పోలవరం ఆథారిటీలోకి శ్రీవాత్సవ
► కృష్ణా బోర్డు చైర్మన్‌ను సభ్యకార్యదర్శిగా నియమించిన కేంద్రం
► వివాదాస్పద నిర్ణయంపై మండిపడుతున్న తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్న సమయంలో కేంద్ర జలవనరులశాఖ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్.కె. శ్రీవాత్సవను ఆంధ్రప్రదేశ్ పరిధిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పోలవరం, పట్టిసీమ వాటాలపై న్యాయం కోసం ఓవైపు బోర్డు ముందు వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో తటస్థంగా ఉంచాల్సిన బోర్డు చైర్మన్‌ను, ఏపీ ప్రాజెక్టుకు సభ్య కార్యదర్శిగా నియమించడంపై తెలంగాణ మండిపడుతోంది.
వివాదాలు ఉన్నాపట్టించుకోకుండానే...
ప్రస్తుతం కృష్ణా జలాలకు సంబంధించి నీటి పంపిణీ, విడుదల, ప్రాజెక్టుల నియంత్రణ, టెలిమెట్రీ వంటి అంశాలతో ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు సాగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తూ ఏపీ చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల వల్ల తమకు దక్కే వాటాపై తేల్చాలని తెలంగాణ పట్టుబడుతోంది. పట్టిసీమ, పోలవరం ద్వారా మొత్తంగా 90 టీఎంసీల నీటి వాటాలు దక్కుతాయని, కనిష్టంగా 70 టీఎంసీలైనా రావాలని కోరుతోంది. గతేడాది ఏపీ పట్టిసీమ ద్వారా ఏకంగా 53 టీఎంసీల నీటిని తరలించగా ఇందులో తెలంగాణకు చుక్క నీటి వాటా దక్కలేదు.
ఈ ఏడాది సైతం 80 టీఎంసీలకుపైగా తరలించాలని ప్రణాళికలు వేస్తోంది. ఈ మళ్లింపులతో దక్కే వాటాలపై కృష్ణా బోర్డు చైర్మన్ స్థాయిలో శ్రీవాత్సవ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు మళ్లింపు జలాలపై కేంద్రం ప్రత్యేకంగా నియమించిన ఏకే బజాజ్ కమిటీకి బోర్డు చైర్మన్ అందించే నివేదికలకు ప్రాధాన్యం ఉటుంది. ఇలాంటి సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఉన్న వ్యక్తినే సభ్య కార్యదర్శిగా నియమించడం ఏమిటని తెలంగాణ నీటిపారుదల వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పోలవరం, పట్టిసీమలతో దక్కే వాటాల అంశంలో ఆయన ఎలా పారదర్శకంగా పని చేస్తారని అడుగుతున్నాయి.
గతంలోనూ ఇంతే...
గతంలో కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్న ఆర్.కె. గుప్తాను కేంద్ర ప్రభుత్వం పోలవరం అథారిటీ సభ్య కార్యదర్శిగా నియమించింది. ఆ సమయంలో గుప్తా పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్‌లో గుప్తా పనిచేస్తున్నారని, ఆయన వల్లే వివాదాలు జటిలం అవుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరులశాఖకు ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై వివిధ వర్గాల నుంచి సమాచారం తీసుకున్న జలవనరులశాఖ గుప్తాను బోర్డు బాధ్యతల నుంచి తప్పించింది. అయినప్పటికీ కేంద్రం ప్రస్తుతం మళ్లీ అలాంటి నిర్ణయమే తీసుకోవడం గమనార్హం.