baswaraj patil
-
టికెట్ల కోసం.. నేతల ఫీట్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో అప్పుడే టికెట్ల వేట మొదలైంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే నేతలు హస్తిన బాట పడుతున్నారు. టికెట్ దక్కించుకునేందకు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ప్రారంభిం చారు. అధిష్టానం పెద్దలనే ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు. జిల్లాలోని పలు అసెంబ్లీ సీట్ల కోసం ‘సిట్టింగు’లను పక్కకు నెట్టాలని ద్వితీయ శ్రేణి నాయకులు ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతమైన పటాన్చెరు చుట్టూనే ‘జిల్లా కాంగ్రెస్’ రాజకీయాలు తిరుగుతున్నాయి. దీంతో సీటును కాపాడుకునే ప్రయత్నంలో పటాన్చెరు సిట్టింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎలాగైనా పటాన్చెరు టికెట్ దక్కిం చుకోవాలనే లక్ష్యంతో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ఏఐసీసీ దూత బస్వరాజ్ పాటిల్‌కు తమ అభిప్రాయాలు చెప్పిన ఈ ఇద్దరు నేతలు ఏకంగా ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బీసీ నినాదమందుకున్న నందీశ్వర్ నందీశ్వర్ గౌడ్ తనకు సన్నిహితులైన సీనియర్ కాంగ్రెస్ నేతలు మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్, ఎంపీ హన్మంతరావుల మీద భారం వేసి ఢిల్లీ నేతలను ఒప్పించే పనిలో పడ్డారు. ఇందుకోసం ఆయన జిల్లాలో ‘ఏకైక బీసీని’ అనే నినాదం వినిపిస్తున్నారు. మెదక్‌లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 చోట్ల అగ్రవర్ణాల వారికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందనీ, బీసీ సామాజిక వర్గం నుంచి తాను ఒక్కడినే ఉన్నందున ఈ సారి కూడా తనకే పటాన్చెరు టికెట్ ఇవ్వాలని ఢిల్లీ పెద్దలవద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ‘బీసీలకు 100 అసెంబ్లీ టికెట్లు’ అనే నినాదం ఎత్తుకున్నాయనీ, ఈ సమయంలో జిల్లాలో ఉన్న ఏకైక బీసీ ఎమ్మెల్యేనైన తనకే తిరిగి పటాన్చెరు టికెట్ ఇవ్వాలని నందీశ్వర్‌గౌడ్ ఢిల్లీ పెద్దలను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. పైగా పటాన్చెరు నియోజకవర్గంలో 2.76 లక్షల ఓట్లు ఉండగా బీసీ సామాజిక వర్గానికి 1.10 లక్షల ఓట్లు ఉన్నాయనీ, ఆ వివరాలను సైతం ఢిల్లీ పెద్దలు దిగ్విజయ్‌సింగ్, అహ్మద్పటేల్లకు అందించినట్లు తెలిసింది. డిప్యూటీ సీఎంపైనే భూపాల్ ఆశలు మరోవైపు పటాన్చెరు సీటుపైనే కన్నేసిన ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను నమ్ముకున్నారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన ఇతర మంత్రుల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవలే ఆయన తన సోదరుని కుమారుడు, మెదక్ పార్లమెంటు యూత్ కాంగ్రెస్ నాయకుడు అవినాష్‌రెడ్డిని తీసుకుని ఢిల్లీ వెళ్లారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ముందుగా భూపాల్‌రెడ్డి కోసం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అపాయింట్మెంటు తీసుకోగా...! భూపాల్‌రెడ్డి మాత్రం తన సోదరుని కొడుకు అవినాష్‌రెడ్డిని తీసుకుని వెళ్లి ఏకంగా రాహుల్‌గాంధీనే కలిసినట్లు సమాచారం. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, జిల్లాలో ఓ యువ నాయకుడుగా ఉన్న తన కుమారునికి పటాన్చెరు టికెట్ ఇవ్వాలని, లేదంటే తన పేరునైనా పరిశీలించాలని కోరుతూ రాహుల్‌గాంధీకి వినతిపత్రం సమర్పించినట్లు తెలుస్తోంది. దీనిపై రాహుల్ స్పందిస్తూ పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. -
ముగిసిన ఏఐసీసీ పరిశీలన
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఏఐసీసీ పరిశీలకుల మూడు రోజుల పర్యటన ముగిసింది. చివరిరోజైన ఆదివారం ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్‌తో సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్ నియోజకవర్గాల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రి సునీతారెడ్డి, ప్రభుత్వ విప్ జయప్రకాశ్‌రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ ఏఐసీసీ పరిశీలకుడిని కలుసుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని విప్ జయప్రకాశ్‌రెడ్డి కోరగా జిల్లాలో ఏకైక బీసీ ఎమ్మెల్యే అయిన తనకు మారో మారు పటాన్చెరు నుంచి పోటీచేసేందుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కోరారు. మరోవైపు పటాన్చెరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ పరిశీలకున్ని కలిశారు. ఇదిలాఉండగా.. డిప్యూటీ సీఎం సతీమణి పద్మినీదామోదర ఏఐసీసీ పరిశీలకుడిని కలిసే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు భావించారు. అయితే పద్మినీ దామోదర కానీ, ఆమె మద్దతుదారులు కానీ ఏఐసీసీ పరిశీలకుడిని కలవలేదు. దీంతో ఆమె సంగారెడ్డి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారానికి తెరపడినట్టేనని పలువురు భావిస్తున్నారు. పార్టీ పరిస్థితి ఆరా మంత్రి సునీతారెడ్డి తన మద్దతుదారులతో ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్‌ను కలిశారు. నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు తమ నియోజకవర్గం నుంచి సునీతారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాల్సిందిగా కోరారు. మంత్రి సునీతారెడ్డితో భేటీ అయిన ఏఐసీసీ పరిశీలకులు జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి ఆరా తీసినట్టు సమాచారం. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుందని బస్వరాజ్‌పాటిల్ అడుగగా డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డికి టికెట్ ఇస్తే పార్టీకి లాభిస్తుందని మంత్రి సూచించినట్టు తెలిసింది. విప్ మద్దతుదారుల హల్చల్ విప్ జయప్రకాశ్‌రెడ్డి మద్దతుదారులు హల్చల్ చేశారు. తోపాజీ అనంతకిషన్, ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, బొంగుల రవి, గోవర్ధన్‌నాయక్, షేక్‌సాబేర్, మండల పార్టీ అధ్యక్షులతో కలిసి ఏఐసీసీ పరిశీలకుడిని కలిశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి స్థానం నుంచి జయప్రకాశ్‌రెడ్డికి మరోమారు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఇదిలా ఉంటే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజయ్య సంగారెడ్డి నుంచి టికెట్ కోరేందుకు ఏఐసీసీ పరిశీలకుడిని కలిసేందుకు ప్రభుత్వ అతిథి గృహానికి వచ్చారు. అయితే విషయం తెలుసుకున్న విప్ జయప్రకాశ్‌రెడ్డి డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డితో కలిసి రాజయ్యను కలిసినట్లు సమాచారం. విరమించుకోవాలని రాజయ్యకు నచ్చజెప్పినట్లు తెలిసింది. పటాన్చెరు టికెట్ కోసం పోటీ పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌తోపాటు పలువురు నాయకులు పరిశీలకుడిని కలిశారు. మరోమారు అవకాశం ఇవ్వాలని నందీశ్వర్‌గౌడ్ కోరగా డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డి, మరికొం దరు మద్దతుతెలిపినట్టు సమాచారం. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆదర్శ్‌రెడ్డి యూత్‌కాంగ్రెస్ కోటాలో తనకు పటాన్చెరు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరారు. కార్పొరేటర్ పుష్పనగేశ్ యాద వ్ కాంగ్రెస్ నాయకులు శంకర్‌యాదవ్, బాల్‌రెడ్డి, డోకూరి రామ్మోహన్‌రెడ్డి, బాశెట్టి అశోక్‌లు టికెట్ కోసం పోటీపడ్డారు. -
ఐదు‘గురి’కి ఓకే!
సాక్షి, సంగారెడ్డి: ఏఐసీసీ పరిశీలకులు గుడెం ఆనందరావు, బస్వరాజ్ పాటిల్ మూడు రోజుల జిల్లా పర్యటనలో విన్నపాలు వెల్లువెత్తాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీకి ఉత్సాహం చూపుతున్న ఔత్సాహికులందరూ పరిశీలకుల ముందు క్యూ కట్టి తమ మనోగతాన్ని ఆవిష్కరించారు. మద్దతుదారులతో తరలివచ్చి ప్రదర్శనకు దిగారు. అందోల్, నర్సాపూర్, సంగారెడ్డి, నారాయణ్‌ఖేడ్, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిట్టింగ్ కాంగ్రెస్ అభ్యర్థులు మినహా ఇతర నేతలెవరూ ఉత్సాహాన్ని చూపలేదు. అందోల్ , నర్సాపూర్ అసెంబ్లీ స్థానానాలకు డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, సంగారెడ్డి అసెంబ్లీ స్థానానికి ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డిల అభ్యర్థిత్వానికి పోటీయే ఎదురుకాలేదు. ఈ స్థానాల నుంచి పార్టీ తరఫున పోటీకి దిగడానికి సిట్టింగ్ అభ్యర్థులు మినహా ఇతర నేతలెవరూ ఆసక్తి చూపలేదు. పోటాపోటీ మెదక్, దుబ్బాక, పటాన్చెరు, సిద్దిపేట, జహీరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ టికెట్ కోసం నేతల మధ్య తీవ్ర పోటీ బయటపడింది. మెదక్ టికెట్ తమకే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్ రెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి సుప్రభాత్ రావులు గట్టిగా ప్రయత్నించారు. పరిశీలకుడు బస్వరాజ్ పాటిల్ ముందు శనివారం ఇరువురి మద్దతుదారులు బల ప్రదర్శనకు దిగడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. దుబ్బాక నుంచి పోటీకి సిట్టింగ్ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డితో పాటు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, పార్టీ నేతలు మనోహర్‌రావు, బండి నర్సాగౌడ్, సోమేశ్వర్ రెడ్డి తదితరులు అవకాశాన్ని కోరారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రఘునందన్ రావు సైతం పరిశీలకుడిని కలుసుకుని దుబ్బాకపై ఇష్టాన్ని వ్యక్తం చేసినట్లు చర్చజరుగుతోంది. జహీరాబాద్ అసెంబ్లీ నుంచి పోటీకి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గీతారెడ్డితో పాటు మాజీ జడ్పీ చైర్మన్ మాసనగారి బాలయ్య ఆసక్తిచూపారు. ఈ సారి స్థానికులకే సిద్దిపేట అసెంబ్లీ టికెట్ కేటాయించాలని అక్కడి నేతలు పరిశీలకుడిని కోరారు. స్థానిక నేతలు గంప నరేందర్, గూడూరి శ్రీనివాస్, చంద్రశేఖర్, తాడూరి శ్రీనివాస్‌లు ఇక్కడి నుంచి పోటీకి తమ ఆసక్తిని చూపారు. ఇక పటాన్చెరు నుంచి పోటీకి మరోసారి అవకాశం కల్పించాలని సిట్టింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కోరారు. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, రాష్ట్ర సర్పంచ్ల సంఘ నేత డోకూరి రామ్మోహన్ రెడ్డి, కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్‌లు సైతం పటాన్చెరు టికెట్ కోరిన వారిలో ఉన్నారు. విజయశాంతి దూరం ! జహీరాబాద్ లోక్‌సభ నుంచి పోటీకి స్థానిక ఎంపీ సురేష్ షెట్కార్తో పాటు మాజీ మంత్రి ఫరీదుద్దీన్, డీసీసీబీ చైర్మన్ జైపాల్ రెడ్డి ఆసక్తి చూపారు. అయితే, మెదక్ లోక్‌సభ స్థానం నుంచిపై ఎవరెవరి గురి ఉందో స్పష్టం కాలేదు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మెదక్ ఎంపీ విజయశాంతి ఏఐసీసీ పరిశీలకుడిని కలవకుండా అందరినీ అయోమయంలో పడేశారు. డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి మాత్రం పటాన్చెరు అసెంబ్లీ స్థానంతో పాటు మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీకి అవకాశాన్ని కోరారు. -
రచ్చ రచ్చ
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు తగదాలు రచ్చకెక్కాయి. రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ తమకే ఇవ్వాలంటూ ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్ ఎదుటే కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం బాహాబాహీకి దిగారు. మెదక్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి సుప్రభాతరావు మద్దతుదారులైతే ఏఐసీసీ పరిశీలకుని ఎదుటే గొడవకు దిగారు. శశిధర్‌రెడ్డి, సుప్రభాతరావు మద్దతుదారులు కూడా తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ పరస్పరం దాడులకు దిగారు. దీంతో ఏఐసీసీ పరిశీలకుడు బస చేసిన సంగారెడ్డి ప్రభుత్వ అతిథి గృహంలోని ఫర్నీచర్ ధ్వంసమైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డి గొడవకు దిగిన వారిని శాంతిపజేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పరిస్థితిని అర్థం చేసుకున్న ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్ స్వయంగా గది నుంచి బయటకు వచ్చి శశిధర్‌రెడ్డి, సుప్రభాతరావు మద్దతుదారులతో మాట్లాడి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ఏఐసీసీ పరిశీలకుడు మాట్లాడినంత సేపు శాంతంగా ఉన్న శశిధర్‌రెడ్డి, సుప్రభాతరావు మద్దతుదారులు ఆ తర్వాత నినాదాలు చేస్తూ పరస్పరం రెచ్చగొట్టుకోసాగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని ప్రభుత్వ అతిథి గృహం నుంచి బయటకు పంపించి వేశారు. ఇదిలాఉంటే దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి, దుబ్బాక నియోజకవర్గ నేత మనోహరావు మద్దతుదారుల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ దశ లో రెండువర్గాల నాయకులు గొడవకు దిగారు. వెంటనే అప్రమత్తమైన సంగారెడ్డి సీఐ శివశంకర్ గొడవకు దిగిన నాయకులను అక్కడి నుంచి పంపించివేశారు. ఈ సందర్భంలోనే సంగారెడ్డి సీఐకి ఎమ్మెల్యే ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డికి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకుముందు సంగారెడ్డికి వచ్చిన ఏఐసీసీ పరిశీలకులు బస్వరాజ్‌పాటిల్ సిద్దిపేట, మెదక్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల నాయకులతో సమావేశమయ్యారు. మెదక్ ఎంపీ అభ్యర్థులతోపాటు నాలుగు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా ఎవరిని బరిలోకి దించాలనే విషయంపై స్థానిక నేతలతో మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే నర్సారెడ్డి ఒక్కరే తన మద్దతుదారులతో కలిసి ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి మరోమారు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎంపీ స్థానానికి రాహుల్, భూపాల్‌రెడ్డి పేర్ల ప్రతిపాదన మెదక్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని బరిలో దింపాల్సిందిగా ఏఐసీసీ పరిశీలకున్ని పలువురు నాయకులు కోరారు. అయితే మెజార్టీ మంది మాత్రం డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుందని సూచించారు. మెదక్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు రాహుల్‌ను మెదక్ నుంచి పోటీ పెడితే పార్టీకి లాభిస్తుందని తెలిపారు. దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, మెదక్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పలువురు ఎంపీ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డికి టికెట్ కేటాయించాల్సిందిగా ఏఐసీసీ పరిశీలకున్ని కోరినట్లు సమాచారం. మెదక్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని చెబుతున్న ఎంపీ విజయశాంతి గురించి ఏ నాయకుడు ఏఐసీసీ పరిశీలకుని వద్ద ప్రస్తావించకపోవడం గమనార్హం. మెదక్ నేతల బలప్రదర్శన మెదక్ ఎమ్మెల్యే టి కెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి సుప్రభాతరావు ఏఐసీసీ పరిశీలకుని ఎదుట బలప్రదర్శనకు దిగారు. తమ మద్దతుదారులను పెద్ద సంఖ్యలో సంగారెడ్డికి తరలించి ఏఐసీసీ పరిశీలకుని ఎదుట ఇరువురు నేతలూ తమ సత్తా చాటే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో శశిధర్‌రెడ్డి, సుప్రభాతరావు మద్దతుదారులు బాహాబాహీకి దిగారు. శశిధర్‌రెడ్డి వర్గీయులు ఏఐసీసీ పరిశీలకున్ని కలిసి తమ నేతకు మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరగా, సుప్రభాతరావు తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తమ్ముడు ఉపేందర్‌రెడ్డి సైతం తనకు మెదక్ టికెట్ ఇవ్వాలని కోరారు. టికెట్ ఇవ్వండి... సిద్దిపేటను హస్తగతం చేస్తాం తమకు పార్టీ అవకాశం ఇస్తే సిద్దిపేటను హస్తగతం చేస్తామని సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేతలు గంప మహేందర్, గూడూరి శ్రీనివాస్, తాడూరి శ్రీనివాస్, చంద్రశేఖర్, వహీద్ఖాన్లు ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్‌ను కోరారు. ఏడుగురు నాయకులు ఎవరికివారే తమ మద్దతుదారులతో కలిసి ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు వినతి పత్రాలు అందించారు. సిద్దిపేట నాయకులు ఎంపీ అభ్యర్థిగా భూపాల్‌రెడ్డి పేరు సూచించినట్లు తెలిసింది. దుబ్బాక కోసం హేమాహేమీలు దుబ్బాక ఎమ్మెల్యే టికెట్ కోసం హేమాహేమీలు ఏఐసీసీ పరిశీలకుని ఎదుట క్యూ కట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సీనియర్ నాయకులు బండి నర్సాగౌడ్, సోమేశ్వర్రెడ్డిలు దుబ్బాక టికెట్ తమకివ్వాల్సిందిగా ఏఐసీసీ పరిశీలకుడిని కోరారు. వీరితోపాటు ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన రఘునందన్‌రావు, డీసీసీబీ ైడె రెక్టర్ గాల్‌రెడ్డి సైతం ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరారు. ముత్యంరెడ్డి పక్షాన ఆయన తనయుడు శ్రీనివాస్‌రెడ్డి ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి తన తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.