సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు తగదాలు రచ్చకెక్కాయి. రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ తమకే ఇవ్వాలంటూ ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్ ఎదుటే కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం బాహాబాహీకి దిగారు. మెదక్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి సుప్రభాతరావు మద్దతుదారులైతే ఏఐసీసీ పరిశీలకుని ఎదుటే గొడవకు దిగారు.
శశిధర్‌రెడ్డి, సుప్రభాతరావు మద్దతుదారులు కూడా తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ పరస్పరం దాడులకు దిగారు. దీంతో ఏఐసీసీ పరిశీలకుడు బస చేసిన సంగారెడ్డి ప్రభుత్వ అతిథి గృహంలోని ఫర్నీచర్ ధ్వంసమైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డి గొడవకు దిగిన వారిని శాంతిపజేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
పరిస్థితిని అర్థం చేసుకున్న ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్ స్వయంగా గది నుంచి బయటకు వచ్చి శశిధర్‌రెడ్డి, సుప్రభాతరావు మద్దతుదారులతో మాట్లాడి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ఏఐసీసీ పరిశీలకుడు మాట్లాడినంత సేపు శాంతంగా ఉన్న శశిధర్‌రెడ్డి, సుప్రభాతరావు మద్దతుదారులు ఆ తర్వాత నినాదాలు చేస్తూ పరస్పరం రెచ్చగొట్టుకోసాగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని ప్రభుత్వ అతిథి గృహం నుంచి బయటకు పంపించి వేశారు. ఇదిలాఉంటే దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి, దుబ్బాక నియోజకవర్గ నేత మనోహరావు మద్దతుదారుల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ దశ లో రెండువర్గాల నాయకులు గొడవకు దిగారు.
వెంటనే అప్రమత్తమైన సంగారెడ్డి సీఐ శివశంకర్ గొడవకు దిగిన నాయకులను అక్కడి నుంచి పంపించివేశారు. ఈ సందర్భంలోనే సంగారెడ్డి సీఐకి ఎమ్మెల్యే ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డికి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకుముందు సంగారెడ్డికి వచ్చిన ఏఐసీసీ పరిశీలకులు బస్వరాజ్‌పాటిల్ సిద్దిపేట, మెదక్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల నాయకులతో సమావేశమయ్యారు. మెదక్ ఎంపీ అభ్యర్థులతోపాటు నాలుగు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా ఎవరిని బరిలోకి దించాలనే విషయంపై స్థానిక నేతలతో మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే నర్సారెడ్డి ఒక్కరే తన మద్దతుదారులతో కలిసి ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి మరోమారు అవకాశం ఇవ్వాలని కోరారు.
ఎంపీ స్థానానికి రాహుల్, భూపాల్‌రెడ్డి పేర్ల ప్రతిపాదన
మెదక్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని బరిలో దింపాల్సిందిగా ఏఐసీసీ పరిశీలకున్ని పలువురు నాయకులు కోరారు. అయితే మెజార్టీ మంది మాత్రం డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుందని సూచించారు. మెదక్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు రాహుల్‌ను మెదక్ నుంచి పోటీ పెడితే పార్టీకి లాభిస్తుందని తెలిపారు.
దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, మెదక్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పలువురు ఎంపీ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డికి టికెట్ కేటాయించాల్సిందిగా ఏఐసీసీ పరిశీలకున్ని కోరినట్లు సమాచారం. మెదక్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని చెబుతున్న ఎంపీ విజయశాంతి గురించి ఏ నాయకుడు ఏఐసీసీ పరిశీలకుని వద్ద ప్రస్తావించకపోవడం గమనార్హం.
మెదక్ నేతల బలప్రదర్శన
మెదక్ ఎమ్మెల్యే టి కెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి సుప్రభాతరావు ఏఐసీసీ పరిశీలకుని ఎదుట బలప్రదర్శనకు దిగారు. తమ మద్దతుదారులను పెద్ద సంఖ్యలో సంగారెడ్డికి తరలించి ఏఐసీసీ పరిశీలకుని ఎదుట ఇరువురు నేతలూ తమ సత్తా చాటే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో శశిధర్‌రెడ్డి, సుప్రభాతరావు మద్దతుదారులు బాహాబాహీకి దిగారు. శశిధర్‌రెడ్డి వర్గీయులు ఏఐసీసీ పరిశీలకున్ని కలిసి తమ నేతకు మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరగా, సుప్రభాతరావు తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తమ్ముడు ఉపేందర్‌రెడ్డి సైతం తనకు మెదక్ టికెట్ ఇవ్వాలని కోరారు.
టికెట్ ఇవ్వండి... సిద్దిపేటను హస్తగతం చేస్తాం
తమకు పార్టీ అవకాశం ఇస్తే సిద్దిపేటను హస్తగతం చేస్తామని సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేతలు గంప మహేందర్, గూడూరి శ్రీనివాస్, తాడూరి శ్రీనివాస్, చంద్రశేఖర్, వహీద్‌ఖాన్‌లు ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్‌ను కోరారు. ఏడుగురు నాయకులు ఎవరికివారే తమ మద్దతుదారులతో కలిసి ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు వినతి పత్రాలు అందించారు. సిద్దిపేట నాయకులు ఎంపీ అభ్యర్థిగా భూపాల్‌రెడ్డి పేరు సూచించినట్లు తెలిసింది.
దుబ్బాక కోసం హేమాహేమీలు
దుబ్బాక ఎమ్మెల్యే టికెట్ కోసం హేమాహేమీలు ఏఐసీసీ పరిశీలకుని ఎదుట క్యూ కట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సీనియర్ నాయకులు బండి నర్సాగౌడ్, సోమేశ్వర్‌రెడ్డిలు దుబ్బాక టికెట్ తమకివ్వాల్సిందిగా ఏఐసీసీ పరిశీలకుడిని కోరారు. వీరితోపాటు ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన రఘునందన్‌రావు, డీసీసీబీ ైడె రెక్టర్ గాల్‌రెడ్డి సైతం ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరారు. ముత్యంరెడ్డి పక్షాన ఆయన తనయుడు శ్రీనివాస్‌రెడ్డి ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి తన తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
రచ్చ రచ్చ
Published Sun, Jan 12 2014 1:32 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement