సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో అప్పుడే టికెట్ల వేట మొదలైంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే నేతలు హస్తిన బాట పడుతున్నారు. టికెట్ దక్కించుకునేందకు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ప్రారంభిం చారు. అధిష్టానం పెద్దలనే ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు. జిల్లాలోని పలు అసెంబ్లీ సీట్ల కోసం ‘సిట్టింగు’లను పక్కకు నెట్టాలని ద్వితీయ శ్రేణి నాయకులు ఎత్తులు వేస్తున్నారు.
ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతమైన పటాన్‌చెరు చుట్టూనే ‘జిల్లా కాంగ్రెస్’ రాజకీయాలు తిరుగుతున్నాయి. దీంతో సీటును కాపాడుకునే ప్రయత్నంలో పటాన్‌చెరు సిట్టింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎలాగైనా పటాన్‌చెరు టికెట్ దక్కిం చుకోవాలనే లక్ష్యంతో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ఏఐసీసీ దూత బస్వరాజ్ పాటిల్‌కు తమ అభిప్రాయాలు చెప్పిన ఈ ఇద్దరు నేతలు ఏకంగా ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
బీసీ నినాదమందుకున్న నందీశ్వర్
నందీశ్వర్ గౌడ్ తనకు సన్నిహితులైన సీనియర్ కాంగ్రెస్ నేతలు మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్, ఎంపీ హన్మంతరావుల మీద భారం వేసి ఢిల్లీ నేతలను ఒప్పించే పనిలో పడ్డారు. ఇందుకోసం ఆయన జిల్లాలో ‘ఏకైక బీసీని’ అనే నినాదం వినిపిస్తున్నారు. మెదక్‌లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 చోట్ల అగ్రవర్ణాల వారికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందనీ, బీసీ సామాజిక వర్గం నుంచి తాను ఒక్కడినే ఉన్నందున ఈ సారి కూడా తనకే పటాన్‌చెరు టికెట్ ఇవ్వాలని ఢిల్లీ పెద్దలవద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ‘బీసీలకు 100 అసెంబ్లీ టికెట్లు’ అనే నినాదం ఎత్తుకున్నాయనీ, ఈ సమయంలో జిల్లాలో ఉన్న ఏకైక బీసీ ఎమ్మెల్యేనైన తనకే తిరిగి పటాన్‌చెరు టికెట్ ఇవ్వాలని నందీశ్వర్‌గౌడ్ ఢిల్లీ పెద్దలను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. పైగా పటాన్‌చెరు నియోజకవర్గంలో 2.76 లక్షల ఓట్లు ఉండగా బీసీ సామాజిక వర్గానికి 1.10 లక్షల ఓట్లు ఉన్నాయనీ, ఆ వివరాలను సైతం ఢిల్లీ పెద్దలు దిగ్విజయ్‌సింగ్, అహ్మద్‌పటేల్‌లకు అందించినట్లు తెలిసింది.
డిప్యూటీ సీఎంపైనే భూపాల్ ఆశలు
మరోవైపు పటాన్‌చెరు సీటుపైనే కన్నేసిన ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను నమ్ముకున్నారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన ఇతర మంత్రుల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవలే ఆయన తన సోదరుని కుమారుడు, మెదక్ పార్లమెంటు యూత్ కాంగ్రెస్ నాయకుడు అవినాష్‌రెడ్డిని తీసుకుని ఢిల్లీ వెళ్లారు.
డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ముందుగా భూపాల్‌రెడ్డి కోసం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంటు తీసుకోగా...! భూపాల్‌రెడ్డి మాత్రం తన సోదరుని కొడుకు అవినాష్‌రెడ్డిని తీసుకుని వెళ్లి ఏకంగా రాహుల్‌గాంధీనే కలిసినట్లు సమాచారం. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, జిల్లాలో ఓ యువ నాయకుడుగా ఉన్న తన కుమారునికి పటాన్‌చెరు టికెట్ ఇవ్వాలని, లేదంటే తన పేరునైనా పరిశీలించాలని కోరుతూ రాహుల్‌గాంధీకి వినతిపత్రం సమర్పించినట్లు తెలుస్తోంది. దీనిపై రాహుల్ స్పందిస్తూ పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
టికెట్ల కోసం.. నేతల ఫీట్లు
Published Sat, Feb 15 2014 11:58 PM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement