రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర దాహార్తిని తీర్చేందుకు పది టీఎంసీల శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను ఎల్లూరు(మహబూబ్‌నగర్) నుంచి నగరానికి తరలించేందుకు జలమండలి అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి సాధ్యాసాధ్యాల నివేదిక(ఫీసిబిలిటీ రిపోర్టు) సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదించి ఆయన ఆదేశాల మేరకు పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. శ్రీశైలం జలాశయం నుంచి మూడు దశల పంపింగ్ ద్వారా నగరానికి నీటిని తరలించే మార్గానికి సంబంధించిన మ్యాప్, ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూపొందించింది. మహబూబ్‌నగర్ జిల్లా ఎల్లూరు నుంచి సుమారు 221 కి.మీ. దూరం ఉన్న హైదరాబాద్‌కు 3000 డయా వ్యాసార్థం గల పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించేందుకు రూ. 3,380 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా వేసింది. ఈ ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపితే పనులు చేపడతామని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
- సాక్షి, హైదరాబాద్
శ్రీశైలం బ్యాక్‌వాటర్ తరలింపు ఇలా..
మహబూబ్‌నగర్ జిల్లా ఎల్లూరు నుంచి నగరానికి 10 టీఎంసీల శ్రీశైలం బ్యాక్ వాటర్ జలాలను తరలించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గం 215 కి.మీ. ఉంటుంది. ఈ ప్రత్యామ్నాయ మార్గంలో ముందుగా శ్రీశైలం జలాశయం సమీపంలోని ఎల్లూరు (230 మీటర్లు)కు నీటిని పంపింగ్ చేసి అక్కడి నుంచి 21 కి.మీ. దూరంలో ఉన్న కల్వకోల్ (380 మీటర్ల ఎత్తు)కు నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. అటు నుంచి 25 కి.మీ. దూరంలో ఉన్న గుడిపల్లి (555మీ.)కి నీటిని పంపింగ్ చేసి అక్కడి నుంచి 34 కి.మీ. దూరంలో ఉన్న తిమ్మాజీపేటకు భూమ్యాకర్షణశక్తి (520మీ.) ద్వారా నీటిని తరలిస్తారు. అటు నుంచి 75 కి.మీ. దూరంలో ఉన్న కొందుర్గ్ (660మీ.)కు నీటిని పంపింగ్ చేస్తారు. అక్కడి నుంచి 60 కి.మీ. దూరంలో నగరానికి భూమ్యాకర్షణ శక్తి ద్వారా నీటిని తరలించి హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలను పూర్తిస్థాయిలో నింపుతారు. ఈ మార్గంలో 121 కి.మీ. మేర నీటిని పంపింగ్ చేస్తారు. మరో 94 కి.మీ. మార్గంలో గ్రావిటీ ఆధారంగానే నగరానికి నీటిని తరలించవచ్చని నివేదికలో పేర్కొన్నారు.
సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు
మార్చి నెలలో జలమండలి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించిన విషయం విదితమే. నగర జనాభా, తాగునీటి అవసరాలు గణనీయంగా పెరుగుతోన్న నేపథ్యంలో పది టీఎంసీల మేర శ్రీశైలం బ్యాక్‌వాటర్ నీటిని సిటీకి తరలించేందుకు అందుబాటులో ఉన్న ఈ ప్రత్యామ్నాయంపై క్షేత్రస్థాయిలో పర్యటించి తనకు నివేదిక సమర్పించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో బోర్డు ఎండీ జగదీశ్వర్ ఆదేశాల మేరకు ఈఎన్‌సీ సత్యనారాయణ, ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కొండారెడ్డిల నేతృత్వంలోని నిపుణుల బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి సాధ్యాసాధ్యాలు, నేలవాలును పరిశీలించి పంపింగ్,గ్రావిటీ మార్గం,పైప్‌లైన్లు, రిజర్వాయర్ల ఏర్పాటుపై ప్రాథమిక ప్రతిపాదనలు, అంచనాలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను నేడో రేపో సీఎంకు సమర్పించి ఆయన ఆదేశాల మేరకు పనులు చేపట్టనున్నట్లు తెలిసింది.