800 టీఎంసీలు కడలిపాలు | Rising Flood Water Level In Godavari And Krishna River Into Sea | Sakshi
Sakshi News home page

800 టీఎంసీలు కడలిపాలు

Published Wed, Aug 25 2021 12:40 AM | Last Updated on Wed, Aug 25 2021 12:40 AM

Rising Flood Water Level In Godavari And Krishna River Into Sea - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ కనుమల్లో గతంలో ఎన్నడూ లేనంత వర్షాలు కురవడం, మహారాష్ట్ర, కర్ణాటక నదీ పరివాహక ప్రాంతాల నుంచి భారీ వరదలు పోటెత్తడంతో ఈ ఏడాది కృష్ణా, గోదావరి నదుల నుంచి భారీగా వరద నీరు సముద్రం పాలవుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా జూలై నెలలో గోదావరి బేసిన్‌ ప్రాజెక్టులు, ఆగస్టు తొలి వారంలోనే కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులు నిండటంతో వచ్చిన నీరు వచ్చినట్లుగా సముద్రంలో కలుస్తోంది. వాటర్‌ ఇయర్‌ ఆరంభమైన జూన్‌ 1 నుంచి 85 రోజుల వ్యవధిలో 800 టీఎంసీల నీరు కడలిపాలైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  

కృష్ణాలో 170.. గోదావరిలో 631... 
రెండు నదీ బేసిన్‌ల పరిధిలో జూన్‌ తొలకరి వర్షాలు పెద్దగా ప్రభావం చూపకున్నా జూలైలో కురిసిన భారీ, అతిభారీ వర్షాలతో నదులు ఉప్పొంగాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో 25–30 సెం.మీ. వర్షపాతం నమోదవడంతో జూలై రెండో వారం నుంచే దిగువకు భారీ ప్రవాహాలు వచ్చాయి. జూలై మూడో వారంలోనే శ్రీశైలం గేట్లు తెరుచుకోగా, ఆగస్టు 1న నాగార్జునసాగర్‌ గేట్లు తెరిచారు. రాష్ట్రంలో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల కింద 299 టీఎంసీల మేర నీటి వినియోగం ఉన్నప్పటికీ చెరువులు, కుంటలు అన్ని నిండి ఉండటం, రిజర్వాయర్‌లలోనూ నీటి నిల్వలు ఉండటంతో ఈ ఏడాది కృష్ణా బేసిన్‌లో తెలంగాణ 35 టీఎంసీలకు మించి వినియోగించలేదు. గోదావరిలోనూ భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌మానేరు, కడెం సహా మధ్యతరహా ప్రాజెక్టులతోపాటు చెరువులన్నీ నిండాయి.

దీంతో గోదావరి జలాల ఎత్తిపోతల ద్వారా పెద్దగా నీటి వినియోగం జరగలేదు. దీంతో నదుల నుంచి వచ్చిన నీరు వచ్చినట్లుగా సముద్రంలోకి చేరుతోంది. మంగళవారం సాయంత్రానికి గోదావరి నుంచి 631 టీఎంసీలు, కృష్ణా నుంచి 170 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. గత ఏడాది ఇదే సమయానికి 192 (గోదావరిలో 168, కృష్ణాలో 24) టీఎంసీల నీరు మాత్రమే సముద్రంలోకి చేరింది. మరోవైపు వచ్చే సెప్టెంబర్, అక్టోబర్‌లో భారీ వర్షాలు కురిస్తే రెండు నదుల్లో కలిపి నాలుగు వేలకుపైగా టీఎంసీల నీరు సముద్రంలో కలిసే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement