సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బేసిన్‌ల పరిధిలో నెలకొన్న వివాదాలను కేంద్ర ప్రభుత్వం వద్దే తేల్చుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సిద్ధమయ్యాయి. నీటి వాటాలు, వినియోగం, కొత్త ప్రాజెక్టులు, ప్రస్తుత ప్రాజెక్టుల నియంత్రణ వంటి అంశాలపై కేంద్ర జలవనరులశాఖ గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో ఇరు రాష్ట్రాలు పరిష్కారం కోసం కృషి చేయనున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించాల్సిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు చేతులెత్తేయడంతో చివరకు కేంద్రమే కదిలి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఈ భేటీ ఏర్పాటు చేసింది.
సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ అధికారులు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్‌సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కేంద్ర జల సంఘం అధికారులతోపాటు కృష్ణా, గోదావరి బోర్డుల అధికారులు, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు హాజరుకానున్నారు. ఈ భేటీలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, టెలీమెట్రీ విధానం అమలు, నీటి వాటాల సర్దుబాటు, పట్టిసీమ,పోలవరంల కింది వాటాలు, నీటి పంపిణీ–నిర్వహణలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎజెండాలో చేర్చిన అంశాలపై ఇరు రాష్ట్రాలు మొదట తమ వాదన వినిపించిన అనంతరం..ఇతర అంశాలేవైనా ఉంటే వాటిపైనా వాదనలు జరిగే అవకాశం ఉంది.
తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్మాణానికి కారణాలు, నీటి వాటాల్లో ఏపీ ఉల్లంఘనలు, ప్రాజెక్టుల నియంత్రణపై చట్టంలో పేర్కొన్న అంశాలు, బచావత్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులు, సుప్రీంకోర్టులో కేసులకు సంబంధించి అన్ని అంశాలతో తెలంగాణ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ముఖ్యంగా ఏపీ చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తే కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 575 టీఎంసీలకు పెంచాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే ఏపీ వాటాను 512 టీఎంసీల నుంచి 236 టీఎంసీలకు తగ్గించాలని పట్టుబట్టనున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ వాటాలకన్నా అధికంగా వినియోగిస్తోందని చెబుతున్న తెలంగాణ, పోతిరెడ్డిపాడు ఉల్లంఘనలను ప్రధానంగా ప్రస్తావించనుంది. కాగా, అదే రోజున పీఎంకేఎస్‌వై సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళుతున్న రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టుల నియంత్రణ, నీటి వాటాల పెంపు అంశంపై కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించే అవకాశం ఉంది.
జల జగడంపై కేంద్రం వద్దే పంచాయితీ
Published Wed, Feb 14 2018 3:06 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment