మెదక్, న్యూస్‌లైన్ : ‘‘అది 1967వ సంవత్సరం. మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పాపన్నపేట సంస్థానాధీశులు రాజా రాంచంద్రారెడ్డి నామినేషన్ వేసేందుకు మెదక్ పయనమయ్యారు. పాపన్నపేట మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు అదే జీపులో అతనికి మద్దతుదారుగా మెదక్‌కు వచ్చారు. తీరా ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లగానే సీను మారింది. మద్దతుదారునిగా వచ్చిన వ్యక్తి జీపు దిగి నేరుగా కార్యాలయానికి వెళ్లి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. ఇది ఆనాటి కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలకు నిలువుటద్దంగా చెప్పవచ్చు.
సీన్ కట్‌చేస్తే...
ఈ నెల 14వ తేదీన మెదక్ జీకేఆర్ గార్డెన్స్‌లో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం.. రాములమ్మ తన గొంతు విప్పారు. ‘‘మెదక్ కాంగ్రెస్ నాయకుల మధ్య సఖ్యతలేదు. ఒకరితో మాట్లాడితే మరొకరికి కోపం. ఎవరివైపు చూసినా ఇబ్బందులే. కలిసి ఉంటేనే విజయం సాధిస్తాం...’’ అంటూ పరోక్షంగా గ్రూపు రాజకీయాలకు చురకలంటించారు.
మారిన రాజకీయ పరిస్థితుల్లో విజయశాంతి తన చూపును మెదక్ అసెంబ్లీ సీటుపై నిలిపారు. సాక్షాత్తు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మద్దతుతో టిక్కెట్ సాధించారు. దీంతో అదే సీటుపై నమ్మకంతో ఉన్న మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. భారీ కార్యకర్తల ర్యాలీతో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అధిష్టానం జోక్యంతో టికెట్ వివాదం టీ కప్పులో తుపాన్‌లా మిగిలింది. ఆపై బుజ్జగింపులు మొదలయ్యాయి. ఈ నెల 12న కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి శ్రవణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించారు. తిరిగి ఈ నెల 14న అదే సీను రిపీట్ అయ్యింది. ఎమ్మెల్యే అభ్యర్థి విజయశాంతి యూసుఫ్‌పేటలోని శశిధర్‌రెడ్డి ఇంటికి వెళ్లి స్వయంగా కార్యకర్తల సమావేశానికి తన కారులోనే తీసుకొచ్చారు.
అయినా ఏ మూలనో దాక్కొని ఉన్న అసంతృప్త భావనలు ముఖంలో చెప్పకనే చెప్పాయి. అదే సమయంలో కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. పాపన్నపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు విజయశాంతి వర్గీయుడైన ఓ నాయకుడిని పట్టుకుని నిలదీశారు. మాకు తెలియకుండా మండలానికొస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాగే సమావేశంలో సైతం రెండు గ్రూప్‌ల మధ్య ఉన్న విభేదాలు అంతర్లీనంగా వారి ఉపన్యాసాల్లోనే బయట పడ్డాయి. ఏ గ్రూప్‌వారు ఆ గ్రూప్ నాయకుల జపం చేస్తూ...ప్రసంగించారు. ఇలా గ్రూప్ రాజకీయాలు ఏ పరిణామానికి దారి తీస్తాయోనన్న ఆందోళన కాంగ్రెస్‌వాదుల్లో వ్యక్తమవుతోంది. అయితే రాములమ్మ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఒకప్పుడు నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి స్థానిక గ్రూప్ రాజకీయాల ప్రభావంతో స్తబ్దుగా ఉన్న నాయకులను మళ్లీ తెరపైకి తేచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల్లో సీనియర్ నాయకులందరితో రాములమ్మ ఫోన్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు కొంతమంది నియోజకవర్గస్థాయి టీడీపీ నాయకులు రెండు రోజుల్లో కాంగ్రెస్‌లోకి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా...గ్రూప్ రాజకీయాలు రాములమ్మకు తలనొప్పిగా మారాయి.
మెదక్ కాంగ్రెస్‌లో గ్రూపుల గోల
Published Wed, Apr 16 2014 6:05 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement