సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కేటాయించిన మేరకే కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వినియోగించుకోవాలి. కృష్ణా బోర్డు కేటాయింపులకు మించి ఒక్క చుక్క నీటిని కూడా అదనంగా వాడుకునే అవకాశం లేదు. మన రాష్ట్రానికి కేటాయించిన నీటిని మన హక్కుగా తీసుకెళ్లడానికి మన భూ భాగంలో మనం కట్టుకుంటున్న ప్రాజెక్టే రాయలసీమ ఎత్తిపోతల పథకం’ అని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. సముద్రంలో కలుస్తున్న కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టి.. తాగు, సాగు నీటి అవసరాల కోసం కరవు పీడిత రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుపై తెలంగాణ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మంగళవారం జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు తదితరులతో సమావేశమయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడిన అంశాలు ఇలా ఉన్నాయి.
నాడు అన్ని ప్రాంతాలకూ మహానేత మంచి చేశారు
► ‘ఎవరైనా మానవత్వంతో ఆలోచించాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ రోజు మానవత్వంతో ఆలోచించడం వల్లే.. తెలంగాణ ప్రాంతంలో ఇదే శ్రీశైలం జలాశయం నుంచి పాలమూరు–రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల నిర్మాణానికి సన్నద్ధత.. కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం ఎడమగట్టు కాలువ) ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తక్కువ నీటి మట్టం ఉన్నప్పుడు కూడా నీళ్లు తరలించుకోగలుగుతున్నారు. అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే దివంగత మహానేత ఆ స్థాయిలో నీటిని ఎత్తిపోయడానికి ప్రాజెక్టులు ప్రారంభించారు’ అని సీఎం వైఎస్ జగన్ అన్నట్లు తెలిసింది.
► ఆంధ్రప్రదేశ్ తనకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి, కరవు పీడిత ప్రాంతం రాయలసీమకు నీళ్లు తరలించడానికి ఒక సదుపాయం ఏర్పాటు చేసుకుంటుంటే పరిమితులు విధించాలని తెలంగాణ సర్కారు అనడం ఎంతవరకు సమంజసమని ఆక్షేపించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీళ్లను మాత్రమే తీసుకుంటామని స్పష్టం చేసినట్లు తెలిసింది.
854 అడుగుల్లో 7 వేల క్యూసెక్కులు కూడా కష్టం
► పుష్కర కాలం తర్వాత ఎన్నడూ లేని రీతిలో శ్రీశైలం జలాశయానికి ఈ ఏడాది 1782 టీఎంసీల వరద వచ్చిందని.. కేవలం స్పిల్ వే గేట్ల ద్వారానే 888 టీఎంసీలను దిగువకు విడుదల చేశామని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేసినట్లు సమాచారం.
► నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు పూర్తిగా నిండాయని.. కృష్ణా డెల్టాకు అవసరమైన మేరకు నీటిని సరఫరా చేస్తూనే ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి 800 టీఎంసీలకుపైగా వరద జలాలను సముద్రంలోకి విడుదల చేశామని వివరించారని తెలిసింది.
► సముద్రంలో కలుస్తున్న వరద జలాలను.. అదీ మన రాష్ట్రానికి కేటాయించిన మేరకు నీటిని కరవు పీడిత ప్రాంతాలకు తరలించడానికి ఒక ప్రాజెక్టు చేపడితే తప్పుపట్టడం సమంజసం కాదని సీఎం వైఎస్ జగన్ అన్నట్లు తెలిసింది.
854 అడుగుల్లో 7 వేల క్యూసెక్కులు కూడా పారవు
► శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్‌పీ) ద్వారా 7 వేల క్యూసెక్కుల నీరు కూడా కాలువలోకి వెళ్లడం కష్టమవుతుంది. అదే నీటి మట్టం 841 అడుగులకు చేరితే పీహెచ్‌పీ నుంచి 1000 క్యూసెక్కులు కూడా కాలువకు చేరవు.
► శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 881 అడుగుల్లో ఉన్నప్పుడే పీహెచ్‌పీ నుంచి ప్రస్తుతం ఉన్న డిజైన్ మేరకు పూర్తి సామర్థ్యం ప్రకారం 44 వేల క్కూసెక్కులను తరలించవచ్చు. ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదిలో పది రోజులకు మించి ఉండటం మహాకష్టం. 881 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు జలవిద్యుద్పుత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేయడం వల్ల నీటి మట్టం తగ్గుపోతుంది. అంటే.. ఆ పది రోజుల్లోనే కరవు పీడిత రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు నీటిని తరలించాల్సి ఉంటుంది.
► కొత్తగా కడుతున్న వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా రెండు సొరంగాల(టన్నెల్స్) నుంచి వెళ్లేది గరిష్టంగా 9 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే. అది కూడా శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల వద్ద ఉంటేనే ఆ మాత్రం నీళ్‌లైనా వెళ్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ఇది.
తక్కువ నీటి మట్టం ఉన్నా తెలంగాణకు 200 టీఎంసీల తరలింపు
► మరోవైపు తెలంగాణ వైపు ఉన్న ప్రాజెక్టులు చూస్తే.. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో నీళ్లు 800 అడుగుల స్థాయిలో ఉన్నా కూడా రోజుకు 2 టీఎంసీల మేర (23,148 క్యూసెక్కులు) తరలించవచ్చు.. ఇలా 90 టీఎంసీల నీటిని తరలించగలరు.
► కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో నీళ్లు 800 అడుగుల స్థాయిలో ఉన్నా రోజుకు 0.3 టీఎంసీల (3,500 క్యూసెక్కుల) నీటిని తీసుకెళ్లగలరు. ఇలా 40 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు.
► శ్రీశైలంలో నీళ్లు 800 అడుగుల స్థాయిలో ఉన్నా డిండి నుంచి రోజుకు 0.5 టీంఎసీలు (5,787 క్యూసెక్కులు) తెలంగాణ రాష్ట్రం తీసుకెళ్లగలదు. ఇలా 30 టీఎంసీల నీటిని తరలించగలరు.
► ఎస్‌ఎల్‌బీసీ ద్వారా అయితే శ్రీశైలంలో 824 అడుగులు నీటిమట్టం ఉన్నప్పుడు రోజుకు సుమారు 0.51 టీఎంసీ (6,000 క్యూసెక్కులు) చొప్పున తెలంగాణ రాష్ట్రం తరలించగలదు. ఇలా 40 టీఎంసీలు తరలించగలరు. ఈ ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి 200 టీఎంసీల నీటిని తీసుకునే సామర్థ్యం తెలంగాణకు ఉంది.
► వీటికితోడు జూరాల, భీమ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ల నుంచి కూడా శ్రీశైలం జలాశయంలోకి వరద రాకముందే తెలంగాణా నీళ్లు తీసుకోగలుగుతుంది.
కరవు పీడిత రాయలసీమ దాహార్తి తీర్చవద్దా?
► శ్రీశైలంలో ఒకవైపు 800 అడుగులు, ఇతర తక్కువ నీటి మట్టాల స్థాయి నుంచి నీటిని వివిధ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రం తీసుకెళ్తుంటే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తనకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి, కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి తాగునీరు ఇవ్వడానికి ఒక సదుపాయం మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఏపీకి పరిమితులు విధించాలనడం ఎంతవరకు సమంజసం?
► కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ) అవార్డు ప్రకారమే ఎవరు ఎన్ని నీళ్లు వాడుకోవాలన్నది నిర్ణయించి.. కృష్ణా బోర్డు ఆ పంపకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అలాంటప్పుడు ఎవరైనా దీన్ని రాజకీయం చేసే ఆలోచన చేయడం సమంజసం కాదు.
కృష్ణా మిగులు జలాల పంపిణీపై భేటీ నేడు
కృష్ణా నదీ మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి విధి విధానాలను రూపొందించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ బుధవారం సమావేశమవుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కృష్ణా నది నికర జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయిస్తూ జూన్ 19, 2015న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ ఇది అమల్లో ఉంటుందని కేంద్రం పేర్కొంది. మిగులు జలాలను పంపిణీ చేయాలని కృష్ణా బోర్డు కేంద్రాన్ని కోరడంతో అందుకు అనుగుణంగా ఓ ఉన్నత స్థాయి కమిటీని జనవరి 21న కేంద్ర జల్ శక్తి శాఖ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బుధవారం మొదటిసారిగా భేటీ అవుతోంది. జూన్ 24లోగా కేంద్రానికి ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment