సాక్షి, అమరావతి బ్యూరో: పులిచింతల ప్రాజెక్టు మళ్లీ జలకళ సంతరించుకుంది. జలాశయంలో నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. ప్రాజెక్టుకు చెందిన 16వ గేటు విరిగిపోవడంతో, స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసేందుకు, ప్రాజెక్టులో నీటిని దిగువకు విడుదల చేశారు. మరమ్మతుల సమయానికి ప్రాజెక్టులో నీటి మట్టం ఐదు టీఎంసీల కనిష్ట స్థాయికి పడిపోయింది. యుద్ధప్రాతిపదికన స్టాప్ గేటు ఏర్పాటు చేశారు. కృష్ణా ఎగువ ప్రాంతాల నుంచి వరద స్థిరంగా కొనసాగుతుండటంతో మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టులో నీటి నిల్వ 17.64 టీఎంసీలకు చేరింది. దీంతో పులిచింతల ప్రాజెక్టు మళ్లీ నీటితో కళకళలాడుతూ కనిపిస్తోంది. కృష్ణా డెల్టా సాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి 18,887 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పట్టిసీమ నీరు తీసుకోకుండానే..
కృష్ణా డెల్టాలో ముమ్మరంగా వరి నాట్లు సాగుతున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా కాలువలకు నీటిని పుష్కలంగా విడుదల చేస్తున్నారు. కేఈబీ, ఏలూరు కాలువలకు 1400 క్యూసెక్కుల చొప్పున, బందరు కాలువకు 2200, రైవస్ కాలువకు నాలుగు వేలు, కృష్ణా పశి్చమ డెల్టాకు 6200, గుంటూరు కాలువకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాలువలకు సాగునీరు ఇచ్చేందుకు వీలుగా బ్యారేజీ గేట్లు మూసి వేశారు. నీటి పారుదల శాఖ అధికారులు ప్రణాళికబద్ధంగా పట్టిసీమ నీరు తీసుకోకుండానే, పులిచింతల ప్రాజెక్టు నుంచి అవసరమున్న మేరకు నీటిని సేకరిస్తూ, మిగిలిన నీటిని నిల్వ చేస్తున్నారు.
రైతు ప్రయోజనాలకు పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసింది. పులిచింతల ప్రాజెక్టు 16వ నంబరు గేటు విరిగిపోయినా దాని స్థానంలో రికార్డు స్థాయిలో రెండు రోజుల్లో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసింది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వకు మార్గం సుగమమైంది. డెల్టా ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి తన చిత్త శుద్ధిని నిరూపించుకొంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద పెరిగింది. ప్రాజెక్టులోకి 1,46,318 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో దిగువనున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1,46,317 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు 63,317 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టులోకి 40,636 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.
డెల్టా సాగు నీటిని అవసరాలకు దిగువనున్న ప్రకాశం బ్యారేజీలోకి 18,887 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణా నదికి స్వల్పంగా వరద పెరిగిన నేపథ్యంలో, సాగు నీటి అవసరాలకు సరిపడా నీటిని వినియోగించుకొంటూనే, పులిచింతల ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలకు వారం రోజుల్లోపే చేరుతుందని నీటి పారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తున్నాం
స్టాప్‌లాగ్ ఏర్పాటు కోసం పులిచింతల ప్రాజెక్టులో నీరు తగ్గించాం. గేటు ఏర్పాటు పూర్తవడంతో తిరిగి నీటిని నిల్వ చేస్తున్నాం. ప్రస్తు తం 17.64 టీఎంసీల నీరు ఉంది. కృష్ణానదికి వరద స్థిరంగా కొనసాగుతోంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నింపుతున్నాం. త్వరలో ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రాజెక్టు వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, తగు చర్యలు తీసుకొంటున్నాం.
- రమేశ్‌బాబు, ఎస్‌ఈ, పులిచింతల ప్రాజెక్టు
‘స్టాప్ గేటు’ ఫలవంతం: పులిచింతలకు జలకళ
Published Wed, Aug 11 2021 9:49 AM | Last Updated on Wed, Aug 11 2021 9:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment