సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీ పూర్తి కావస్తున్న నేపథ్యంలో..వచ్చే వర్షాకాల సీజన్ నుంచి నీటి ఎత్తిపోతలు గణనీయంగా ఉండనున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుండటంతో నీటి వినియోగం గరిష్ట స్థాయికి చేరనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలో ఎత్తిపోతలు ఏకంగా 700 టీఎంసీల వరకు ఉంటుందని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. ఎత్తిపోసే నీటి పరిమాణానికి తగినట్టే విద్యుత్ వినియోగం సైతం 7 వేల మెగావాట్లను దాటే అవకాశం ఉందని శాఖ లెక్కలు కట్టింది.
ఇకపై ‘డబుల్’ఎత్తిపోత..
కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా 282 టీఎంసీల మేర నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సీజన్‌లో కాళేశ్వరం ద్వారా 58 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోయడంలో అది 340 టీఎంసీలకు చేరింది. ఇందులో ప్రధానంగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు,భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారానే కనీసంగా 120 టీఎంసీలు, ఏఎంఆర్‌పీ ద్వారా మరో 50 టీఎంసీల మేర నీరు ఎత్తిపోస్తుండగా, దేవాదుల, ఎల్లంపల్లి, గుత్ప, అలీసాగర్ వంటి పథకాల కింద మరో 70 టీఎంసీల ఎత్తిపోతల కొనసాగుతూ వస్తోంది. పాత ప్రాజెక్టుల ద్వారా నీటిని తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పంపు మోటార్లు, వాటికి అనుగుణంగా విద్యుత్ అవసరాలు 1,600 మెగావాట్ల వరకు ఉన్నాయి.
ఎత్తిపోతల పథకాలకు యూనిట్‌కు 5.80 చొప్పున గణించినా, రూ. 1,800 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. అయితే వచ్చే ఖరీఫ్ నుంచి నీటి ఎత్తిపోతలు గణనీయంగా పెరగనున్నాయి. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల ద్వారానే గరిష్టంగా 250 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఇక గోదావరి బేసిన్‌లో 450 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. ఇందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే 200–250 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయి. ఇక దేవాదుల పరిధిలోనూ కంతనపల్లి సిద్ధం కానుండటంతో రెండు సీజన్‌లలో కలిపి 100 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక వేస్తున్నారు. మిగతా పథకాల కింద మరో 100 టీఎంసీల నీటిని తరలించనున్నారు.
మొత్తంగా రెండు బేసిన్‌ల పరిధిలో 700 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. రెండు బేసిన్‌లలోని 22 ఎత్తిపోతల పథకాల పరిధిలో 96 పంప్‌హౌస్‌లు ఉండగా, 318 పంపుల నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో 270 పంపులు జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయని భావిస్తోంది. వీటిని నిర్ణీత నీటిని ఎత్తిపోసేలా నడిపిస్తే విద్యుత్ వినియోగం 6,700–7000 మెగావాట్లు వరకు ఉంటుందని లెక్క గడుతోంది. ఇందులో అధికంగా కాళేశ్వరం ఎత్తిపోతలకే మోటార్లు తిరిగే రోజులు, వాటి సామర్థ్యాన్ని బట్టి 4,500 మెగావాట్ల నుంచి 5,500 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండవచ్చని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. ఈ విద్యుత్‌కే ఖర్చు దాదా పు రూ.6,500 కోట్లు ఉంటుందని చెబుతున్నాయి.
700 టీఎంసీలు ఎత్తిపోసేలా...
Published Tue, Mar 3 2020 1:31 AM | Last Updated on Tue, Mar 3 2020 1:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment