Somasila siddhesvaram bridge
-
సోమశిల–సిద్ధేశ్వరం వంతెన పూర్తి చేయాలి
-
సోమశిల–సిద్ధేశ్వరం వంతెన పూర్తి చేయాలి
వైఎస్సార్ సీపీ తెలంగాణ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కృష్ణానదిపై సోమ శిల– సిద్ధేశ్వరం వంతెనను త్వరగా పూర్తిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ తెలం గాణ డిమాండ్ చేసింది. రాయలసీమ నుంచి కృష్ణానది మీదుగా పుట్టీలో వస్తూ పాత పాల మూరు జిల్లా మంచాలకట్ట వద్ద 61 మంది జలసమాధి అయి పదేళ్లు కావొస్తోందని ఆ పార్టీ పేర్కొంది. ఈ ఘటనకు ఆనాటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి చలించిపోయి కృష్ణా నదిపై రాకపోకలకోసం సోమశిల–సిద్ధేశ్వరం వంతెనకు నిధులు మంజూరు చేసిన విష యాన్ని గుర్తుచేసింది. వైఎస్సార్ మరణం తర్వాత పలువురు సీఎంలు మారారని, కానీ ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయని ఆ పార్టీ ప్రధానకార్యదర్శి గున్రెడ్డి రాంభూపాల్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం బ్రిడ్జి నిర్మా ణానికి అనుమతినిచ్చి రూ.193 కోట్లు కేటా యించిందన్నారు.అయితే సర్వే పనులను కోల్‌కతాకు చెందిన సీటెక్ కంపెనీ చేపట్టి నివేదికను ఆర్అండ్బీ అధికారులకు అందిం చినా ఈ బ్రిడ్జి నిర్మాణంలో పురోగతి లేద న్నారు. ఈ ప్రాంతంలో వంతెన నిర్మిస్తే కొల్లా పూర్ నియోజకవర్గంతో పాటు, నాగర్ కర్నూ ల్ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈ వంతెన కోసం నాగర్‌కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడిని తేవాలని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. జాతీయ రహదారుల్లోనూ అన్యాయం... రాయచూర్ నుంచి గద్వాల్, అలంపూర్, పెబ్బేరు, కొల్లాపూర్, అచ్చంపేట, దేవర కొండ, మిర్యాలగూడ మీదుగా కోదాడ వరకు జాతీయ రహదారిని అనుసంధానించాలని రాంభూపాల్‌రెడ్డి సూచించారు. దీనివల్ల పాత పాలమూరు, నల్లగొండ జిల్లాలు అభివృద్ధి అవుతాయన్నారు. కొత్తగా మంజూరైన 19 జాతీయ రహదారుల్లో నాగర్ కర్నూల్ జిల్లాకు ప్రాధాన్యం లభించలేదన్నారు. రాజకీయాలకతీతంగా ప్రజా ప్రతినిధులు ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని కోరారు. 19 జాతీయ రహదారులతో పాటు పాత పాలమూరు జిల్లాలోని పట్టణాల అనుసంథాన ప్రక్రియను పూర్తిస్థాయిలో పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
అడుగు ముందుకు
కృష్ణమ్మ ఒడిలో ‘పుట్టె’డు కష్టాలు ఇక తొలగిపోనున్నాయి.. దశాబ్దాల కాలంగా ఉన్న ఈ ప్రాంతప్రజల రవాణా ఇబ్బందులు తీరనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ సోమశిల, సిద్ధేశ్వరం గ్రామాల మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణ పనులకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. పొరుగు జిల్లా కర్నూలుతో పాలమూరువాసుల సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. ఈ మేరకు వంతెన నిర్మాణంలో భాగస్వాములుకావాలని సీఎస్ ఏపీ సీఎస్‌కు లేఖ కూడా రాశారు. చకచకా సోమశిల సిద్ధేశ్వరం వంతెన నిర్మాణ సర్వే - టెండర్లు దక్కించుకున్న కలకత్తా సీడ్‌టెక్ కంపెనీ - పనులు పరిశీలించిన ఆర్అండ్బీ ఈఎన్సీ చీఫ్ - వారంరోజుల్లో ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక - రూ.193కోట్లు మంజూరుచేసిన ప్రభుత్వం - భాగస్వామ్యం కోసం ఏపీ ప్రభుత్వానికి సీఎస్ లేఖ కొల్లాపూర్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేసే సోమశిల, సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియ గతంతో ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కిపడింది. కర్నూలు, మహబూబ్‌నగర్ జి ల్లాల మధ్య ఇరుప్రాంత ప్రజలు నిత్యం కృష్ణానదిలో పుట్టీలు, మరబోట్ల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమం లో 2007లో మంచాలకట్ట వద్ద పుట్టీ మునిగి 61మంది జలసమాధి కావడం తో వంతెన నిర్మాణం కోసం డిమాండ్ పెరిగింది. ఈ వంతెన నిర్మాణం కోసం అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.110కోట్లు, కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ మీదుగా నంద్యాల వరకు డబుల్‌లైన్ రోడ్డు నిర్మించేందుకు రూ.85కోట్లు మంజూరుచేశారు. టెండర్లు పూర్తయినా పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. వైఎస్ఆర్ అకాలమరణంతో వం తెన నిర్మాణం ఆగిపోయింది. మళ్లీ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వంతెన నిర్మాణం ఆవశ్యకత తెరపైకి వచ్చింది. వంతెన పనులను మూడు విభాగాలుగా విభజించారు. కొల్లాపూర్ నుంచి నాగర్‌కర్నూల్ వరకు రూ.50.50 కోట్లతో డబుల్‌లైన్ రోడ్డు, కొల్లాపూర్ నుంచి సోమశిల వరకు బైపాస్ రహదారితోపాటు డబుల్‌లైన్ కోసం రూ.ఏడున్నర కోట్లు, వంతెన నిర్మాణం కోసం రూ.180కోట్లు మంజూరు చేశారు. మొదటివిడతగా కొల్లాపూర్ నుంచి నాగర్‌కర్నూల్ వరకు డబుల్‌లైన్ రోడ్డు పనులు పూర్తిచేశారు. బైపాస్ పనుల కోసం సర్వే నిర్వహించి టెండర్ల కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పనులు ప్రారంభంకాలేదు. ఆ తరువాత వంతెన ప్రాధాన్యతను మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.193కోట్లు కేటాయించింది. నిధులు కేటాయించి దాదాపుగా ఆరునెలలు దాటినా పనులు ప్రారంభంకాలేదు. ఇటీవల ప్రభుత్వాదేశానుసారం ఆర్అండ్బీ అధికారులు నూతనంగా సర్వేకోసం రూ.1.10కోట్లు కేటాయించారు. టెండర్లను కలకత్తాకు చెందిన సీడ్‌టెక్ కంపెనీ దక్కించుకుంది. వారంరోజులుగా సీడ్‌టెక్ కంపెనీ ప్రతినిధులు సోమశిల, సిద్ధేశ్వరం ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్నారు. పనులను పరిశీలించేందుకు ఆదివారం ఆర్అండ్బీ ఈఎన్సీ చీఫ్ రవీందర్రావు రావడంతో ఈసారి తప్పకుండా వంతెన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఇక్కడి ప్రజలు ఆశిస్తున్నారు. తీరనున్న రవాణా కష్టాలు ఉమ్మడిరాష్ట్రంలో వంతెన నిర్మాణానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. హైదారాబాద్ నుంచి తిరుపతి, ఆత్మకూర్తోపాటు ఇతర ప్రాంతాలకు కర్నూలు మీదుగా కాకుండా జడ్చర్ల, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ మీదుగా వెళ్తే దాదాపు 120 కిలోమీటర్లకు పైగా దూరభారం తగ్గుతుంది. కర్నూలు జిల్లాలోని సిమెంట్, వ్యవసాయ సరుకుల రవాణాకు బ్రిడ్జికి ప్రధానంగా దోహదపడతుంది. అదేవిధంగా తెలంగాణలో ఉత్పత్తి చేసే ముడి సరుకులతోపాటు ఇతర రవాణా సామగ్రి, ప్రజల ప్రయాణాలకు కూడా మార్గం సుగమం అవుతుంది. ఈ అంశాలను వివరిస్తూ సోమశిల, సిద్ధేశ్వరం వంతెన నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ సీఎస్‌కు లేఖ పంపింది. వంతెన నిర్మాణం జరిగితే జిల్లాలోని కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలు మరింతగా అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలోని నందికొట్కూర్ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది. -
సోమశిల- సిద్ధేశ్వరం వంతెనకు గ్రీన్‌సిగ్నల్
కొల్లాపూర్: కొల్లాపూర్ ప్రజల చిరకాల వాంఛ అయిన సోమశిల- సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి తెలంగాణ సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వంతెన నిర్మాణానికి *193కోట్లు కేటాయిస్తూ జీఓ.నెం.131 విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 27న రోడ్లు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గత నెల 30న రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన మంత్రివర్గం కృష్ణా, గోదావరి నదులపై వంతెనల నిర్మాణానికి నిధులు కేటాయించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తగా రెండు నదులపై వంతెనల నిర్మాణం కోసం 1974.43కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా సోమశిల-సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి *193కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంతెన నిర్మాణం జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు, పాలమూరు జిల్లా అభివృద్ధికి దోహదపడుతుంది. వైఎస్హయంలో శ్రీకారం సోమశిల-సిద్ధేశ్వరం వంతెన నిర్మించాలని దశాబ్ధాల కాలంగా కొల్లాపూర్‌వాసులు పోరాడుతున్నారు. 2007లో మంచాలకట్ట గ్రామ సమీపంలో కృష్ణానదిలో పుట్టి మునిగి 61మంది మృతిచెందారు. ఈ ఘటనను చూసి చలించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోమశిల- సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. అందులో భాగంగా 2009లో *110 కోట్లు నిధులు కేటాయిస్తూ వంతెన నిర్మాణం కోసం కొల్లాపూర్‌లో శిలాఫలకం వేశారు. అదేవిధంగా క ల్వకుర్తి నుంచి నంద్యాల వరకూ డబుల్‌లైన్ రహదారి నిర్మాణం కోసం *85కోట్లను కేటాయిస్తూ మరో పైలాన్‌ను ఆవిష్కరించారు. అయితే పనుల ప్రారంభానికి పలురకాల సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడంతో పనులు నిలిచిపోయాయి. మళ్లీ స్థానిక ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు చొరవతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వంతెనతో పాటు, రోడ్ల నిర్మాణానికి *253కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా మొదటి విడతగా నాగర్‌కర్నూల్ నుంచి కొల్లాపూర్ వరకూ *50కోట్లతో డబుల్‌లైన్ రహదారి నిర్మించింది. కొల్లాపూర్ నుంచి సోమశిల రహదారి వరకూ బైపాస్ రహదారి నిర్మాణం కోసం *7.50కోట్ల నిధులను కేటాయించింది. బైపాస్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా అధికారులు గుర్తించారు. పనులు ప్రారంభమయ్యే సమయంలోనే రాష్ట్రం విడిపోయింది. దీంతో వంతెన నిర్మాణం జరుగుతుందో లేదోనన్న అయోమయం స్థానిక ప్రజల్లో నెలకొంది. వంతెన నిర్మాణం జరిగితే కొల్లాపూర్ నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యాపార లావాదేవీలు పెరిగేందుకు వీలుంటుంది. తిరుపతి, నంద్యాల, బెంగళూరు, హైదరాబాద్‌ల మధ్య దూరం తగ్గనుంది. సిమెంట్, ముడిఖనిజాల పరిశ్రమల వర్గాలకు ఈ వంతెన ప్రధానంగా దోహదపడనుంది. వ్యాపార,వాణిజ్యవర్గాలకు ఉపయోగంకరంగా ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కూడా ఉపయోగపడనుంది.