శాంతించిన కృష్ణమ్మ
సాక్షి, విజయవాడ : పవిత్రకృష్ణానదిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. పులిచింతల నుంచి వరద నీరు రావడం తగ్గుముఖం పట్టడంతో ప్రకాశం బ్యారేజ్‌నుంచి కిందకు వదిలేనీటిని తగ్గించేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆదివారం 75 వేల క్యూసెక్కుల నీరు వదలగా.. సోమవారం 43,200 క్యూసెక్కల నీరు మాత్రమే వదిలారు. ప్రకాశం బ్యారేజ్‌కు పైనుంచి కేవలం 52,134 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. కాల్వలకు 8,934 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో కేవలం 60 గేట్లను ఒక్క అడుగుమేర పైకి లేపి ఉంచారు. పది గేట్లను మూసివేశారు. పులిచింతల వద్ద 30 టీఎంసీ నీరు ఉండగా, ప్రకాశం బ్యారేజ్‌లో 11.8 అడుగుల నీటిని నిల్వ చేశారు. పులిచింతల నుంచి నీరు రాకపోయినప్పటికీ మున్నేరు నుంచి 20వేల క్యూసెక్కుల నీరు నదిలోకి వచ్చి కలుస్తోంది. మంగళవారం ఉదయానికి కృష్ణానది యథాతథ స్థితికి చేరే అవకాశం ఉంది.