చుక్క చుక్కకూ లెక్కుంది
* కృష్ణా, గోదావరి బేసిన్లలోని కేటాయింపు జలాలన్నీ వినియోగంలోకి
* సమగ్ర నీటి యాజమాన్య విధానానికి రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్రానికి ఉన్న వాటాల మేరకు జలాలను సంపూర్ణంగా, సమర్థంగా వినియోగించుకునేలా సమగ్ర జల విధానం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర పరీవాహకంలో లభ్యతగా ఉన్న ప్రతి నీటి చుక్కను అవసరాలకు తగినట్లుగా నిల్వ, వినియోగం చేసుకునేలా సమగ్ర అభివృద్ధి పథకాలను తీసుకురావాలని భావిస్తోంది.
నదుల్లో వరద ఉండే రోజుల్లోనే గరిష్ట స్థాయిలో నీటిని ఒడిసిపట్టుకునేందుకు వీలైనన్ని ఎక్కువ బ్యారేజీలు, చెక్‌డ్యామ్‌లు కట్టాలని... వివాదాలున్న చోట ఇతర రాష్ట్రాలతో ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరిగేలా విధానానికి తుది రూపునివ్వాలని యోచిస్తోంది. పర్యావరణ సమతౌల్యం, పరీవాహక ప్రాంత రక్షణ, షెడ్యూల్ వర్గాల హక్కులను కాపాడాలన్న జాతీయ జల విధానాన్ని అనుసరిస్తూనే... రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మలుచుకునేలా కార్యాచరణకు సిద్ధమవుతోంది.
ఉమ్మడి రాష్ట్ర జల విధానం ఉన్నా.. అది తెలంగాణ అవసరాలకు అనుగుణంగా లేనందున నూతన విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో రాష్ట్ర ప్రాథమ్యాలు, వాతావరణ పరిస్థితులు, సాగు, తాగు, పరిశ్రమల అవసరాలు, అనువైన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేస్తోంది. చిన్ననీటి వనరుల వినియోగానికి 46 వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టింది. అయితే ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రభుత్వం అనేక మార్పులు చేస్తుండటంతో... ఆయా ప్రాజెక్టుల పూర్తిపై అనేక సందేహాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో స్పష్టమైన జల విధానాన్ని ప్రభుత్వపరంగా ప్రకటించేలా కసరత్తు జరుగుతోంది. దీనిని రెండు వారాల్లో ప్రజల ముందు పెట్టాలనే యోచనలో ఉంది.
చెక్‌డ్యామ్‌లు, బ్యారేజీలతో ఒడిసిపడదాం..
ప్రస్తుత కరువు పరిస్థితుల్లో రెండు మూడు టీఎంసీల కోసం ఆరాటపడుతుంటే... ఇదే సమయంలో 360 టీఎంసీల గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయింది. దీంతో ముందస్తు ప్రణాళికతో వీలైనన్ని చెక్‌డ్యామ్‌లు, బ్యారేజీలు నిర్మించడం ద్వారా... నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలు ఇప్పటికే అనుసరిస్తున్న విధానాన్ని ఇక్కడా అనుసరించాలని నిర్ణయించింది. గోదావరిలో నికర, వరద జలాలు కలుపుకొని లభ్యతగా ఉన్న 1,400 టీఎంసీల నీటిలో రాష్ట్రానికి 854.67 టీఎంసీల మేర వినియోగించుకునే అవకాశమున్నా... 400 టీఎంసీల మేరకే వాడుకుంటోంది.
ఇంకా దాదాపు 350 టీఎంసీల నీటిని వాడుకునేందుకు దేవాదుల, ఎల్లంపల్లి, రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్, ప్రాణహిత-చేవెళ్ల, కంతనపల్లి, కాళేశ్వరం, ఎస్సారెస్పీ వరద కాల్వ, మిడ్‌మానేరు ప్రాజెక్టులు చేపట్టింది. కానీ ఇవేవీ పూర్తికాకపోవడంతో నీటి వినియోగం సాధ్యపడటం లేదు. ఈ నేపథ్యంలో దుమ్ముగూడెం మొదలుకొని ప్రాణహిత వరకు వీలైనన్ని ఎక్కువ బ్యారేజీలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇక కృష్ణా నదిలో రాష్ట్రానికి 299 టీఎంసీల కేటాయింపులున్నా... వాడుకలో ఉన్నది పోనూ మరో 200 టీఎంసీల వరకు ఉపయోగించుకునే అవకాశాలున్నాయి.
దీనికోసం ఇప్పటికే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను చేపట్టగా, కొత్తగా పాలమూరు, డిండిలతో 100 టీఎంసీల నీటిని తీసుకునేలా ప్రణాళికలు వేస్తున్నారు. దీంతోపాటు కృష్ణాపైనా ఆర్డీఎస్ నుంచి కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టు రివర్ బ్యాంకుల్లో బ్యారేజీలు, చెక్‌డ్యాములు కట్టేలా విధానాన్ని రూపొందించనున్నారు. దీంతోపా టు మున్నేరు సబ్‌బేసిన్‌లో లభ్యతగా ఉన్న 100 టీఎంసీల నీటి వినియోగానికి కత్వాల ప్రాజెక్టు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది.
ప్రాణహిత, ఇంద్రావతి పూర్తి వినియోగం
గోదావరి ఉప బేసిన్లు అయిన ప్రాణహిత నదిలో 320 టీఎంసీలు, ఇంద్రావతి నది లో 280 టీఎంసీల లభ్యత జలాలు ఉన్నా... ప్రస్తుతం వాటిని వినియోగించుకోవడం లేదు. ఈ దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని తీసుకునేలా.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ను మారుస్తున్నారు.
ఇంద్రావతి నీటిని ఒడిసిపట్టేందుకు ఇచ్చంపల్లి దిగువన వీలైనన్ని ఎక్కువ బ్యారేజీలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టాలన్నది ప్రభుత్వ యోచనగా ఉంది. ఒకవేళ బ్యారేజీలతో ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్రల్లో ముంపు ప్రాంతం ఉంటే సీఎం స్థాయి చర్చలతో పరిష్కారాలు కనుగొనేలా విధానాన్ని రూపొందించాలని భావిస్తోంది. ఈ బ్యారేజీల నుంచే వాటర్‌గ్రిడ్ పథకానికి అవసరమయ్యే సుమారు 80 టీఎంసీల నీటిని అందించాలని, పరిశ్రమల అవసరాలకు కేటాయించాలని యోచిస్తోంది.
ఎత్తిపోతలను తగ్గిద్దాం
రాష్ట్రంలో చేపడుతున్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరాలు భారీగా ఉండనున్నాయి. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్న 15 ఎత్తిపోతల ప్రాజెక్టులతో 40.21 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, మరో 1.34 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్టులకే 5,903 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం ఉండనుంది. పాలమూరు, ప్రాణహిత అవసరాలను కలిపితే అది 10వేల మెగావాట్లకు చేరుతుంది. ఈ స్థాయి విద్యుత్‌ను వాడుకుంటే యూనిట్‌కు రూ.5.50 చొప్పున లెక్కించినా... ఏటా రూ.10వేల కోట్ల మేర అవసరం. అందువల్ల ఎత్తిపోతలను తగ్గించే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. దీనిని జల విధానంలో వివరించే అవకాశం ఉంది.