nandeeswar goud
-
19న టీడీపీలోకి నందీశ్వర్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ ఈ నెల 19న టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. సోమవారం ఆయన ఎన్టీఆర్ భవన్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణను మర్యాదపూర్వకంగా కలిశారని, 19న టీడీపీలో బేషరతుగా చేరుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.బుచ్చిలింగం వెల్లడించారు. నందీశ్వర్‌గౌడ్ 2014 ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లారు. ఆ తర్వాత తన రాజకీయ గురువు డి.శ్రీనివాస్ కూడా కాంగ్రెస్‌లోకి వస్తున్నారనే వార్తల నేపథ్యంలో గత నెలలో ఆయన కాంగ్రెస్ ముఖ్య నేతలు కుంతియా, ఉత్తమ్‌లను కలిసి పార్టీలో చేరికపై చర్చించారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటవుతున్న కూటమి పరిణా మాల నేపథ్యంలో ఆయనకు కాంగ్రెస్ పక్షాన టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో టీడీపీలో చేరుతున్నారని తెలుస్తోంది. పటాన్చెరు అసెం బ్లీ స్థానాన్ని టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీ కారం తెలిపిందని, ఆయన టీడీపీ అభ్యర్థిగా అక్కడి నుంచి బరిలో దిగుతారని ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. -
సందిగ్ధంలో ఆ ఇద్దరు
సాక్షి, సంగారెడ్డి: ‘మిస్టర్ కూల్’గా పేరున్న నందీశ్వర్‌గౌడ్, ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ ఉన్న తూర్పు జయప్రకాశ్‌రెడ్డి రాజకీయ భవితవ్యం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ పార్టీ మారుతున్నారన్న అంశం రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వీరిద్దరూ రాజకీయంగా ఎటువైపు అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లా రాజకీయాల్లో పేరున్న నందీశ్వర్‌గౌడ్, జగ్గారెడ్డిలు ప్రస్తుతమున్న పార్టీలను వీడి కొత్త కండువాలు కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు కూడాఎటుపోదామంటూ అనుచరుల అభిప్రాయాలను సేకరిస్తుండగా, వీరి అడుగులు ఎటు పడతాయోనని కేడర్ ఆసక్తిగా గమనిస్తోంది. సొంత పార్టీలో ఇమడలేకే.. జిల్లాలో ఏకైక బీసీ నాయకునిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌కు సొంత పార్టీ నుంచి ఎప్పుడూ చేదు అనుభవమే ఎదురవుతూ వచ్చింది. సొంత పార్టీ నాయకులే ఆయన్ను ఎప్పటికప్పుడు తొక్కిపెట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ఎన్నికల సమయంలో సొంత పార్టీ నాయకులే తనకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారనే ఆవేదనతో నందీశ్వర్‌గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అప్పట్లో గులాబి దళపతి కేసీఆర్‌తో భేటీ కూడా అయ్యారు. ఆయన గులాబీ గూటికి దాదాపుగా చేరినట్టే అనుకున్న సమయంలో ఢిల్లీ పెద్దలు రంగ ప్రవేశం చేసి బుజ్జగించడంతో నందీశ్వర్ మనుసు మార్చుకుని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. పటాన్చెరు నియోజకవర్గం నుంచి భూపాల్‌రెడ్డి, చంద్రారెడ్డి లాంటి కీలక నేతలు వెళ్లిపోయినప్పటికీ నందీశ్వర్ పార్టీ కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు. అయినప్పటికీమెదక్ ఉప ఎన్నికలో తన గెలుపు కోసం నందీశ్వర్‌గౌడ్ పనిచేయలేదని సునీతాలక్ష్మారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనికితోడు ఇటీవల సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుకు ఆయనను ఆహ్వానించలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన నందీశ్వర్‌గౌడ్ సొంత పార్టీలో అవమానాలు ఎదుర్కొంటు ఉండటం కంటే పార్టీ మారి కేడర్‌ను కాపాడుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. నందీశ్వర్‌గౌడ్ పార్టీ మారే యోచనను పసిగట్టిన గులాబీ పార్టీ, టీడీపీలు ఆయనకు ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. నందీశ్వర్‌గౌడ్ పార్టీ మారిన పక్షంలో పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పెద్ద దెబ్బ తగలనుంది. కాంగ్రెస్‌వైపే జగ్గారెడ్డి అడుగులు ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మెదక్ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ నుంచే పోటీ చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన బీజేపీకిదూరంగానే ఉంటూ వస్తున్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో బీజేపీ చేపట్టే ఏ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనటం లేదు. దీనికితోడు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరితేనే బాగుంటుందని అనుచరులంతా ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రాజకీయ అవసరాల దృష్ట్యా తన ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీలో చేరటమే బాగుంటుందని జగ్గారెడ్డి సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లేదా జనవరిలో కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. -
కాంగ్రెస్‌లోనూ గెలుపు ధీమా
కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపుపై ధీమాతోనే ఉంది. కాకుంటే ఏ నిర్ణయం అయినా ఢిల్లీ అధిష్టానమే తీసుకోవాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు కేసీఆర్ తరహాలో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. తమకు కనీసం 50 సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మద్దతును మిత్రపక్షమైన సీపీఐతో పాటు, పాతనేస్తం ఎంఐఎం నుంచి తీసుకోవాలని ఆపార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. దళిత సామాజిక వర్గానికి చెందిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ‘ముఖ్య’మైన పదవి రేసులో ముందున్నారు. ఇప్పటికే ఆయన అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఆ పార్టీ నేతలు వేస్తున్న అంచనాల ప్రకారం పాత కాపులతో పాటు బీసీ సామాజిక వర్గం నుంచి నందీశ్వర్‌గౌడ్ కూడా మంత్రి వర్గం రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఒక్క బీసీ.. వంద కుట్రలు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘జిల్లాలో ఏకైక బీసీ ఎమ్మెల్యేను.. ఈ ఎన్నికల్లో నాకు టికెట్ రాకుండా కుట్రలు చేస్తున్నారు. ఓ వర్గం నన్ను పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తోంది...’ ఇది టికెట్ల కేటాయింపునకు ముందు నందీశ్వర్‌గౌడ్ వ్యక్తం చేసిన ఆవేదన. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే వచ్చి నందీశ్వర్‌కు టికెట్ ఇచ్చింది. అయినా అదే వర్గం ‘శల్యసారథ్యం’ చేస్తూ సొంత పార్టీ అభ్యర్థికే ‘చెయ్యి’చ్చి ‘కారు’ గేర్లు మారుస్తున్నారు. గెలిచే సీటును కుట్రలు కుతంత్రాలతో ఓడించే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే ఒక్క బీసీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ పటాన్చెరు సెగ్మెంట్ బరిలో ఉన్నారు. పార్టీ కేడర్‌తో ఎన్నికల్లో దూసుకె ళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తుంటే సొంత పార్టీ ముఖ్యులే ఆయనను కుట్రపూరితంగా వెనక్కినెట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి పోటీదారులతో కలిసి సొంత పార్టీ అభ్యర్థిని ఓడించే కుట్రలు పన్నుతున్నట్లు సమాచారం. పార్టీ టికెట్ కేటాయించే సమయం నుంచి తెరవెనక ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గం నాయకులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయితే అధిష్టానం ముందు వారి ఆటలు సాగలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నందీశ్వర్‌గౌడ్‌కు టికెట్ కేటాయించారు. ఇది మింగుడుపడని పటాన్చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్యనేతలు నందీశ్వర్‌గౌడ్‌ను ఎన్నికల్లో ఎలాగైనా దెబ్బతీయాలనే తలంపుతో కుట్రలకు తెరలేపారని కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేదన వ్యక్తం చేస్తోంది. భూపాల్‌రెడ్డి ప్రచారానికి దూరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ప్రచారానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్‌కు మద్దతుగా ఇంతవరకు ఆయన ప్రచారంలో పాల్గొనలేదు. దీన్ని సొంత పార్టీ నేతలే బహిరంగంగా తప్పుబడుతున్నారు. భూపాల్‌రెడ్డి దూరంగా ఉండటంతో ఆయన అనుచరులు, మద్దతుదారులు సైతం ఆయన దారిలోనే పయనిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా రామచంద్రాపురం మండలానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్‌కు మద్దతుగా పనిచేయటంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్.. భూపాల్‌రెడ్డితో సహా అందరినీ కలుపుకునే ప్రయత్నాలు చేసినా సొంత పార్టీ నేతల నుంచి సానుకూల స్పందన లభించటంలేదని తెలుస్తోంది. ఏఐసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ కొప్పుల రాజు స్వయంగా కలగజేసుకుని భూపాల్‌రెడ్డికి ఫోన్‌చేసి నందీశ్వర్‌గౌడ్‌కు సహకరించాలని సూచించిన విషయం విదితమే. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
సిట్టింగ్‌లకు గ్రీన్ సిగ్నల్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జబితా కసరత్తు కొలిక్కి వచ్చింది. పార్టీ స్క్రీనింగ్ కమిటీ గురువారం తొలి జాబితాకు తుది రూపం ఇచ్చింది. ‘మిస్టర్ కూల్’ శివతాండవం.. ‘ఫైర్‌బ్రాండ్’ మౌనవ్రతం వంటివి మెతుకు సీమ కాంగ్రెస్‌కు సిట్టింగు ఎమ్మెల్యేలకు కలిసొచ్చాయి. నందీశ్వర్‌గౌడ్ విశ్వరూపాన్ని చూసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలను కదిలించడానికి వెనుకడుగు వేసినట్టు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 8 మంది సిట్టింగుల్లో ఒక్క నారాయణఖేడ్ మినహా మిగిలిన అన్ని చోట్ల మళ్లీ పాతకాపులకే టికెట్లు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అందోల్- దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి- జగ్గారెడ్డి, పటాన్చెరు- నందీశ్వర్‌గౌడ్, దుబ్బాక- చెరుకు ముత్యంరెడ్డి, గజ్వేల్- నర్సారెడ్డి, జహీరాబాద్- గీతారెడ్డి, నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప జాబితాలో మార్పు ఉండే అవకాశం లేదని కాంగ్రెస్ కరాఖండికండీగా చెప్తున్నారు. నారాయణఖేడ్ అసెంబ్లీ నుంచి ప్రస్తుత ఎంపీ సురేష్ షెట్కర్‌ను రంగంలోకి దింపి, జహీరాబాద్ ఎంపీ సీటు మైనార్టీ నాయకుడు ఫరీదుద్దిన్కు కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అందువల్లే నారాయణఖేడ్ అసెంబ్లీ సీటును ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇవ్వకుండా ఖాళీపెట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సీపీఐ నేతలతో సమావేశమై పొత్తుల విషయంపై చర్చిస్తారు. అదే రోజు సీపీఐ అడిగిన సీట్ల జాబితాను ఢిల్లీ అధిష్టానం ముందుపెట్టనున్నట్లు సమాచారం. సీపీఐ కోరిన సీట్లను ఆ పార్టీకి వదిలేసి మరో జాబితా సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. అయితే జిల్లా నుంచి సీపీఐకి సీట్లు ఇచ్చే అవకాశం లేదని ప్రాథమికంగా తెలుస్తోంది. ఒకేవేళ తప్పని పరిస్థితి తలెత్తితే ఆ పార్టీ బలంగా ఉన్న చోట సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతా సవ్యంగా సాగితే శనివారం సాయంత్రం, లేదా ఆదివారం రోజున తొలి జాబితా వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుపై అనేక ఊహాగానాలు, అనుమానాలు వెలువడ్డాయి. ముఖ్యంగా పటాన్చెరు, సంగారెడ్డి, దుబ్బాక, నర్సాపురం, సీట్లపై పుకార్లు షికార్లు చేశాయి. సంగారెడ్డి నియోజకవర్గంపై డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. తన వర్గానికి చెందిన ఐకేపీ మహిళలతోనూ, అనుచరులతో కలిసి తూర్పు జగ్గారెడ్డిపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. సీటు దాదాపు పద్మినీరెడ్డికే ఖరారు అయిందని ప్రచారం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత మాజీ డిప్యూటీ స్పీకర్, సంగారెడ్డి నుంచి ఐదు పర్యాయాలు గెలిచిన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి కొడుకు నిరూప్‌రెడ్డికి టికెట్ వస్తుందని పుకార్లు వచ్చాయి. అన్ని అనుమాలకు తెర వేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగ్గారెడ్డికే మళ్లీ టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పటాన్చెరు నియోజకవర్గం నుంచి టికెట్ కోసం డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి భూపాల్ రెడ్డి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. రాహుల్ గాంధీని కలిసి తనకు సీటు ఇవ్వాలని కోరారు. డీసీసీ అధ్యక్షుని హోదాలో ఏఐసీసీకి పంపిన ముగ్గురు ప్రాపబుల్స్ పేర్లలో తన పేరుతో పాటు తన అనుచరుల పేర్లను మాత్రమే చేర్చి సిట్టింగు ఎమ్మెల్యే పేరు చేర్చక పోవడంతో ఆగ్రహించిన నందీశ్వర్‌గౌడ్ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో దిగివచ్చిన అధిష్టానం ఆయనకే కాదు సిట్టింగులందరికి టికెట్ ఇస్తామని సూచన ప్రాయంగా తెలిపింది. దుబ్బాక నియోజక వర్గంలో ఈసారి చెరుకు ముత్యంరెడ్డితో భూపతి మనోహర్‌రావు, బండి నర్సాగౌడ్ పోటీపడ్డారు. మనోహర్‌గౌడ్ రెండు సార్లు రాహుల్‌గాంధీని కలిసి టికెట్ కోసం ప్రయత్నం చేశారు. ముత్యంరెడ్డిపై ఉన్న వ్యతిరేకతను ఎత్తిచూపించి అధిష్టానం ఒప్పించే ప్రయత్నం చేశారు. ఒక దశలో తనకు టికెట్ రాదేమోనని అనుమానించిన ముత్యంరెడ్డి తనకు కాకుంటే తన కుమారుడు శ్రీనివాసరెడ్డికైనా టికెట్ ఇవ్వాలనే వాదన తెరమీదకు తెచ్చారు. నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీతారెడ్డికి పోటీగా ఎవరు లేనప్పటికీ సీపీఐ పార్టీతో పొత్తుల నేపథ్యంలో ఆమె సీటుకు ప్రమాదం ఉందనే సంకేతాలు వచ్చాయి. ఆమె సీటుకు ఢోకా లేదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కాగా నర్సాపూర్ టికెట్ కోసం చివరి వరకు పట్టుబడతామని సీపీఐ జిల్లా కమిటీ చెప్తోంది. వారి మాటలను బట్టి చూస్తే సునీతారెడ్డి సీటుకు పొత్తుల ప్రమాదం ఇంకా పొంచి ఉందనే చెప్పొచ్చు. జిల్లాకే చెందిన మరో మాజీ మంత్రి గీతారెడ్డి తన కుటుంబం నుంచి రెండు సీట్ల కోసం ప్రయత్నం చేశారు. జహీరాబాద్ టికెట్‌ను తన కూతురు మేఘనారెడ్డికి, మల్కాజ్గిరి అసెంబ్లీ టికెట్ తనకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ దిశగా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఆమె పాత సీటుకే టికెట్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. నారాయణఖేడ్ నియోజకవర్గంపైనే కొంత సందిగ్థత ఏర్పడింది. ప్రస్తుతం ఎంపీ సురేష్ షట్కర్ను ఎమ్మెల్యేగా పంపిచే అవకాశాలను అధిష్టానం యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే నారాయణఖేడ్‌పై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చని సమాచారం. -
గు‘లాబీ’!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పుట్టింట్లో పట్టుకోసం టీఆర్ఎస్ పాట్లు పడుతోంది. జిల్లాలో రాజకీయంగా ‘ఫాం’లోకి రావడానికి ‘ఫాంహౌస్’ మీదే ఆశలు పెట్టుకుంది. ఉద్యమ పరంగా ముందున్న తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయంగా నియోజకవర్గంలో చాలా వెనుకబడి ఉంది. దాదాపు ఆరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు బలమైన పునాదులు లేవు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే సిద్దిపేట, దుబ్బాక మీదనే ఆ పార్టీకి ఆశలు సజీవంగా ఉన్నాయి. మెదక్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ ఇప్పటికే ఇక్కడ వర్గపోరు మొదలైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు గులాబీ దళపతి వేస్తున్న ఎత్తులు.. జిత్తులు చిత్తయిపోతున్నాయి. ‘హ్యాండిచ్చి’ జారుకున్నారు... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించడం.. టీఆర్ఎస్ నేతల కోసం రెడ్ కార్పెట్ పరవటం... మరోవైపు ‘టీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్‌లోకి పోతారో, కాంగ్రెస్ వాళ్లు టీఆర్ఎస్లోకి వస్తారో చూద్దాం’ అంటూ ఆ మరుసటి రోజే గులాబీ దళపతి కేసీఆర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అదే ఊపు మీద కేసీఆర్ పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ మీద వల విసిరారు. ఫాంహౌస్ విందుకు పిలిచి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. టీఆర్ఎస్లో చేరటం దాదాపు ఖాయమనే నందీశ్వర్‌గౌడ్ సంకేతాలు పంపించారు. ఇక గులాబీ కండువా కప్పుకోవడమే తరువాయి అనుకున్న సమయంలో ఆయన హ్యాండిచ్చి జారిపోయారు. ఇదే జిల్లా నుంచి ఇద్దరు మాజీ మంత్రులకు కూడా కేసీఆర్ గాలం వేశారు. వారిని ఒప్పించి పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డికి అప్పగించినట్టు, ఆయన ఆ ఇద్దరు మాజీ మంత్రులను ఒప్పించే ప్రయత్నం చేసినట్టు సమాచారం. వారిద్దరి చేరిక దాదాపు ఖారారైనట్టే అని, రేపో మాపో పార్టీలో చేరిపోతారని టీఆర్ఎస్లోనే ఒక వర్గం మీడియాకు లీకుల మీద లీకులు ఇచ్చింది. ఈ లీకులపై స్పందించిన సదరు మాజీ మంత్రి ఒకరు పార్టీ మారే ప్రసక్తి లేదని, మాది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబమేనని, పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. ఇక మరో మాజీ మంత్రి కోసం ప్రయత్నం చేస్తే ముందు పొత్తుల విషయం తేలనివ్వండి ఆ తర్వాత ఆలోచన చేద్దాం అన్నట్లు ప్రచారం జరుగుతోంది. దళిత నాయకుడు, ముఖ్యమంత్రి రేసులో ఉన్న దామోదర రాజనర్సింహకు చెక్ పెట్టడానికి కేసీఆర్ వేసిన రెండు ఎత్తులు పని చేయలేదు. ముందుగా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రిని పార్టీలోకి ఆహ్వానించారు. మొదటి నుంచి ఆయనకు కేసీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్ని సార్లు పిలిచినా ఆయన పార్టీలోకి రాకపోయేసరికి కేసీఆర్‌కు కోపం వచ్చి సదరు మాజీ మంత్రి పార్టీలోకి వచ్చినా తీసుకునేది లేదని తన అనుచరులతో తెగేసి చెప్పినట్టు సమాచారం. ఆయన బదులుగా ప్రజా కళాకారుడు రసమయి బాలకిషన్‌ను జోగిపేటకు పంపేందుకు కేసీఆర్ సూచనప్రాయంగా ప్రతిపాదించారు. ఇక గతంలో పార్టీని వీడి ఇటీవలే మళ్లీ చేరిన ఆయన్ను జోగిపేట నుంచి పోటీ చేయించాలని ప్రయత్నం చేశారు. ఆట పాటలతో రాజనర్సింహను కట్టడి చేయాలని టీఆర్ఎస్ నేతలు కొందరు రసమయికి సూచించగా... కేసీఆర్ పాచికలను ముందే పసిగట్టిన బాలకిషన్ మానకొండూరు తప్ప మరోచోట పోటీ చేయనని తెగేసి చె ప్పినట్లు సమాచారం. జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల కంటే ప్రత్యర్థి పార్టీ నేతల వలసల మీదనే కేసీఆర్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ప్రత్యర్థి పార్టీల నుంచి రెండో శ్రేణి నాయకత్వం, అంతకంటే తక్కువ స్థాయి నాయకులు టీఆర్ఎస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. జాక్‌పాట్ కొట్టగలిగే నేతలు పార్టీలో చేరేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో కేసీఆర్ మరింత పదునుతో మరో ఎత్తుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
కుట్రలు చేస్తే ఖబడ్దార్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘మెదక్ జిల్లాలో 66 ఏళ్లుగా అగ్రకులాలే పెత్తనం చేస్తున్నాయి, బీసీ నేతలను ఎదగనీయకుండా రెడ్డి, వెలమ నేతలు అణగదొక్కే కుట్రలు చేస్తున్నారు. ఇకపై వారి ఆటలను సాగనివ్వం’’ అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీ కులాలను అణిచి వేసేందుకు కుట్రలు చేస్తున్న అగ్రకుల పెత్తందార్లూ..! ఖబడ్దార్ అని ఘాటుగా హెచ్చరించారు. పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ సోమవారం సంగారెడ్డిలో జరిగిన సోనియా ‘అభినందన సభ’లో ఆవేదన వ్యక్తం చేయడంపై ఆర్. కృష్ణయ్య స్పందించారు. పత్రికల ద్వారా వివరాలు తెలుసుకున్న ఆయన మంగళవారం ‘సాక్షి’ కార్యాలయానికి ఫోన్ చేసి మాట్లాడారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేకంగా పని చేస్తోందని, దీన్ని ఎంత మాత్రం సహించబోమన్నారు. జిల్లాలో ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే ఉంటే దాన్ని కూడా ఓర్చుకోలేక ఉన్న ఒక్క సీటు కూడా లాక్కునే ప్రయత్నం చేయడం అగ్రకులాల ఆధిపత్య ధోరణికి నిదర్శనమన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌తో పాటుగా మరో నలుగురు బీసీలకు టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే అన్ని బీసీ కులాలు, ఉప కులాలను కలుపుకుని జాయింట్ యాక్షన్ కమిటీ వేసి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టి గెలిపించుకుంటామన్నారు. ఆరు దశాబ్ధాలుగా అగ్రకులాలే పెత్తనం చేసినా సహించామనీ, ఇకనుంచి వారి ఆటలు సాగనివ్వమన్నారు. జిల్లా జనాభాలో 80 శాతం ఉన్న బీసీలకు వాస్తవంగా ఐదు అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం చూసినా మెదక్ జిల్లాలో ప్రస్తుతం అగ్రకులాల వారు ఉన్న స్థానాల్లో బీసీలుండాలనీ, బీసీ ఉన్న ఒకే ఒక స్థానం అగ్రకులాలకు దక్కాలన్నారు. బీసీల ఓట్లతో గెలిచి బీసీల సీట్లలో కూర్చుని రాజ్యాధికారంతో పాటు వ్యాపారాలు కూడా గుప్పిట్లో పెట్టుకుని బీసీలనే అణచివేస్తున్నారని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అన్ని బీసీ కులాలు ఐక్యం కావాల్సిన సమయం వచ్చిందని, రాజ్యాధికారంలో హక్కులను సాధించుకోవడం కోసం బీసీలంతా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. -
టికెట్ల కోసం.. నేతల ఫీట్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో అప్పుడే టికెట్ల వేట మొదలైంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే నేతలు హస్తిన బాట పడుతున్నారు. టికెట్ దక్కించుకునేందకు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ప్రారంభిం చారు. అధిష్టానం పెద్దలనే ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు. జిల్లాలోని పలు అసెంబ్లీ సీట్ల కోసం ‘సిట్టింగు’లను పక్కకు నెట్టాలని ద్వితీయ శ్రేణి నాయకులు ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతమైన పటాన్చెరు చుట్టూనే ‘జిల్లా కాంగ్రెస్’ రాజకీయాలు తిరుగుతున్నాయి. దీంతో సీటును కాపాడుకునే ప్రయత్నంలో పటాన్చెరు సిట్టింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎలాగైనా పటాన్చెరు టికెట్ దక్కిం చుకోవాలనే లక్ష్యంతో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ఏఐసీసీ దూత బస్వరాజ్ పాటిల్‌కు తమ అభిప్రాయాలు చెప్పిన ఈ ఇద్దరు నేతలు ఏకంగా ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బీసీ నినాదమందుకున్న నందీశ్వర్ నందీశ్వర్ గౌడ్ తనకు సన్నిహితులైన సీనియర్ కాంగ్రెస్ నేతలు మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్, ఎంపీ హన్మంతరావుల మీద భారం వేసి ఢిల్లీ నేతలను ఒప్పించే పనిలో పడ్డారు. ఇందుకోసం ఆయన జిల్లాలో ‘ఏకైక బీసీని’ అనే నినాదం వినిపిస్తున్నారు. మెదక్‌లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 చోట్ల అగ్రవర్ణాల వారికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందనీ, బీసీ సామాజిక వర్గం నుంచి తాను ఒక్కడినే ఉన్నందున ఈ సారి కూడా తనకే పటాన్చెరు టికెట్ ఇవ్వాలని ఢిల్లీ పెద్దలవద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ‘బీసీలకు 100 అసెంబ్లీ టికెట్లు’ అనే నినాదం ఎత్తుకున్నాయనీ, ఈ సమయంలో జిల్లాలో ఉన్న ఏకైక బీసీ ఎమ్మెల్యేనైన తనకే తిరిగి పటాన్చెరు టికెట్ ఇవ్వాలని నందీశ్వర్‌గౌడ్ ఢిల్లీ పెద్దలను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. పైగా పటాన్చెరు నియోజకవర్గంలో 2.76 లక్షల ఓట్లు ఉండగా బీసీ సామాజిక వర్గానికి 1.10 లక్షల ఓట్లు ఉన్నాయనీ, ఆ వివరాలను సైతం ఢిల్లీ పెద్దలు దిగ్విజయ్‌సింగ్, అహ్మద్పటేల్లకు అందించినట్లు తెలిసింది. డిప్యూటీ సీఎంపైనే భూపాల్ ఆశలు మరోవైపు పటాన్చెరు సీటుపైనే కన్నేసిన ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను నమ్ముకున్నారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన ఇతర మంత్రుల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవలే ఆయన తన సోదరుని కుమారుడు, మెదక్ పార్లమెంటు యూత్ కాంగ్రెస్ నాయకుడు అవినాష్‌రెడ్డిని తీసుకుని ఢిల్లీ వెళ్లారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ముందుగా భూపాల్‌రెడ్డి కోసం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అపాయింట్మెంటు తీసుకోగా...! భూపాల్‌రెడ్డి మాత్రం తన సోదరుని కొడుకు అవినాష్‌రెడ్డిని తీసుకుని వెళ్లి ఏకంగా రాహుల్‌గాంధీనే కలిసినట్లు సమాచారం. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, జిల్లాలో ఓ యువ నాయకుడుగా ఉన్న తన కుమారునికి పటాన్చెరు టికెట్ ఇవ్వాలని, లేదంటే తన పేరునైనా పరిశీలించాలని కోరుతూ రాహుల్‌గాంధీకి వినతిపత్రం సమర్పించినట్లు తెలుస్తోంది. దీనిపై రాహుల్ స్పందిస్తూ పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.