Central Water Resources
-
నీటిని తోడేస్తున్న కర్ణాటక
సాక్షి, హైదరాబాద్: నీటి వినియోగంలో కర్ణాటక ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఇప్పటికే కృష్ణా జలాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ విచ్చలవిడి వినియోగంతో నీటిని వదలని ఆ రాష్ట్రం ప్రస్తుతం వచ్చిన నీటిని వచ్చినట్లుగా వాడేస్తోంది. దిగువ రాష్ట్రాల హక్కులను తుంగలో తొక్కేస్తూ ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రల ఎగువనే నీటినంతా దోచేస్తోంది. ప్రధాన ప్రాజెక్టుల నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తూ చెరువులు, చిన్నతరహా జలాశయాలను నింపుతోంది. దీంతో వర్షాకాలం మొదలై నెలన్నర దాటిపోయినా ఇప్పటికీ శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రాజెక్టులు ఖాళీ కుండలను తలపిస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోనే ఏకంగా 365 టీఎంసీల లోటు ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే సాగర్ పరిధిలోని ఆయకట్టుకు అక్టోబర్, నవంబర్‌నాటికి నీరందడం గగనంగానే కనిపిస్తోంది. నీటిపారుదల రంగ నిపుణులు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడం కానీ, కేంద్ర జలవనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లడం కానీ చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జూన్, జూలైలో కురిసే సాధారణ వర్షాలకే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర రిజర్వాయర్లకు ప్రవాహాలు మొదలయ్యాయి. తుంగభద్రకు ఈ వాటర్ ఇయర్లో జూన్ నుంచి గరిష్టంగా రోజుకు 30 వేల క్యూసెక్కులకు మించి వరద కొనసాగుతోంది. అయినా ఇప్పటిదాకా ప్రాజెక్టుల్లో చేరిన కొత్త నీరు 43 టీఎంసీలే కావడం గమనార్హం. బుధవారం కూడా ఈ ప్రాజెక్టులోకి 38 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 50.07 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. కాగా, కర్ణాటక నెలన్నర వ్యవధిలో తుంగభద్ర ఎగువన కనిష్టంగా 10 టీఎంసీలు, గరిష్టంగా 20 టీఎంసీలు వినియోగించినట్లు తెలుస్తోంది. ఆల్మట్టి పరిధిలో ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని వినియోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టులోకి ఇప్పటివరకు 38 టీఎంసీల కొత్తనీరు వచ్చింది. అప్పటికే ఉన్న నిల్వతో కలిపితే 58 టీఎంసీల నీరు ఉండాలి. కానీ గత 15 రోజులుగా దాదాపు 8 నుంచి 10 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. చెరువులు, చెక్‌డ్యామ్‌ల నిండా నీరు నింపేందుకు కర్ణాటక ఈ అక్రమాలకు పాల్పడుతోంది. వినియోగం ఇదే రీతిలో ఉంటే శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండటం కష్టమే అవుతుంది. ఇప్పుడిప్పుడే అక్కడ ఖరీఫ్ ఊపందుకుండటంతో నీటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే దిగువన శ్రీశైలం, సాగర్‌కు అక్టోబర్ వరకు నీటి రాక గగనమే కానుంది. ఖాళీగా శ్రీశైలం, సాగర్ శ్రీశైలానికి గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా నెలన్నర వ్యవధిలో కేవలం 0.34 టీఎంసీల కొత్త నీరే వచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.06 టీఎంసీల నిల్వే ఉంది. 186.75 టీఎంసీల లోటు కనిపిస్తోంది. సాగర్‌లోనూ అదే పరిస్థితి. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. 133.37 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. ఇప్పటివరకు సాగర్‌లోకి కొత్తగా 3.20 టీఎంసీల నీరు వచ్చినట్టు కనిపిస్తున్నా.. అందులో శ్రీశైలం లీకేజీల ద్వారా వచ్చిన నీరే 2 టీఎంసీల దాకా ఉంటుంది. ఇక్కడ ఇంకా 178.68 టీఎంసీల లోటు ఉంది. -
హిమాలయాల నుంచి గోదావరి వరకు..
సాక్షి, హైదరాబాద్: నదుల అనుసంధానానికి సంబంధించి సరికొత్త ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం తెరపైకి తీసుకురానుంది. హిమాలయాల నుంచి మానస్–సంకోశ్–తీస్తా–గంగా–సువర్ణరేఖ–మహానదుల మీదుగా గోదావరికి నదుల అనుసంధానం చేపట్టాలని కేంద్రాన్ని కోరనుంది. మంగళవారం హైదరాబాద్‌లో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జలవనరుల ప్రాంతీయ సదస్సులో సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ అంశాన్ని ప్రతిపాదించనున్నారు. హిమాలయాల నుంచి గోదావరికి నదీ ప్రవాహాలు మళ్లిస్తే భవిష్యత్ తరాలకు నీటి కొరత ఉండదని వివరించనున్నారు. 938 టీఎంసీల నీటితో గోదావరికి అనుసంధానం చేస్తే దక్షిణాది వాటర్ గ్రిడ్ పటిష్టమవుతుందని, కృష్ణా బేసిన్లో భవిష్యత్ నీటి కొరతకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రకటించనున్నారు. ‘గోదావరి–కావేరీ’నే ప్రధానం..! హైదరాబాద్‌లోని బేగంపేట తాజ్ వివాంటా హోటల్లో జరగనున్న సదస్సుకు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మేఘవాల్ నేతృత్వం వహించనున్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల సాగునీటి శాఖ మంత్రులు పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్‌రావు, ఈఎన్సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు హాజరవనున్నారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై సదస్సులో ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. గోదావరిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి, అక్కడి నుంచి 247 టీఎంసీల మిగులు జలాలను నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి, అటునుంచి గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరీకి తరలించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. దానిపై ఇదివరకే కేంద్రం ఓమారు సమావేశం నిర్వహించగా.. నీటి లభ్యత, ముంపు తదితరాలపై రాష్ట్రం అనేక అనుమానాలు లేవనెత్తింది. మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తెచ్చాకే కావేరీ అనుసంధానం చేపట్టాలని కోరింది. 575 టీఎంసీలపై పట్టు.. కృష్ణా జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికున్న 811 టీఎంసీల వాటాలో 575 టీఎంసీలు రాష్ట్ర వాటా కింద కేటాయించాలని రాష్ట్రం కోరనుంది. పోలవరం, పట్టిసీమల కింద దక్కే వాటాలతో పాటు, తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కూడా తేల్చిన తరువాతే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయించాలని పట్టుబట్టే అవకాశముంది. కాళేశ్వరం జాతీయ హోదాపైనా కేంద్రాన్ని కోరనుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించిన తరువాతే బోర్డుల పరిధిలోని ప్రాజెక్టులను నిర్ణయించాలని డిమాండ్ చేయనుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీటిని అడ్డగోలుగా తరలిస్తున్న విషయాన్ని భేటీలో లేవనెత్తాలని సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి హరీశ్ నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే తెలంగాణ ప్రాంతాల పరిరక్షణ అంశాన్నీ ప్రస్తావించనున్నారు. -
కృష్ణాలో వాటా పెంపే లక్ష్యంగా పోరాడనున్న రాష్ట్రం
-
జల జగడంపై కేంద్రం వద్దే పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బేసిన్ల పరిధిలో నెలకొన్న వివాదాలను కేంద్ర ప్రభుత్వం వద్దే తేల్చుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సిద్ధమయ్యాయి. నీటి వాటాలు, వినియోగం, కొత్త ప్రాజెక్టులు, ప్రస్తుత ప్రాజెక్టుల నియంత్రణ వంటి అంశాలపై కేంద్ర జలవనరులశాఖ గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో ఇరు రాష్ట్రాలు పరిష్కారం కోసం కృషి చేయనున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించాల్సిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు చేతులెత్తేయడంతో చివరకు కేంద్రమే కదిలి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఈ భేటీ ఏర్పాటు చేసింది. సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ అధికారులు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్‌సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కేంద్ర జల సంఘం అధికారులతోపాటు కృష్ణా, గోదావరి బోర్డుల అధికారులు, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు హాజరుకానున్నారు. ఈ భేటీలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, టెలీమెట్రీ విధానం అమలు, నీటి వాటాల సర్దుబాటు, పట్టిసీమ,పోలవరంల కింది వాటాలు, నీటి పంపిణీ–నిర్వహణలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎజెండాలో చేర్చిన అంశాలపై ఇరు రాష్ట్రాలు మొదట తమ వాదన వినిపించిన అనంతరం..ఇతర అంశాలేవైనా ఉంటే వాటిపైనా వాదనలు జరిగే అవకాశం ఉంది. తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్మాణానికి కారణాలు, నీటి వాటాల్లో ఏపీ ఉల్లంఘనలు, ప్రాజెక్టుల నియంత్రణపై చట్టంలో పేర్కొన్న అంశాలు, బచావత్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులు, సుప్రీంకోర్టులో కేసులకు సంబంధించి అన్ని అంశాలతో తెలంగాణ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ముఖ్యంగా ఏపీ చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తే కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 575 టీఎంసీలకు పెంచాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే ఏపీ వాటాను 512 టీఎంసీల నుంచి 236 టీఎంసీలకు తగ్గించాలని పట్టుబట్టనున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ వాటాలకన్నా అధికంగా వినియోగిస్తోందని చెబుతున్న తెలంగాణ, పోతిరెడ్డిపాడు ఉల్లంఘనలను ప్రధానంగా ప్రస్తావించనుంది. కాగా, అదే రోజున పీఎంకేఎస్‌వై సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళుతున్న రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టుల నియంత్రణ, నీటి వాటాల పెంపు అంశంపై కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించే అవకాశం ఉంది. -
పోలవరం ఆథారిటీలోకి శ్రీవాత్సవ
► కృష్ణా బోర్డు చైర్మన్‌ను సభ్యకార్యదర్శిగా నియమించిన కేంద్రం ► వివాదాస్పద నిర్ణయంపై మండిపడుతున్న తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్న సమయంలో కేంద్ర జలవనరులశాఖ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్.కె. శ్రీవాత్సవను ఆంధ్రప్రదేశ్ పరిధిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పోలవరం, పట్టిసీమ వాటాలపై న్యాయం కోసం ఓవైపు బోర్డు ముందు వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో తటస్థంగా ఉంచాల్సిన బోర్డు చైర్మన్‌ను, ఏపీ ప్రాజెక్టుకు సభ్య కార్యదర్శిగా నియమించడంపై తెలంగాణ మండిపడుతోంది. వివాదాలు ఉన్నాపట్టించుకోకుండానే... ప్రస్తుతం కృష్ణా జలాలకు సంబంధించి నీటి పంపిణీ, విడుదల, ప్రాజెక్టుల నియంత్రణ, టెలిమెట్రీ వంటి అంశాలతో ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు సాగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తూ ఏపీ చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల వల్ల తమకు దక్కే వాటాపై తేల్చాలని తెలంగాణ పట్టుబడుతోంది. పట్టిసీమ, పోలవరం ద్వారా మొత్తంగా 90 టీఎంసీల నీటి వాటాలు దక్కుతాయని, కనిష్టంగా 70 టీఎంసీలైనా రావాలని కోరుతోంది. గతేడాది ఏపీ పట్టిసీమ ద్వారా ఏకంగా 53 టీఎంసీల నీటిని తరలించగా ఇందులో తెలంగాణకు చుక్క నీటి వాటా దక్కలేదు. ఈ ఏడాది సైతం 80 టీఎంసీలకుపైగా తరలించాలని ప్రణాళికలు వేస్తోంది. ఈ మళ్లింపులతో దక్కే వాటాలపై కృష్ణా బోర్డు చైర్మన్ స్థాయిలో శ్రీవాత్సవ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు మళ్లింపు జలాలపై కేంద్రం ప్రత్యేకంగా నియమించిన ఏకే బజాజ్ కమిటీకి బోర్డు చైర్మన్ అందించే నివేదికలకు ప్రాధాన్యం ఉటుంది. ఇలాంటి సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఉన్న వ్యక్తినే సభ్య కార్యదర్శిగా నియమించడం ఏమిటని తెలంగాణ నీటిపారుదల వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పోలవరం, పట్టిసీమలతో దక్కే వాటాల అంశంలో ఆయన ఎలా పారదర్శకంగా పని చేస్తారని అడుగుతున్నాయి. గతంలోనూ ఇంతే... గతంలో కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్న ఆర్.కె. గుప్తాను కేంద్ర ప్రభుత్వం పోలవరం అథారిటీ సభ్య కార్యదర్శిగా నియమించింది. ఆ సమయంలో గుప్తా పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్లో గుప్తా పనిచేస్తున్నారని, ఆయన వల్లే వివాదాలు జటిలం అవుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరులశాఖకు ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై వివిధ వర్గాల నుంచి సమాచారం తీసుకున్న జలవనరులశాఖ గుప్తాను బోర్డు బాధ్యతల నుంచి తప్పించింది. అయినప్పటికీ కేంద్రం ప్రస్తుతం మళ్లీ అలాంటి నిర్ణయమే తీసుకోవడం గమనార్హం.