సోమశిల- సిద్ధేశ్వరం వంతెనకు గ్రీన్‌సిగ్నల్
కొల్లాపూర్: కొల్లాపూర్ ప్రజల చిరకాల వాంఛ అయిన సోమశిల- సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి తెలంగాణ సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వంతెన నిర్మాణానికి *193కోట్లు కేటాయిస్తూ జీఓ.నెం.131 విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 27న రోడ్లు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గత నెల 30న రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన మంత్రివర్గం కృష్ణా, గోదావరి నదులపై వంతెనల నిర్మాణానికి నిధులు కేటాయించాలని నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తగా రెండు నదులపై వంతెనల నిర్మాణం కోసం 1974.43కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా సోమశిల-సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి *193కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంతెన నిర్మాణం జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు, పాలమూరు జిల్లా అభివృద్ధికి దోహదపడుతుంది.
వైఎస్‌హయంలో శ్రీకారం
సోమశిల-సిద్ధేశ్వరం వంతెన నిర్మించాలని దశాబ్ధాల కాలంగా కొల్లాపూర్‌వాసులు పోరాడుతున్నారు. 2007లో మంచాలకట్ట గ్రామ సమీపంలో కృష్ణానదిలో పుట్టి మునిగి 61మంది మృతిచెందారు. ఈ ఘటనను చూసి చలించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోమశిల- సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. అందులో భాగంగా 2009లో *110 కోట్లు నిధులు కేటాయిస్తూ వంతెన నిర్మాణం కోసం కొల్లాపూర్‌లో శిలాఫలకం వేశారు.
అదేవిధంగా క ల్వకుర్తి నుంచి నంద్యాల వరకూ డబుల్‌లైన్ రహదారి నిర్మాణం కోసం *85కోట్లను కేటాయిస్తూ మరో పైలాన్‌ను ఆవిష్కరించారు. అయితే పనుల ప్రారంభానికి పలురకాల సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడంతో పనులు నిలిచిపోయాయి. మళ్లీ స్థానిక ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు చొరవతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వంతెనతో పాటు, రోడ్ల నిర్మాణానికి *253కోట్లు కేటాయించారు.
ఇందులో భాగంగా మొదటి విడతగా నాగర్‌కర్నూల్ నుంచి కొల్లాపూర్ వరకూ *50కోట్లతో డబుల్‌లైన్ రహదారి నిర్మించింది. కొల్లాపూర్ నుంచి సోమశిల రహదారి వరకూ బైపాస్ రహదారి నిర్మాణం కోసం *7.50కోట్ల నిధులను కేటాయించింది. బైపాస్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా అధికారులు గుర్తించారు. పనులు ప్రారంభమయ్యే సమయంలోనే రాష్ట్రం విడిపోయింది. దీంతో వంతెన నిర్మాణం జరుగుతుందో లేదోనన్న అయోమయం స్థానిక ప్రజల్లో నెలకొంది.
వంతెన నిర్మాణం జరిగితే కొల్లాపూర్ నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యాపార లావాదేవీలు పెరిగేందుకు వీలుంటుంది. తిరుపతి, నంద్యాల, బెంగళూరు, హైదరాబాద్‌ల మధ్య దూరం తగ్గనుంది. సిమెంట్, ముడిఖనిజాల పరిశ్రమల వర్గాలకు ఈ వంతెన ప్రధానంగా దోహదపడనుంది. వ్యాపార,వాణిజ్యవర్గాలకు ఉపయోగంకరంగా ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కూడా ఉపయోగపడనుంది.