కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల అంశం కాక పుట్టిస్తోంది. ఈ నదీ జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులే ప్రధానాస్త్రాలుగా ఇరు పార్టీలు మాటల తూటాలు పేలుస్తున్నాయి. ఐదారు జిల్లాల్లో ఇప్పుడిదే ప్రధానాస్త్రంగా మారడంతో ‘నదీ జలాలు’ వేడెక్కుతున్నాయి.
ప్రాణ‘హితం’ ఎవరికో..
ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అంశం రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేస్తోంది. ఈ ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్‌ను కాంగ్రెస్ తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నట్లుగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ ఆర్థిక, పర్యావరణ, నిర్వహణ పరంగా అనుసరణీయం కాదని కాంగ్రెస్ వాదిస్తోంది. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో చర్చించాకే దీనిపై ముందుకెళ్లాలని కోరినా అదేమీ పట్టనట్లు వ్యవహరించి ప్రాణహితను విభజించి పూర్తిగా పక్కనపెట్టారని కాంగ్రెస్ తన ప్రచారంలో హోరెత్తిస్తోంది.
ప్రాణహిత ప్రాజెక్టులోని అంబేద్కర్ పేరునూ తొలగించిందని ఇటీవల భైంసా సభలో రాహుల్ ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా నేతలు ఇదే అస్త్రంతో ముందుకు వెళుతున్నారు. ఈ ప్రచారం సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్ నియోజకవర్గాల ప్రజలను ప్రభావితం చేయనుంది. దీనికి టీఆర్‌ఎస్ ధీటుగా జవాబిచ్చే ప్రయత్నం చేస్తోంది. పాత డిజైన్ మేరకు 56 వేల ఎకరాలకే నీరిచ్చే అవకాశం ఉందని, తాము రీ డిజైన్‌లో ఆయకట్టును 2 లక్షలకు పెంచామని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న ప్రచారం చేస్తున్నారు. ప్రాణహితకు కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో రాని అటవీ, వన్యప్రాణి విభాగ అనుమతులు తాము సాధించామని చెబుతున్నారు.
‘పాలమూరు’.. ప్రచార హోరు
మహబూబ్‌నగర్ జిల్లాలోనూ ప్రాజెక్టులే ఓట్ల కల్పతరువుగా మారాయి. క ల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌తో పాటు కొత్తగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు తమవంటే తమవంటూ కాంగ్రెస్ – టీఆర్‌ఎస్ హోరెత్తిస్తున్నాయి. ప్రాజెక్టు పనులు అత్యధికంగా తమ హయాంలోనే పూర్తయ్యాయని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంటే.. పదేళ్లలో కాంగ్రెస్ పది వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వలేకపోయిందని, తాము అధికారంలోకి వచ్చాకే జిల్లాలో 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిందని టీఆర్‌ఎస్ చెబుతోంది. అంచనా వ్యయాలను పెంచేందుకే ప్రాజెక్టుల్లో మార్పులు చేశారని కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎస్.జైపాల్‌రెడ్డి, అరుణ, రేవంత్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి ఆరోపిస్తుండగా, వలసలు వాపస్ వచ్చేలా పనులు చేస్తున్నామని టీఆర్‌ఎస్ మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి హోరెత్తిస్తున్నారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రులు కేటీఆర్, హరీశ్.. తప్పుడు కేసులతో కాంగ్రెస్ ప్రాజెక్టులను అడ్డుకుంటోందని విమర్శలు గుప్పించారు.
‘బాబు’ తీరు.. ప్రతిపక్షం బేజారు
అంతరాష్ట్ర నదీ జలాల అంశం సైతం రెండు పార్టీల మధ్య ప్రచారాస్త్రంగా మారింది. పాలమూరు, డిండి, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని, ఆపాలంటూ పదేపదే కేంద్రానికి, బోర్డులకు లేఖ రాస్తున్నారని టీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. అలాంటి బాబుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేతులు కలిపి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని దుయ్యబడుతోంది. కాంగ్రెస్–టీడీపీ మైత్రి మరింత బలపడుతున్న నేపథ్యంలో ఏపీ సృష్టిస్తున్న అడ్డంకులు, తుంగభద్ర నదిపై అడ్డగోలుగా చేపడుతున్న ప్రాజెక్టుల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా టీఆర్‌ఎస్ ప్రణాళిక రచించింది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన బహిరంగసభల్లో దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహం రచిస్తున్నారు. దీన్ని తిప్పికొట్టే అంశంపై కాంగ్రెస్ తర్జనభర్జన పడుతోంది.
‘కాళేశ్వరం’ కాక..
కాంగ్రెస్: కమీషన్ల కోసం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచారు. మెజార్టీ పనులను ఆంధ్రా కాంట్రాక్టు సంస్థలకే కట్టబెట్టారు.
- కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం రూ.లక్ష కోట్లకు పెంచారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టుకే పేరుమార్చి రీ డిజైన్ చేశారు (ఇటీవల రాష్ట్ర పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ)
టీఆర్‌ఎస్: రూ.80,190 కోట్ల అంచనా వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జల సంఘం ఆమోదం తెలుపుతూ జారీ చేసిన లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన హరీశ్‌రావు.
- కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్ – ప్రాణహిత ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంతెంత పెరిగిందో తెలిపే మూడు జీవో కాపీలను ట్విట్టర్‌లో పెట్టిన కేటీఆర్.
- ‘కాళేశ్వరం నీళ్లు కావాలా.. కాంగ్రెస్ పార్టీ క్వార్టర్ కావాలా?’ అంటూ ప్రచారం సాగిస్తున్న టీఆర్‌ఎస్.
- కాళేశ్వరానికి రాష్ట్రం జాతీయ హోదానే అడగలేదని ఇటీవల కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించగా, జాతీయ హోదాపై కేంద్రానికి రాసిన లేఖను విడుదల చేసిన హరీశ్.
- సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment