సాక్షి, అమరావతి: తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని మున్నేరు ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 1.97 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా.. అదే స్థాయిలో దిగువకు వదిలేశారు. ఈ ప్రవాహానికి కట్టలేరు, బుడమేరు, పాలేరు తదితర వాగులు, వంకల ప్రవాహం తోడవుతుండటంతో పులిచింతల ప్రాజెక్ట్‌కు దిగువన కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది.
ప్రకాశం బ్యారేజీలోకి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 2,60,875 క్యూసెక్కులు చేరుతుండటంతో.. అంతే స్థాయిలో వరదను 55 గేట్లను 6 అడుగులు, 15 గేట్లను ఏడు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. జూలై చివరి వారంలో ప్రకాశం బ్యారేజీకి ఈ స్థాయిలో వరద రావడం.. గేట్లు ఎత్తి సముద్రంలోకి ఈ స్థాయిలో వరదను వదిలేయడం ఇదే తొలిసారి. ఖమ్మం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో శుక్రవారం వర్షాలు తెరిపి ఇవ్వడంతో శనివారం ప్రకాశం బ్యారేజీలోకి చేరే ప్రవాహం తగ్గనుంది.
ఎగువ కృష్ణాలో స్థిరంగా ప్రవాహం
పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా కృష్ణా ప్రధాన పాయలో ఎగువన వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి 1.66 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద కాస్త తగ్గింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1.07 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 59 టీఎంసీలకు చేరుకుంది.
జూరాలకు ఎగువ నుంచి 1.22 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో స్పిల్ వే గేట్లు, విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తున్నారు. జూరాల నుంచి 1,20,390 క్యూసెక్కులు, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల సుంకేశుల బ్యారేజ్ నుంచి 4,311, హంద్రీ నుంచి 117 వెరసి 1,24,818 క్యూసెక్కులు శ్రీశైలంలోకి చేరుతుండటంతో నీటి నిల్వ 45.53 టీఎంసీలకు చేరుకుంది.
ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శనివారం శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి చేరే వరద పెరగనుంది. ఇక తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు మూసీ నుంచి పులిచింతలలోకి 55,144 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 28.03 టీఎంసీలకు చేరుకుంది. మరో 17 టీఎంసీలు చేరితే పులిచింతల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment