సాక్షి, హైదరాబాద్/ నెట్‌వర్క్: రాష్ట్రంతోపాటు ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతుండటంతో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు వస్తున్నాయి. గోదావరి పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. బుధవారం ఎస్సారెస్పీలోకి 52 వేల క్యూసెక్కుల వరద రాగా.. గురువారం ఏకంగా 1.38 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ఎస్సారెస్పీ నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలుకాగా.. గురువారం సాయంత్రానికి 65 టీఎంసీలకు చేరింది. మరో 25 టీఎంసీలు చేరితే గేట్లు ఎత్తనున్నారు. వరద ఇదే స్థాయిలో కొనసాగితే రెండు రోజుల్లోనే ప్రాజెక్టు నిండనుంది. ఇక గోదావరి బేసిన్‌లోని ఎల్లంపల్లి, లోయర్ మానేరు ప్రాజెక్టులకు కూడా భారీ వరద వస్తోంది. భారీ ప్రవాహాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మి బ్యారేజీ (మేడిగడ్డ), సరస్వతి బ్యారేజీ (అన్నారం)లో గేట్లు ఎత్తి నీటిని వదిలిపెడుతున్నారు. సింగూరులోకి 2,245 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. నీటి నిల్వ 29.91 సామర్థ్యానికిగాను 18.43 టీఎంసీలకు చేరింది.
కృష్ణా ప్రాజెక్టులకు ఇలా..
కృష్ణా బేసిన్‌లో స్ధిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. నారాయణపూర్ నుంచి జూరాలకు వరద వస్తోంది. ఇక్కడ ఎత్తిపోతల పథకాలు, ఎడమ, కుడి కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తితో నాగార్జునసాగర్‌కు నీళ్లు వెళ్తున్నాయి. నాగార్జునసాగర్ నుంచి ఔట్‌ఫ్లో లేకున్నా.. పరీవాహకంలోని వర్షాలు, మూసీ వరద రావడంతో పులిచింతల నిండుతోంది.
చిన్న ప్రాజెక్టుల్లో జలకళ
ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోపాటు సరస్వతి బ్యారేజీ నుంచి వస్తున్న నీటితో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్కసాగర్ బ్యారేజీ నిండుగా కళకళలాడుతోంది. మొత్తం 59 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నిండిపోయింది. దాంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు నిండుకుండల్లా మారాయి.
జలకళతో గోదావరి గలగల
Published Fri, Jul 16 2021 2:43 AM | Last Updated on Fri, Jul 16 2021 2:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment