సాక్షి, అమరావతి/విజయవాడ: కృష్ణానది మరోసారి పరవళ్లు తొక్కుతోంది. పులిచింతల, మున్నేరుల నుంచి వరద నీరు ఉధృతంగా వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి మొత్తం 1,33,429 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తుండడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి చెందిన 40 గేట్లను ఒకడుగు, 30 గేట్లను రెండడుగుల మేర పైకిలేపి 82,625 వేల క్యూసెక్కుల నీటిని వచ్చింది వచ్చినట్లుగా సముద్రంలోకి వదలటంతోపాటు కాలువలకూ నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు.. వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండడంతో బ్యారేజీ నిండుకుండలా దర్శనమిస్తోంది.
శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా..
నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో గురువారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 73,573 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతలు.. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాలు, స్పిల్ వే ద్వారా 94,353 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 214.85 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అలాగే, నాగార్జునసాగర్‌లోకి 91,728 క్యూసెక్కులు వస్తుండగా కుడి, ఎడమ కాలువ, ఏఎమ్మార్పీలకు 11 వేల క్యూసెక్కులు, మిగిలిన 80 వేల క్యూసెక్కులను విద్యుదుత్పత్తి కేంద్రాలు, గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ దిగువన కృష్ణా వరదకు మూసీ ప్రవాహం తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 97,541 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో నిల్వ గరిష్ఠ స్థాయి 45.26 టీఎంసీలకు చేరుకోవడంతో దిగువకు 1,33,429 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గోదావరి, వంశధార నదుల్లోనూ వరద ప్రవాహం కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,28,518 క్యూసెక్కులు రాగా.. గోదావరి డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 1,27,823 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గొట్టా బ్యారేజీలోకి 11,927 క్యూసెక్కుల వంశధార ప్రవాహం రాగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదులుతున్నారు.
538.16 టీఎంసీలు కడలిపాలు
కాగా, ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం వరకు (ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో) మొత్తం 538.16 టీఎంసీల కృష్ణా వరద నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసిందని.. ఇది మరికొద్ది రోజులు కొనసాగే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో నాలుగేళ్లు సాగునీరు లేక రైతులు విలవిల్లాడారు. అక్టోబర్ వచ్చినా పూర్తిగా వరినాట్లు పడేవి కావు. కానీ, ఈ ఏడాది పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉండడంతో అన్నదాతలు ఆనందోత్సాహాలతో వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటున్నారు.
15న కృష్ణా బోర్డు సమావేశం
ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటిదాకా వినియోగించుకున్న కృష్ణా జలాల లెక్కలు తేల్చేందుకు కృష్ణా బోర్డు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ నుంచి ఈఈలు బాబూరావు, మనోహర్‌రాజు.. తెలంగాణ నీటిపారుదల శాఖ నుంచి ఎస్‌ఈ ఆర్వీ ప్రకాశ్, ఈఈ శ్రీధర్‌కుమార్‌లు సమావేశమయ్యారు. నీటి వినియోగం లెక్కలు ఒక కొలిక్కి రాలేదు. దీంతో ఈ విషయమై ఈనెల 15న కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. రబీలో ఇరు రాష్ట్రాల అవసరాలు.. జలాశయాల్లో నీటి లభ్యత ఆధారంగా బోర్డు కేటాయింపులు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment