మెదక్, న్యూస్‌లైన్: మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకుంది. పార్టీ టిక్కెట్‌ను విజయశాంతికి ఖరారు చేస్తూ సోమవారం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.
దీంతో టికెట్‌ను ఆశించిన పట్లోళ్ల శశిధర్‌రెడ్డి గుర్రుగా ఉన్నారు. అయినా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగానే మంగళవారం నామినేషన్ వేసేందుకు ముహూర్తం నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో విజయశాంతి, శశిధర్‌రెడ్డి వర్గీయులు వేర్వేరుగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
దీంతో కొంతమంది కార్యకర్తలు శశిధర్‌రెడ్డి వైపు, మరికొంతమంది విజయశాంతి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంకొంతమంది కార్యకర్తలు మాత్రం ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడుతున్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అయిన శశిధర్‌రెడ్డి చాలా కాలంగా ఎమ్మెల్యే టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఫలితాలు వెలువడిన మరునాడే యూసుఫ్‌పేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్యకర్తలను పట్టు జారిపోకుండా చూసుకున్నారు.
ఓటమిభారం తనను కుంగదీయలేదన్న సంకేతాలను కార్యకర్తలకు పంపి, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. సుమారు ఐదేళ్లుగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి డి.కె.అరుణ, ప్రభుత్వ సహకారంతో నిధులు మంజూరు చేయించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ తనదేనన్న ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో ఎంపీ విజయశాంతి టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం, ఆపై మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఆశించడం జరిగింది. ఈమేరకు టిక్కెట్ ఆమెకే ఖరారు చేస్తూ అధిష్టానం జాబితా జారీ చేసింది.
దీంతో ఈనెల 9న నామినేషన్ వేసేందుకు కూడా ఆమె ముహూర్తం నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శశిధర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి పార్టీ టిక్కెట్‌కోసం చివరి యత్నాలు చేశారు. ఒకవేళ పార్టీ నుంచి టిక్కెట్ వచ్చినా..రాకున్నా కాంగ్రెస్ పార్టీ నుంచే నామినేషన్ వేసేందుకు నిశ్చయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన స్వగ్రామమైన యూసుఫ్‌పేటలో భారీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కార్యకర్తలంతా పోటీలో ఉండాలని సూచించడంతో మంగళవారం శ్రీరామ నవమి రోజున నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా మరోవైపు మెదక్ మండలానికి చెందిన సుమారు 12 మంది సర్పంచ్‌లు సోమవారం హైదరాబాద్‌కు తరలివెళ్లి విజయశాంతికి తమ మద్దతు ప్రకటించినట్లు తెలిసింది. మాజీ కౌన్సిలర్, జిల్లా కాంగ్రెస్ మహిళా కార్యదర్శి తోటహరిణి, డీసీసీ కార్యదర్శి తోట అశోక్, మెదక్ మాజీ ఏఎంసీ చైర్మన్ మధుసూదన్‌రావులు కూడా పార్టీ నిర్ణయించిన అభ్యర్థినే గెలిపిస్తామని ఇప్పటికే ప్రకటించారు.
మెదక్ ఎంపీగా పనిచేసి రైల్వేలైన్ మంజూరులో క్రియాశీలక పాత్ర పోషించినందున తనకు మెదక్ ప్రజలు పట్టం కడతారనే ఆశతో విజయశాంతి ఉన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ఏ ఎంపీ చేయలేని విధంగా తాను కృషి చేశానన్న ధీమాతో ఉన్నారు. పోటాపోటీగా సాగుతున్న ఎన్నికల రేసు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది.
మెదక్ కాంగ్రెస్‌లో అసమ్మతి
Published Mon, Apr 7 2014 11:30 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement