కృష్ణా, గోదావరి జలాల ఆధారంగా నిర్మిస్తున్న, నిర్మించ తలపెట్టిన కొత్త ప్రాజెక్టులపై ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ముదిరిన నేపథ్యంలో డీపీఆర్‌ల అంశం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. డీపీఆర్‌లు సమర్పించాలంటూ బోర్డులు రెండు రాష్ట్రాలకు లేఖాస్త్రాలు సంధిస్తున్నాయి. తమకు చెల్లించాల్సిన నిధులు వెంటనే డిపాజిట్ చేయాలని కూడా కోరుతుండటంతో ఒత్తిడి పెరుగుతోంది.
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్‌ల అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. గెజిట్‌లో పేర్కొన్న ఒక్కో అంశాన్ని పరిశీలిస్తున్న బోర్డులు.. వాటి అమలు ప్రక్రియను షురూ చేశాయి. గెజిట్ వెలువరించిన మరుసటి రోజే ఆ కాపీలను తెలుగు రాష్ట్రాలకు అధికారికంగా పంపిన బోర్డులు.. తదనుగుణంగా చర్యలు మొద లుపెట్టాలని సూచించాయి. నోటిఫికేషన్‌లో పేర్కొ న్న మాదిరి తమకు డబ్బులు చెల్లించాలని, ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని వరుసగా లేఖలు రాస్తున్నాయి. మరోపక్క అనుమతులు లేని ప్రాజెక్టులకు రుణాల మంజూరు విషయంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రుణ సంస్థలు ఆలోచనలో పడ్డాయి. కేంద్రం విడుదల చేసిన గెజిట్‌తో ప్రాజెక్టుల నిర్మాణంపై పడే ప్రభావం, రుణ సంస్థలకు ఎదురయ్యే చిక్కులపై ఆరా తీయడం మొదలుపెట్టాయి.
డీపీఆర్‌ల కోసం ఒత్తిడి
అక్టోబర్‌లో అపెక్స్ భేటీ జరిగింది. అప్పట్నుంచే రెండు బోర్డులు ప్రాజెక్టుల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదికలు)లు సమర్పించాలని రాష్ట్రాలను కోరుతున్నాయి. అయినా తెలంగాణ ఇంతవరకు ఎలాంటి డీపీఆర్‌లు సమర్పించలేదు. ఇటీవల కొత్త ప్రాజెక్టుల విషయంలో వివాదాలు ముదిరిన నేపథ్యంలో.. అపెక్స్ ఆమోదం లేకుండా, కేంద్ర జల సంఘంతో పాటు తమ అనుమతి లేకుండా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టరాదని బోర్డులు తాజాగా మరోసారి ఆదేశించాయి. అలాగే అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే సమర్పించాలని కూడా కోరాయి. తాజాగా తెలంగాణ చేపట్టిన 37 ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు చేయడంతో కృష్ణా బోర్డు వాటి డీపీఆర్‌లు ఇవ్వాల్సిందిగా రెండ్రోజుల కిందట లేఖ రాసింది. మరోపక్క గోదావరి బోర్డు గోదావరి ఎత్తిపోతల పథకం ఫేజ్–3, సీతారామ, కంతనపల్లి, మిషన్ భగీరథ, లోయర్ పెనుగంగపై చేపట్టిన మూడు బ్యారేజీలు, రామప్ప–పాకాల నీటితరలింపు, కాళేశ్వరంలోని మూడో టీఎంసీకి సంబంధించిన పనుల డీపీఆర్‌లు సమర్పించాలని కోరింది. అయితే డీపీఆర్‌లు ఇచ్చేందుకు సిద్ధమని చెబుతున్నా.. తెలంగాణ ఇంతవరకు ఇవ్వలేదు.
ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు ఇవ్వండి
ఇలావుండగా కేంద్ర ప్రభుత్వం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా బోర్డులు సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు చొప్పున చెల్లించాలని బోర్డులు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశాయి. నోటిఫికేషన్ వెలువడ్డ రోజునుంచి 60 రోజుల్లో ఈ నిధులు చెల్లించాలని గెజిట్‌లో పేర్కొన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరాయి.
అనుమతులపై రుణ సంస్థల ఆరా..
ఈ పరిస్థితుల్లో రుణ సంస్థలు ప్రాజెక్టులకు అనుమతులపై దృష్టి సారించాయి. ముఖ్యంగా తెలంగాణలోని కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులతో పాటు సీతారామ సాగర్, సీతమ్మ బ్యారేజీ, తుపాకులగూడెం, దేవాదుల, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ), నాబార్డ్ వంటి సంస్థలు రుణాలు అందించాయి. ప్రస్తుతం ఈ సంస్థలు ప్రాజెక్టులకు అనుమతులపై కాళేశ్వరం కార్పొరేషన్, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల నుంచి సమాచారం కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేని పక్షంలో ప్రాజెక్టుల నిర్మాణాలను ఎలా ముందుకు తీసుకెళ్తారు?
అనుమతుల ప్రక్రియకు కార్యాచరణ ప్రణాళిక ఏంటీ అన్న విషయాలపై రుణ సంస్థలు లేఖలు రాసినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులకు ఆర్‌ఈసీ రూ.20 వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చింది. మరో కార్పొరేషన్‌కు పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీలు మరో రూ.2 వేల కోట్ల రుణాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇందులో కొంతమేర ఇప్పటికే మంజూరు చేయగా, మరికొంత విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుత గెజిట్ నోటిఫికేషన్ల నేపథ్యంలో అవి తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నాయి. గోదావరి నదిపై దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన నిర్మించ తలపెట్టిన సీతమ్మసాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,426.25 కోట్ల రుణం ఇచ్చేందుకు పీఎఫ్‌సీ ముందుకు వచ్చింది. అయితే అనుమతులు లేవన్న కారణంగా ప్రాజెక్టును నిలిపివేస్తే తమ రుణాలను బేషరతుగా వెనక్కి తీసుకుంటామని ఆ సంస్థ షరతులు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment