సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘మెదక్ జిల్లాలో 66 ఏళ్లుగా అగ్రకులాలే పెత్తనం చేస్తున్నాయి, బీసీ నేతలను ఎదగనీయకుండా రెడ్డి, వెలమ నేతలు అణగదొక్కే కుట్రలు చేస్తున్నారు. ఇకపై వారి ఆటలను సాగనివ్వం’’ అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీ కులాలను అణిచి వేసేందుకు కుట్రలు చేస్తున్న అగ్రకుల పెత్తందార్లూ..! ఖబడ్దార్ అని ఘాటుగా హెచ్చరించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ సోమవారం సంగారెడ్డిలో జరిగిన సోనియా ‘అభినందన సభ’లో ఆవేదన వ్యక్తం చేయడంపై ఆర్. కృష్ణయ్య స్పందించారు.
పత్రికల ద్వారా వివరాలు తెలుసుకున్న ఆయన మంగళవారం ‘సాక్షి’ కార్యాలయానికి ఫోన్ చేసి మాట్లాడారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేకంగా పని చేస్తోందని, దీన్ని ఎంత మాత్రం సహించబోమన్నారు. జిల్లాలో ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే ఉంటే దాన్ని కూడా ఓర్చుకోలేక ఉన్న ఒక్క సీటు కూడా లాక్కునే ప్రయత్నం చేయడం అగ్రకులాల ఆధిపత్య ధోరణికి నిదర్శనమన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌తో పాటుగా మరో నలుగురు బీసీలకు టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే అన్ని బీసీ కులాలు, ఉప కులాలను కలుపుకుని జాయింట్ యాక్షన్ కమిటీ వేసి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టి గెలిపించుకుంటామన్నారు.
ఆరు దశాబ్ధాలుగా అగ్రకులాలే పెత్తనం చేసినా సహించామనీ, ఇకనుంచి వారి ఆటలు సాగనివ్వమన్నారు. జిల్లా జనాభాలో 80 శాతం ఉన్న బీసీలకు వాస్తవంగా ఐదు అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం చూసినా మెదక్ జిల్లాలో ప్రస్తుతం అగ్రకులాల వారు ఉన్న స్థానాల్లో బీసీలుండాలనీ, బీసీ ఉన్న ఒకే ఒక స్థానం అగ్రకులాలకు దక్కాలన్నారు. బీసీల ఓట్లతో గెలిచి బీసీల సీట్లలో కూర్చుని రాజ్యాధికారంతో పాటు వ్యాపారాలు కూడా గుప్పిట్లో పెట్టుకుని బీసీలనే అణచివేస్తున్నారని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అన్ని బీసీ కులాలు ఐక్యం కావాల్సిన సమయం వచ్చిందని, రాజ్యాధికారంలో హక్కులను సాధించుకోవడం కోసం బీసీలంతా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
కుట్రలు చేస్తే ఖబడ్దార్
Published Wed, Feb 26 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM
Advertisement
Advertisement