్దరు సీఈలు విధుల్లో చేరుతున్నారని, వారికి అన్ని వివరాలు తెలియజేయాల్సి ఉందని బోర్డుల అధికారులు వివరించారు. ఏయే ప్రాజెక్టులు ఏ బోర్డు పరిధిలో ఉండాలన్న విషయం తేలాక కేంద్ర బలగాల భద్రత అంశాన్ని చర్చిద్దామని ఇరు రాష్ట్రాలు తెలిపినట్లు సమాచారం. సీడ్ మనీ అందించడంపై ప్రభుత్వ స్థాయిలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఇరు రాష్ట్రాల అధికారులు తెలపగా అందుకు బోర్డులు అంగీకరించాయి. ఈ భేటీలో ప్రాజెక్టుల డీపీఆర్‌ల అంశంపై చర్చించలేదని తెలిసింది. -
జలవివాదాల పరిష్కారానికి ఇదే మార్గం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య కృష్ణా, గోదావరి నదీజలాల వివాదాల సమస్య కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. గత అనుభవాల రీత్యా రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ సమస్య పరిష్కారం అంత సులువు కాదు కాబట్టి అంతర్జాతీయ జలవివాదాల పరిష్కారానికి ప్రపంచస్థాయిలో రూపొందించిన ‘హెల్సెంకీ’ జలసూత్రమే శరణ్యమనిపిస్తోంది. ఏ దేశంలోనైనా ఎగువన ఉన్న రాష్ట్రానికే నదీజలాలను ముందుగా వినియోగించుకునే సర్వహక్కు ఉంటుందని, దిగువన ఉన్న రాష్ట్రాలు ఆ తరువాతనే నదీజలాలను వినియోగించుకునే హక్కు ఉంటుందన్న వాదనను ‘హెల్సెంకీ’ ప్రపంచ మహాసభ తిరస్కరించింది. సమానస్థాయిలో నదీజలాలను ముందు తాగునీటికీ, సాగునీటి అవసరాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి, వాడుకోవాలని ‘హెల్సెంకీ’ మహాసభ 1966లో ఏకగ్రీవంగా తీర్మానించింది. రాజ్యాంగానికి, దేశ ఫెడరల్ స్వభావానికి పరమ విరుద్ధంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని, పరిశ్రమల్ని ‘చాప చుట్టేసి’ భారీ స్థాయిలో ప్రైవేట్ గుత్తాధిపతులకు, పాలకులు ధారా దత్తం చేయడానికి కేంద్రపాలకులు నిర్ణయించేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారం కూడా జటిలమవు తోంది! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అర్ధాంతరంగా చీలగొట్టి తమాషా చూస్తున్న నిన్నటి కాంగ్రెస్, నేటి బీజేపీ పాలకులు సరికొత్త విభజన నాటకం ఆడుతూ వస్తున్నారు. దీంట్లో భాగంగానే విభజిత రాష్ట్ర ప్రయోజనాలకు ఉద్దేశించిన కేంద్ర ఒప్పందాలకు విరుద్ధంగా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల మధ్య కృష్ణ, గోదావరి నదీజలాల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య కృష్ణా, గోదావరి నదీజలాల వివాదాల సమస్య కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. గత అనుభవాల రీత్యా రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ సమస్య పరిష్కారం అంత సులువు కాదు కాబట్టి అంతర్జాతీయ జలవివాదాల పరిష్కారానికి ప్రపంచస్థాయిలో రూపొందించిన ‘హెల్సెంకీ’ జల సూత్రమే శరణ్యమనిపిస్తోంది. పైగా ఇప్పటిదాకా జల వివాదాల పరి ష్కారానికి స్వతంత్ర శక్తులుగా వ్యవహరిస్తున్న ప్రత్యేక రివర్బోర్టులు కూడా కేంద్రం అధీనంలోనే జారుకునే ప్రమాదం ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచీ కృష్ణా, గోదావరి నదులపై ఉన్న మేజర్, మధ్య రకం సాగునీటి ప్రాజెక్టులన్నీ కేంద్రం అధీనంలోకి జారుకోనున్నా యంటూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కృష్ణానదిపైన ఆధా రపడిన వివిధ స్థాయి ప్రాజెక్టులు 36 కాగా, గోదావరి నదీ జలాలపై ఆధారపడిన రెండు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఒడిశాలతో కలిపి 21 ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ప్రాజెక్టులతోపాటు వాటికి సంబం ధించిన అనుబంధ విభాగాలన్నీ కూడా (బ్యారేజ్‌లు, డ్యామ్‌లు, రిజ ర్వాయర్లు, తదితర నిర్మాణ భాగాలు సహా) ఇకపై కేంద్ర సంస్థల పరిధిలోనే జారుకుంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను నిష్పాక్షి కంగా ఉంచే పేరిట ఈ రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు రెండు రివర్బోర్డులలోనూ ప్రధాన పదవులలో ఉండరు! ఇక కృష్ణానదీ జల వ్యవస్థ కిందకు ఏపీ, తెలంగాణలు రెండింటి పరిధిలోకి వచ్చే ప్రాజె క్టులు శ్రీశైలం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం కుడికాల్వ, కాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు, టైల్‌పాండ్, తుంగభద్ర ప్రాజెక్టు, భైరవాని తిప్ప, రాజోలిబండ డైవర్షన్ పథకం, కె.సి. కెనాల్ ప్రాజెక్టు, గాజులదిన్నె. కాగా ఇంతవరకు కేంద్రం రెండు రాష్ట్రాలలోనూ ఇంకా అనుమతించని ప్రాజెక్టులు– తెలుగు గంగ, టి.జి.సి.హెడ్ వర్క్స్, వెలి గొండ ప్రాజెక్టు, దాని హెడ్ రెగ్యులేటర్ టన్నెల్, తదితర భాగాలు. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం, పంప్‌హౌస్, మచ్చుమర్రి లిఫ్ట్ ఇరి గేషన్ పథకం, గాలేరు–నగరి సుజల స్రవంతి, దాని హెడ్‌వర్క్స్, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం, మునిమేరు ప్రాజెక్టు పునర్నిర్మాణ పథకం. ఇక గోదావరి నదిపై తల పెట్టిన ఆంధ్ర–తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతించిన పథకాలు ఏవంటే... పెదవేగి (గుమ్మడిపల్లి) శ్రీ వై.వి. రామకృష్ణ (సూరెం పాలెం) రిజర్వాయర్ పథకం, ముసురుమిల్లి రిజర్వాయర్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, కాటన్ బ్యారేజి, చాగల్నాడు ఎత్తి పోతల పథకం, భూపతి పాలెం రిజర్వాయర్, తదితరాలు, కాగా, గోదావరిపై కేంద్రం అనుమతించని ప్రాజెక్టులు. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగే షన్ పథకం, పురుషోత్తపట్నం, ఎత్తిపోతల పథకం, (ఇదికూడా పోలవరం భారీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత నిలిచి పోతుంది.) చింతలపూడి ఎత్తి పోతల పథకం వెంకట నగరం. కృష్ణా– గోదావరి నదీ జలాల పంపిణీ వివాదంలో కేంద్రం విధానాలు మరిన్ని తగాదాలకు కారణమయ్యే అవకాశాలే ఎక్కువ కాబట్టి అంతర్జాతీయ జల వివాదాల పరిష్కారా నికి ప్రపంచ స్థాయిలో రూపొందించిన ‘హెల్సెంకీ’ జలసూత్రమే శరణ్యమనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆశపెట్టుకున్న బచావత్ ట్రిబ్యునల్ ప్రతిపాదనలు, తెలంగాణ ఆశపెట్టుకున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రతిపాదనలు గానీ ఆచరణలో అక్కరకు రానందున, హేతుబద్ధమైన అంతర్జాతీయ జలవివాదాల పరిష్కారాలకు మూలమైన వివాదరహితమైన ‘హెల్సెంకీ’ నదీజలాల పంపిణీ వ్యవస్థే భారతదేశానికి శరణ్యమని అనిపిస్తోంది. ఏ దేశంలోనైనా ఎగువన ఉన్న రాష్ట్రానికే నదీజలాలను ముందుగా వినియోగించుకునే సర్వహక్కు ఉంటుందని, దిగువన ఉన్న రాష్ట్రాలు ఆ తరువాతనే నదీజలాలను వినియోగించుకునే హక్కు ఉంటుందన్న వాదనను ‘హెల్సెంకీ’ ప్రపంచ మహాసభ తిర స్కరించింది. సమానస్థాయిలో నదీజలాలను ముందు తాగునీటికీ, సాగు నీటి అవసరాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి, వాడుకోవాలని ‘హెల్సెంకీ’ మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అందుకే బచావత్ ట్రిబ్యునల్ కాలపరిమితి 2000–2001 సంవత్సరంతో ముగియనుం డగా, నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి కృష్ణా జలాల్లో అదనపు నీటి సంపద సముద్రం పాలుకాకుండా వాడుకోవచ్చుగానీ ఆ నీటిపైన తన హక్కును మాత్రం చాటుకోకూడదని ఆదేశించి పోయింది. కానీ ఆ స్థితిలో ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన వెలగబెడుతూ వచ్చిన నాటి కాంగ్రెస్, టీడీపీ పాలకులు (ఎన్టీఆర్, వై.ఎస్. రాజ శేఖరరెడ్డి, నేటి వైఎస్సార్సీపీ సార«థి జగన్మోహన్రెడ్డి మినహా) బచావత్ సూచించినట్టు నదీ జలసంపద అనవసరంగా సముద్రం పాలు కాకుండా ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలన్న ప్రతిపాదనను పెడ చెవిన పెట్టిన ఫలితంగా, కనీసం చెక్‌డ్యామ్‌ను కూడా సకాలంలో నిర్మించుకోకుండా కాలక్షేపం చేస్తూ వచ్చారు. ముందస్తుగా నిర్దిష్టమైన ఒప్పందాలు రాష్ట్రాల మధ్య లేకుండా భవిష్యత్తులో వినియోగం పేరిట నదీ జలరాశిని దొంగచాటుగా రిజర్వు చేయడానికి ప్రయత్నిం చడం సాధ్యపడని విషయమని ప్రసిద్ధ ఇరిగేషన్ నిపుణుడు లిప్పర్ చెప్పాడు! కనుకనే ‘హెల్సెంకీ’ నిబంధనలు నదీ జలరాశి వాడకంలో హేతుబద్ధ వినియోగానికి మాత్రమే కట్టుబడి ఉండాలని రాష్ట్రాలను, దేశాలను శాసించవలసి వచ్చిందని గుర్తించాలి! జలరాశి ‘ముందస్తు దొంగవాడకం’ సూత్రాన్ని అనుమతించిన అమెరికా సైనికాధికారి హెర్మాన్ సూత్రం చెల్లనేరదని కూడా హెల్సెంకీ నిబంధనలు స్పష్టం చేశాయి. అమెరికా ‘హెర్మాన్’ దొంగవాడకం సూత్రాన్ని ఏనాడో ఒక కేసులో కలకత్తా హైకోర్టు (1906–07) కొట్టే సింది! ఉభయ రాష్ట్రాల వాడకానికి సరిపడా నీళ్లు నదిలో లేనప్పుడు నదీ జలరాశిని సమంగా సంబంధిత రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సి ఉంటుంది. చివరికి నైలునదీ జలాల వివాదంలో కూడా సూడాన్, ఈజిప్టులు, అమెరికాలోని రాష్ట్రాలూ, హెల్సెంకీ అంతర్జా తీయ నిబంధనలనే పాటించాల్సి వచ్చింది! కృష్ణా–గోదావరి జల నిధుల వాడక సమస్యలను పరిష్కరించడానికి రివర్ ర్యాలీ వ్యవస్థ ఉన్నా తాత్సారం జరగడానికి కారణం... ప్రజలకు దూరమైన పాల కులు, వారి స్వప్రయోజనాలేనని మరవరాదు. ఈ రకమైన వారస త్వానికి, ఎన్టీఆర్, వైఎస్సార్ ఉమ్మడి ఏపీ పగ్గాలు చేపట్టిన తరు వాతనే గండిపడింది. ఈ అనుభవాలన్నింటినీ గుణపాఠాలుగా భావించి ఏపీ సీఎం స్థానంలో ఉండి, వైఎస్సార్ అనుభవచ్ఛాయల నుంచి దూసుకువచ్చి నవరత్నాలు పేర్చడమే కాకుండా, అంతకుమించిన ప్రజాసంక్షేమ పథకాలతో, కేంద్ర నాయకత్వాలు సమగ్ర ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి తలపెడు తున్న ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్న చిరంజీవి, యువనేత వైఎస్ జగన్. అతను మానవ, మానవేతర ప్రకృ తులు కల్పించిన సవాళ్లను ఎదుర్కొంటూ మాట తప్పకుండా, మడమ తిప్పకుండానే’ దూసుకుపోతున్నాడు. గనుకనే 6 కోట్లమంది ప్రజలు ‘కోలాహల నాయకా శెభాషురే’ అని తనని దీవిస్తున్నారు! -ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
800 టీఎంసీలు కడలిపాలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో గతంలో ఎన్నడూ లేనంత వర్షాలు కురవడం, మహారాష్ట్ర, కర్ణాటక నదీ పరివాహక ప్రాంతాల నుంచి భారీ వరదలు పోటెత్తడంతో ఈ ఏడాది కృష్ణా, గోదావరి నదుల నుంచి భారీగా వరద నీరు సముద్రం పాలవుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా జూలై నెలలో గోదావరి బేసిన్ ప్రాజెక్టులు, ఆగస్టు తొలి వారంలోనే కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు నిండటంతో వచ్చిన నీరు వచ్చినట్లుగా సముద్రంలో కలుస్తోంది. వాటర్ ఇయర్ ఆరంభమైన జూన్ 1 నుంచి 85 రోజుల వ్యవధిలో 800 టీఎంసీల నీరు కడలిపాలైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కృష్ణాలో 170.. గోదావరిలో 631... రెండు నదీ బేసిన్ల పరిధిలో జూన్ తొలకరి వర్షాలు పెద్దగా ప్రభావం చూపకున్నా జూలైలో కురిసిన భారీ, అతిభారీ వర్షాలతో నదులు ఉప్పొంగాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో 25–30 సెం.మీ. వర్షపాతం నమోదవడంతో జూలై రెండో వారం నుంచే దిగువకు భారీ ప్రవాహాలు వచ్చాయి. జూలై మూడో వారంలోనే శ్రీశైలం గేట్లు తెరుచుకోగా, ఆగస్టు 1న నాగార్జునసాగర్ గేట్లు తెరిచారు. రాష్ట్రంలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల కింద 299 టీఎంసీల మేర నీటి వినియోగం ఉన్నప్పటికీ చెరువులు, కుంటలు అన్ని నిండి ఉండటం, రిజర్వాయర్లలోనూ నీటి నిల్వలు ఉండటంతో ఈ ఏడాది కృష్ణా బేసిన్లో తెలంగాణ 35 టీఎంసీలకు మించి వినియోగించలేదు. గోదావరిలోనూ భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌మానేరు, కడెం సహా మధ్యతరహా ప్రాజెక్టులతోపాటు చెరువులన్నీ నిండాయి. దీంతో గోదావరి జలాల ఎత్తిపోతల ద్వారా పెద్దగా నీటి వినియోగం జరగలేదు. దీంతో నదుల నుంచి వచ్చిన నీరు వచ్చినట్లుగా సముద్రంలోకి చేరుతోంది. మంగళవారం సాయంత్రానికి గోదావరి నుంచి 631 టీఎంసీలు, కృష్ణా నుంచి 170 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. గత ఏడాది ఇదే సమయానికి 192 (గోదావరిలో 168, కృష్ణాలో 24) టీఎంసీల నీరు మాత్రమే సముద్రంలోకి చేరింది. మరోవైపు వచ్చే సెప్టెంబర్, అక్టోబర్‌లో భారీ వర్షాలు కురిస్తే రెండు నదుల్లో కలిపి నాలుగు వేలకుపైగా టీఎంసీల నీరు సముద్రంలో కలిసే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. -
Krishna, Godavari Board: ఏమీ తేల్చలేదు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం వెలువరించిన కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీల ఉమ్మడి భేటీ అసంపూర్తిగా ముగిసింది. బోర్డుల పూర్తి స్థాయి భేటీ నిర్వహించాకే సమన్వయ కమిటీల సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేసిన తెలంగాణ మంగళవారం నాటి భేటీకి గైర్హాజరయ్యింది. కాగా ఆంధ్ర ప్రదేశ్.. గెజిట్‌లోని పలు అంశాలపై తమకు అభ్యంతరాలున్నాయని, వాటిపై కేంద్రానికి లేఖ రాసి అక్కడినుంచి స్పష్టత వచ్చాకే అన్ని అంశాలపై స్పందిస్తామని తెలిపింది. ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు), నిధులు సహా ఏ ఇతర అంశాలైనా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాకే ముందుకెళతామని అధికారులు చెప్పారు. సీఎం సూచనలతోనే దూరం! కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండ్యల అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో ఈ ఉమ్మడి సమావేశం జరిగింది. ఏపీ తరఫున ఈఎన్సీ నారాయణరెడ్డితో పాటు ఇతర ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి సోమవారమే తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. అయితే ఈ భేటీకి దూరంగా ఉండాలని ఆయన సూచించినట్లు తెలిసింది. దీంతో తెలంగాణ ఇంజనీర్లు ఎవరూ మంగళవారం నాటి సమావేశానికి హాజరు కాలేదు. బోర్డుల పూర్తిస్థాయి భేటీ తర్వాతే సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని సోమవారం గోదావరి బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ.. మంగళవారం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. మా ప్రభుత్వంతో చర్చించాక చెబుతాం: ఏపీ ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవడం, వాటి అనుమతులు, అనుమతుల్లేని ప్రాజెక్టుల వివరాలు, సీఐఎస్ఎఫ్ భద్రత, నిధుల విడుదల, విద్యుదుత్పత్తి వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసే విషయాన్ని బోర్డులు ప్రస్తావించినట్లు తెలిసింది. తమకు సహకరించాలని, అవసరమైన నివేదికలు, వివరాలు ఇవ్వాలని బోర్డులు ఏపీని కోరాయి. దీనిపై స్పందించిన ఏపీ ఇంజనీర్లు.. అన్ని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవడం, పర్యవేక్షణకు సిబ్బంది కేటాయింపులు, నిధుల విడుదల వంటి అంశాలపై తమకు కొన్ని అభ్యంతరాలున్నాయని తెలిపారు. దీనిపై త్వరలోనే కేంద్ర జల శక్తి శాఖకు లేఖ రాస్తామని చెప్పారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వడం, నిధుల విడుదల, ప్రాజెక్టులకు అనుమతుల విషయాలపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. గోదావరిలో మున్ముందు తీవ్ర సమస్యలు: ఏపీ ఈఎన్సీ ఉమ్మడి భేటీ ముగిసిన తర్వాత ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ అభ్యంతరాలపై ఓ స్పష్టత వచ్చాకే నోటిఫికేషన్ అమలుపై పూర్తి స్థాయిలో స్పందిస్తామని బోర్డుకు చెప్పామని తెలిపారు. అన్ని ప్రాజెక్టులు, గెజిట్‌లో సూచించిన అన్ని అంశాలపై బోర్డు పర్యవేక్షణ అక్కర్లేదని, కేవలం క్లిష్టమైన అంశాలను మాత్రమే బోర్డులు చూస్తే సరిపోతుందని అన్నారు. ఇదే సమయంలో గోదావరి జలాల వినియోగం, మళ్లింపు అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మున్ముందు కృష్ణాలో కన్నా గోదావరిలో తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ‘గోదావరిలో ఉమ్మడి ఏపీకి 1,430 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇందులో 1,350 టీఎంసీలను వినియోగించేలా తెలంగాణ కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ, దేవాదుల వంటి పథకాలు చేపడుతోంది. గోదావరిలో మిగులు జలాలు లేవు. ఎగువ రాష్ట్రాలు వినియోగించుకోలేని నీరు మాత్రమే దిగువకు వస్తోంది. ఆయా రాష్ట్రాలు వినియోగం మొదలు పెట్టినా, తెలంగాణ 1,350 టీఎంసీలు వాడినా పూర్తి దిగువ రాష్ట్రమైన ఏపీలోని పోలవరం, గోదావరి డెల్టా సిస్టమ్( జీడీఎస్)కు తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. ఇది ఏపీకి తీరని నష్టం చేకూర్చుతుంది..’ అని తెలిపారు. పోలవరం, పట్టిసీమలతో మళ్లిస్తున్న గోదావరి జలాలకు గానూ తమకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలని తెలంగాణ కోరడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణ సైతం 241 టీఎంసీల మేర గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోందని, మరి దీని మాటేమిటి? అని ఆయన ప్రశ్నించారు. సముద్రంలోకి పూర్తి వృధాగా పోతున్న సందర్భంలో తాము మళ్లించుకునే నీటిని వినియోగ వాటాల కింద పరిగణించరాదని కోరుతున్నా తెలంగాణ వినిపించుకోవడం లేదని తెలిపారు. వృధాగా పోతున్న నీటిని వినియోగించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. 5న రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో పర్యటన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో పర్యటించే అంశం భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఈ నెల 5న జరిగే ఈ పర్యటనకు సహకరించాలని ఏపీని బోర్డు కోరింది. ఇందుకు అంగీకరించిన ఏపీ.. కమిటీలో తెలంగాణ ఇంజనీర్లు లేకుండా చూడాలని షరతు పెట్టింది. దీనిపై బోర్డు ఎలాంటి నిర్ణయం చేసిందీ తెలియలేదు. అయితే తెలంగాణ కోరుతున్నట్లుగా ఈ 12న పూర్తి స్థాయి బోర్డుల భేటీ జరిగే అవకాశం ఉందని తెలిసింది. -
Krishna And Godavari River: ముప్పేట ఒత్తిడి!
కృష్ణా, గోదావరి జలాల ఆధారంగా నిర్మిస్తున్న, నిర్మించ తలపెట్టిన కొత్త ప్రాజెక్టులపై ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ముదిరిన నేపథ్యంలో డీపీఆర్‌ల అంశం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. డీపీఆర్‌లు సమర్పించాలంటూ బోర్డులు రెండు రాష్ట్రాలకు లేఖాస్త్రాలు సంధిస్తున్నాయి. తమకు చెల్లించాల్సిన నిధులు వెంటనే డిపాజిట్ చేయాలని కూడా కోరుతుండటంతో ఒత్తిడి పెరుగుతోంది. సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ల అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. గెజిట్‌లో పేర్కొన్న ఒక్కో అంశాన్ని పరిశీలిస్తున్న బోర్డులు.. వాటి అమలు ప్రక్రియను షురూ చేశాయి. గెజిట్ వెలువరించిన మరుసటి రోజే ఆ కాపీలను తెలుగు రాష్ట్రాలకు అధికారికంగా పంపిన బోర్డులు.. తదనుగుణంగా చర్యలు మొద లుపెట్టాలని సూచించాయి. నోటిఫికేషన్లో పేర్కొ న్న మాదిరి తమకు డబ్బులు చెల్లించాలని, ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని వరుసగా లేఖలు రాస్తున్నాయి. మరోపక్క అనుమతులు లేని ప్రాజెక్టులకు రుణాల మంజూరు విషయంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రుణ సంస్థలు ఆలోచనలో పడ్డాయి. కేంద్రం విడుదల చేసిన గెజిట్‌తో ప్రాజెక్టుల నిర్మాణంపై పడే ప్రభావం, రుణ సంస్థలకు ఎదురయ్యే చిక్కులపై ఆరా తీయడం మొదలుపెట్టాయి. డీపీఆర్‌ల కోసం ఒత్తిడి అక్టోబర్‌లో అపెక్స్ భేటీ జరిగింది. అప్పట్నుంచే రెండు బోర్డులు ప్రాజెక్టుల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదికలు)లు సమర్పించాలని రాష్ట్రాలను కోరుతున్నాయి. అయినా తెలంగాణ ఇంతవరకు ఎలాంటి డీపీఆర్‌లు సమర్పించలేదు. ఇటీవల కొత్త ప్రాజెక్టుల విషయంలో వివాదాలు ముదిరిన నేపథ్యంలో.. అపెక్స్ ఆమోదం లేకుండా, కేంద్ర జల సంఘంతో పాటు తమ అనుమతి లేకుండా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టరాదని బోర్డులు తాజాగా మరోసారి ఆదేశించాయి. అలాగే అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే సమర్పించాలని కూడా కోరాయి. తాజాగా తెలంగాణ చేపట్టిన 37 ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు చేయడంతో కృష్ణా బోర్డు వాటి డీపీఆర్‌లు ఇవ్వాల్సిందిగా రెండ్రోజుల కిందట లేఖ రాసింది. మరోపక్క గోదావరి బోర్డు గోదావరి ఎత్తిపోతల పథకం ఫేజ్–3, సీతారామ, కంతనపల్లి, మిషన్ భగీరథ, లోయర్ పెనుగంగపై చేపట్టిన మూడు బ్యారేజీలు, రామప్ప–పాకాల నీటితరలింపు, కాళేశ్వరంలోని మూడో టీఎంసీకి సంబంధించిన పనుల డీపీఆర్‌లు సమర్పించాలని కోరింది. అయితే డీపీఆర్‌లు ఇచ్చేందుకు సిద్ధమని చెబుతున్నా.. తెలంగాణ ఇంతవరకు ఇవ్వలేదు. ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు ఇవ్వండి ఇలావుండగా కేంద్ర ప్రభుత్వం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా బోర్డులు సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు చొప్పున చెల్లించాలని బోర్డులు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశాయి. నోటిఫికేషన్ వెలువడ్డ రోజునుంచి 60 రోజుల్లో ఈ నిధులు చెల్లించాలని గెజిట్‌లో పేర్కొన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరాయి. అనుమతులపై రుణ సంస్థల ఆరా.. ఈ పరిస్థితుల్లో రుణ సంస్థలు ప్రాజెక్టులకు అనుమతులపై దృష్టి సారించాయి. ముఖ్యంగా తెలంగాణలోని కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులతో పాటు సీతారామ సాగర్, సీతమ్మ బ్యారేజీ, తుపాకులగూడెం, దేవాదుల, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ (ఆర్ఈసీ), నాబార్డ్ వంటి సంస్థలు రుణాలు అందించాయి. ప్రస్తుతం ఈ సంస్థలు ప్రాజెక్టులకు అనుమతులపై కాళేశ్వరం కార్పొరేషన్, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల నుంచి సమాచారం కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేని పక్షంలో ప్రాజెక్టుల నిర్మాణాలను ఎలా ముందుకు తీసుకెళ్తారు? అనుమతుల ప్రక్రియకు కార్యాచరణ ప్రణాళిక ఏంటీ అన్న విషయాలపై రుణ సంస్థలు లేఖలు రాసినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులకు ఆర్ఈసీ రూ.20 వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చింది. మరో కార్పొరేషన్‌కు పీఎఫ్సీ, ఆర్ఈసీలు మరో రూ.2 వేల కోట్ల రుణాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇందులో కొంతమేర ఇప్పటికే మంజూరు చేయగా, మరికొంత విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుత గెజిట్ నోటిఫికేషన్ల నేపథ్యంలో అవి తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నాయి. గోదావరి నదిపై దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన నిర్మించ తలపెట్టిన సీతమ్మసాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,426.25 కోట్ల రుణం ఇచ్చేందుకు పీఎఫ్సీ ముందుకు వచ్చింది. అయితే అనుమతులు లేవన్న కారణంగా ప్రాజెక్టును నిలిపివేస్తే తమ రుణాలను బేషరతుగా వెనక్కి తీసుకుంటామని ఆ సంస్థ షరతులు విధించింది. -
జల వివాదం: పర్మిషన్ లేకుంటే ప్రాజెక్టుల మూత!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలను వినియోగించుకుంటూ తెలంగాణ, ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని బోర్డుల పరిధిపై వెలువరించిన గెజిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్లో ప్రస్తావించినంత మాత్రాన అనుమతి లేని ప్రాజెక్టులను ఆమోదించినట్టు కాదని పేర్కొంది. ఆరు నెలల్లోగా అనుమతి తీసుకోవడంలో విఫలమైతే ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టాల్సి ఉంటుందని.. అవి పూర్తయినా కూడా నీటి వినియోగించుకోవడానికి వీల్లేదని హెచ్చరించింది. గెజిట్‌లో పేర్కొన్న మేరకు అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులివే కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ఎస్ఎల్బీసీ సామర్థ్యం మరో పది టీఎంసీలు పెంపు కల్వకుర్తి ఎత్తిపోతల కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం అదనంగా 15 టీఎంసీలు పెంపు పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ డిండి ఎత్తిపోతల ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్టు భక్త రామదాస ఎత్తిపోతల తుమ్మిళ్ల ఎత్తిపోతల నెట్టెంపాడు ఎత్తిపోతల నెట్టెంపాడు సామర్థ్యం అదనంగా 3.4 టీఎంసీలు పెంపు దేవాదుల లిఫ్టు ద్వారా గోదావరి జలాలు కృష్ణా బేసిన్‌కు మళ్లించే ప్రాజెక్టు (వీటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతలను విభజన చట్టం 11వ షెడ్యూల్లో కేంద్రం అధికారికంగా గుర్తించింది) కృష్ణానదిపై ఏపీ చేపట్టిన ప్రాజెక్టులు తెలుగు గంగ వెలిగొండ హంద్రీ-నీవా గాలేరు-నగరి ముచ్చుమర్రి ఎత్తిపోతల సిద్ధాపురం ఎత్తిపోతల గురు రాఘవేంద్ర (ఇందులో మొదటి నాలుగింటిని విభజన చట్టం 11వ షెడ్యూల్లో కేంద్రం అధికారికంగా గుర్తించింది) ఉమ్మడిగా చేపట్టిన ప్రాజెక్టు మున్నేరు పునర్ నిర్మాణం గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు కంతనపల్లి బ్యారేజీ కాళేశ్వరంలో అదనపు టీఎంసీ పనులు రామప్ప- పాకాల మళ్లింపు తుపాకులగూడెం బ్యారేజీ మోదికుంటవాగు ప్రాజెక్టు చౌట్పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల కందుకుర్తి ఎత్తిపోతల బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత గూడెం ఎత్తిపోతల ముక్తేశ్వర్ ఎత్తిపోతల సీతారామ ఎత్తిపోతల (రాజీవ్ దుమ్ముగూడెం) పట్టిసీమ ఎత్తిపోతల పురుషోత్తపట్నం ఎత్తిపోతల చింతలపూడి ఎత్తిపోతల వెంకటనగరం ఎత్తిపోతల -
గెజిట్ నోటిఫికేషన్‌ను స్వాగతించిన తెలంగాణ బీజేపీ
వేములవాడ: కృష్ణా, గోదావరి జలాలపై కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం వేములవాడలో జరిగిన రాష్ట్రస్థాయి దళితమోర్చా కార్యవర్గ సమావేశానికి హాజరైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టులో కృష్ణాజలాల వివాదం నడుస్తుండగా, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం, 8 నెలల తర్వాత వెనక్కి తీసుకోవడంలో మతలబేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించేందు కు ప్రయత్నాలు జరుగుతున్నాయని, హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఇద్దరు సీఎంలు హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు. -
జల వివాదాలకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లో తరచూ రేగుతున్న జల వివాదాలకు చెక్‌పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేళ్లుగా ఎటూ తేలకుండా వాయిదా పడుతూ వస్తున్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గురువారం అర్ధరాత్రి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కృష్ణా బోర్డు సమర్ధవంతంగా పనిచేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) బ్యాంక్ అకౌంట్లోకి 60 రోజుల్లోగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు చెరో రూ.200 కోట్ల చొప్పున జమ చేయాలని సూచించింది. నోటిఫికేషన్ విడుదలతో కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులు, వాటి నిర్వహణ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సిబ్బంది అంతా బోర్డుల పరిధిలోకి వచ్చాయి. ప్రాజెక్టుల నీటి నిర్వహణతో పాటు భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షించనున్నాయి. ఈ నోటిఫికేషన్ జారీ చేసే నాటికి కేంద్రం ఆమోదించని ప్రాజెక్టుల పనులన్నింటిని ఇరు రాష్టాలు నిలిపివేయాలని పేర్కొంది. రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో నిర్ణయించిన మేరకు అనుమతులు లేని ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్‌కు పంపి 6 నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని సూచించింది. ఆరు నెలల్లో అనుమతి పొందకపోతే ఆ ప్రాజెక్టులను రద్దు చేసుకోవాలని, వాటి ద్వారా ఎలాంటి నీటిని తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం వివరించింది. బోర్డుల పరిధిపై కుదరని అభిప్రాయం.. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్ 85(1) ప్రకారం కేంద్రం.. బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే బోర్డులకు.. వాటి పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడంతో వీటికి ఎలాంటి అధికారాలు లేవు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నా బోర్డులు ఏమీ చేయలేకపోతున్నాయి. ఈ క్రమంలో తమ పరిధిని ఖరారు చేసి ప్రాజెక్టులపై పెత్తనం ఇవ్వాలని బోర్డులు కోరాయి. దీనిపై తెలంగాణ, ఏపీ మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లో ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదని, ఈ అంశంపై ప్రస్తుతం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తోందని పేర్కొంది. విభజన చట్టం సెక్షన్–87 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేశాకనే బోర్డు పరిధిని నోటిఫై చేయాలని.. 2016, సెప్టెంబర్ 21న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ, 2020, అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. అయితే ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటి నుంచో కోరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా బోర్డు నియంత్రణ అవసరమని చెబుతూ వచ్చింది. ఈ వైరుధ్యాలు ఉన్నా.. రెండో అపెక్స్ భేటీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బోర్డుల పరిధిని ఖరారు చేసే అధికారం తమకుందని స్పష్టం చేశారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనిపై చర్చించి నోటిఫికేషన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. గోదావరి.. బోర్డు పరిధిలోకి ఎందుకు... ఇక గోదావరి బేసిన్ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చుకోవడాన్ని తెలంగాణ తప్పుపడుతోంది. గోదావరి బేసిన్లో తెలంగాణ, ఏపీల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు లేవని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు లేక ఇరురాష్ట్రాల మధ్య సంయుక్తంగా నిర్మించిన ప్రాజెక్టులు లేనందున దీని పరిధిని ఖరారు చేయ రాదని గతంలో కేంద్రానికి లేఖలు రాసింది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 87 ప్రకారం గతంలో ఉన్న అవార్డులు, అంతర్రాష్ట్ర నదీ వివా దాల చట్టం–1956 మేరకు ఏర్పడ్డ ట్రిబ్యునల్ల తీర్పులకు లోబడి కేంద్రం బోర్డుల పరిధిని నోటిఫై చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో ప్రాజెక్టులను బోర్డుల పరిధికి తీసుకోవడానికి సంబంధించి ఎలాంటి అంశాలు లేవని దృష్టికి తెచ్చింది. కొత్త మార్గదర్శకాలను తెలంగాణ, ఏపీలోని గోదావరి ప్రాజెక్టులపై రుద్దరాదని స్పష్టం చేసింది. అయినా దీని పరిధిపైనా గెజిట్ ఇచ్చేందుకే కేంద్రం మొగ్గు చూపింది. కృష్ణా బోర్డు పరిధిలో.. కృష్ణా బోర్డు పరిధి నోటిఫై కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ దాని పరిధిలోకి వెళ్లాయి. అందులో తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉన్న హెచ్ఎల్సీ(హైలెవల్ కెనాల్), ఎల్ఎల్సీ(లోలెవల్ కెనాల్), కేసీ కెనాల్, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాలపై ఆధారపడి ఉన్న విద్యుత్ కేంద్రం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, శ్రీశైలంపై ఆధారపడ్డ తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి, హంద్రీనీవా, ముచ్చు మర్రి, వెలిగొండ, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, శ్రీలైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలు, సాగర్‌పై ఆధారపడిన కుడి, ఎడమ కాల్వలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఏఎంఆర్పీ, హెచ్ఎండబ్ల్యూఎస్, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వచ్చాయి. అలాగే కాళేశ్వరం, దేవాదుల, నిజాంసాగర్, సింగూరు, ఎస్సారెస్పీ, లోయర్‌మానేరు, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీ, చింతలపూడి, పురుషోత్తపట్నం గోదావరి బోర్డు పరిధిలోకి వెళ్లాయి. ప్రధానికి రెండు దఫాలు సీఎం జగన్ లేఖలు బోర్డు పరిధి ఖరారైనందున కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం కనీస స్థాయి కంటే దిగువన ఉన్నప్పటికీ తెలంగాణ సర్కార్ అక్రమంగా ఎడమ గట్టు కేంద్రంలో జూన్ 1నే విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అయితే తెలంగాణ సర్కారు కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తిని చేపట్టింది. కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితిని సృష్టించి రాష్ట్ర హక్కులను కాలరాస్తున్న తెలంగాణ సర్కార్ తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండుదఫాలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌సింగ్ షెకావత్‌లకు లేఖలు రాశారు. గతేడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు అధీనంలోకి తేవాలని, వాటికి సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించి బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు ఇరు రాష్ట్రాలకు నీటిని విడుదల చేయాలని కోరారు. కానీ.. తెలంగాణ సర్కార్ తీరులో మార్పు రాకపోవడంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసేలా కేంద్రానికి నిర్దేశం చేయాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో రెండు బోర్డుల పరిధిని కేంద్రం ఖరారు చేసింది. -
జలకళతో గోదావరి గలగల
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రంతోపాటు ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతుండటంతో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు వస్తున్నాయి. గోదావరి పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. బుధవారం ఎస్సారెస్పీలోకి 52 వేల క్యూసెక్కుల వరద రాగా.. గురువారం ఏకంగా 1.38 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ఎస్సారెస్పీ నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలుకాగా.. గురువారం సాయంత్రానికి 65 టీఎంసీలకు చేరింది. మరో 25 టీఎంసీలు చేరితే గేట్లు ఎత్తనున్నారు. వరద ఇదే స్థాయిలో కొనసాగితే రెండు రోజుల్లోనే ప్రాజెక్టు నిండనుంది. ఇక గోదావరి బేసిన్‌లోని ఎల్లంపల్లి, లోయర్ మానేరు ప్రాజెక్టులకు కూడా భారీ వరద వస్తోంది. భారీ ప్రవాహాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మి బ్యారేజీ (మేడిగడ్డ), సరస్వతి బ్యారేజీ (అన్నారం)లో గేట్లు ఎత్తి నీటిని వదిలిపెడుతున్నారు. సింగూరులోకి 2,245 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. నీటి నిల్వ 29.91 సామర్థ్యానికిగాను 18.43 టీఎంసీలకు చేరింది. కృష్ణా ప్రాజెక్టులకు ఇలా.. కృష్ణా బేసిన్లో స్ధిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. నారాయణపూర్ నుంచి జూరాలకు వరద వస్తోంది. ఇక్కడ ఎత్తిపోతల పథకాలు, ఎడమ, కుడి కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తితో నాగార్జునసాగర్‌కు నీళ్లు వెళ్తున్నాయి. నాగార్జునసాగర్ నుంచి ఔట్‌ఫ్లో లేకున్నా.. పరీవాహకంలోని వర్షాలు, మూసీ వరద రావడంతో పులిచింతల నిండుతోంది. చిన్న ప్రాజెక్టుల్లో జలకళ ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోపాటు సరస్వతి బ్యారేజీ నుంచి వస్తున్న నీటితో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్కసాగర్ బ్యారేజీ నిండుగా కళకళలాడుతోంది. మొత్తం 59 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నిండిపోయింది. దాంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు నిండుకుండల్లా మారాయి. -
అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా!
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఈనెల 5న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 20వ తేదీ తర్వాత నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన భేటీ వాయిదా పడే అవకాశం ఉందని కృష్ణా, గోదావరి బోర్డు వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం సిద్ధమైన ప్రభుత్వం ► షెడ్యూల్ ప్రకారం అపెక్స్ కౌన్సిల్ భేటీలో పాల్గొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం మార్గదర్శకాల మేరకు మంగళవారం కేంద్ర జల్ శక్తి శాఖకు అజెండాను పంపాలని నిర్ణయించింది. ► కృష్ణా, గోదావరి నదులపై రెండు రాష్ట్రాలు చేపట్టిన కొత్త ప్రాజెక్టుల విషమయంలో బోర్డులకు తెలుగు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకున్నాయి. వీటిపై జూన్ 4న కృష్ణా బోర్డు, 5న గోదావరి బోర్డు సమావేశాలు జరిగాయి. సీడబ్ల్యూసీ అనుమతి లేని వాటిని కొత్త ప్రాజెక్టులుగానే పరిగణిస్తామని, వాటి డీపీఆర్‌లు ఇస్తే పరిశీలన, ఆమోదం కోసం అపెక్స్ కౌన్సిల్‌కు పంపుతామని బోర్డులు సూచించాయి. ► ఈనెల 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఆ రోజు ఇరు రాష్ట్రాల సీఎంలు అందుబాటులో ఉంటారో లేదో తెలపాలని సీఎస్‌లకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి గత నెల 28న లేఖ రాసింది. -
700 టీఎంసీలు ఎత్తిపోసేలా...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీ పూర్తి కావస్తున్న నేపథ్యంలో..వచ్చే వర్షాకాల సీజన్ నుంచి నీటి ఎత్తిపోతలు గణనీయంగా ఉండనున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుండటంతో నీటి వినియోగం గరిష్ట స్థాయికి చేరనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఎత్తిపోతలు ఏకంగా 700 టీఎంసీల వరకు ఉంటుందని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. ఎత్తిపోసే నీటి పరిమాణానికి తగినట్టే విద్యుత్ వినియోగం సైతం 7 వేల మెగావాట్లను దాటే అవకాశం ఉందని శాఖ లెక్కలు కట్టింది. ఇకపై ‘డబుల్’ఎత్తిపోత.. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా 282 టీఎంసీల మేర నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సీజన్లో కాళేశ్వరం ద్వారా 58 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోయడంలో అది 340 టీఎంసీలకు చేరింది. ఇందులో ప్రధానంగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు,భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారానే కనీసంగా 120 టీఎంసీలు, ఏఎంఆర్పీ ద్వారా మరో 50 టీఎంసీల మేర నీరు ఎత్తిపోస్తుండగా, దేవాదుల, ఎల్లంపల్లి, గుత్ప, అలీసాగర్ వంటి పథకాల కింద మరో 70 టీఎంసీల ఎత్తిపోతల కొనసాగుతూ వస్తోంది. పాత ప్రాజెక్టుల ద్వారా నీటిని తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పంపు మోటార్లు, వాటికి అనుగుణంగా విద్యుత్ అవసరాలు 1,600 మెగావాట్ల వరకు ఉన్నాయి. ఎత్తిపోతల పథకాలకు యూనిట్‌కు 5.80 చొప్పున గణించినా, రూ. 1,800 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. అయితే వచ్చే ఖరీఫ్ నుంచి నీటి ఎత్తిపోతలు గణనీయంగా పెరగనున్నాయి. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల ద్వారానే గరిష్టంగా 250 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఇక గోదావరి బేసిన్లో 450 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. ఇందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే 200–250 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయి. ఇక దేవాదుల పరిధిలోనూ కంతనపల్లి సిద్ధం కానుండటంతో రెండు సీజన్లలో కలిపి 100 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక వేస్తున్నారు. మిగతా పథకాల కింద మరో 100 టీఎంసీల నీటిని తరలించనున్నారు. మొత్తంగా రెండు బేసిన్ల పరిధిలో 700 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. రెండు బేసిన్లలోని 22 ఎత్తిపోతల పథకాల పరిధిలో 96 పంప్‌హౌస్‌లు ఉండగా, 318 పంపుల నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో 270 పంపులు జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయని భావిస్తోంది. వీటిని నిర్ణీత నీటిని ఎత్తిపోసేలా నడిపిస్తే విద్యుత్ వినియోగం 6,700–7000 మెగావాట్లు వరకు ఉంటుందని లెక్క గడుతోంది. ఇందులో అధికంగా కాళేశ్వరం ఎత్తిపోతలకే మోటార్లు తిరిగే రోజులు, వాటి సామర్థ్యాన్ని బట్టి 4,500 మెగావాట్ల నుంచి 5,500 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండవచ్చని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. ఈ విద్యుత్‌కే ఖర్చు దాదా పు రూ.6,500 కోట్లు ఉంటుందని చెబుతున్నాయి. -
అనుసంధానంపై త్వరగా తేల్చండి
సాక్షి, హైదరాబాద్ : గోదావరి – కృష్ణా – కావేరి నదుల అనుసంధానంపై తాము సూచించిన ప్రతి పాదనలను పరిశీలించి త్వరగా తమకు నివేదిక ఇవ్వాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. జానంపేట్ మీదుగా గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించి అటు నుంచి కావేరికి తీసుకెళ్లే ప్రతిపాదనపై అభ్యంతరాలు, పరిశీలనను త్వరగా తెలపాలని సూచించింది. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ ఖటారియా అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) 17వ ప్రత్యేక కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ ఉపేంద్రప్రతాప్ సింగ్, ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భూపాల్‌సింగ్, సీడబ్ల్యూసీ అధికారులు, ఇంజనీర్లు సమావేశంలో పాల్గొన్నారు. గోదావరి – కృష్ణా – కావేరి (గ్రాండ్ ఆనికట్) అనుసంధానం ప్రాజెక్టును తొలి ప్రాధాన్యతగా చేపట్టాలని తమిళనాడు అధికారులు కేంద్రాన్ని కోరారు. గోదావరితో అనుసంధానం చేస్తే తప్ప తమ రాష్ట్ర నీటి కష్టాలు తీరవని స్పష్టం చేశారు. గోదావరి నీటిని జానంపేట మీదుగా కృష్ణాకు, అటుగా తమిళనాడులోని గ్రాండ్ ఆనికట్‌కు 247 టీఎంసీల నీటిని తరలించేందుకు ఎన్‌డబ్ల్యూడీఏ ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, దీన్ని త్వరగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియతో తెలంగాణలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు లబ్ధి కలుగుతుందని, ఈ దృష్ట్యా ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వ వైఖరి వెంట నే చెప్పాలని కేంద్రమంత్రి రాష్ట్ర ఇంజనీర్లకు సూచించారు. కేంద్ర సూచనలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్రం నుంచి సమావేశంలో పాల్గొన్న అంతర్రాష్ట్ర జల విభాగ ఎస్ఈ నరహరిబాబు, డిప్యూటీ డైరెక్టర్ కె. ప్రసాద్ తెలిపారు. ఏపీ అవసరాలు తీరాకే తమిళనాడుకు తమ రాష్ట్రం గోదావరి, కృష్ణాలో కేటాయింపుల మేర నీటిని ఉపయోగించుకున్న తర్వాత ఇంకా నీళ్లు మిగిలితేనే తమిళనాడుకు నీటిని తరలించాలని ఏపీ వాదించింది. ఈమేరకు ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో ప్రతిపాదన అందజేసింది. గోదావరి, కృష్ణాలో కలిపి తమ కేటాయింపుల మేరకు నీటిని ఉపయోగించుకుంటామని ఇందుకోసం గోదావరి – కృష్ణా అనుసంధానం ప్రాజెక్టు చేపడుతామని నివేదించింది. తమ అవసరాలు తీరాక పెన్నా బేసిన్ మీదుగా గ్రాండ్ ఆనికట్‌కి నీటిని తరలిస్తే తమకేమి అభ్యంతరం లేదని చెప్పింది. ఇంద్రావతి నీళ్లపై ఛత్తీస్‌గఢ్ కొత్త వాదన ఇంద్రావతి నీళ్లను పూర్తిగా ఉపయోగించుకుంటామని ఛత్తీస్‌గఢ్ ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో ప్రస్తావించింది. ఇంద్రావతిలో మిగులు జలాలు ఉన్నాయని, వాటి ఆధారంగా దిగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టవద్దని సూచిం చింది. ఇంద్రావతిపై తమ ప్రభుత్వం బ్యారేజీలు, ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆ నీటిని తమ అవసరాలకు ఉపయోగించుకుంటామని చె ప్పింది. గోదావరి – కావేరి అనుసంధానం ఆమోదం తెలుపబోమని తేల్చి చెప్పింది. -
జలం వర్షించే.. పొలం హర్షించే
సాక్షి, అమరాతి: కృష్ణా, గోదావరి, వంశధార జలాలను ఒడిసి పట్టి.. ఆయకట్టు చివరి భూములకు సైతం నీళ్లందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది. రాష్ట్రంలో భారీ, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఐడీసీ) కింద ప్రస్తుత నీటి సంవత్సరంలో 87,62,037 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. మూడు నదులపై ఉన్న ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు శుక్రవారం వరకూ 20,62,891 ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. గతేడాది ఇదే సమయానికి కేవలం 9.87 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేయడం గమనార్హం. ఈ ఏడాది సెపె్టంబర్ ఆఖరు నాటికి సింహభాగం ఆయకట్టుకు నీటిని అందించడానికి సర్కారు చర్యలు చేపట్టింది. ఆయకట్టు చివరి భూములకు కూడా నీళ్లందించేలా యాజమాన్య పద్ధతులను అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏనాడూ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లందించిన దాఖలాలు లేవు. గత పదేళ్లలో ఎన్నడూ లేని రీతిలో కృష్ణా, గోదావరి, వంశధార పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. మూడు నదుల్లోనూ నీటి లభ్యత భారీగా పెరిగింది. ప్రధానంగా కృష్ణా నది వరద నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు ప్రభుత్వం తరలించింది. పులిచింతల ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేశారు. గోదావరి కుడిగట్టుపై తాడిపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలు, ఎడమ గట్టుపై పుష్కర, చాగల్నాడు, రాజానగరం, తొర్రిగడ్డ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల ద్వారా వరద నీటిని ఒడిసి పడుతున్నారు. వంశధార, నాగావళి నదుల వరద జలాలను తోటపల్లి, నారాయణపురం, గొట్టా బ్యారేజీల్లో నిల్వ చేశారు. సమర్థవంతంగా నీటి పంపిణీ రిజర్వాయర్లలో నిల్వ చేసిన నీటిని వృ«థా కానివ్వకుండా, సమర్థవంతమైన యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టుకు సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి డెల్టాకు జూన్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టాకు జూన్ రెండో వారంలోగానే సాగునీరు విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు జూన్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తోటపల్లి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు, శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు కింద ఆయకట్టుకు జూన్ మొదటివారంలో నీటిని విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పుష్కర, చాగల్నాడు, రాజానగరం, తొర్రిగడ్డ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఆయకట్టుకు జూన్ రెండో వారం నుంచి నీరు అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడిపూడి ఎత్తిపోతల కింద ఆయకట్టుకూ జూన్ రెండోవారంలో నీటిని విడుదల చేశారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల కింద రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేస్తున్నారు. కృష్ణా బేసిన్లో సాగు జోరు శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లలో నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోగానే ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. సాగర్ కుడి, ఎడమ కాలువల ఆయకట్టుకు ఆగస్టు 11న.. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ)లకు ఆగస్టు 7న, హంద్రీ–నీవాకు ఆగస్టు 6న నీటిని విడుదల చేశారు. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టుకు సెపె్టంబర్ మూడో వారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. హంద్రీ–నీవా ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో చెరువులు నింపి, కొంత భాగం ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. తుంగభద్ర జలాశయం కింద హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆయకట్టుకు ఇప్పటికే నీటిని విడుదల చేశారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి సింహభాగం ఆయకట్టులో రైతులు పంటలు సాగు చేయనున్నారు. ఈ ఏడాది పంటల దిగుబడి భారీగా పెరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. -
రెండు పంటలకు ఢోకా లేనట్లే!
నాగార్జునసాగర్: కృష్ణా, గోదావరి బేసిన్లు కొత్తనీటితో కళకళ్లాడుతున్నాయి. రెండు రాష్ట్రాల రైతులకు.. రెండు పంటలకు సరిపోయేంతనీరు జలాశయాల్లోకి చేరుతోందని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం నాగార్జునసాగర్ ఎడమకాల్వకు ఆంధ్రప్రదేశ్ భారీనీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి ఆయన నీటిని విడుదల చేశారు. అనంతరం కృష్ణమ్మకు సారెచీరలతోపాటు పూలమాలలు, పసుపు కుంకుమతో వాయినమిచ్చారు. సీఎం కేసీఆర్ కృష్ణా, గోదావరి నదుల్లోని ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టి తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నారని చెప్పారు. పక్కరాష్ట్రాలతో స్నేహపూర్వకంగా మెలిగి అభివృద్ధి చెందడం ఎలాగో సీఎం కేసీఆర్ ఆచరించి చూపారని పేర్కొన్నారు. కలిసిమెలిసి ఉంటూ.. సహజవనరులను సద్వినియోగం చేసుకుని ఇరురాష్ట్రాల రైతాంగాని కి లబి్ధచేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నా రు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్లిద్దరు.. కలిసి ఉంటే కలదు సుఖం అని నిరూపించారని అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు కూడా.. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం గణపు రం సమీపంలోని ఏఎమ్మార్పీ ప్రధాన గేటు నుంచి ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు మంత్రి జగదీశ్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. పెద్దవూర మండలం పూల్యాతండా సమీపంలోని పంప్‌హౌజ్ ద్వారా ఏఎమ్మార్పీ లో–లెవల్ వరద కాల్వకు 320 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో బండా నరేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నర్సింహయ్య, భాస్కర్‌రావు, భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. సాగర్‌కు భారీగా పెరిగిన వరద నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సాగర్ రిజర్వాయర్‌లో గంటకో అడుగు చొప్పున నీటిమట్టం పెరుగుతుండటంతో సోమవారం గేట్లు ఎత్తనున్నట్లు తెలిసింది. తెలం గాణ, ఏపీ మంత్రులు నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు సమాచారం. లక్ష్మి బ్యారేజీలో 65 గేట్ల ఎత్తివేత కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరికి వరద ఆదివారం నిలకడగా 9.39 మీటర్ల ఎత్తుతో ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజీలో 65 గేట్లు ఎత్తిగా దిగువకు 3.26 లక్షల క్యూసెక్కుల వరద వెళ్తోంది. -
శ్రీశైలానికి గోదారమ్మ!
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. ఆగస్టు రెండో వారం నాటికిగానీ ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలానికి చేరడం లేదు. మరోపక్క కర్ణాటక సర్కార్ ఆల్మట్టి జలాశయం ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతున్న నేపథ్యంలో ఎగువ నుంచి వరద ప్రవాహం సెప్టెంబరు ఆఖరు నాటికిగానీ చేరే అవకాశం ఉండదు. ఫలితంగా కృష్ణాలో నీటి లభ్యత మరింత తగ్గడం ఖాయం. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను శ్రీశైలం జలాశయంలోకి ఎత్తిపోస్తే ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంతోపాటు అటు దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని ఆయకట్టును స్థిరీకరించవచ్చునని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖరరావులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు ఈనెల 28న హైదరాబాద్‌లో ఇద్దరు సీఎంలు సమావేశమవుతున్నారు. గోదావరి వరద జలాలను గరిష్టంగా వినియోగించుకోవడంపై అధ్యయనం చేసి ఆలోగా నివేదికలను సిద్ధం చేయాలని ఇరు రాష్ట్రాల అధికారులను ఆదేశించారు. పలు ప్రతిపాదనలపై అధికారుల కసరత్తు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్న నేపథ్యంలో గోదావరి జలాలను శ్రీశైలం జలాశయానికి తరలించే ప్రతిపాదనలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావుతోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తదితరులు గోదావరి జలాలను శ్రీశైలం జలాశయానికి మళ్లింపుపై సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. గోదావరిలో ఇంద్రావతి నది కలసిన తర్వాత బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు టీఎంసీలను శ్రీశైలంలోకి తరలించే ప్రతిపాదనపై ప్రధానంగా చర్చిస్తున్నారు. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) చేసిన ప్రతిపాదనల్లో ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్, అకినేపల్లి–నాగార్జునసాగర్ అనుసంధానాలను రీడిజైనింగ్ చేసి ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను శ్రీశైలం తరలించడం.. అకినేపల్లి నుంచి శ్రీశైలం జలాశయంలోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ మూడు ప్రతిపాదనల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని వినియోగించుకునే ప్రతిపాదనపై మొగ్గు చూపాలని ఇరువురు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. గోదావరి నుంచి రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు టీఎంసీలను శ్రీశైలం జలాశయంలోకి ఎత్తిపోస్తే తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటి ఎద్దడిని అధిగమించవచ్చని సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆ 90 రోజులు నీటిని ఎత్తిపోస్తే.. ఏటా గోదావరిలో మూడు నుంచి నాలుగు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. ప్రాణహిత, ఇంద్రావతి ఉపనదుల ద్వారా గరిష్టంగా వరద జలాలు గోదావరిలోకి చేరుతున్నాయి. జూలై నుంచి అక్టోబర్ వరకూ ఏటా సగటున 90 రోజులపాటు గోదావరిలో గరిష్టంగా వరద ఉంటుంది. ఆ 90 రోజుల్లో నిత్యం సగటున నాలుగు నుంచి ఐదు టీఎంసీలను శ్రీశైలం జలాశయంలోకి ఎత్తిపోస్తే ఇటు ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా.. అటు తెలంగాణలో పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ఆయకట్టులను స్థిరీకరించవచ్చు. శ్రీశైలం జలాశయం నిండిన తర్వాత గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు తరలించి సాగర్ ఆయకట్టును స్థిరీకరించవచ్చు. అక్కడి నుంచి పులిచింతల మీదుగా ప్రకాశం బ్యారేజీకి నీటిని తరలించి కృష్ణా డెల్టా అవసరాలను తీర్చవచ్చునని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారు. -
నీరు-నిప్పు
కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల అంశం కాక పుట్టిస్తోంది. ఈ నదీ జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులే ప్రధానాస్త్రాలుగా ఇరు పార్టీలు మాటల తూటాలు పేలుస్తున్నాయి. ఐదారు జిల్లాల్లో ఇప్పుడిదే ప్రధానాస్త్రంగా మారడంతో ‘నదీ జలాలు’ వేడెక్కుతున్నాయి. ప్రాణ‘హితం’ ఎవరికో.. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అంశం రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేస్తోంది. ఈ ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్‌ను కాంగ్రెస్ తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నట్లుగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ ఆర్థిక, పర్యావరణ, నిర్వహణ పరంగా అనుసరణీయం కాదని కాంగ్రెస్ వాదిస్తోంది. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో చర్చించాకే దీనిపై ముందుకెళ్లాలని కోరినా అదేమీ పట్టనట్లు వ్యవహరించి ప్రాణహితను విభజించి పూర్తిగా పక్కనపెట్టారని కాంగ్రెస్ తన ప్రచారంలో హోరెత్తిస్తోంది. ప్రాణహిత ప్రాజెక్టులోని అంబేద్కర్ పేరునూ తొలగించిందని ఇటీవల భైంసా సభలో రాహుల్ ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా నేతలు ఇదే అస్త్రంతో ముందుకు వెళుతున్నారు. ఈ ప్రచారం సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్ నియోజకవర్గాల ప్రజలను ప్రభావితం చేయనుంది. దీనికి టీఆర్ఎస్ ధీటుగా జవాబిచ్చే ప్రయత్నం చేస్తోంది. పాత డిజైన్ మేరకు 56 వేల ఎకరాలకే నీరిచ్చే అవకాశం ఉందని, తాము రీ డిజైన్‌లో ఆయకట్టును 2 లక్షలకు పెంచామని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న ప్రచారం చేస్తున్నారు. ప్రాణహితకు కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో రాని అటవీ, వన్యప్రాణి విభాగ అనుమతులు తాము సాధించామని చెబుతున్నారు. ‘పాలమూరు’.. ప్రచార హోరు మహబూబ్‌నగర్ జిల్లాలోనూ ప్రాజెక్టులే ఓట్ల కల్పతరువుగా మారాయి. క ల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌తో పాటు కొత్తగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు తమవంటే తమవంటూ కాంగ్రెస్ – టీఆర్ఎస్ హోరెత్తిస్తున్నాయి. ప్రాజెక్టు పనులు అత్యధికంగా తమ హయాంలోనే పూర్తయ్యాయని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంటే.. పదేళ్లలో కాంగ్రెస్ పది వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వలేకపోయిందని, తాము అధికారంలోకి వచ్చాకే జిల్లాలో 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిందని టీఆర్ఎస్ చెబుతోంది. అంచనా వ్యయాలను పెంచేందుకే ప్రాజెక్టుల్లో మార్పులు చేశారని కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎస్.జైపాల్‌రెడ్డి, అరుణ, రేవంత్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి ఆరోపిస్తుండగా, వలసలు వాపస్ వచ్చేలా పనులు చేస్తున్నామని టీఆర్ఎస్ మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి హోరెత్తిస్తున్నారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రులు కేటీఆర్, హరీశ్.. తప్పుడు కేసులతో కాంగ్రెస్ ప్రాజెక్టులను అడ్డుకుంటోందని విమర్శలు గుప్పించారు. ‘బాబు’ తీరు.. ప్రతిపక్షం బేజారు అంతరాష్ట్ర నదీ జలాల అంశం సైతం రెండు పార్టీల మధ్య ప్రచారాస్త్రంగా మారింది. పాలమూరు, డిండి, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని, ఆపాలంటూ పదేపదే కేంద్రానికి, బోర్డులకు లేఖ రాస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అలాంటి బాబుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేతులు కలిపి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని దుయ్యబడుతోంది. కాంగ్రెస్–టీడీపీ మైత్రి మరింత బలపడుతున్న నేపథ్యంలో ఏపీ సృష్టిస్తున్న అడ్డంకులు, తుంగభద్ర నదిపై అడ్డగోలుగా చేపడుతున్న ప్రాజెక్టుల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా టీఆర్ఎస్ ప్రణాళిక రచించింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన బహిరంగసభల్లో దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహం రచిస్తున్నారు. దీన్ని తిప్పికొట్టే అంశంపై కాంగ్రెస్ తర్జనభర్జన పడుతోంది. ‘కాళేశ్వరం’ కాక.. కాంగ్రెస్: కమీషన్ల కోసం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచారు. మెజార్టీ పనులను ఆంధ్రా కాంట్రాక్టు సంస్థలకే కట్టబెట్టారు. - కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం రూ.లక్ష కోట్లకు పెంచారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టుకే పేరుమార్చి రీ డిజైన్ చేశారు (ఇటీవల రాష్ట్ర పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ) టీఆర్ఎస్: రూ.80,190 కోట్ల అంచనా వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జల సంఘం ఆమోదం తెలుపుతూ జారీ చేసిన లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన హరీశ్‌రావు. - కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్ – ప్రాణహిత ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంతెంత పెరిగిందో తెలిపే మూడు జీవో కాపీలను ట్విట్టర్లో పెట్టిన కేటీఆర్. - ‘కాళేశ్వరం నీళ్లు కావాలా.. కాంగ్రెస్ పార్టీ క్వార్టర్ కావాలా?’ అంటూ ప్రచారం సాగిస్తున్న టీఆర్ఎస్. - కాళేశ్వరానికి రాష్ట్రం జాతీయ హోదానే అడగలేదని ఇటీవల కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించగా, జాతీయ హోదాపై కేంద్రానికి రాసిన లేఖను విడుదల చేసిన హరీశ్. - సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి -
కృష్ణాలో వాటా పెంపే లక్ష్యంగా పోరాడనున్న రాష్ట్రం
-
జల జగడంపై కేంద్రం వద్దే పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బేసిన్ల పరిధిలో నెలకొన్న వివాదాలను కేంద్ర ప్రభుత్వం వద్దే తేల్చుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సిద్ధమయ్యాయి. నీటి వాటాలు, వినియోగం, కొత్త ప్రాజెక్టులు, ప్రస్తుత ప్రాజెక్టుల నియంత్రణ వంటి అంశాలపై కేంద్ర జలవనరులశాఖ గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో ఇరు రాష్ట్రాలు పరిష్కారం కోసం కృషి చేయనున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించాల్సిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు చేతులెత్తేయడంతో చివరకు కేంద్రమే కదిలి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఈ భేటీ ఏర్పాటు చేసింది. సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ అధికారులు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్‌సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కేంద్ర జల సంఘం అధికారులతోపాటు కృష్ణా, గోదావరి బోర్డుల అధికారులు, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు హాజరుకానున్నారు. ఈ భేటీలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, టెలీమెట్రీ విధానం అమలు, నీటి వాటాల సర్దుబాటు, పట్టిసీమ,పోలవరంల కింది వాటాలు, నీటి పంపిణీ–నిర్వహణలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎజెండాలో చేర్చిన అంశాలపై ఇరు రాష్ట్రాలు మొదట తమ వాదన వినిపించిన అనంతరం..ఇతర అంశాలేవైనా ఉంటే వాటిపైనా వాదనలు జరిగే అవకాశం ఉంది. తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్మాణానికి కారణాలు, నీటి వాటాల్లో ఏపీ ఉల్లంఘనలు, ప్రాజెక్టుల నియంత్రణపై చట్టంలో పేర్కొన్న అంశాలు, బచావత్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులు, సుప్రీంకోర్టులో కేసులకు సంబంధించి అన్ని అంశాలతో తెలంగాణ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ముఖ్యంగా ఏపీ చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తే కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 575 టీఎంసీలకు పెంచాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే ఏపీ వాటాను 512 టీఎంసీల నుంచి 236 టీఎంసీలకు తగ్గించాలని పట్టుబట్టనున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ వాటాలకన్నా అధికంగా వినియోగిస్తోందని చెబుతున్న తెలంగాణ, పోతిరెడ్డిపాడు ఉల్లంఘనలను ప్రధానంగా ప్రస్తావించనుంది. కాగా, అదే రోజున పీఎంకేఎస్‌వై సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళుతున్న రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టుల నియంత్రణ, నీటి వాటాల పెంపు అంశంపై కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించే అవకాశం ఉంది. -
చుక్క చుక్కకూ లెక్కుంది
* కృష్ణా, గోదావరి బేసిన్లలోని కేటాయింపు జలాలన్నీ వినియోగంలోకి * సమగ్ర నీటి యాజమాన్య విధానానికి రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్రానికి ఉన్న వాటాల మేరకు జలాలను సంపూర్ణంగా, సమర్థంగా వినియోగించుకునేలా సమగ్ర జల విధానం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర పరీవాహకంలో లభ్యతగా ఉన్న ప్రతి నీటి చుక్కను అవసరాలకు తగినట్లుగా నిల్వ, వినియోగం చేసుకునేలా సమగ్ర అభివృద్ధి పథకాలను తీసుకురావాలని భావిస్తోంది. నదుల్లో వరద ఉండే రోజుల్లోనే గరిష్ట స్థాయిలో నీటిని ఒడిసిపట్టుకునేందుకు వీలైనన్ని ఎక్కువ బ్యారేజీలు, చెక్‌డ్యామ్‌లు కట్టాలని... వివాదాలున్న చోట ఇతర రాష్ట్రాలతో ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరిగేలా విధానానికి తుది రూపునివ్వాలని యోచిస్తోంది. పర్యావరణ సమతౌల్యం, పరీవాహక ప్రాంత రక్షణ, షెడ్యూల్ వర్గాల హక్కులను కాపాడాలన్న జాతీయ జల విధానాన్ని అనుసరిస్తూనే... రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మలుచుకునేలా కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఉమ్మడి రాష్ట్ర జల విధానం ఉన్నా.. అది తెలంగాణ అవసరాలకు అనుగుణంగా లేనందున నూతన విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో రాష్ట్ర ప్రాథమ్యాలు, వాతావరణ పరిస్థితులు, సాగు, తాగు, పరిశ్రమల అవసరాలు, అనువైన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేస్తోంది. చిన్ననీటి వనరుల వినియోగానికి 46 వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టింది. అయితే ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రభుత్వం అనేక మార్పులు చేస్తుండటంతో... ఆయా ప్రాజెక్టుల పూర్తిపై అనేక సందేహాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో స్పష్టమైన జల విధానాన్ని ప్రభుత్వపరంగా ప్రకటించేలా కసరత్తు జరుగుతోంది. దీనిని రెండు వారాల్లో ప్రజల ముందు పెట్టాలనే యోచనలో ఉంది. చెక్‌డ్యామ్‌లు, బ్యారేజీలతో ఒడిసిపడదాం.. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో రెండు మూడు టీఎంసీల కోసం ఆరాటపడుతుంటే... ఇదే సమయంలో 360 టీఎంసీల గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయింది. దీంతో ముందస్తు ప్రణాళికతో వీలైనన్ని చెక్‌డ్యామ్‌లు, బ్యారేజీలు నిర్మించడం ద్వారా... నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలు ఇప్పటికే అనుసరిస్తున్న విధానాన్ని ఇక్కడా అనుసరించాలని నిర్ణయించింది. గోదావరిలో నికర, వరద జలాలు కలుపుకొని లభ్యతగా ఉన్న 1,400 టీఎంసీల నీటిలో రాష్ట్రానికి 854.67 టీఎంసీల మేర వినియోగించుకునే అవకాశమున్నా... 400 టీఎంసీల మేరకే వాడుకుంటోంది. ఇంకా దాదాపు 350 టీఎంసీల నీటిని వాడుకునేందుకు దేవాదుల, ఎల్లంపల్లి, రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్, ప్రాణహిత-చేవెళ్ల, కంతనపల్లి, కాళేశ్వరం, ఎస్సారెస్పీ వరద కాల్వ, మిడ్‌మానేరు ప్రాజెక్టులు చేపట్టింది. కానీ ఇవేవీ పూర్తికాకపోవడంతో నీటి వినియోగం సాధ్యపడటం లేదు. ఈ నేపథ్యంలో దుమ్ముగూడెం మొదలుకొని ప్రాణహిత వరకు వీలైనన్ని ఎక్కువ బ్యారేజీలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇక కృష్ణా నదిలో రాష్ట్రానికి 299 టీఎంసీల కేటాయింపులున్నా... వాడుకలో ఉన్నది పోనూ మరో 200 టీఎంసీల వరకు ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. దీనికోసం ఇప్పటికే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను చేపట్టగా, కొత్తగా పాలమూరు, డిండిలతో 100 టీఎంసీల నీటిని తీసుకునేలా ప్రణాళికలు వేస్తున్నారు. దీంతోపాటు కృష్ణాపైనా ఆర్డీఎస్ నుంచి కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టు రివర్ బ్యాంకుల్లో బ్యారేజీలు, చెక్‌డ్యాములు కట్టేలా విధానాన్ని రూపొందించనున్నారు. దీంతోపా టు మున్నేరు సబ్‌బేసిన్‌లో లభ్యతగా ఉన్న 100 టీఎంసీల నీటి వినియోగానికి కత్వాల ప్రాజెక్టు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రాణహిత, ఇంద్రావతి పూర్తి వినియోగం గోదావరి ఉప బేసిన్లు అయిన ప్రాణహిత నదిలో 320 టీఎంసీలు, ఇంద్రావతి నది లో 280 టీఎంసీల లభ్యత జలాలు ఉన్నా... ప్రస్తుతం వాటిని వినియోగించుకోవడం లేదు. ఈ దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని తీసుకునేలా.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ను మారుస్తున్నారు. ఇంద్రావతి నీటిని ఒడిసిపట్టేందుకు ఇచ్చంపల్లి దిగువన వీలైనన్ని ఎక్కువ బ్యారేజీలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టాలన్నది ప్రభుత్వ యోచనగా ఉంది. ఒకవేళ బ్యారేజీలతో ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్రల్లో ముంపు ప్రాంతం ఉంటే సీఎం స్థాయి చర్చలతో పరిష్కారాలు కనుగొనేలా విధానాన్ని రూపొందించాలని భావిస్తోంది. ఈ బ్యారేజీల నుంచే వాటర్‌గ్రిడ్ పథకానికి అవసరమయ్యే సుమారు 80 టీఎంసీల నీటిని అందించాలని, పరిశ్రమల అవసరాలకు కేటాయించాలని యోచిస్తోంది. ఎత్తిపోతలను తగ్గిద్దాం రాష్ట్రంలో చేపడుతున్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరాలు భారీగా ఉండనున్నాయి. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్న 15 ఎత్తిపోతల ప్రాజెక్టులతో 40.21 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, మరో 1.34 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులకే 5,903 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం ఉండనుంది. పాలమూరు, ప్రాణహిత అవసరాలను కలిపితే అది 10వేల మెగావాట్లకు చేరుతుంది. ఈ స్థాయి విద్యుత్‌ను వాడుకుంటే యూనిట్‌కు రూ.5.50 చొప్పున లెక్కించినా... ఏటా రూ.10వేల కోట్ల మేర అవసరం. అందువల్ల ఎత్తిపోతలను తగ్గించే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. దీనిని జల విధానంలో వివరించే అవకాశం ఉంది. -
సోమశిల- సిద్ధేశ్వరం వంతెనకు గ్రీన్‌సిగ్నల్
కొల్లాపూర్: కొల్లాపూర్ ప్రజల చిరకాల వాంఛ అయిన సోమశిల- సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి తెలంగాణ సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వంతెన నిర్మాణానికి *193కోట్లు కేటాయిస్తూ జీఓ.నెం.131 విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 27న రోడ్లు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గత నెల 30న రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన మంత్రివర్గం కృష్ణా, గోదావరి నదులపై వంతెనల నిర్మాణానికి నిధులు కేటాయించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తగా రెండు నదులపై వంతెనల నిర్మాణం కోసం 1974.43కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా సోమశిల-సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి *193కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంతెన నిర్మాణం జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు, పాలమూరు జిల్లా అభివృద్ధికి దోహదపడుతుంది. వైఎస్హయంలో శ్రీకారం సోమశిల-సిద్ధేశ్వరం వంతెన నిర్మించాలని దశాబ్ధాల కాలంగా కొల్లాపూర్‌వాసులు పోరాడుతున్నారు. 2007లో మంచాలకట్ట గ్రామ సమీపంలో కృష్ణానదిలో పుట్టి మునిగి 61మంది మృతిచెందారు. ఈ ఘటనను చూసి చలించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోమశిల- సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. అందులో భాగంగా 2009లో *110 కోట్లు నిధులు కేటాయిస్తూ వంతెన నిర్మాణం కోసం కొల్లాపూర్‌లో శిలాఫలకం వేశారు. అదేవిధంగా క ల్వకుర్తి నుంచి నంద్యాల వరకూ డబుల్‌లైన్ రహదారి నిర్మాణం కోసం *85కోట్లను కేటాయిస్తూ మరో పైలాన్‌ను ఆవిష్కరించారు. అయితే పనుల ప్రారంభానికి పలురకాల సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడంతో పనులు నిలిచిపోయాయి. మళ్లీ స్థానిక ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు చొరవతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వంతెనతో పాటు, రోడ్ల నిర్మాణానికి *253కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా మొదటి విడతగా నాగర్‌కర్నూల్ నుంచి కొల్లాపూర్ వరకూ *50కోట్లతో డబుల్‌లైన్ రహదారి నిర్మించింది. కొల్లాపూర్ నుంచి సోమశిల రహదారి వరకూ బైపాస్ రహదారి నిర్మాణం కోసం *7.50కోట్ల నిధులను కేటాయించింది. బైపాస్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా అధికారులు గుర్తించారు. పనులు ప్రారంభమయ్యే సమయంలోనే రాష్ట్రం విడిపోయింది. దీంతో వంతెన నిర్మాణం జరుగుతుందో లేదోనన్న అయోమయం స్థానిక ప్రజల్లో నెలకొంది. వంతెన నిర్మాణం జరిగితే కొల్లాపూర్ నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యాపార లావాదేవీలు పెరిగేందుకు వీలుంటుంది. తిరుపతి, నంద్యాల, బెంగళూరు, హైదరాబాద్‌ల మధ్య దూరం తగ్గనుంది. సిమెంట్, ముడిఖనిజాల పరిశ్రమల వర్గాలకు ఈ వంతెన ప్రధానంగా దోహదపడనుంది. వ్యాపార,వాణిజ్యవర్గాలకు ఉపయోగంకరంగా ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కూడా ఉపయోగపడనుంది.