సాక్షి, హైదరాబాద్: నీటి వినియోగంలో కర్ణాటక ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఇప్పటికే కృష్ణా జలాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ విచ్చలవిడి వినియోగంతో నీటిని వదలని ఆ రాష్ట్రం ప్రస్తుతం వచ్చిన నీటిని వచ్చినట్లుగా వాడేస్తోంది. దిగువ రాష్ట్రాల హక్కులను తుంగలో తొక్కేస్తూ ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రల ఎగువనే నీటినంతా దోచేస్తోంది. ప్రధాన ప్రాజెక్టుల నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తూ చెరువులు, చిన్నతరహా జలాశయాలను నింపుతోంది. దీంతో వర్షాకాలం మొదలై నెలన్నర దాటిపోయినా ఇప్పటికీ శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రాజెక్టులు ఖాళీ కుండలను తలపిస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోనే ఏకంగా 365 టీఎంసీల లోటు ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే సాగర్ పరిధిలోని ఆయకట్టుకు అక్టోబర్, నవంబర్‌నాటికి నీరందడం గగనంగానే కనిపిస్తోంది. నీటిపారుదల రంగ నిపుణులు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడం కానీ, కేంద్ర జలవనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లడం కానీ చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జూన్, జూలైలో కురిసే సాధారణ వర్షాలకే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర రిజర్వాయర్లకు ప్రవాహాలు మొదలయ్యాయి. తుంగభద్రకు ఈ వాటర్ ఇయర్‌లో జూన్ నుంచి గరిష్టంగా రోజుకు 30 వేల క్యూసెక్కులకు మించి వరద కొనసాగుతోంది. అయినా ఇప్పటిదాకా ప్రాజెక్టుల్లో చేరిన కొత్త నీరు 43 టీఎంసీలే కావడం గమనార్హం. బుధవారం కూడా ఈ ప్రాజెక్టులోకి 38 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 50.07 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. కాగా, కర్ణాటక నెలన్నర వ్యవధిలో తుంగభద్ర ఎగువన కనిష్టంగా 10 టీఎంసీలు, గరిష్టంగా 20 టీఎంసీలు వినియోగించినట్లు తెలుస్తోంది.
ఆల్మట్టి పరిధిలో ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని వినియోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టులోకి ఇప్పటివరకు 38 టీఎంసీల కొత్తనీరు వచ్చింది. అప్పటికే ఉన్న నిల్వతో కలిపితే 58 టీఎంసీల నీరు ఉండాలి. కానీ గత 15 రోజులుగా దాదాపు 8 నుంచి 10 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. చెరువులు, చెక్‌డ్యామ్‌ల నిండా నీరు నింపేందుకు కర్ణాటక ఈ అక్రమాలకు పాల్పడుతోంది. వినియోగం ఇదే రీతిలో ఉంటే శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండటం కష్టమే అవుతుంది. ఇప్పుడిప్పుడే అక్కడ ఖరీఫ్ ఊపందుకుండటంతో నీటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే దిగువన శ్రీశైలం, సాగర్‌కు అక్టోబర్ వరకు నీటి రాక గగనమే కానుంది.
ఖాళీగా శ్రీశైలం, సాగర్
శ్రీశైలానికి గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా నెలన్నర వ్యవధిలో కేవలం 0.34 టీఎంసీల కొత్త నీరే వచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.06 టీఎంసీల నిల్వే ఉంది. 186.75 టీఎంసీల లోటు కనిపిస్తోంది. సాగర్‌లోనూ అదే పరిస్థితి. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. 133.37 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. ఇప్పటివరకు సాగర్‌లోకి కొత్తగా 3.20 టీఎంసీల నీరు వచ్చినట్టు కనిపిస్తున్నా.. అందులో శ్రీశైలం లీకేజీల ద్వారా వచ్చిన నీరే 2 టీఎంసీల దాకా ఉంటుంది. ఇక్కడ ఇంకా 178.68 టీఎంసీల లోటు ఉంది.
నీటిని తోడేస్తున్న కర్ణాటక
Published Thu, Jul 12 2018 3:16 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment