సాక్షి, సంగారెడ్డి: ఏఐసీసీ పరిశీలకులు గుడెం ఆనందరావు, బస్వరాజ్ పాటిల్ మూడు రోజుల జిల్లా పర్యటనలో విన్నపాలు వెల్లువెత్తాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీకి ఉత్సాహం చూపుతున్న ఔత్సాహికులందరూ పరిశీలకుల ముందు క్యూ కట్టి తమ మనోగతాన్ని ఆవిష్కరించారు. మద్దతుదారులతో తరలివచ్చి ప్రదర్శనకు దిగారు. అందోల్, నర్సాపూర్, సంగారెడ్డి, నారాయణ్‌ఖేడ్, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిట్టింగ్ కాంగ్రెస్ అభ్యర్థులు మినహా ఇతర నేతలెవరూ ఉత్సాహాన్ని చూపలేదు.
అందోల్ , నర్సాపూర్ అసెంబ్లీ స్థానానాలకు డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, సంగారెడ్డి అసెంబ్లీ స్థానానికి ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డిల అభ్యర్థిత్వానికి పోటీయే ఎదురుకాలేదు. ఈ స్థానాల నుంచి పార్టీ తరఫున పోటీకి దిగడానికి సిట్టింగ్ అభ్యర్థులు మినహా ఇతర నేతలెవరూ ఆసక్తి చూపలేదు.
పోటాపోటీ
మెదక్, దుబ్బాక, పటాన్‌చెరు, సిద్దిపేట, జహీరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ టికెట్ కోసం నేతల మధ్య తీవ్ర పోటీ బయటపడింది. మెదక్ టికెట్ తమకే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్ రెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి సుప్రభాత్ రావులు గట్టిగా ప్రయత్నించారు. పరిశీలకుడు బస్వరాజ్ పాటిల్ ముందు శనివారం ఇరువురి మద్దతుదారులు బల ప్రదర్శనకు దిగడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. దుబ్బాక నుంచి పోటీకి సిట్టింగ్ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డితో పాటు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, పార్టీ నేతలు మనోహర్‌రావు, బండి నర్సాగౌడ్, సోమేశ్వర్ రెడ్డి తదితరులు అవకాశాన్ని కోరారు.
ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రఘునందన్ రావు సైతం పరిశీలకుడిని కలుసుకుని దుబ్బాకపై ఇష్టాన్ని వ్యక్తం చేసినట్లు చర్చజరుగుతోంది. జహీరాబాద్ అసెంబ్లీ నుంచి పోటీకి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గీతారెడ్డితో పాటు మాజీ జడ్పీ చైర్మన్ మాసనగారి బాలయ్య ఆసక్తిచూపారు. ఈ సారి స్థానికులకే సిద్దిపేట అసెంబ్లీ టికెట్ కేటాయించాలని అక్కడి నేతలు పరిశీలకుడిని కోరారు. స్థానిక నేతలు గంప నరేందర్, గూడూరి శ్రీనివాస్, చంద్రశేఖర్, తాడూరి శ్రీనివాస్‌లు ఇక్కడి నుంచి పోటీకి తమ ఆసక్తిని చూపారు. ఇక పటాన్‌చెరు నుంచి పోటీకి మరోసారి అవకాశం కల్పించాలని సిట్టింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కోరారు. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘ నేత డోకూరి రామ్మోహన్ రెడ్డి, కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్‌లు సైతం పటాన్‌చెరు టికెట్ కోరిన వారిలో ఉన్నారు.
విజయశాంతి దూరం !
జహీరాబాద్ లోక్‌సభ నుంచి పోటీకి స్థానిక ఎంపీ సురేష్ షెట్కార్‌తో పాటు మాజీ మంత్రి ఫరీదుద్దీన్, డీసీసీబీ చైర్మన్ జైపాల్ రెడ్డి ఆసక్తి చూపారు. అయితే, మెదక్ లోక్‌సభ స్థానం నుంచిపై ఎవరెవరి గురి ఉందో స్పష్టం కాలేదు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మెదక్ ఎంపీ విజయశాంతి ఏఐసీసీ పరిశీలకుడిని కలవకుండా అందరినీ అయోమయంలో పడేశారు. డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి మాత్రం పటాన్‌చెరు అసెంబ్లీ స్థానంతో పాటు మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీకి అవకాశాన్ని కోరారు.
ఐదు‘గురి’కి ఓకే!
Published Sun, Jan 12 2014 11:17 PM | Last Updated on Fri, Aug 17 2018 6:00 PM
Advertisement
Advertisement