అడుగు ముందుకు | Making it easier to transport between two states | Sakshi
Sakshi News home page

అడుగు ముందుకు

Published Mon, Jul 6 2015 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

అడుగు ముందుకు

అడుగు ముందుకు

కృష్ణమ్మ ఒడిలో ‘పుట్టె’డు కష్టాలు ఇక తొలగిపోనున్నాయి.. దశాబ్దాల కాలంగా ఉన్న ఈ ప్రాంతప్రజల రవాణా ఇబ్బందులు తీరనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ సోమశిల, సిద్ధేశ్వరం గ్రామాల మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణ పనులకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. పొరుగు జిల్లా కర్నూలుతో పాలమూరువాసుల సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. ఈ మేరకు వంతెన నిర్మాణంలో భాగస్వాములుకావాలని సీఎస్ ఏపీ సీఎస్‌కు లేఖ కూడా రాశారు.
చకచకా సోమశిల సిద్ధేశ్వరం వంతెన నిర్మాణ సర్వే
- టెండర్లు దక్కించుకున్న కలకత్తా సీడ్‌టెక్ కంపెనీ
- పనులు పరిశీలించిన ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ చీఫ్
- వారంరోజుల్లో ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక
- రూ.193కోట్లు  మంజూరుచేసిన ప్రభుత్వం
- భాగస్వామ్యం కోసం ఏపీ ప్రభుత్వానికి సీఎస్ లేఖ
కొల్లాపూర్:
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేసే సోమశిల, సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియ గతంతో ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కిపడింది. కర్నూలు, మహబూబ్‌నగర్ జి ల్లాల మధ్య ఇరుప్రాంత ప్రజలు నిత్యం కృష్ణానదిలో పుట్టీలు, మరబోట్ల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమం లో 2007లో మంచాలకట్ట వద్ద పుట్టీ మునిగి 61మంది జలసమాధి కావడం తో వంతెన నిర్మాణం కోసం డిమాండ్ పెరిగింది.

ఈ వంతెన నిర్మాణం కోసం అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.110కోట్లు, కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ మీదుగా నంద్యాల వరకు డబుల్‌లైన్ రోడ్డు నిర్మించేందుకు రూ.85కోట్లు మంజూరుచేశారు. టెండర్లు పూర్తయినా పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. వైఎస్‌ఆర్ అకాలమరణంతో వం తెన నిర్మాణం ఆగిపోయింది. మళ్లీ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వంతెన నిర్మాణం ఆవశ్యకత తెరపైకి వచ్చింది. వంతెన పనులను మూడు విభాగాలుగా విభజించారు. కొల్లాపూర్ నుంచి నాగర్‌కర్నూల్ వరకు రూ.50.50 కోట్లతో డబుల్‌లైన్ రోడ్డు, కొల్లాపూర్ నుంచి సోమశిల వరకు బైపాస్ రహదారితోపాటు డబుల్‌లైన్ కోసం రూ.ఏడున్నర కోట్లు, వంతెన నిర్మాణం కోసం రూ.180కోట్లు మంజూరు చేశారు.

మొదటివిడతగా కొల్లాపూర్ నుంచి నాగర్‌కర్నూల్ వరకు డబుల్‌లైన్ రోడ్డు పనులు పూర్తిచేశారు. బైపాస్ పనుల కోసం సర్వే నిర్వహించి టెండర్ల కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పనులు ప్రారంభంకాలేదు. ఆ తరువాత వంతెన ప్రాధాన్యతను మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.193కోట్లు కేటాయించింది. నిధులు కేటాయించి దాదాపుగా ఆరునెలలు దాటినా పనులు ప్రారంభంకాలేదు.

ఇటీవల ప్రభుత్వాదేశానుసారం ఆర్‌అండ్‌బీ అధికారులు నూతనంగా సర్వేకోసం రూ.1.10కోట్లు కేటాయించారు. టెండర్లను కలకత్తాకు చెందిన సీడ్‌టెక్ కంపెనీ దక్కించుకుంది. వారంరోజులుగా సీడ్‌టెక్ కంపెనీ ప్రతినిధులు సోమశిల, సిద్ధేశ్వరం ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్నారు. పనులను పరిశీలించేందుకు ఆదివారం ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ చీఫ్ రవీందర్‌రావు రావడంతో ఈసారి తప్పకుండా వంతెన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఇక్కడి ప్రజలు ఆశిస్తున్నారు.
 
తీరనున్న రవాణా కష్టాలు

ఉమ్మడిరాష్ట్రంలో వంతెన నిర్మాణానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. హైదారాబాద్ నుంచి తిరుపతి, ఆత్మకూర్‌తోపాటు ఇతర ప్రాంతాలకు కర్నూలు మీదుగా కాకుండా జడ్చర్ల, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ మీదుగా వెళ్తే దాదాపు 120 కిలోమీటర్లకు పైగా దూరభారం తగ్గుతుంది. కర్నూలు జిల్లాలోని సిమెంట్, వ్యవసాయ సరుకుల రవాణాకు బ్రిడ్జికి ప్రధానంగా దోహదపడతుంది.

అదేవిధంగా తెలంగాణలో ఉత్పత్తి చేసే ముడి సరుకులతోపాటు ఇతర రవాణా సామగ్రి, ప్రజల ప్రయాణాలకు కూడా మార్గం సుగమం అవుతుంది. ఈ అంశాలను వివరిస్తూ సోమశిల, సిద్ధేశ్వరం వంతెన నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ సీఎస్‌కు లేఖ పంపింది. వంతెన నిర్మాణం జరిగితే జిల్లాలోని కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలు మరింతగా అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలోని నందికొట్కూర్ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement