water flow heavy
-
బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న మూసీనది
-
పోటెత్తిన కృష్ణమ్మ..
సాక్షి, హైదరాబాద్/ దోమలపెంట/ గద్వాల రూరల్: ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది మళ్లీ పోటెత్తింది. జూరాల నుంచి కృష్ణా, సుంకేశుల నుంచి తుంగభద్ర ద్వారా ఆదివారం రాత్రి 7 గంటల సమయానికి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,60,748 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ప్రాజెక్టులో 885 అడుగుల వద్ద 215.8 టీఎంసీలను నిల్వ చేశారు. తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు, ఏపీ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 27,137 క్యూసెక్కులతో పాటు ప్రాజెక్టు 9 గేట్ల ద్వారా మొత్తం 3,16,652 క్యూసెక్కులను శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జునసాగర్‌లోకి వస్తున్న 3,38,298 క్యూసెక్కులను పూర్తిగా దిగువకు వదిలేస్తున్నారు. సాగర్‌లో 588.8 అడుగులవద్ద 308.47 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు. అలాగే పులిచింతలలోకి 4,09,060 క్యూసెక్కులు వస్తుండగా 3,96,062 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఎగువన కర్ణాటకలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి నుంచి 82,000 క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 92,550 క్యూసెక్కులను వచ్చింది వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌కు 52.94 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 70 వేల క్యూసెక్కులను శ్రీశైలం డ్యామ్ వైపు విడుదల చేస్తున్నారు. -
‘స్టాప్ గేటు’ ఫలవంతం: పులిచింతలకు జలకళ
సాక్షి, అమరావతి బ్యూరో: పులిచింతల ప్రాజెక్టు మళ్లీ జలకళ సంతరించుకుంది. జలాశయంలో నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. ప్రాజెక్టుకు చెందిన 16వ గేటు విరిగిపోవడంతో, స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసేందుకు, ప్రాజెక్టులో నీటిని దిగువకు విడుదల చేశారు. మరమ్మతుల సమయానికి ప్రాజెక్టులో నీటి మట్టం ఐదు టీఎంసీల కనిష్ట స్థాయికి పడిపోయింది. యుద్ధప్రాతిపదికన స్టాప్ గేటు ఏర్పాటు చేశారు. కృష్ణా ఎగువ ప్రాంతాల నుంచి వరద స్థిరంగా కొనసాగుతుండటంతో మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టులో నీటి నిల్వ 17.64 టీఎంసీలకు చేరింది. దీంతో పులిచింతల ప్రాజెక్టు మళ్లీ నీటితో కళకళలాడుతూ కనిపిస్తోంది. కృష్ణా డెల్టా సాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి 18,887 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పట్టిసీమ నీరు తీసుకోకుండానే.. కృష్ణా డెల్టాలో ముమ్మరంగా వరి నాట్లు సాగుతున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా కాలువలకు నీటిని పుష్కలంగా విడుదల చేస్తున్నారు. కేఈబీ, ఏలూరు కాలువలకు 1400 క్యూసెక్కుల చొప్పున, బందరు కాలువకు 2200, రైవస్ కాలువకు నాలుగు వేలు, కృష్ణా పశి్చమ డెల్టాకు 6200, గుంటూరు కాలువకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాలువలకు సాగునీరు ఇచ్చేందుకు వీలుగా బ్యారేజీ గేట్లు మూసి వేశారు. నీటి పారుదల శాఖ అధికారులు ప్రణాళికబద్ధంగా పట్టిసీమ నీరు తీసుకోకుండానే, పులిచింతల ప్రాజెక్టు నుంచి అవసరమున్న మేరకు నీటిని సేకరిస్తూ, మిగిలిన నీటిని నిల్వ చేస్తున్నారు. రైతు ప్రయోజనాలకు పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసింది. పులిచింతల ప్రాజెక్టు 16వ నంబరు గేటు విరిగిపోయినా దాని స్థానంలో రికార్డు స్థాయిలో రెండు రోజుల్లో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసింది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వకు మార్గం సుగమమైంది. డెల్టా ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి తన చిత్త శుద్ధిని నిరూపించుకొంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద పెరిగింది. ప్రాజెక్టులోకి 1,46,318 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో దిగువనున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1,46,317 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు 63,317 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టులోకి 40,636 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. డెల్టా సాగు నీటిని అవసరాలకు దిగువనున్న ప్రకాశం బ్యారేజీలోకి 18,887 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణా నదికి స్వల్పంగా వరద పెరిగిన నేపథ్యంలో, సాగు నీటి అవసరాలకు సరిపడా నీటిని వినియోగించుకొంటూనే, పులిచింతల ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలకు వారం రోజుల్లోపే చేరుతుందని నీటి పారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తున్నాం స్టాప్‌లాగ్ ఏర్పాటు కోసం పులిచింతల ప్రాజెక్టులో నీరు తగ్గించాం. గేటు ఏర్పాటు పూర్తవడంతో తిరిగి నీటిని నిల్వ చేస్తున్నాం. ప్రస్తు తం 17.64 టీఎంసీల నీరు ఉంది. కృష్ణానదికి వరద స్థిరంగా కొనసాగుతోంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నింపుతున్నాం. త్వరలో ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రాజెక్టు వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, తగు చర్యలు తీసుకొంటున్నాం. - రమేశ్‌బాబు, ఎస్ఈ, పులిచింతల ప్రాజెక్టు -
జలకళతో గోదావరి గలగల
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రంతోపాటు ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతుండటంతో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు వస్తున్నాయి. గోదావరి పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. బుధవారం ఎస్సారెస్పీలోకి 52 వేల క్యూసెక్కుల వరద రాగా.. గురువారం ఏకంగా 1.38 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ఎస్సారెస్పీ నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలుకాగా.. గురువారం సాయంత్రానికి 65 టీఎంసీలకు చేరింది. మరో 25 టీఎంసీలు చేరితే గేట్లు ఎత్తనున్నారు. వరద ఇదే స్థాయిలో కొనసాగితే రెండు రోజుల్లోనే ప్రాజెక్టు నిండనుంది. ఇక గోదావరి బేసిన్‌లోని ఎల్లంపల్లి, లోయర్ మానేరు ప్రాజెక్టులకు కూడా భారీ వరద వస్తోంది. భారీ ప్రవాహాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మి బ్యారేజీ (మేడిగడ్డ), సరస్వతి బ్యారేజీ (అన్నారం)లో గేట్లు ఎత్తి నీటిని వదిలిపెడుతున్నారు. సింగూరులోకి 2,245 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. నీటి నిల్వ 29.91 సామర్థ్యానికిగాను 18.43 టీఎంసీలకు చేరింది. కృష్ణా ప్రాజెక్టులకు ఇలా.. కృష్ణా బేసిన్లో స్ధిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. నారాయణపూర్ నుంచి జూరాలకు వరద వస్తోంది. ఇక్కడ ఎత్తిపోతల పథకాలు, ఎడమ, కుడి కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తితో నాగార్జునసాగర్‌కు నీళ్లు వెళ్తున్నాయి. నాగార్జునసాగర్ నుంచి ఔట్‌ఫ్లో లేకున్నా.. పరీవాహకంలోని వర్షాలు, మూసీ వరద రావడంతో పులిచింతల నిండుతోంది. చిన్న ప్రాజెక్టుల్లో జలకళ ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోపాటు సరస్వతి బ్యారేజీ నుంచి వస్తున్న నీటితో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్కసాగర్ బ్యారేజీ నిండుగా కళకళలాడుతోంది. మొత్తం 59 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నిండిపోయింది. దాంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు నిండుకుండల్లా మారాయి. -
పరీక్షకు వెళ్లొస్తూ.. వంకలో కొట్టుకుపోయిన దంపతులు
సాక్షి, కమలాపురం : కమలాపురం–ఖాజీపేట రహదారిలో పాగేరు వంతెనపై ద్విచక్ర వాహనంలో వెళుతూ నీటి ఉధృతికి దంపతులు గల్లంతయ్యారు. స్థానికులు గమనించి భార్యను రక్షించి బయటకు తీశారు. భర్త ఆచూకీ లభించలేదు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు... మండలంలోని చిన్న చెప్పలికి చెందిన శరత్ చంద్రారెడ్డికి కడపకు చెందిన ఐశ్వర్యతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వారు కడపలోనే నివాసం ఉంటున్నారు. శరత్ చంద్రారెడ్డి కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పీఆర్ఓగా పని చేస్తున్నాడు. గురువారం ఎడ్ సెట్ పరీక్ష రాసేందుకు ఐశ్వర్యను చాపాడుకు తీసుకెళ్లాడు. పరీక్ష ముగిసిన అనంతరం సాయంత్రం కమలాపురం మీదుగా స్వగ్రామం చిన్న చెప్పలికి ద్విచక్ర వాహనంలో బయలు దేరారు. పాగేరు వంకలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై కొంత దూరం రాగానే ప్రవాహ వేగానికి అదుపు తప్పడంతో ద్విచక్ర వాహనంతో పాటు భార్యా భర్తలిద్దరూ వరద నీటిలో కొట్టుకొని పోయారు. స్థానిక యువకుడు నీటిలో దూకి ఐశ్వర్యను రక్షించాడు. శరత్ చంద్రారెడ్డి అప్పటికే కనబడకుండా పోయాడు. తహసీల్దార్ విజయ్ కుమార్, ఎస్ఐ రాజారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఓఓ నాగేశ్వర్ రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శిక్షణ పొందిన అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయినా శరత్ ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గాలింపు ఆపివేశారు. తన భర్త కోసం కొండంత ఆశతో వంతెన ఒడ్డున ఐశ్వర్య కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటన చూసినవారు కంట తడి పెట్టారు. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు, ఏడు నెలల కుమార్తె ఉంది. -
ఉప్పొంగిన ప్రాణహిత, గోదావరి
కాళేశ్వరం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత వరద కలుస్తోంది. ఎగువన అన్నారం (సరస్వతీ) బ్యారేజీ గేట్లు ఎత్తడంతో దిగువకు వచ్చే గోదావరి జలాలు కూడా కాళేశ్వరం వద్ద కలుస్తున్నాయి. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల వరద పుష్కర ఘాట్లను తాకుతూ 8.3 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీకి వరద తాకిడి పెరుగుతోంది. దీంతో శుక్రవారం బ్యారేజీలో ని 85 గేట్లకు గాను 57 గేట్లు ఎత్తి వరదను దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువన గోదావరి, ప్రాణహిత నదుల ద్వారా 2,91,200 క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లు ఎత్తడంతో దిగువకు 2.42,500 క్యూసెక్కుల నీరు తరలుతోందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. అలాగే.. అన్నారంలోని సరస్వతీ బ్యారేజీలోకి స్థానిక వాగుల ద్వారా భారీగా నీరు వచ్చి చేరుతోంది. కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోతలను నిలిపివేశారు. బ్యారేజీలో మొత్తం 66 గేట్లకు గాను 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా 9.20 టీఎంసీలతో నిండుకుండలా మారింది. ఈ బ్యారేజీకి సుమారు 30కి పైగా వాగుల ద్వారా ఇన్‌ఫ్లో 36,480 క్యూసెక్కులు వస్తుండగా, గేట్లు ఎత్తడంతో 29,700 క్యూసెక్కుల వరద దిగువ కాళేశ్వరం వైపునకు వెళ్తోంది. సాయంత్రంగా ఐదు గేట్లను మూసివేశారు. భద్రాచలం వద్ద పోటెత్తిన గోదారమ్మ కాగా, భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు గోదావరి నీటి మట్టం 40.3 అడుగులకు చేరింది. గంట గంటకూ పెరుగుతున్న గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద వచ్చి చేరుతుండటంతో గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఉదయం 10 గంటలకు 7.13 మీటర్ల నీటి మట్టం నమోదు కాగా, మధ్యాహ్నం 12 గంటలకు 7.26 మీటర్లు, సాయంత్రం 4 గంటలకు 7.34 మీటర్లు, సాయంత్రం 5 గంటలకు 7.40 మీటర్లకు చేరింది. ఇలా గంటగంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులతో కలసి ఏటీడీఏ పీఓ హనుమంత్, ఏఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించి సహాయక చర్యలపై చర్చించారు. అలాగే, వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ఏటూరునాగారం తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు పనిచేసే ఈ కంట్రోల్ రూంను 80080 60434 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
మళ్లీ బిరబిరా కృష్ణమ్మ..
సాక్షి, అమరావతి/విజయవాడ: కృష్ణానది మరోసారి పరవళ్లు తొక్కుతోంది. పులిచింతల, మున్నేరుల నుంచి వరద నీరు ఉధృతంగా వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి మొత్తం 1,33,429 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తుండడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి చెందిన 40 గేట్లను ఒకడుగు, 30 గేట్లను రెండడుగుల మేర పైకిలేపి 82,625 వేల క్యూసెక్కుల నీటిని వచ్చింది వచ్చినట్లుగా సముద్రంలోకి వదలటంతోపాటు కాలువలకూ నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు.. వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండడంతో బ్యారేజీ నిండుకుండలా దర్శనమిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా.. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో గురువారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 73,573 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతలు.. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాలు, స్పిల్ వే ద్వారా 94,353 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 214.85 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అలాగే, నాగార్జునసాగర్‌లోకి 91,728 క్యూసెక్కులు వస్తుండగా కుడి, ఎడమ కాలువ, ఏఎమ్మార్పీలకు 11 వేల క్యూసెక్కులు, మిగిలిన 80 వేల క్యూసెక్కులను విద్యుదుత్పత్తి కేంద్రాలు, గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ దిగువన కృష్ణా వరదకు మూసీ ప్రవాహం తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 97,541 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో నిల్వ గరిష్ఠ స్థాయి 45.26 టీఎంసీలకు చేరుకోవడంతో దిగువకు 1,33,429 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గోదావరి, వంశధార నదుల్లోనూ వరద ప్రవాహం కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,28,518 క్యూసెక్కులు రాగా.. గోదావరి డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 1,27,823 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గొట్టా బ్యారేజీలోకి 11,927 క్యూసెక్కుల వంశధార ప్రవాహం రాగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదులుతున్నారు. 538.16 టీఎంసీలు కడలిపాలు కాగా, ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం వరకు (ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో) మొత్తం 538.16 టీఎంసీల కృష్ణా వరద నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసిందని.. ఇది మరికొద్ది రోజులు కొనసాగే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో నాలుగేళ్లు సాగునీరు లేక రైతులు విలవిల్లాడారు. అక్టోబర్ వచ్చినా పూర్తిగా వరినాట్లు పడేవి కావు. కానీ, ఈ ఏడాది పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉండడంతో అన్నదాతలు ఆనందోత్సాహాలతో వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటున్నారు. 15న కృష్ణా బోర్డు సమావేశం ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటిదాకా వినియోగించుకున్న కృష్ణా జలాల లెక్కలు తేల్చేందుకు కృష్ణా బోర్డు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ నుంచి ఈఈలు బాబూరావు, మనోహర్‌రాజు.. తెలంగాణ నీటిపారుదల శాఖ నుంచి ఎస్ఈ ఆర్వీ ప్రకాశ్, ఈఈ శ్రీధర్‌కుమార్‌లు సమావేశమయ్యారు. నీటి వినియోగం లెక్కలు ఒక కొలిక్కి రాలేదు. దీంతో ఈ విషయమై ఈనెల 15న కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. రబీలో ఇరు రాష్ట్రాల అవసరాలు.. జలాశయాల్లో నీటి లభ్యత ఆధారంగా బోర్డు కేటాయింపులు చేయనుంది. -
తుంగభద్రకు పెరుగుతున్న ఉధృతి
సాక్షి, హైదరాబాద్ : ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఉప నదులు, వాగుల నుంచి ప్రవాహాలు వస్తుండటంతో భారీగా నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం ప్రాజెక్టులోకి 48 వేల క్యూసెక్కుల నీరు రాగా, శనివారం అది మరో 4 వేలకు పెరిగింది. శనివారం 52,136 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో నమోదైంది. శుక్రవారం ప్రాజెక్టులో నీటి నిల్వ 11.91 టీఎంసీలు ఉండగా శనివారానికి 16.38 టీఎంసీలకు చేరింది. ఒక్క రోజులోనే సుమారు 5 టీఎంసీల నీరు ప్రాజెక్టుకు చేరింది. వాటర్ ఇయర్ మొదలయ్యాక తొలిసారి ఆల్మట్టిలోకి శనివారం నుంచి ప్రవాహాలు మొదలయ్యాయి. ఆల్మట్టిలోకి 2,153 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలకు గానూ 22.61 టీఎంసీలకు చేరింది. ఇక నారాయణపూర్‌లోకి ప్రవాహాలు తగ్గాయి. మూడ్రోజులుగా ప్రాజెక్టుకు 2,500 క్యూసెక్కుల ప్రవాహాలు రాగా శనివారం అది 900 క్యూసెక్కులకు తగ్గింది. జూరాల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు సైతం నీటి ప్రవాహాలు తగ్గాయి. -
గోదావరికి మళ్లీ పెరిగిన వరద
నెల్లిపాక: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎటపాక మండలంలో పలు వాగులు పోటెత్తాయి. శనివారం అర్ధరాత్రి భారీగా నీరు చేరడంతో ఆదివారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి వరద 38 అడుగులకు చేరింది. మధ్యాహ్నం ఎగువన ఉన్న చర్ల తాలిపేరు ప్రాజñ క్టు నుంచి 7 గేట్లు ఎత్తి సుమారు 21వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. 6.23 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల ధవళేశ్వరం : ఆదివారం రాత్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది. బ్యారేజ్‌లోని 175 గేట్లను ఎత్తి 6,23,071 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. అలాగే తూర్పు డెల్టాకు 4100, మధ్య డెల్టాకు 2 వేలు, పశ్చిమ డెల్టాకు 6 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 6.98 మీటర్లు, పేరూరులో 11.50 మీటర్లు, దుమ్ముగూడెంలో 10.63 మీటర్లు, కూనవరంలో 13.45 మీటర్లు, కుంటలో 7.55 మీటర్లు, కొయిదాలో 17.46 మీటర్లు, పోలవరంలో 11.06 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 15 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి.