Vijaya Shanti
-
తెలంగాణ ప్రీ పోల్ సర్వేలపై విజయశాంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు స్పీడ్ పెంచారు. మరోవైపు.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే ఆదిలాబాద్ సభలో కేసీఆర్ సర్కార్ బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇక, బీజేపీ నేత విజయశాంతి కేసీఆర్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయశాంతి ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ ప్రీ పోల్ సర్వేలు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు దూరమవుతున్నట్లు తెలియచేస్తున్నవి. దోపిడీ, దుర్మార్గం, అవినీతి, నియంతృత్వంతో నడుస్తున్న ఈ కేసీఆర్ గారి అహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలోని ఈ మార్పు తప్పక అభినందనీయం. నేను నా తోటి తెలంగాణ ఉద్యమకారులం సంవత్సరాలుగా చెబుతున్న వాస్తవాలు, మా ప్రజల ఆలోచనకు, అవగాహనకు చేరుతున్నట్లు ఇప్పుడిప్పుడే అన్పిస్తున్నది’ అంటూ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రీ పోల్ సర్వేలు, రానున్న అసెంబ్లీ ఎన్నికలల్ల బీఆర్ఎస్ గెలుపుకు దూరమవుతున్నట్లు తెలియచేస్తున్నవి.. దోపిడీ, దుర్మార్గం, అవినీతి, నియంతృత్వంతో నడుస్తున్న ఈ కేసీఆర్ గారి అహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలోని ఈ మార్పు తప్పక అభినందనీయం.. నేను నా తోటి తెలంగాణ… pic.twitter.com/t7Fs9MaSJ9 — VIJAYASHANTHI (@vijayashanthi_m) October 10, 2023 మరోవైపు.. అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని అనుకూల పరిస్థితులున్నందున వీటిని ఉపయోగించుకుని విజయం సాధించాలని స్పష్టం చేశారు. విజయం దిశగా కట్టుదిట్ట మైన కార్యాచరణను, ఎన్నికల వ్యూహాలను అమలు చేయాలని రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలను ఆయన ఆదేశించారు. ప్రజల్లో కేసీఆర్ సర్కార్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతున్నందున దానిని బీజేపీకి అనుకూలంగా ఓట్లుగా మార్చేకునే దిశగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పార్టీకి, నేతలకు అవసరమైన సహాయ, సహకారాలు, తోడ్పాటును అందించేందుకు జాతీ య నాయకత్వం సిద్ధం ఉందని హామీ నిచ్చారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ ప్లాన్.. 17 రోజులు.. 41 సభలు -
పార్టీలో అసంతృప్తులు, కర్ణాటక ఓటమితో కష్టాల్లో పడిన బీజేపీ
-
ఈటల Vs విజయశాంతి: ట్విట్టర్లో పొలిటికల్ పంచాయితీ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ నేతల మధ్య మరోసారి కోల్డ్‌వార్ బహిర్గతమైంది. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ మహిళా నేత విజయశాంతి మధ్య విభేదాలు ట్విట్టర్ వేదికగా బయటకు వచ్చాయి. కొద్దిరోజులుగా ఈటలను టార్గెట్ చేసి విజయశాంతి పొలిటికల్ కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విజయశాంతి మరోసారి ఈటలపై సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో చేరికల కమిటీతో ఇప్పటి వరకు విజయాలు రాలేదని విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే దుబ్బాక, జీహెచ్ఎంసీ విజయాలు చేరికల కమిటీతో రాలేదని ట్విట్టర్లో విజయశాంతి ప్రస్తావించారు. బీజేపీని నిరంతరం గెలిపిస్తున్నది ప్రాణమిచ్చే కార్యకర్తల త్యాగాలేనని అన్నారు. బీజేపీని నమ్మే ప్రజల విశ్వాసాలు, రక్తమిచ్చే హైందవ ధర్వశ్రేణుల పోరాటాలు మాత్రమే బీజేపీని గెలిపిస్తున్నాయని తెలిపారు. నాటి ఆ దుబ్బాక, జిహెచ్ఎంసి, నిన్నటి ఎమ్మెల్సీ ఫలితాలు చేరికలతో వచ్చాయా...! చేరికల కమిటీతో వచ్చాయా..? ప్రజల విజ్ఞాన నిర్ణయంతో వచ్చాయా...! విశ్లేషించుకోవాలి.. — VIJAYASHANTHI (@vijayashanthi_m) May 30, 2023 మరోవైపు.. గతంలో అన్ని పార్టీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని, బీజేపీలో కూడా కేసీఆర్ కోవర్టులు ఉన్నారని ఈటల రాజేందర్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈటలపై విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీలో కోవర్ట్‌లు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య పొలిటికల్ పంచాయితీ ముదిరింది. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల చేతులెత్తేశారు, చిట్ చాట్ లో ఈటల చెప్పారు, చేరికలు ఇక లేవు అంటున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ..... pic.twitter.com/G8ulVzUyTf — VIJAYASHANTHI (@vijayashanthi_m) May 30, 2023 ఇక, అంతకుముందు మంత్రి హరీష్ రావు.. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల చేతులెత్తేశారు, చిట్ చాట్‌లో ఈటల చెప్పారు అని కామెంట్స్ చేశారు. దీనిపై విజయశాంతి స్పందించారు. హరీష్ కామెంట్స్‌పై ట్విట్టర్లో విజయశాంతి పొలిటికల్ కౌంటర్ ఇచ్చారు. ‘చేరికలు ఇక లేవు అంటున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు.. చేరికల కమిటీ పేరు చెబుతూ, చిట్చాట్లను ప్రస్తావిస్తూ మీరు చేస్తున్న బీజేపీ వ్యతిరేక విమర్శల ప్రచారం నిలవదు. ఇది హరీష్‌రావుకు తెలియంది కాదు’ అంటూ ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: కవిత అసలైన పెట్టుబడిదారు! -
చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ఎలాగైనా సాధించి, రాష్ట్ర ప్రజల్లో ఆ ఆనందాన్ని చూడాలన్న ప్రధాన ఆశయంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చిన్నట్లు చెప్పారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. తెలంగాణ వచ్చినా కూడా కేసీఆర్ దొర వద్ద ప్రజలు బానిసలుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇంత మంది త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికే లాభం జరిగిందని మండిపడ్డారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి 25 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్ కుటుంబానికే లాభం జరిగిందని విజయశాంతి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కమిషన్లు తీసుకున్న కేసీఆర్ కుటుంబానికి, వారి బినామీలకే లబ్ది చేకూరిందన్నారు. ప్రాజెక్టుతో ప్రజలకు నీరు మాత్రం రావడం లేదని, రైతులు నష్టపోతున్నారన్నారని అన్నారు. ఒక పనికిమాలిన ప్రాజెక్టు కట్టారని దుయ్యబట్టారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ సర్కార్ 5 లక్షల కోట్ల అప్పులుగా మార్చిందని మండిపడ్డారు.. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలడిగితే చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్‌కు లేదా? ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఎందుకు అని నిలదీశారు ‘బీఆర్ఎస్ దేనికోసం పెట్టావ్. ఎవరికోసం పెట్టావ్.. తెలంగాణ డబ్బుల్ని బీఆర్ఎస్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్.. కేసీఆర్‌లో కమిట్మెంట్ లేదు. కేసీఆర్‌పై పోరాడానికి తెలంగాణ బీజేపీ సిద్ధంగా ఉంది. కానీ మమ్మల్ని ఇబ్బందిలు పెడుతున్నారు. సభలకు, పాదయాత్రలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు తొలుత మెదక్ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేశాను. చేయాల్సిన అభివృద్ధి చేశాను. ఇప్పుడు నేను కొత్తగా పోటీ చేయాలి. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కేంద్ర డిసైడ్ చేస్తుంది. అసెంబ్లీ, పార్లమెంట్లో దేనికి పోటీ చేసేది త్వరలో తెలుస్తుంది. ఏ పార్టీలో చిన్న చిన్న గొడలు ఉంటాయి. వాటిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఒక టీం వర్క్‌లాగే ముందుకు వెళ్తున్నాం. బీజేపీ చాలా డిసిప్లెన్ పార్టీ’ అని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఆమె ఇంకేం మాట్లాడారో తెలుసుకునేందుకు ఈ కింది వీడియో చూడండి. -
బీజేపీలో హాట్‌టాపిక్.. రాజాసింగ్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన విజయశాంతి!
రాజాసింగ్ ఫైర్ బ్రాండ్ నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఏం మాట్లాడినా సంచలనం, వివాదాస్పదమే. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతోనే బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. తర్వాత జైలు పాలయ్యారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ నాయకులు కక్కలేక.. మింగలేక ఇబ్బందిపడుతున్నారు. రాములమ్మ మాత్రం భిన్నంగా రియాక్టయ్యారు. ఇంతకీ ఆమె ఏమన్నారు?.. కక్కలేక మింగలేక కమలం.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో ఏమి చేయాలో అర్థంకాక, కేడర్‌ను సముదాయించలేక తెలంగాణ బీజేపీ నేతలు సతమతం అవుతున్నారు. మహమ్మద్ ప్రవక్త మీద రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా స్పందించింది. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై అప్పటివరకు నమోదైన కేసులను పరిగణలోకి తీసుకుంటూ పీడీ యాక్ట్ పెట్టి.. చర్లపల్లి జైలుకు పంపింది. ప్రస్తుతం రాజాసింగ్ జైలులో ఉన్నారు. సస్పెన్షన్ తొలగించే విషయంలో బీజేపీ హై కమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎప్పుడొస్తారు సర్..? రాజాసింగ్ జైలుకు వెళ్లి నెల రోజులు అవుతుంది. జైలు నుండి ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి. రాజాసింగ్ జైల్లో ఉండటంపై బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు, హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడా నిరసనలు, బందులు కూడా జరుగుతున్నాయి. ఈ ఘటనలన్నీ రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. రాజాసింగ్‌ను బీజేపీ నుండి సస్పెండ్ చేసినా కార్యకర్తలు మాత్రం బ్యానర్లు, ఫ్లెక్సీలపైన ఆయన ఫొటోలను తీసివేయడం లేదు. బండి సంజయ్ సంగ్రామ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల మీద కూడా రాజాసింగ్ ఫొటోలు దర్శనమిచ్చాయి. టైగర్ ఎక్కడ..? పార్టీ హై కమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్థానిక శ్రేణులు పెద్దగా పట్టించుకోవడంలేదు. వారం క్రితం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు రాజాసింగ్‌ను విడుదల చేయాలంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. పార్టీ సస్పెండ్ చేసినా కార్పొరేటర్లు మాత్రం ఆయనకు మద్దతుగా కౌన్సిల్ మీటింగ్‌లో తమ అభిమానం చాటుకున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ కార్యకర్తలు, పార్టీ నేతలు మాట్లాడుతున్నప్పుడు ఆటంకం కల్పించారు. టైగర్ రాజా సింగ్ ఎక్కడ అని ప్లకార్డ్స్ ప్రదర్శించారు. స్లోగన్స్ ఇచ్చారు. దీంతో బండి సంజయ్ జోక్యం చేసుకొని వారిని సముదాయించారు. బండి సంజయ్ ఎక్కడా కూడా రాజాసింగ్ పేరును ప్రస్తావించలేదు. పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఆయన పేరు చెబుతూ మాట్లాడలేరు. రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి జైలులో వేసినా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. పార్టీ బ్యానర్ మీద ఆందోళన చేయలేని స్థితి. అలాగని పార్టీ రాజాసింగ్‌ను సస్పెండ్ చేసింది కాబట్టి ఆయన కోసం ఏమీ చేయలేమని కేడర్‌కు చెప్పలేని సంకట పరిస్థితి. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మాత్రం రాజాసింగ్‌కు మద్దతుగా ఒక ప్రకటన విడుదల చేయడం కలకలం రేపుతోంది. పార్టీ రాష్ట్ర నేతలు రాజాసింగ్ పేరును ప్రస్తావించకుండా సపోర్ట్ చేస్తుండగా.. విజయశాంతి పార్టీ లైన్ దాటి నేరుగా రాజాసింగ్‌ను సపోర్ట్ చేస్తూ ప్రకటన విడుదల చేయడంపై పార్టీలో చర్చ సాగుతోంది. మొత్తం మీద రాజాసింగ్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. రాజాసింగ్‌ను దూరం చేసుకోలేరు. అలాగని హైకమాండ్ ఆదేశాలను అతిక్రమించలేరు. -
లక్ష్మణ్ వచ్చి మాట్లాడి వెళ్లిపోయారు, నాకేమీ అర్థంకాలేదు: విజయశాంతి
-
పోర్టల్ ప్రక్షాళనతోనే పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి, రెవెన్యూ, ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. తప్పులతడకగా మారిన ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేయకపోతే ప్రజలు పెద్దఎత్తున నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ‘రెవెన్యూ చట్టాలు– ధరణిలో లోపాలు’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. దీనికి హాజరైన మాజీ సైనికాధికారులు, స్వాతంత్య్ర సమ రయోధులు, భూబాధితుల సంఘం నాయకులు, పలువురు సాంకేతిక నిపుణులు మాట్లాడుతూ ధరణి లోపాల గురించి వివరించారు. అసైన్డ్ భూముల శాశ్వత హక్కుల సాధన సంఘం నేతలు గుమ్మి రాజ్‌కుమార్‌రెడ్డి, మన్నె నర్సింహారెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఉన్న 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను 14 లక్షల పేద రైతు కుటుంబాలు సా గు చేసుకుంటున్నాయి. వీటిపై ఆ రైతులకు శాశ్వత హక్కులు కల్పించాలి’అని అన్నారు. సీనియర్ అడ్వొకేట్ గోపాల్ శర్మ మాట్లాడుతూ రెవెన్యూచటాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, దీనిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు కూడా తగిన అధికారాలు లేవన్నారు. ధరణి వల్ల ఇబ్బందులు పడుతున్న రైతులు మాట్లాడుతూ ‘అమ్మిన భూములకు పాత యజమానుల పేర్లే ధరణిలో కన్పిస్తున్నాయి. ప్రతి కలెక్టరేట్లలో నిర్వహించే గ్రీవెన్స్ సెల్లో 80 శాతం దరఖాస్తులు ధరణి లోపాలపైనే కావడం సిగ్గు చేటు’అని అన్నారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ రాంగోపాల్ మాట్లాడుతూ గ్రామ పరిపాలనకు సమాధి కడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. సీఎం మాటలకు, చేతలకు పొంతన లేదు: బండి ‘ధరణి పోర్టల్ ప్రారంభమై రెండేళ్లైనా సమస్యలు పరిష్కారంకాలేదు. దీనిపై సీఎం మాటలకు, చేతలకూ పొంతన లేదు’అని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్ సమస్యలపై 5 లక్షల దరఖాస్తులు వచ్చాయంటే, సమస్య తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ‘ధరణి పోర్టల్ పెట్టింది, ప్రజాసమస్యల పరిష్కారానికా, వేలకోట్ల విలువైన భూములను దండు కోవడానికా’అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉం టే, ధరణి బాధ్యతలను పేరుగాంచిన సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. -
వినాయకుడికి కిషన్ రెడ్డి, విజయశాంతి ప్రత్యేక పూజలు
-
జయలలిత జయంతి: విజయశాంతి భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: ‘‘అమ్మా... మీరెక్కడో రాజకుమార్తెగా మళ్ళీ జన్మించే ఉంటారు. అయినప్పటికీ మాకందరికీ తెలిసిన రోజుగా మీకివే పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు పంచిన స్నేహం, అభిమానం, ఆప్యాయత నాకు జీవితకాలపు కానుకలుగా... తీపి గుర్తులుగా ఎప్పటికీ అలాగే ఉంటాయి. మత తీవ్రవాదుల హిట్ లిస్టులో నేను టార్గెట్ అయినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు మీరు నా భద్రత కోసం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ... ఇంకా... పురట్చి తలైవియిన్ అన్బు తంగై (విప్లవ నాయకి జయలలితకు ప్రియమైన చెల్లెలు).... ప్రచార బీరంగి (ప్రచారంలో ఫిరంగి) అంటూ మీరు నాకిచ్చిన గౌరవప్రదమైన పిలుపులు ఈ జన్మంతా జ్ఞాపకాలుగా మిగిలే ఉంటాయి. ఎప్పటికీ...’’ అంటూ సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి ఉద్వేగానికి లోనయ్యారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ‘అమ్మ’ జయలలిత 73వ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు షేర్ చేశారు. ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. అమ్మగా చెరగని ముద్ర వేసిన తలైవి మైసూరు రాష్ట్రంలో 24 ఫిబ్రవరి 1948లో జయరాం- వేదవల్లి(సంధ్య) దంపతులకు జన్మించిన జయలలిత, చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేశారు. నటిగా శిఖరాగ్రాలకు చేరుకున్న ఆమె, ఎంజీ రామచంద్రన్ ఆహ్వానం మేరకు 1982లో రాజకీయాల్లో ప్రవేశించారు. విద్యావంతురాలిగా, న్యత్యకారిణిగా, గొప్ప వక్తగా తనదైన ముద్ర వేసిన జయలలిత.. ఏఐఏడీఎంకేలో ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, రాజ్యసభలో అడుగుపెట్టారు. ఎంజీఆర్ మరణానంతరం ఎన్నో అవమానాలకు గురైన ఆమె ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ.. ధీటుగా ముందుకు సాగారు. 38 ఏళ్ల వయసులో రాష్ట్ర శాసనసభలో తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా చరిత్రకెక్కారు. ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పురుషాధిక్య రంగంలో నెగ్గుకువచ్చి ఆరు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ప్రజల గుండెల్లో ‘అమ్మ’గా చెరగని ముద్ర వేసుకున్నారు. పురుచ్చి తలైవిగా నీరాజనాలు అందుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు జీవితం అనుభవించిన ఆమె, 2016 డిసెంబరు 5న తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌తో అనుబంధం తమిళనాడు దివంగత సీఎం జయలలితకు భాగ్యనగరంతో విడదీయరాని అనుబంధం ఉంది. నటీమణిగా వెలుగొందుతున్న సమయంలో తరచుగా ఇక్కడకు వచ్చేవారట. షూటింగ్ నిమిత్తం ఇక్కడే బస చేసేవారట. ఈక్రమంలో శ్రీనగర్ కాలనీలో జయలలిత రెండు ఇళ్లు కొనుగోలు చేశారు. ఇక తెలుగు నటీనటులతోనూ ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉండేదట. -
కేసీఆర్ నాకన్నా పెద్ద నటుడు: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీలో చేరిక అనంతరం తొలిసారి హైదరాబాద్ చేరుకున్న విజయశాంతికి ఘన స్వాగతం లభించింది. ఆమె గురువారం మొదటిసారి పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ 2023లో కేసీఆర్‌ను గద్దె దించడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ధీటుగా నిలబడేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (కాంగ్రెస్ పార్టీకి విజయశాంతి గుడ్‌బై!) ‘జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. నేను అప్పట్లో బీజేపీలో ఉండే తెలంగాణ కోసం పోరాడాను. కొన్ని కారణాల వల్ల భారతీయ జనతా పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. నేను 1998 జనవరి 26న బీజేపీలో చేరాను. ఆ తర్వాత తెలంగాణ కోసం నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను... పోరాడాను. అయితే కొన్ని కారణాల వల్ల నేను ఆ రోజు బీజేపీని వీడాను. కొన్ని పార్టీలు తెలంగాణ రావడానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ కారణంగానే పార్టీ బయటకు నుంచి వచ్చేశాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2005 తర్వాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి, అనేక సమస్యలపై పోరాటాలు చేశాను. ఆ తర్వాత టీఆర్ఎస్ పుట్టుకొచ్చింది. టీఆర్ఎస్కు ఎదురు ఉండకూడదని కేసీఆర్ భావించారు. ఉద్యమాలు చేసినవారిని ఆయన ఇబ్బంది పెట్టారు. ఒక దశలో అయితే కేసీఆర్ తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేయాలని ఒత్తిడి తెచ్చారు. అందుకోసం చాలామందిని నాతో చర్చలకు పంపారు. పార్టీని విలీనం చేయాలని ఇష్టం లేకున్నా.. పరిస్థితులను బట్టి పార్టీని విలీనం చేయాల్సి వచ్చింది. (కాంగ్రెస్‌కు కేసీఆర్ స్లో పాయిజన్ ఎక్కించారు) టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఎంపీగా గెలిచాను. ఆ తర్వాత పార్లమెంట్లో రాష్ట్ర సాధన కోసం కొట్లాడాం. 2013లో నన్ను టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారు. అదంతా ప్రీ ప్లాన్డ్‌గానే చేశారు. తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు కూడా పార్లమెంట్లో లేరు. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ తన కుటుంబంతో సోనియా గాంధీ కాళ్లమీద పడ్డారు. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ పార్టీ ఎదురు ఉండకూడదనే ఉద్దేశంతో టార్గెట్ చేశారు. నా కన్నా గొప్ప నటుడు కేసీఆర్. తనకన్నా బలమైన నేతలెవరూ ఉండకూడదనేది ఆయన ఆలోచన. కేసీఆర్‌లా మాట మార్చడం నాకు రాదు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మోసం చేసిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది చనిపోయారు. వాళ్ల శవాల మీద కూర్చొని కేసీఆర్ పరిపాలిస్తున్నారు. కేసీఆర్ ఎన్నడూ తెలంగాణ ప్రజలను ప్రేమించలేదు. ఆయనకు డబ్బులే ముఖ్యం. ఏం చేసుకుంటారు దొర డబ్బుని. ఎల్లకాలం అబద్ధాలతో మోసం చేయలేరు. తెలంగాణ ప్రజల్లోనూ మార్పు వస్తోంది. కేసీఆర్‌కు దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపి, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి’ అని విజయశాంతి పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్‌కు కేసీఆర్ స్లో పాయిజన్ ఎక్కించారు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయమని సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. కేవలం తన కుటుంబం మాత్రమే బాగుపడాలనే స్వార్థం ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును గద్దె దింపేది తామేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయశాంతి సోమవారం బీజేపీలో చేరారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ.. ‘‘1998లో బీజేపీలో చేరాను. కొందరు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని 2005లో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చాను. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి అనేక సమస్యలపై పోరాటం చేశాను. అప్పుడు నా పార్టీనీ టీఆర్ఎస్లో విలీనం చేయమని అడిగారు. నిజానికి నేను 1998లోనే తెలంగాణ పోరాటం మొదలు పెట్టాను. టీఆర్ఎస్ కంటే ముందు నేను తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యాను. కేసీఆర్ కుట్రతోనే టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు’’ అని రాములమ్మ చెప్పుకొచ్చారు. ఇక టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీరును ప్రస్తావిస్తూ.. ‘‘ తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ పార్లమెంట్లో లేరు. ఆయన సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణలో తన కుటుంబం మాత్రమే ఎదగాలనే స్వార్థం కేసీఆర్‌ది. కాంగ్రెస్ పార్టీ అసలు సమస్యలపై పోరాటం చేయడం లేదు. కాంగ్రెస్‌కు ఆయన స్లో పాయిజన్ ఎక్కించారు. కాంగ్రెస్ పోరాడలేని స్థితికి చేరుకుంది. ఏడాది కిందటే బీజేపీలో చేరాలని అనుకున్నా.కేసీఆర్‌ను గద్దె దించడమే నా లక్ష్యం.పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తా. తెలంగాణ ప్రజలు బాగు పడడమే నాకు కావాలి. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమే’’ అని విజయశాంతి పేర్కొన్నారు. కాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కె.లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (చదవండి: ‘తెలంగాణలో దూకుడు పెంచండి’) -
‘తెలంగాణలో దూకుడు పెంచండి’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు దూకుడు పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపిన పంథానే ఇకముందు కూడా కొనసాగించాలన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి , సీనియర్ నేత వివేక్ వెంకట్‌స్వామి, మాజీ ఎంపీ, ప్రముఖ నటి విజయశాంతిలతో కలసి ఆదివారమిక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమిత్‌షాతో భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను ఆయనకు వివరించారు. ఓట్ల శాతంతోపాటు సీట్ల సంఖ్య కూడా పెరిగిందని చెప్పారు. దుబ్బాక ఫలితం అనంతరం జీహెచ్ఎంసీ ఫలితాలు కూడా సానుకూలంగా రావడంతో నేతలు, కార్యకర్తలందరినీ అమిత్ షా అభినందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి బీజేపీలో చేరుతున్న విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విజయశాంతి సోమవారం ఉదయం 11 గంటలకు బీజేపీ సభ్యత్వం తీసుకోనున్నారు. అదేరోజు సాయంత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కండువా కప్పి విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఉద్యమకారులను కేసీఆర్ విస్మరించారు: సంజయ్ అమిత్‌షాతో సమావేశం అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల్లో చేరిన విజయశాంతి మళ్లీ ఇప్పుడు మాతృసంస్థకు రావడం సంతోషం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలైన తెలంగాణ ఉద్యమకారులను సీఎం కేసీఆర్ విస్మరించారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం బీజేపీ చేస్తున్న పోరాటాన్ని ఉద్యమకారులు గుర్తించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏ ఎన్నికలైనా ఒకే తరహా పోరాటం చేస్తాం. గెలుపోటములను సమంగా స్వీకరిస్తాం’ అని సంజయ్ తెలిపారు. బీజేపీలో చేరనున్న మహిళా పైలెట్ తెలంగాణ గిరిజన మహిళాపైలట్ అజ్మీరా బాబీ బీజేపీలో చేరనున్నారు. ఆదివారం అమిత్‌షాను కలసిన సంజయ్ బృందంలో ఆమె కూడా ఉన్నారు. సోమవారం ఉదయం విజయశాంతితోపాటు అజ్మీరా కూడా పార్టీలో చేరననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్ పార్టీకి విజయశాంతి గుడ్‌బై!
సాక్షి, న్యూఢిల్లీ : టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్, మాజీ ఎంపీ, నటి విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం అందింది. కాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆమె ఆదివారం రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. కాగా నేడు సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్న విజయశాంతి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.వాస్తవానికి విజయశాంతి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చాలాకాలంగా స్తబ్దుగా ఉంటున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అధిష్టానం అప్పగించినా రాష్ట్ర నాయకత్వం సహకరించకపోవడంతో ఆమె అసంతృప్తి చెందారు. దీంతో ఆమె కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనలేకపోవడమే కాకుండా పార్టీ సమావేశాలకు కూడా డుమ్మా కొట్టారు. ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్యం ఠాగూర్ తొలిసారి రాష్ట్రానికి వచ్చినప్పుడు జరిగిన సమావేశాలకు విజయశాంతిని ఆహ్వానించినా వెళ్లకుండా తన ఉద్దేశాన్ని ఢిల్లీ పెద్దలకు తెలిపారు. ఇక, దుబ్బాక ఎన్నికల వ్యవహారంలో ఆమెను పార్టీ కానీ, పార్టీని ఆమె కానీ పట్టించుకోలేదు. రాష్ట్ర నాయకత్వం కూడా విజయశాంతి వస్తే స్వాగతిస్తామని, పార్టీ కార్యకలాపాలకు ప్రత్యేక ఆహ్వానాలు ఉండవనే ధోరణిలోనే వ్యవహరిస్తోంది. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులకు, విజయశాంతికి మధ్య రాజకీయదూరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా విజయశాంతి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. దీంతో ఆమె మళ్లీ పాత గూటికే చేరుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆమెను కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించినా... పార్టీ వ్యవహారశైలి పట్ల అసంతృప్తి ఉన్నా విజయశాంతి చివరికి హస్తం వీడేందుకే సిద్ధపడ్డారు. బీజేపీ పెద్దలు కూడా ఆమె రాకను స్వాగతించడంతో విజయశాంతి హస్తానికి హ్యాండ్ ఇచ్చి కమలానికి జై కొట్టారు. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులకు, విజయశాంతికి మధ్య రాజకీయదూరం పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా విజయశాంతి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. దీంతో ఆమె మళ్లీ పాత గూటికే చేరుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆమెను కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించినా... పార్టీ వ్యవహారశైలి పట్ల అసంతృప్తి ఉన్నా విజయశాంతి చివరికి హస్తం వీడేందుకే సిద్ధపడ్డారు. బీజేపీ పెద్దలు కూడా ఆమె రాకను స్వాగతించడంతో విజయశాంతి హస్తానికి హ్యాండ్ ఇచ్చి కమలానికి జై కొట్టనున్నారు. -
నేను తీసుకున్న మంచి నిర్ణయం సరిలేరు నీకెవ్వరు చేయటమే
‘‘నా కెరీర్లో నేను తీసుకున్న మంచి నిర్ణయం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేయటమే. 20 ఏళ్ల కెరీర్లో ఇంత అద్భుతమైన స్పందనను నేనెప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాన్న అభిమానులు, నా అభిమానుల తరఫున దర్శకుడు అనిల్‌కి థ్యాంక్స్’’ అన్నారు మహేశ్‌బాబు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న విడుదలైన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేశ్‌బాబు, రష్మిక జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్‌బాబు కూడా ఓ నిర్మాతగా వ్యవహరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటించారు. ‘బ్లాక్‌బస్టర్ కా బాప్’ పేరుతో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా 100 కోట్ల షేర్ పోస్టర్‌ను చిత్రం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఎన్నో మంచి డైలాగులు రాశారు. కానీ, ‘రమణా.. లోడెత్తాలిరా’ అనే డైలాగ్ మాత్రం బీభత్సంగా పేలింది. కథ వినగానే దేవిశ్రీ ప్రసాద్ మాస్ సాంగ్ చేయటానికి మంచి అవకాశం ఉందని ముందే చెప్పారు. అలా వచ్చిందే ‘మైండ్ బ్లాంక్’ సాంగ్. ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో విజయశాంతి గారితో నటించాను. ఆ సినిమా పెద్ద హిట్. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ సంక్రాంతిని ఎప్పటికీ మరచిపోను. నాలుగైదేళ్లుగా నా అభిమానులు, ప్రేక్షకులు కొత్త మహేశ్‌ను కోరుకుంటున్నారు. అది ఈ సినిమాతో సాధ్యం చేసిన నిర్మాత అనిల్ సుంకరగారికి థ్యాంక్స్’’ అన్నారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని ‘బ్లాక్‌బస్టర్ కా బాప్‌గా నిలిపిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను. సైనికుల తల్లిదండ్రుల బాధ ఏంటో అనిల్ ఈ చిత్రంలో సందేశాత్మకంగా చూపించారు. మహేశ్‌బాబుతో పని చేయటం కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో చేసిన భారతి పాత్ర నా కెరీర్‌కి ఎంతో ప్రత్యేకం. రాములక్కా.. మళ్లీ సినిమాలు చేయండి అని అడుగుతున్నారు. ఈ రాములక్క సినిమా చేయాలంటే సబ్జెక్ట్ బాగుండాలి, పాత్ర దద్దరిల్లాలి’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్లో అన్నాను... మహేశ్ సార్ నా సినిమా వల్ల మీ ముఖంలో నవ్వురావాలి, మిమ్మల్ని ఆనందంగా చూడాలి అని. సినిమా విడుదలైన రోజు నుండి నేను ఆయనతోనే ఉంటున్నాను. ఆయన ఎంతో సంతోషంగా ఉంటున్నారు. బాబు బ్యాటింగ్ మొదలయ్యింది, ఫస్ట్ వీక్ 100 కోట్లు కలెక్ట్ చేసింది’’ అన్నారు. ‘‘మహేశ్‌తో ఇలాంటి జోనర్లో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నా. ఎవరూ ఊహించని విధంగా ఆయన నటన ఉంది. అనిల్ రావిపూడికి థ్యాంక్స్’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, యం.ఎల్.ఏ వినయ్ భాస్కర్, వరంగల్ సీపీ రవీందర్‌తో పాటు నటుడు రాజేంద్రప్రసాద్, నిర్మాతలు ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, దర్శకులు వంశీ పైడిపల్లి, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్ బృందం..
సరిలేరు నీకెవ్వరు చిత్రం విజయవంతం కావడంతో చిత్రబృందం మంచి జోష్‌లో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు చిత్ర బృందం గురువారం తిరుమల వెళ్లింది. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానశ్రయం చేరుకున్న చిత్రబృందంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అక్కడి నుంచి వారు రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లారు. తిరుమల వెళ్లినవారిలో మహేశ్ బాబు, నమ్రత, వారి పిల్లలు, విజయశాంతి, దిల్ రాజు, అనిల్ రావిపూడి, రాజేంద్రప్రసాద్, అనిల్ సుంకర, వంశీ పైడిపల్లి ఉన్నారు. రేపు వేకువజామున సరిలేరు నీకెవ్వరు చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. -
పండగ తెచ్చారు
ఈ దీపావళికి సినిమా అభిమానుల మనసుకి సంతోషమనే వెలుగును అందించింది టాలీవుడ్. కొత్త సినిమా ప్రకటనలు, చిత్రీకరణ విశేషాలు, కొత్త పోస్టర్స్‌తో దీపావళి సంబరాలను డబుల్ చేసింది. బాలకృష్ణ హీరోగా కేఎస్. రవికుమార్ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు బాలకృష్ణ. సి. కల్యాణ్, సి.వి. రావ్, పత్సా నాగరాజు నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబరు 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆర్మీ మేజర్ అజయ్‌కృష్ణ పాత్రలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దాదాపు పదమూడేళ్ల తర్వాత ఈ సినిమాలో నటిస్తున్నారు విజయశాంతి. దీపావళి సందర్భంగా ఈ సినిమాలోని మహేశ్ కొత్త పోస్టర్‌తో పాటు, విజయశాంతి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ‘అల.. వైకుంఠపురమలో..’ని ‘రాములో రాములా’ పాట టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. తమన్ స్వరకర్త. ‘రాములో రాములా’ పూర్తి పాటను విడుదల చేశారు. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వెంకీమామ’. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మాతలు. ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఖాకీ తొడిగి, లాఠీ పట్టి మరోసారి పోలీసాఫీసర్‌గా డ్యూటీ చేయనున్నారు రవితేజ. పూజా హెగ్డే, అల్లు అర్జున్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హీరోగా తన కొత్త సినిమా మొదలుకానున్నట్లు ప్రకటించారు రవితేజ. బి. మధు నిర్మించనున్నారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’. ‘‘టైటిల్‌ని బట్టి ఇది రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య జరిగే ఇతివృత్తం అనుకుంటారు కానీ, ఈ చిత్రకథాంశం అది కాదు. ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేసి, సినిమాను నవంబర్‌లో విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న ‘ఎంతమంచి వాడవురా’ సినిమా చిత్రీకరణ ఈ నెల 31 నుంచి నవంబరు 10వరకు కేరళలో జరగనుంది. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాలో ఓ దృశ్యం శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 15న విడుదల కానుంది. సాయితేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్కేఎన్ సహ–నిర్మాత. డిసెంబరు 20న విడుదల కానుంది. ఆది పినిశెట్టి నటిస్తున్న చిత్రం ‘క్లాప్’. పృథ్వీ ఆదిత్య దర్శకుడు. ఐబీ కార్తికేయన్ నిర్మాత. పి. ప్రభాప్రేమ్, మనోజ్, హర్ష సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కల్యాణ్‌రామ్, మెహరీన్ నిఖిల్ హీరోగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్‌కుమార్ అకెళ్ల నిర్మాణంలో టి. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 29న విడుదల కానుంది. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న ‘సూపర్ మచ్చి’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పులివాసు దర్శకుడు. నవీన్‌చంద్ర హీరోగా జి కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ‘హీరో హీరోయిన్’ కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఈ దీపావళి పండగ ఇంకా చాలా పోస్టర్లను మోసుకొచ్చింది. బోలెడన్ని విశేషాలను తెచ్చింది. -
మెదక్‌లో హస్తం.. నిస్తేజం
మెతుకుసీమలో ఓ వెలుగు వెలిగిన ‘హస్తం’.. నిస్తేజంగా మారింది. దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ జిల్లాలో ఉనికిని కోల్పోయింది. ఇప్పటికే బడా నేతలు జంప్ కాగా.. ఆ పార్టీలో కొన్నాళ్లుగా స్తబ్ధత రాజ్యమేలుతోంది. తాజాగా కాంగ్రెస్ ఎన్నికల క్యాంపెయినింగ్ కమిటీ చైర్పర్సన్, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి.. బీజేపీవైపు చూస్తున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో మిగిలిన చోటామోటా నాయకులు ఊగిసలాటలో కొట్టుమిట్టాడుతుండగా.. ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. సాక్షి, మెదక్: కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా నిలిచి.. ఇందిరాగాంధీని ఎంపీగా గెలిపించి.. దేశానికి ప్రధానమంత్రిని అందించిన ఘన చరిత్ర మెదక్‌కు ఉంది. అలాంటి ఈ జిల్లాలో మారిన రాజకీయ పరిణామ క్రమంలో ఆ పార్టీ ప్రాబవం పూర్తిగా కోల్పోయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం టీఆర్ఎస్ హవాలో ఆ పార్టీ పరిస్థితులు తలకిందులయ్యాయి. క్రమక్రమంగా నేతలు జారిపోవడంతో కోలుకోలేని స్థితికి చేరింది. ప్రధానంగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలుకాగా.. అప్పటి నుంచి పార్టీలో స్తబ్ధత నెలకొంది. కాంగ్రెస్‌లో ఉన్న నాయకుల్లోనూ పార్టీ కోసం పనిచేయాలనే తపన కొరవడడంతో ఈ దుస్థితి దాపురించినట్లు తెలుస్తోంది. తాజాగా.. కాంగ్రెస్‌లో మళ్లీ కలకలం మొదలైంది. మెదక్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ ఎన్నికల క్యాంపెయినింగ్ కమిటీ చైర్పర్సన్, సినీ స్టార్ విజయశాంతి బీజేపీలో చేరనున్నట్లు ఇటీవల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆమె అనుచరులు అన్నీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒక్కొక్కరుగా వెళ్లిపోవడంతో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘హస్తం’ హయాంలో మంత్రిగా పనిచేసిన సునీత లక్ష్మారెడ్డి గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మెదక్ ఎమ్మెల్యేగా గతంలో గెలిచిన శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి జిల్లాలో కీరోల్ నిర్వరించారు. అనంతర పరిణామ క్రమంలో ఆయన బీజేపీలో చేరారు. జిల్లాలో ఉన్న ఇద్దరు సీనియర్ నాయకులు ఇతర పార్టీల్లో చేరడంతో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా బలహీనపడింది. ఉన్న వారు పట్టించుకోకపోవడంతో.. గత ఏడాది అసెంబ్లీ పోరు తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో దిగారు. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత అతను ఒక్కసారి కూడా మెదక్ జిల్లాను తొంగి చూసింది లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన పట్లోళ్ల ఉపేందర్‌రెడ్డి కూడా ఇప్పటివరకు పార్టీకి దూరంగా ఉన్నారు. ఇలా పార్టీలో ఉన్న వారు సైతం అందుబాటులో ఉండకపోవడంతో ముఖ్య నాయకులు, కార్యకర్తల్లో మనోధైర్యం కొరవడింది. విజయశాంతి అసంతృప్తి. ఊగిసలాటలో నాయకులు? మెదక్‌లో ఎంపీగా గెలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విజయశాంతి కాంగ్రెస్‌లో తగిన గుర్తింపు దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నట్లు.. త్వరలో ఆమె బీజేపీలో చేరుతున్నట్లు ఇటీవల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి చివరి వరకు ప్రయత్నం చేసి విఫలమైన ఓ నాయకుడు, విజయశాంతి ముఖ్య అనుచరుడు ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా బేరీజు వేస్తున్నట్లు సమాచారం. ఇదివరకే శశిధర్‌రెడ్డి బీజేపీలో పాగా వేసిన నేపథ్యంలో తన పరిస్థితి ఏమిటన్న మీమాంసలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు మిగిలిన విజయశాంతి ముఖ్య అనుచరులు, చోటామోటా నాయకులు సైతం ఊగిసలాటలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల ఆర్టీసీ సమ్మె సందర్భంగా కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీకి చెందిన నేతలు ఇద్దరు, ముగ్గురు తప్ప ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొనకపోవడం ఇందుకు నిదర్శనమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యంతోపాటు ఆందోళన నెలకొంది. ఏదేమైనా ఫైర్‌బ్రాండ్ విజయశాంతి బీజేపీలో చేరుతారా.. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఏమిటో వేచిచూడాల్సిందే. -
రాజకీయాల్లోకి మహేష్ బాబు?
భరత్ అనే నేను సినిమాలో యంగ్ సీఎంగా అదరగొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడా..? హీరోగా తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌ను సాధించిన సూపర్ స్టార్ పాలిటిక్స్‌లోనూ సత్తా చూపేందుకు రెడీ అవుతున్నారా..? ప్రస్తుతం జాతీయ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. మహేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా.. మహేష్ త్వరలో రాజకీయ ప్రవేశం చేయనున్నారని! వార్తలు మీడియా సర్కిల్స్‌లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారం కొత్తదేమీ కాదు. గతంలోనూ మహేష్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరగింది. అప్పట్లో ఈ వార్తలపై స్పదించిన మహేష్ వాటిని కొట్టిపారేశారు. ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని, తాను నటన తప్ప వేరే ఏది చేయనని కుండ బద్దలు కొట్టేశారు. అదే సమయంలో ఓ ఇంటర్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ ‘చిన్నప్పటినుంచే నాకు నటన అంటే ఇష్టం.. షూటింగ్ కోసం స్కూల్ ఎగ్గోట్టేవాడిని, ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యి ఒక ఏడాది వృదా కావటంతో.. నాన్నగారు(సూపర్ స్టార్ కృష్ణ) నటనకు బ్రేక్ ఇచ్చి చదువు పూర్తి చేయమన్నా’రు. దాంతో నేను మళ్లీ స్కూల్‌కి వెళ్లాల్సి వచ్చిందని ప్రిన్స్ చెప్పుకొచ్చాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో సీనియర్ నటి విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు సమాచారం. -
ఇట్స్ మేకప్ టైమ్
విజయశాంతి సినిమాలకు బ్రేక్ ఇచ్చి 13 ఏళ్లయింది. ఇప్పుడు ఆమె మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు.. అద్దం ముందు నిల్చుని డైలాగ్ పేపర్ చెక్ చేసుకుంటున్నారు. యాక్షన్, కట్ పదాల మధ్యలో మళ్లీ తన యాక్టింగ్ స్కిల్‌ని ఆడియన్స్‌కి చూపించడానికి రెడీ అయ్యారు. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనీల్ సుంకర, ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయిక. ఇందులో విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నారు. సోమవారం షూటింగ్లో జాయిన్ అయ్యారామె. ‘‘అదే క్రమశిక్షణ, అదే డైనమిజం, అదే యాటిట్యూడ్. 13 ఏళ్లలో విజయశాంతిగారు ఏం మారలేదు’’ అన్నారు అనిల్ రావిపూడి. కాగా విజయశాంతిది మహేశ్‌తో సమానంగా సాగే పాత్ర అని తెలిసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. -
మూడు రోజుల్లో స్టెప్ ఇన్
పదమూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ స్క్రీన్ మీద కనిపించనున్నారు విజయశాంతి. మరో మూడు రోజుల్లో కెమెరా ముందుకు రాబోతున్నారని సమాచారం. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నారు. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా కథానాయిక. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆగస్ట్ 9 నుంచి విజయశాంతి చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది. 9 నుంచి ఓ వారంపాటు షూటింగ్లో పాల్గొంటారట. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని మళ్లీ జాయిన్ అవుతారు. ఈ సినిమా కోసం సుమారు 55 రోజులు డేట్స్‌ను కేటాయించారట విజయశాంతి. దీన్ని బట్టి ఆమె పాత్ర ఈ సినిమాలో ఎంత కీలకంగా ఉండబోతోందో ఊహించవచ్చు. మహేశ్‌బాబుతో పాటు సాగే పాత్రలో విజయశాంతి కనిపిస్తారని సమాచారం. ఈ పాత్ర కోసం విజయశాంతి ఫిట్‌గా మారిపోయారు కూడా. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
సరిలేరు నీకెవ్వరు
పదమూడేళ్ల విరామం తర్వాత విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు! మహేశ్‌బాబు హీరోగా 2020 లో విడుదల కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఆమెను మనం చూడవచ్చు. నిజానికి ఆరు నెలల క్రితమే విజయశాంతి సినిమాల్లోకి రావలసి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించవలసి ఉన్నందున సినిమాల్లోకి రాలేకపోయారు. అయితే ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్నందున రాజకీయాలకు దూరమైనట్లేనని భావించనక్కర్లేదని విజయశాంతి అంటున్నారు. ఆమె నటించిన చివరి చిత్రం ‘నాయుడమ్మ’. విజయశాంతి మొదటి చిత్రం తెలుగు కాదు. అది ‘కల్లుక్కుళ్ ఈరమ్’ అనే తమిళ చిత్రం. విజయశాంతి రాజకీయ రంగ ప్రవేశం చేసింది కూడా ప్రాంతీయ పార్టీ కాదు. అది భారతీయ జనతా పార్టీ. అయితే ఆమె ఎలాగైతే తమిళ, తెలుగు భాషలకు మాత్రమే పరిమితం కాలేదో, అలాగే ఒక పార్టీలోనే ఉండిపోలేదు. బీజేపీలోంచి బయటికి వచ్చి సొంతంగా ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత తల్లి తెలంగాణను టి.ఆర్.ఎస్. లో విలీనం చేశారు. తర్వాత టి.ఆర్.ఎస్.నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. ఆ క్షణం నుంచే విజయశాంతి మళ్లీ బీజేపీలోకి వెళ్లిపోతారనీ, లేదంటే తెలుగుదేశంలో చేరతారనీ వార్తలు మొదలయ్యాయి. తర్వాత ఆమె అన్నాడీయెంకేలో చేరబోతున్నారనే మాట కూడా వినిపించింది. అయితే ఆమె కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. -
కేసీఆర్ వ్యాఖ్యలు విడ్డూరం: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: తాము తెలంగాణ ప్రజలకే ఏజెంట్లం తప్ప, ఎవరితోనూ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదేళ్లు బీజేపీతోనూ, ప్రధాని నరేంద్ర మోదీతోనూ కేసీఆర్‌కి ఉన్న రహస్య అవగాహన గురించి తెలంగాణ ప్రజలకు బాగా అవగాహన వచ్చిందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఆడిన నాటకం కూడా వారికి అర్ధమైందన్నారు. నరేంద్రమోదీని ఇప్పడు ఎన్నికల సందర్భంగా తెగ తిడుతున్న కేసీఆర్... గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలపై నోరు మెదిపేందుకు కూడా ఎందుకు సాహసించలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మోదీతో బంధాన్ని బయటపెడితే తెలంగాణ సీఎంకు ఎక్కడ లేని కోపం వస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు ఏజెంట్లుగా పనిచేస్తామని చెబుతున్న కేసీఆర్, రాష్ట్రంలోని 14 మంది ఎంపీల మద్దతున్నా, కనీసం విభజన హామీలను సాధించడంలో ఎందుకు విఫలమయ్యారో వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. -
రాహుల్, మోదీల మధ్యే పోరు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీకి, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి మధ్యే పోరు జరగనుందని టీకాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీనే దేశంలో సుస్థిరమైన పాలన అందించగలదన్నారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏఐసీసీ పబ్లిసిటీ కమిటీ అన్ని రాష్ట్రాల కమిటీలతో మంగళవారం ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ పబ్లిసిటీ కమిటీ చైర్మన్ ఆనంద్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా పాల్గొన్నారు. దీనికి రాష్ట్రం నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, క్యాంపెయిన్ కమిటీ చైర్పర్సన్ విజయశాంతి హాజరయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో పబ్లిసిటీ కమిటీలు ఏ విధం గా ప్రజల్లోకెళ్లాలి అన్న విషయాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. రాహుల్.. దేశ భవిష్యత్తు: రాజగోపాల్‌రెడ్డి సమావేశం అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. లౌకికంగా కాంగ్రెస్ దేశాన్ని ఏ విధంగా కాపాడిందన్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీనే దేశానికి మెరుగైన పాలన అందించగలుగుతుందని, రాహుల్ గాంధీ దేశ భవిష్యత్తు అని.. రాష్ట్ర అభివృద్ధి కూడా కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. త్వరలో నిర్ణయిస్తాం: విజయశాంతి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి రాబోయే రోజుల్లో పబ్లిసిటీ, క్యాంపెయిన్ కమిటీల పాత్ర ఎలా ఉండాలన్న దానిపై ఈ భేటీలో చర్చించినట్లు విజయశాంతి చెప్పారు. ఎన్నికల ప్రచారాన్ని ఎప్పట్నుంచి ప్రారం భించాలన్న దానిని త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు లోక్‌సభ ఎన్నికలకు తేడా ఉం టుందని.. ఈ ఎన్నికలు ప్రధాని మోదీకి, రాహుల్ గాంధీకి మధ్య జరిగే యుద్ధమన్నారు. -
‘గజదొంగను గద్దె దింపాలి’
సాక్షి, సూర్యాపేట : కేసీఆర్ కుటుంబంలోని నలుగురు కలిసి నాలుగు కోట్ల ప్రజానికాన్ని దోచుకుంటున్నారని కాంగ్రెస్ ప్రచార తార విజయశాంతి ఆరోపించారు. మహాకూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆమె మిర్యాలగూడలో జరిగిన రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజల నెత్తురు కూడు తింటూ కుటుంబ పాలన చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో అధికారం కోసం కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారని, నాలుగున్నరేళ్ల కాలంలో ఒక్క హామీ కూడా అమలుచేయలేదని అన్నారు. కొడుకుని సీఎం చేయాలనే ఆర్భాటం తప్ప మరో ఆలోచనే కేసీఆర్‌కు లేదని పేర్కొన్నారు. కేసీఆర్‌ను గద్దె దింపడానికే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు ఆమె వివరించారు. రాహుల్ గాంధీది సింప్లిసిటీ అని, కేసీఆర్‌ది పబ్లిసిటీ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ లాంటి గజదొంగను గద్దె దింపాలని ఆమె పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రైతుల సంక్షేమం: సినీనటి విజయశాంతి
సాక్షి, దోమకొండ: దొరల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. ఆదివారం రాత్రి దోమకొండలో ఆమె మండలి విఫక్షనేత షబ్బీర్‌అలీతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురిం చి ప్రజలకు ఆమె వివరించారు. విజయశాంతి రోడ్‌షోకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. కాంగ్రెస్‌తోనే రైతు సంక్షేమం బీబీపేట: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే రైతు సంక్షేమం ముందుకు సాగుతుందని, టీఆర్ఎస్తో రైతులకు కష్టాలు తప్పవని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం కామారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ గెలుపు కోసం రోడ్‌షో నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి అంశాన్ని ప్రజా సంక్షేమం నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుందన్నారు. ప్రజల సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతున్న టీఆర్ఎస్ గ్రామాల్లోని ఒకరిద్దరి పార్టీ నాయకులకు ట్రాక్టర్లు ఇచ్చినంత మాత్రాన అది ఏ కరంగా సంక్షేమం చేపట్టినట్లు అవుతుందని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల పాలన లో అభివృద్ధి చేయకుండా మాటల గారడితో ప్రజలను మోసం చేశారని అన్నారు. టీఆర్ఎస్ వారిని మీ ఓటుతో తరిమికొట్టండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. 2014లో చేసిన తప్పును సరిదిద్దుకొనే అవకాశం మీ ముందు ఉందని కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలన్నారు. ఈ ఎన్నికలు దొరలతో కాంగ్రెస్ చేస్తున్న యుద్ధం అని మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఎమ్మెల్యే అభ్యర్థిగా షబ్బీర్ అలీని గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు యూసుఫ్ అలీ, ఎంజీ వేణుగోపాల్, జమునా రాథోడ్, మండల నాయకులు భూమాగౌడ్, సుతారి రమేష్, మ్యాదరి సత్తయ్య, విఠల్, వెంకట్ గౌడ్, కొరివి నర్సింలు, సాయి పాల్గొన్నారు. సభకు భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు భిక్కనూరు: సినీనటి విజయశాంతి దోమకొండ లో నిర్వహించిన రోడ్‌షోకు భిక్కనూరు మండలం నుంచి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఆదివారం భారీగా తరలి వెళ్లారు. మండల కేంద్రలోని అన్ని వీధుల గుండా బైక్ ర్యాలీ తీసి దోమకొండకు తరలివెళ్లారు. కాంగ్రెస్ నేతలు ఇంద్రకరణ్‌రెడ్డి, లింబాద్రి, చంద్రకాంత్‌రెడ్డి, సుదర్శన్, నాగభూషణంగౌడ్, అంకంరాజు, సిద్దగౌడ్, వెంకటిగౌడ్, ప్రభాకర్, కుంట లింగారెడ్డి, కుంట మల్లారెడ్డి, ఎల్లారెడ్డి ఉన్నారు. -
మోసాలకు అంబాసిడర్‌గా కేసీఆర్
మధిర/ఏటూరునాగారం: గత ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుత ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. శనివారం ఆమె ఖమ్మం జిల్లా మధిర మం డలం సిరిపురంలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. దొర ఒక వైపు, కాంగ్రెస్ మరోవైపు అని.. దొర కావాలో, ప్రజా సమస్యలు పరిష్కరించే కాంగ్రెస్ పార్టీ కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇప్పటి వరకు ఉద్యమాలతో దోచుకోవడం, దాచుకోవడం చేశారన్నారు. ఈ విషయంలో కేసీఆర్ మోసాలకు అంబాసిడర్‌గా మారారని ఆరోపించారు. నాడు మహాత్మాగాంధీ సింపుల్‌గా ఉండేవారని, కేసీఆర్ మాత్రం పబ్లిసిటీ పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. గాంధీ నాడు తన కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వలేదని, కేసీఆర్ నలుగురు కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చారని విమర్శించారు. డిసెంబర్ 11 తర్వాత రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ రాజకీయ, ఆర్థిక మోసాలతో వ్యవస్థకు నష్టం వాటిల్లుతోందన్నారు. ఖమ్మం జిల్లా చారిత్రాత్మకమైందని, ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం పాటలతో ఆయన అలరించారు. కీలక స్థానంలో ఉంటా: భట్టి త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని, అందులో తాను కీలక స్థానంలో ఉంటానని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 70 నుంచి 80 సీట్లతో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము ఇస్తున్న హామీలు సంక్షేమ పథకాల ను వెంటనే అమలు చేస్తామన్నారు. నిధులను నలుగురి కోసం కాకుండా 4 కోట్ల మంది ప్రజలకు పంచుతామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపే సమయం ఆసన్నమైం దన్నారు. దొరల పాలన కావాలో, ప్రజాపాలన కావా లో తేల్చుకోవాల్సింది ప్రజలేనన్నారు. మధిర నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తనకు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందన్నారు. కేసీఆర్ అబద్ధాలను ప్రజలు నమ్మరు: రాజగోపాల్‌రెడ్డి మునుగోడు: లేచింది మొద లు కొని పడుకునే వరకు అబద్ధాలు ఆడే సీఎం కేసీఆర్ ని ప్రజలు నమ్మేస్థితిలో లేరని కాంగ్రెస్ పార్టీ మునుగోడు అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని పలివెల, కిష్టాపురం గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం లాంటి అమలుకు వీలుకాని హామీలిచ్చి గద్దెనెక్కాడన్నారు. అయితే ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో ఈ ఎన్నికల్లో అబద్ధాలు ఆడే అవకాశం లేకుండా పోయిందన్నారు. 7న జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలవుతుందని కేసీఆర్ గ్రహించారని, అందుకే తాను ఇంట్లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పుకొస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందన్నారు. -
నేతలొస్తున్నారు..
సాక్షి, పెద్దపల్లి : ప్రచారపర్వానికి గడువు సమీపించడంతో అన్నిపార్టీల అధినేతలు జిల్లాబాట పట్టారు. ఇప్పటివరకు ఆయా పార్టీలకు సంబంధించిన నేతల సభలు జరగకపోగా, వరుసగా అన్ని పార్టీల నేతలు ఒకేసారిగా ప్రచారం రానుండడంతో రాజకీయం వేడెక్కనుంది. పోలింగ్‌కు పదిరోజుల ముందు భారీ బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా జోష్ నింపేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, బీజేపీ జాతీయ రథసారథి అమిత్‌షా, పరిపూర్ణానంద స్వామి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 29, 30న జిల్లాలో పర్యటించనున్నారు. 29న సాయంత్రం 4 గంటలకు గోదావరిఖనిలోని జూనియర్‌కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో కేసీఆర్ పాల్గొంటారు. 30న మధ్యాహ్నం 3.15 గంటలకు మంథనిలో, సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లిలో నిర్వహించే బహిరంగసభల్లో కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈమేరకు మంగళవారం కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. కాగా వరుసగా రెండు రోజులు జిల్లాలో కేసీఆర్ పర్యటించనుండడంతో పార్టీ నేతల్లో హడావుడి మొదలైంది. రామగుండం, మంథని, పెద్దపల్లి అభ్యర్థులు సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి బహిరంగసభల ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో రెండు, మూడు నియోజకవర్గాలు కలిపి ఒక నియోజకవర్గంలో కేసీఆర్ బహిరంగసభలు నిర్వహించారు. కానీ.. పెద్దపల్లి జిల్లాలో మాత్రం వరుసగా రెండు రోజులపాటు ప్రచార సభలు నిర్వహిస్తుండడం, అందునా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కేసీఆర్ బహిరంగసభలు నిర్వహిస్తుండడం ప్రాధాన్యతను చెప్పకనే చెబుతోంది. రేవంత్‌రెడ్డి...అమిత్‌షా...పరిపూర్ణానంద... పార్టీ అధినేతలు, స్టార్కంపెయినర్లతో ప్రచార సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్, బీజేపీ లు ఏర్పాట్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రచార సభ ఈ నెల 30 లేదా డిసెంబర్ ఒకటిన జిల్లా కేంద్రంలో నిర్వహించడానికి పార్టీ సన్నహాలు చేస్తోంది. తనతో పాటు టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన చింతకుంట విజయ రమణారావుకు మద్దతుగా రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. రామగుండం అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌కు మద్దతుగా గోదావరిఖనిలోనూ పర్యటించనున్నారు. రేవంత్‌రెడ్డి రావడంఖాయమే అయినా... తేదీలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు సినీనటి విజయశాంతి, ప్రజాకవి గద్దర్లు మంథని నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. మంథని పట్టణంలో విజయశాంతి, కాటారం మండల కేంద్రంలో గద్దర్ల సభలు ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సన్నహాలు చేస్తున్నారు. అధికారికంగా తేదీలు ఖరారు కావాల్సి ఉంది. ఇక బీజేపీ జాతీయ రథసారథి అమిత్‌షా, స్వామి పరిపూర్ణానందస్వామి ప్రచారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డి పార్టీ రథసారథులను రప్పించేందుకు సన్నహాలు చేస్తున్నారు. పెద్దపల్లిలో అమిత్‌షా, పరిపూర్ణానందస్వామిల ప్రచార సభలు ఉండే అవకాశం ఉంది. అయితే తేదీలు ఖరారు కావాల్సి ఉంది. వచ్చేనెల 4న కేంద్ర మంత్రి స్మృతిఇరానీ గోదావరిఖనిలో ప్రచార సభ నిర్వహించనున్నారు. ఆయా పార్టీల అధినేతల పర్యటనలు వరుసగా జరగనుండడంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయం వేడెక్కింది. -
దొరలు, ప్రజల మధ్య పోరాటం
కొల్లాపూర్/అచ్చంపేట: ‘తెలంగాణలో దొరల పాలన కావాలో, ప్రజా పాలన కావాలో.. ప్రజలే నిర్ణయించుకోవాలి. ఈ ఎన్నికల్లో దొరలు – ప్రజలకు మధ్య పోరాటం జరగబోతోంది. ఈ పోరాటంలో విజయం ఎవరిదో నిర్ణయించేది మీరే.. తెలంగాణ సమాజం భయంతో బతుకుతోంది. ప్రశ్నించే గొంతుకలు మౌనం వహిస్తున్నాయి. ఈ దొరల పాలనకు చరమగీతం పలికి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం’అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మూడు రోజులుగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజైన శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేటల్లో ‘ప్రజాగ్రహ సభలు’ ఏర్పాటు చేశారు. తొలుత కొల్లాపూర్‌లోని రాజాబంగ్లా ఎదుట కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి హర్షవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో, తర్వాత అచ్చంపేటలో భట్టి విక్రమార్క ప్రసంగించారు. అప్పుల రాష్ట్రంగా మార్చారు.. రాష్ట్ర బడ్జెట్‌ను కేసీఆర్ కుటుంబం నాలుగేళ్లుగా దోచుకుతింటోందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. సిరిసిల్లలో దళితులను హింసించింది, ఇసుక అక్రమాలకు పాల్పడింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలను కేసీఆర్ మోసం చేశారన్నారు. అటవీ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టాలిస్తే, వాటిని బలవంతంగా లాక్కునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందన్నారు. వైఎస్సార్ హయాంలోనే పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు నిర్మించి, వాటిని ప్రారంభించామన్నారు. అందులో మిగిలిన కొన్ని పనులను పూర్తిచేసి ప్రాజెక్టులన్నీ తామే నిర్మించామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మంత్రి జూపల్లి కృష్ణారావు పోజులిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దోచేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఒకే దఫాలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని, సోమశిల బ్రిడ్జి నిర్మిస్తామని, బీసీ సబ్‌ప్లాన్‌ను తీసుకొస్తామని అన్నారు. ‘చీప్’మినిస్టర్ రాష్ట్రానికి కేసీఆర్ చీఫ్ మినిస్టర్‌లా పనిచేయడం లేదని, ఆయన వ్యవహారమంతా ‘చీప్’మినిస్టర్‌లా ఉందని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. ‘దొరా అన్నీ గమనిస్తున్నాం.. బడుగులను ఆగం చేస్తున్నవు దొరా... ఇక బాంచన్ బతుకులు మాకొద్దు దొరా’అంటూ ధ్వజమెత్తారు. 2014లో చిన్న తప్పు చేసి రాష్ట్ర ప్రజలంతా పెద్దశిక్షను అనుభవిస్తున్నారన్నారు. అటువంటి తప్పు మరోసారి చేయొద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు మెచ్చే మేనిఫెస్టోతో వస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్‌కు హఠావో ‘కేసీఆర్‌కు హఠావో.. తెలంగాణకొ బచావో’అని ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేసీఆర్ మోసాలపై యువత తిరగబడాల్సిన అవసరం వచ్చిందన్నారు. టీఆర్ఎస్ ఓటమి ఖాయం టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమైపోయిందని, అందుకే ఆ పార్టీ ముందస్తుకు సిద్ధమైందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం, పాలమూరు జిల్లాను జూపల్లి కృష్ణారావు దోచుకుతింటున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఇసుక మాఫియా నడుపుతోంది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. బానిస బతుకులు పోవాలంటే, ప్రజలు స్వేచ్ఛగా బతకాలనుకుంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలన్నారు. ఈ సభలో ఎంపీ నంది ఎల్లయ్య, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ తదితరులు ప్రసంగించారు. అచ్చంపేటలో కూలిన స్టేజీ కొల్లాపూర్‌లో సభ అనంతరం కాంగ్రెస్ నేతలు హెలికాప్టర్లో అచ్చంపేటకు చేరుకున్నారు. ఇక్కడ ప్రజాగ్రహ సభ సందర్భంగా నేతలు స్టేజీపై ఎక్కి ప్రసంగానికి సిద్ధమయ్యారు. అయితే, పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కూడా స్టేజీపైకి ఎక్కడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు తగలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం నాయకులు ప్రచార రథంపైకి చేరుకుని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. -
విజయశాంతికి కీలక పదవి?
సాక్షి, హైదరాబాద్: సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నారు. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చురుకుగా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీతో విజయశాంతి సమావేశం అయినట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె ఈ సందర్భంగా రాహుల్‌కు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో విజయశాంతి చురుకుగా పాల్గొంటారని, కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేస్తారన్నారు. కాగా విజయశాంతి గత కొన్నాళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే రేవంత్ చేరికపై ఆమె అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమెకు పార్టీలో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయశాంతి రాహుల్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక గత ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయశాంతి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. -
నేనె హీరో
గాల్లో ఎగిరి ఓ తన్ను తన్నినా.. కెమెరాకు తిరిగి క్లోజ్‌లో ఒక పంచ్ డైలాగ్ కొట్టినా.. మౌనంగా ఒక లుక్ ఇచ్చినా.. చీపురుతో తాట తీసినా.. గన్నుతో కాకపుట్టించినా.. ‘విజయ’లో ఉన్న అశాంతే కనిపిస్తుంది... కోపం, ఉద్రేకం, రౌద్రం, ప్రతీకారం కన్నీళ్లలా కాకుండా చెమట బిందువుల్లా ఆమె చెంపల మీద జారతాయి. ‘హీరోయిన్ బేస్డ్ సినిమాల్లేండీ’ అని తోసి పారేయకండి. రాములమ్మది హీరో బేస్డ్ సినిమాయే. హీరో అవడానికి మీసాలే ఉండక్కర్లా. రోషం.. పౌరుషం ఉంటే చాలు అంటున్నారు విజయశాంతి ⇒ మరో రెండు రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవం. దేశానికి ఫ్రీడం వచ్చి 70 ఏళ్లైంది. అసలు మహిళలకు ఫ్రీడమ్ వచ్చిందా? విజయశాంతి: ఇంకా రాలేదనే అనుకుంటున్నా. స్వాతంత్య్రం వచ్చిన ఈ 70 ఏళ్లలో మంచి మార్పు వచ్చుండాలి. కానీ రాలేదు. టీవీలు, పేపర్లలో ప్రతిరోజూ మహిళలపై ఎన్నో ఘటనలు జరుగుతున్నాయనే వార్తలే. జరగరానివి జరుగుతున్నాయి. అవన్నీ చూస్తుంటే బాధగా ఉంటుంది. స్కూల్ పిల్లలు, వర్కింగ్ విమెన్, వాళ్లూ–వీళ్లూ అనే తేడా లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సేఫ్టీ లేకుండా పోయింది. పెద్దింటి పిల్లలు, రాజకీయ నాయకులు, వాళ్ల వారసులు ఉండడంతో కొన్ని తప్పులు వెలుగులోకి రాకుండాపోతున్నాయి. ఓవరాల్‌గా నష్టపోయేది, చనిపోయేది ఆడవాళ్లే. స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలపై మగాళ్లందరూ తలదించుకోవాలి. ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకు అందరూ తలదించుకోవాలి. ఆడవాళ్లకు రక్షణ ఉంటేనే కదా.. ఫ్రీడమ్ వచ్చినట్లు! ⇒ హీరోయిన్గా దాదాపు 30 ఏళ్లు బిజీ బిజీగా సినిమాలు చేశారు. బహుశా ఇంత కెరీర్ స్పాన్ ఉన్న ఆర్టిస్టులు తక్కువేమో? 1979లో స్టార్ అయి, దాదాపు 28 ఏళ్లు కంటిన్యూస్‌గా సినిమాలు చేశాను. అంత లాంగ్ కెరీర్ నాకే దక్కిందేమో. అదో రికార్డ్. మధ్యలో బ్రేక్ తీసుకుని చేసినవాళ్లు ఉన్నారనుకోండి.టి. కృష్ణగారి సినిమాలు చేయడం నా లక్. లేకపోతే గ్లామరస్ హీరోయిన్గా మిలిగిపోయేదాన్నేమో. టి. కృష్ణగారు, దాసరి నారాయణరావుగారు, మోహన్ గాంధీ వంటి దర్శకులుంటే... ఇప్పటి హీరోయిన్లకూ మంచి మంచి అవకాశాలొస్తాయి. ఇప్పుడంతా హీరోలకే కదా. ⇒ అప్పట్లో కూడా హీరోల డామినేషన్ ఉండేది కదా.. ఉండేది. కాకపోతే మాకు మంచి కథలు వచ్చేవి. నిరూపించుకునే స్కోప్ ఉండేది. ⇒ మీకు హీరోయిన్ ఇమేజ్ ఇష్టమా? హీరో ఇమేజా? హీరోయిన్ ఇమేజ్‌ని తక్కువ చేయడంలేదు. కాకపోతే నిరూపించుకునే చాన్స్ తక్కువ. అందుకే హీరో ఇమేజే ఇష్టం. నా మెంటాలిటీకి అదే సూట్ అవుతుంది. ‘మహిళలు తక్కువ కాదు’ అనే ఫీలింగ్‌తో ఉంటాను. అందుకు తగ్గట్టుగానే లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసి, తక్కువ కాదని నిరూపించుకున్నాను. అందుకే హీరోలు చేసినట్లే యాక్షన్ మూవీస్ చేశాను. ⇒ ఏం చేస్తే బాగుంటుందనుకుంటున్నారు... ‘నిర్భయ’ చట్టం వచ్చాక దారుణాలు తగ్గుతాయేమో అనిపించింది.. చట్టాలు తీసుకొస్తున్నారు గానీ... వాటిని కరెక్టుగా అమలు చేయడంలేదు. రీసెంట్గా ఓ రాజకీయ నాయకుడి కుమారుడు అర్ధరాత్రి ఓ అమ్మాయిని వెంబడించిన ఘటన చూశాం కదా. ఇక, మనం ఎవర్ని నమ్ముతాం? ఏ రకంగా నమ్ముతాం? మగవాళ్ల మైండ్‌సెట్ మారాలేమో అనిపిస్తోంది. ప్రతి ఒక్కరికీ అక్కాచెళ్లెల్లు, అమ్మలు ఉంటారు. మరి, బయటకు వచ్చేటప్పటికి అమ్మాయిల పట్ల ఎందుకలా ప్రవర్తిస్తున్నారనేది అర్థం కావడం లేదు. చట్టాలను స్ట్రాంగ్ చేయాలి. ⇒ ఆడవాళ్లు బయటకు రావడం వల్ల, లేట్ నైట్స్‌లో బయట ఉండడం వల్ల ఇటువంటివి జరుగు తున్నాయనేవాళ్లు ఉన్నారు. లేట్ నైట్స్ అంటే... ఇప్పుడు ఉద్యోగాలు చేస్తుంటారు. ఉదాహరణకు... మీరున్నారు. మీడియాలో ఎంతోమంది మహిళలున్నారు. షిఫ్టు ప్రకారం నైట్ డ్యూటీలు చేస్తుంటారు. వాళ్లేం చేయాలి? బయట సమాజం ఇలా ఉందని ఉద్యోగాలు మానుకోలేరు కదా! పని చేసేవాళ్లు చేయాలి. ఎదుటి వ్యక్తులు సరిగ్గా ఉండాలి. పద్ధతిగా నడుచుకోవాలి. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. రెండు మూడు ఘటనల పట్ల స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయితే అప్పుడు భయం వస్తుంది. పెద్దింటోళ్లు, చిన్నింటోళ్లు అనే తేడాలు లేకుండా తప్పు చేసే ఏ మగాణ్ణయినా శిక్షించాల్సిందే. ఆ విషయంలో దయాదాక్షిణ్యాలు ఉండకూడదు. ⇒ ఈ ఘటనలు పక్కనపెడితే... మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారు. అంతరిక్షంలోకి వెళ్తున్నారు. ఆ అభివృద్ధి గురించి? అది ఆనందమే. మహిళల్లో మంచి ప్రతిభ దాగుంది. దూసుకెళ్తున్నారు. అదొక్కటే కాకుండా... మహిళలు అన్ని రంగాల్లోనూ కొన్ని ఇబ్బందులూ ఎదుర్కొంటున్నారు. వాళ్ల ప్రతిభను చూసి ఓర్వలేనోళ్లు ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తారు. అటువంటి ప్రతికూలస్థితులను అధిగమించి కొందరు మహిళలు పైకొస్తున్నారు. ఇది అభినందించాల్సిన విషయం. మగవాళ్ల కంటే ఆడవాళ్లు తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. ⇒ అప్పట్లో హీరోయిన్ అంటే విజయశాంతి. విజయశాంతి అంటే హీరోయిన్ అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. అప్పుడు ఈర్ష్యతో మిమ్మల్ని తొక్కేయ డానికి ఎవరైనా ట్రై చేశారా? ఒక హీరోయిన్‌కి హీరో ఇమేజ్ రావడం ఏంటి? హయ్యస్ట్ పెయిడ్ హీరోయిన్ ఏంటి? అని మాట్లాడిన వాళ్లు ఉన్నారు. అవన్నీ ఓవర్‌కమ్ చేసుకుని నా పని నేను చేసుకుంటూ వెళ్లేదాన్ని. సక్సెస్‌లు వస్తుండేవి. ప్రజలు నన్నెంతో ఆదరించారు. దాంతో భయపడలేదు. యాక్షన్ ఫిల్మ్స్‌లో స్టంట్స్ కూడా డూప్ లేకుండా చేశా. ఇప్పుడంటే గ్రాఫిక్స్ వచ్చాయి కానీ... అప్పట్లో లేవు కదా. 30 అడుగుల ఎత్తు నుంచి దూకాలంటే దూకేయడమే. నేను చేయ నంటే ఎవరూ ఏమీ అనేవారు కాదేమో! కానీ, నేనే తగ్గేదాన్ని కాదు. మహిళలు ఎందులో తక్కువ? అనే ఫీలింగ్‌తో రిస్క్ తీసుకునేదాన్ని. కొన్ని సందర్భాల్లో కాళ్లు–చేతులు విరగొట్టుకున్నా. వాటిని లెక్క చేయకుండా పని చేయాలనే అభిప్రాయంతో చేశా. రాజకీయాల్లో అయితే సినిమాల్లో కంటే దారుణంగా, భయంకరంగా ఉంటుంది. వాటిని ఓవర్‌కమ్ చేసి రావాలి. ⇒ రాజకీయాల్లో భయంకరమైన రాజకీయా లుంటాయన్నారు. ఇందులోకి ఎందుకొచ్చాం అనే ఫీలింగ్ ఏమైనా..? నేనా రోజు తెలంగాణ అంశం టేకప్ చేసి నప్పుడు.. ‘సినిమాల్లో టాప్‌మోస్ట్‌గా ఉండి, తెలంగాణ కోసం వెంపర్లాడుతోందేంటి? రాంగ్ డెసిషన్ తీసుకుంది?’ అని చాలామంది హేళన చేశారు. కొన్ని అవమానాలూ జరిగాయి. అయినా పట్టించుకోలేదు. రెండు ప్రాంతాల్లో (ఆంధ్రా, తెలంగాణ) పేరు, సామాజిక బాధ్యత గల కళాకారిణిగా తెలుగు ప్రజల క్షేమం కోరుకున్నా. రాష్ట్రాలుగా విడిపోయినా... మంచి మనసుతో అందరూ కలిసుండాలని చెప్పా. తెలుగు ప్రజల మధ్య అప్పట్లో నెలకొన్న గీత, వైరుధ్యాలు ఈరోజు తొలగాయనే సంతృప్తి నాకుంది. ‘విడిపోతే రెండు ప్రాంతా లు బాగుపడతాయి, ఇరు వర్గాలకు న్యాయం చేసినోళ్లమవుతాం’ అని చెప్పా. ఇప్పుడందరూ హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ సాధన కోసం పాటుపడినందుకు ఆనందపడుతున్నా. ⇒ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో శ్రమించారు. ఆ పార్టీలో ఉండి ఉంటే ఒక పెద్ద పదవి పొంది ఉండేవారేమో? నాపై కొన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగాయి. ప్రతిభ ఉన్నోళ్లకు ఇబ్బందులు తప్పవు. రాజకీయాలు అన్నప్పుడు వెన్నుపోట్లు తప్పవు. ప్రాంతీయ పార్టీలు అలాగే ఉంటాయి. ప్రజలు ఆశించినట్టు జరగాలంటే జాతీయ పార్టీల ద్వారానే సాధ్యపడుతుంది. జరిగిందేదో జరిగింది. అయినా... కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. నాకా గ్రాటిట్యూడ్ ఉంది. పదవులన్నది ఈరోజు రాకపోవచ్చు, రేపు రావొచ్చు. కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామనే తృప్తి నాకుంది. అది పదవుల కంటే ఎక్కువని అనుకుంటున్నా. పదవులది ఏముంది? ఐదేళ్లు అధికారంలో ఉంటారు. తర్వాత ప్రజలు మరొక పార్టీకి ఓటేస్తారు. కానీ, ఈ అచీవ్మెంట్ అనేది మళ్లీ రాదు. గాంధీగారు దేశ స్వాతంత్య్రం కోసం శ్రమించినట్టు, నేను తెలంగాణ కోసం 19 ఏళ్లు కష్టపడ్డా. నాకది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ⇒ తమిళనాడులో రజనీకాంత్, కమల్‌హాసన్‌లు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయంటు న్నారు. మీకు అక్కడ బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ మధ్య మీరు తమిళనాడు వెళ్లారు. మీరు అక్కడ్నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? లేదమ్మా. తెలంగాణ కోసం 19 ఏళ్లు నేను కష్టపడి పని చేసి, రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరో రాష్ట్రం గురించి ఆలోచించడం లేదు. అఫ్కోర్స్... నాకు అక్కడ అభిమానులున్నారు. నేనక్కడి రాజకీయాల్లోకి రావాలని వాళ్లు కోరుకోవచ్చు. కానీ, నేనలా తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి వెళ్లే మనిషిని కాదు. తెలంగాణను తీసుకురావాలనుకున్నాం. తీసుకొచ్చాం. ఇప్పుడీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇంకా మంచి చేయాలనే ఆలోచనతో నేనున్నా. తమిళనాడులో ఏఐఏడీయంకే పార్టీ వాళ్లు అడిగారు. అయితే... నేను వెళ్లాలనుకోవడం లేదు. జయలలితగారంటే నాకిష్టం. ఆవిడ అధికారంలో తెచ్చిన ప్రభుత్వంలో, పార్టీలో సమస్యలు రాకుండా ఉండడం కోసం... వాళ్లు నన్ను రిక్వెస్ట్ చేయడంతో నేను తమిళనాడుకి వెళ్లి క్యాంపెయిన్ చేసొచ్చా. ⇒ ఈ మధ్య కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్స్‌ని డ్రగ్స్ విషయమై విచారించారు కదా.. దాని గురించి ఏమంటారు? ఒకవేళ ఫిల్మ్ ఇండస్ట్రీవాళ్లు పొరపాటు చేసి ఉంటే, వాళ్లను పిలిచి, కౌన్సెలింగ్ ఇస్తే సరిపోయి ఉండేదేమో. ‘ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్’ అని చెబితే బాగుండేదేమో. వేరే రంగాల్లోనూ ఉన్నారు కదా. కొంతమంది పేర్లు బయటపెట్టలేమని డిపార్ట్మెంట్ అంటోంది. దాన్నెలా అర్థం చేసుకోవాలి? పెద్దవాళ్లను ఎలా వదిలే స్తారు? వాళ్లను ఎందుకు ఫ్రేమ్‌లోకి తీసుకురాలేదు. ఇదెక్కడి న్యాయం? పక్షపాతం ఎందుకు? నైజీరియా వాళ్లు తీసుకొస్తున్నారా? బ్రెజిల్ వాళ్లు తీసుకొస్తున్నారా? డ్రగ్స్ సరఫరా ఎలా జరుగుతోంది? అని కూపీ లాగాలి. వాళ్లను కఠినంగా శిక్షించాలి. పబ్స్‌ని ఎందుకు మూయ డం లేదు? పబ్‌లు మన కల్చర్ కాదు. ప్రభుత్వానికి నిజాయతీ ఉంటే పబ్స్‌ని మూసేయాలి. డ్రగ్స్ వల్ల వేల మంది జీవితాలు నాశనమవుతున్నాయి. అందుకే అవసరమైతే ఉద్యమం చేయాలనుకుంటున్నా. ⇒ చెన్నై వెళ్లి శశికళగారిని కలిశారు కాబట్టి, ఆవిడతో చేతులు కలపాలనుకున్నారన్నది చాలామంది ఊహ.. జయలలితగారిది ప్రజలు ఎన్నుకున్న పార్టీ. మంచి మంచి పథకాలు ఉన్నాయి. ఐదేళ్ల పాటు ఉండాల్సిన పార్టీ. పళనీస్వామి, పన్నీర్ సెల్వం, శశికళ.. వీళ్లంతా కలసికట్టుగా పార్టీని నడిపిస్తే బాగుంటుందనుకున్నా. వీళ్లల్లో ఏ ఒక్కరి పక్షాన నిలబడాలని నేను అనుకోలేదు. ఆ పార్టీ ముందుకెళ్లాలనుకున్నాను. అంతే కానీ, వ్యక్తులతో సంబంధం లేదు. ⇒ జయలలిత టాపిక్ వచ్చింది కాబట్టి... ఆవిడ మరణం ఓ మిస్టరీ అని చాలామంది ఫీలింగ్? జయలలితగారి మరణంలో మిస్టరీ లేదమ్మా. నిజంగా ఆవిడకు ఒంట్లో బాగాలేదు. 1998 నుంచి నేను ఆవిడతో పని చేస్తున్నా. అప్పట్నుంచి జయలలితగారికి షుగర్, బీపీ ఉన్నాయి. ఒకానొక దశలో ఆవిడ వల్ల కాకపోతే క్యాంపెయిన్‌కు నన్ను వెళ్లమని రిక్వెస్ట్ చేశారు. అప్పుడు నేను బీజేపీలో ఉన్నా క్యాంపెయిన్‌కి వెళ్లి వాళ్ల అభ్యర్థులను గెలిపించా. అప్పుడే ఆమెకు కాళ్ల ఆపరేషన్ చేశారు. ఆవిడకు షుగర్ విపరీతంగా ఉండేది. మిస్టరీ ఏం లేదు. అంత పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న టైమ్‌లో హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆల్మోస్ట్ రెండు మూడు రోజుల్లో ఇంటికి వచ్చేస్తారని అనుకుంటున్న టైమ్‌లో ఘోరం జరిగింది. నేను అక్కడి డాక్టర్లతో మాట్లాడాను. ⇒ తెలంగాణ పరిపాలనపై మీ అభిప్రాయం? తప్పులు ఎక్కువైతే మాట్లాడక తప్పదు కదా! తెలంగాణ పరిపాలనపై మాట్లాడాల్సిన సందర్భం వచ్చినట్టుంది. ఆల్మోస్ట్ మూడేళ్లయింది. నేను కొంచెం టైమ్ ఇచ్చా. ఇక, మాట్లాడాల్సిన టైమ్ ఆసన్నమైంది. ⇒ ఒసేయ్ రాములమ్మ’కి పార్ట్ 2 చేయాలనుకున్నారని ఓ టాక్. బహుశా దాసరిగారు ఉండి ఉంటే అది జరిగేదేమో... దాసరిగారు నాకోసం మూడు సబ్జెక్ట్స్ రెడీ చేస్తూ వచ్చారు. ‘ఒసేయ్ రాములమ్మ–2’ స్టోరీ కూడా వర్కవుట్ చేశారు. ఆ తర్వాత ఇండియన్ పాలిటిక్స్‌కి సంబంధించి ఒక పొలిటీషియన్ జీవితంతో బయోపిక్ ప్లాన్ చేశారు. హిందీలో ‘గులాబ్ గ్యాంగ్’ సినిమా టైప్‌లో ఒకటి చేయా లనుకున్నారు. ఆయన ఉండి ఉంటే.. సినిమా చేసి ఉండేదాన్ని. ఆర్టిస్ట్‌ని ఎలా డీల్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. హీరోయిన్లను హుందాగా చూపించిన దర్శకుడు. ⇒ ఇతర రాష్ట్రాల రాజకీయాల గురించి కూడా తెలుసుకుంటుంటారా? ఒక్కో స్టేట్‌లో అక్కడికి తగ్గ సమస్యలున్నాయి. అయితే మన స్టేట్‌లో ఎక్కువ ఉన్నాయి. ముందు దీన్ని ‘సెట్‌రైట్’ చేయాలి. రానున్న రోజుల్లో నా పోరాటం ఈ దిశలోనే ఉంటుంది. ⇒ ఈ ‘డీమానిటైజేషన్’, ‘జీఎస్టీ’.. వీటి వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? నాకు తెలిసి ప్రజలు లాభపడినట్లు అనిపించలేదు. మధ్యతరగతివాళ్లు, దిగువ మధ్యతరగతులవాళ్లు ఇబ్బందుల పాలవుతున్నారు. డబ్బులు తెచ్చుకోవడానికి ఏటీయంల ముందు ఎన్నేసి గంటలు నిలబడ్డారో, ఎన్నిసార్లు బ్యాంకుల చుట్లూ తిరిగారో తెలిసిందే. జీఎస్టీ తర్వాత రేట్లు ఇంకా పెరిగాయేమో అనిపిస్తోంది. ఏ విధానాలనైనా ప్రజల మేలు కొరకు ప్రవేశపెట్టాలి కానీ, వాళ్లను ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేయకూడదు. ⇒ ఫైనల్లీ మీకు ‘సి.ఎం. విజయశాంతి’ అనిపించుకోవాలనే కోరిక ఉందా? సినిమాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు ఇంకా సక్సెస్ వస్తే బాగుంటుందనిపిస్తుంది. సూపర్‌స్టార్ అయితే బాగుంటుందనిపిస్తుంది. ఏ ఆర్టిస్ట్‌కైనా ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. టాప్ పొజిషన్‌కి రావాలనుంటుంది. అలాగే, రాజకీయాల్లో పందొమ్మిదేళ్లు ఎన్నో త్యాగాలు చేసి, ఎన్ని అవకాశాలొచ్చినా పక్కన పెట్టి... తెలంగాణ సాధించేవరకు నా మైండ్లోకి ఏదీ తీసుకోనని భీష్మించుకుని కూర్చుని అంత నిజాయితీగా పనిచేసి, టార్గెట్ రీచ్ అయ్యా. తెలంగాణ సాధించా. ఇప్పుడు దేవుడు, ప్రజలు అవకాశం ఇస్తే... సి.ఎం. కావడంలో తప్పు లేదు. సి.ఎం. అని మీరంటున్నారు. నా దృష్టిలో అది కూడా సేవే. పేరుకు మాత్రమే సి.ఎం. కానీ, వర్క్ చేయాలి. అనుకున్నదాంట్లో 60, 70 శాతం చేసినా సక్సెస్ అవుతాం. కానీ, ఎందుకో చాలామంది పని చేయడం లేదు. చెప్పేది చెబుతున్నారు. చేతల్లో అది ఉండడం లేదు. – డి.జి. భవాని -
నా రాజకీయ జీవితం తెలంగాణలోనే..
మాజీ ఎంపీ విజయశాంతి సాక్షి, హైదరాబాద్: తన రాజకీయ జీవి తమంతా తెలం గాణ లోనేనని, తమిళనా డుకు వెళ్లిపోతానన్న సమాచారం అవాస్తవ మని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. అనారోగ్యం కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు దివంగత సీఎం జయలలితతో తనకు మధ్య సాన్నిహిత్యం ఉందని, తానంటే ఆమెకు ఎంతో ఇష్టమని అన్నారు. జయలలితపై నాకూ అంతే గౌరవమని, ఆ అభిమానంతో నే సంక్షోభ సమయంలో అన్నాడీఎంకేకు మద్దతు పలికానని వివరించారు. ప్రజలకు ఎంతో సేవచేసి, మంచి పథకాలు ప్రవేశపెట్టి జయలలిత మళ్లీ అధికారంలోకి వచ్చారని, అలా వచ్చిన ప్రభుత్వాన్ని కూల దోయడం సరికాదని అన్నారు. -
శశికళకు మద్దతుగా ఎమ్మెల్యేల తీర్మానం
-
చిన్నమ్మ కోసం..
► శశికళ కోసం వడివడిగా అడుగులు ►ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానం ►శశికళను కలిసిన నటి విజయశాంతి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిలో చిన్నమ్మ శశికళను కూర్చోబెట్టేందుకు పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా తీర్మానాలు చేయిస్తూ ఏకగ్రీవంగా ఎంపికకు సిద్ధ్దమవుతోంది. శశికళను నటి విజయశాంతి కలుసుకోవడం శనివారం హైలెట్‌గా నిలిచింది. దర్శకుడు భారతీరాజా పోయెస్‌గార్డెన్‌లో శనివారం శశికళతో భేటీ అయ్యారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం పార్టీని తాత్కాలికంగా కలవరపాటుకు గురిచేసినా, వెంటనే కోలుకున్న శ్రేణులు శశికళకు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యాయి. అమ్మ స్థానంలో శశికళను ఎంపిక చేయడంలో ఆమెకు ఉన్న అర్హత ఏమిటని కొందరు నిలదీస్తున్నా ఎవరికి వారు ఆమె పట్ల భక్తి చాటుకుంటూనే ఉన్నారు. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం 135 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. సమావేశం వివరాలను గోప్యంగా ఉంచి శనివారం బహిర్గతం చేశారు. శశికళనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించినట్లు సీఎం తెలిపారు. శనివారం ఉదయం 11.45 గంటలకు సీఎం పన్నీర్‌సెల్వం తన మంత్రి వర్గ సహచరులు, తేనీ జిల్లా పార్టీ నేతలతో కలిసి జయ సమాధి వద్దకు చేరుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకోవాలని సమాధి వద్ద తీర్మానించారు. అక్కడి నుండి నాలుగు బస్సుల్లో పోయస్‌గార్డెన్ కు వెళ్లి తీర్మానం ప్రతిని శశికళకు అందజేశారు. తేనీ నేతలను పన్నీర్ సెల్వం తన నివాసానికి తీసుకెళ్లి విందుఇచ్చారు. అలాగే అన్నాడీఎంకే సాహిత్య విభాగం కార్యదర్శి, మాజీ మంత్రి వలర్మతి సైతం శశికళకు మద్దతుగా తీర్మానం చేశారు. మధురై నగర పార్టీ నేతలు శశికళకు మద్దతు పలుకుతూ తీర్మానం చేశారు. పార్టీ జిల్లాల కార్యదర్శులు, నిర్వాహకులు శశికళను కలుసుకుని బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరారు. అలాగే పార్టీ మత్స్యకారుల విభాగం సైతం శనివారం సమావేశమై శశికళకు మద్దతు ప్రకటించింది. విజయశాంతి రాక: నటి విజయశాంతి శనివారం ఉదయం పోయస్‌గార్డన్ కు వెళ్లి శశికళను కలుసుకోవడం చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలకు దూరంగా, దాదాపుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న విజయశాంతి అకస్మాత్తుగా చెన్నైలో ప్రత్యక్షం కావడం విశేషం. శశికళను కలుసుకున్న తరువాత జయ సమాధివద్దకు వెళ్లి నివాళులర్పించారు. అలాగే ప్రముఖ దర్శకులు భారతిరాజా కూడా శశికళను కలుసుకున్నారు. -
శశికళకు మద్దతుగా ఎమ్మెల్యేల తీర్మానం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం శనివారం తెలిపారు. పార్టీ కార్యాలయంలో 135 మంది ఎమ్మెల్యేలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. మాజీ మంత్రి వలర్మతి నేతృత్వంలో శశికళకు మద్దతుగా శనివారం మరో తీర్మానాన్ని ఆమోదించారు. శశికళతో నటి విజయశాంతి భేటీ నటి విజయశాంతి శనివారం చెన్నైలోని పోయెస్‌గార్డెన్ లో శశికళను కలుసుకున్నారు. అరగంటసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. తర్వాత జయలలిత సమాధి వద్దకు వెళ్లి జయకు విజయశాంతి నివాళులర్పించారు. పొత్తుకోసం బీజేపీ చర్చలు: మురళీధరరావు అన్నాడీఎంకేతో పొత్తుకోసం చర్చలు జరుగుతున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు శుక్రవారం కేరళలో జరిగిన ఒక సభలో వెల్లడించారు. కాగా, అన్నాడీఎంకేను చీల్చే ఆలోచన బీజేపీకి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సౌందరరాజన్ స్పష్టంచేశారు. -
వివాహిత ఆత్మహత్య
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పూర్ణశాసనం గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కర్తలి విజయశాంతి (27)కి వివాహం కాగా ఒక కుమారుడు, ఒక కమార్తె ఉన్నారు. భర్త సింగపూర్‌లో ఉంటుండడంతో విజయశాంతి పిల్లలతో కలసి పూర్ణశాసనం గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
జిల్లాలో 81 శాతం పోలింగ్ నమోదు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఫలితంగా భారీ పోలింగ్ నమోదైంది. చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. జిల్లాలో 10 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 81 శాతం పోలింగ్ నమోదైంది. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 6 శాతం ఎక్కువ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిత్మా సబర్వాల్ తెలిపారు. అత్యధికంగా నర్సాపూర్ నియోజకవర్గంలో 86 శాతం, అత్యల్పంగా సిద్దిపేట నియోజకవర్గంలో 75 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిన్న మొన్నటి వరకు నిప్పులు చెరిగిన సూర్యుడు ఎన్నికల వేళ ఓటర్లకు సహకరించాడు. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతం కావడంతో వాతావరణం చల్లబడింది. పలు చోట్ల టీఆర్ఎస్, కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. యువ ఓటర్లు భారీగా పోలింగ్‌లో పాల్గొన్నారు. యువ ఓటర్లు రాకతో అభ్యర్థుల గెలుపు ఓటముల తలకిందులయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 2,678 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో 20 శాతం కేంద్రాల్లో ఈవీఏంలు మొరాయించడంతో అధికారులు ఉరుగులు పరుగులు పెట్టారు. మనూరు మండలం దన్వాడ గ్రామంలో ఎంపీ అభ్యర్థి కోసం ఏర్పాటు చేసిన ఈవీఎంలో ఏ బటన్ నొక్కినా చెయ్యి గుర్తుకే ఓటు పడుతుందని ఓటర్లు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారి పరిశీలనలో కూడా అలానే జరుగుతోందని నిర్ధారణ కావడంతో ఈవీఎంను మార్చారు. అయితే అప్పటికే 71 ఓట్లు పడటంతో వాటిపై ఎన్నికల అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గులాబీ దళపతి కేసీఆర్ హెలికాప్టర్లో వచ్చి తన స్వగ్రామం చింతమడకలో ఓటు వేశారు. మెదక్ మండలం మద్దులవాయి గ్రామంలో ఓ ఎన్నికల అధికారి వృద్ధుల ఓట్లను కారు గుర్తుకు వేయిస్తున్నారని ఆరోపిస్తూ విజయశాంతి పోలింగ్ కేంద్ర ఎన్నికల ప్రిసైడింగ్ అధికారితో వాదనకు దిగారు. ఆయనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం బంజరుపల్లిలో ఓటర్లపై ఎస్ఐ కోటయ్య, తూప్రాన్ మండలం కోనాయపల్లి(పిపి) గ్రామంలో ఎస్ఐ అనిల్‌రెడ్డి ఓటర్లపై దురుసుగా ప్రవర్తించారు. అనిల్‌రెడ్డి ఓటర్లపై అకారణంగా దాడి చేశారని గ్రామస్థులు ఆరోపిస్తూ ఆయా గ్రామాలకు చెందిన ఓటర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఓటర్లు కులాల వారీగా విడిపోయి డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని భీష్మించి కూర్చున్న సంఘటనలు పలు నియోజకవర్గాల్లో కనిపించింది. ఇలాంటి సంఘటనతో ఓటర్ల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం, అందోల్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జహీరాబాద్ నియోజకవర్గం కేంద్రం పాటు, కోహీర్, ఝరాసంగం మండలాల్లో సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో ఓటర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మెదక్ నియోజకవర్గం ఉదయం ఏడుగంటలకే మెదక్, పాపన్నపేట మండలాల్లో స్వల్పంగా వర్షం కురవడంతో ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. మెదక్ పట్టణంలోని పిట్లంబేస్, న్యూహైస్కూల్, గీత కాలేజీ, మండలంలోని రాజ్‌పల్లి, పేరూర్, మాచవరం, పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి, చిన్నశంకరంపేట మండలం మడూర్, రామాయంపేట మండలంలో పర్వతపూర్, అక్కన్నపేట, కె. వెంకటపూర్ గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలీంగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మెదక్ మండల పరిధిలోని మద్దులవాయి గ్రామంలో ప్రిసైడింగ్ అధికారి మదన్మోహన్రావు ఓపార్టీకి మద్దతుగా ఓటర్లను తప్పుదారి పట్టించి ఓట్లు వేయించారంటూ గ్రామస్థులు ఆరోపించడంతో పోలింగ్ పది నిమిషాల పాటు ఆగిపోయింది. అనంతరం అక్కడికి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి ప్రిసైడింగ్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గం: వెల్దుర్తి మండలం బొమ్మారంలోని 22వ పోలింగ్స్టేషన్లో 50మంది ఓట్లు వేశాక ఈవీఎం పనిచేయకపోవడంతో 30 నిమిషాల పాటు పోలింగ్ ఆగిపోయింది. మాసాయిపేటలో, కుకునూర్‌లో పోలింగ్ ప్రారంభంలోనే ఈవీఎం పనిచేయక పోవడంతో కొత్తవాటితో పోలింగ్ ప్రారంభించారు. కొల్చారం మండలం ఎనగండ్లలో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరగడ ంతో వారిని చెదర గొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. రంగంపేటలో ఈవీఎం పనిచేయకపోవడంతో 20 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. శివ్వంపేట మండలం గోమారంలో మంగళవారం రాత్రి టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. టీఆర్ఎస్ దాడిలో కాంగ్రెస్‌కు చెందిన పలువురికి గాయాలయ్యాయి. సర్పంచ్ చంద్రాగౌడ్‌తో పాటు మరో 11మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. చెన్నాపూర్ గ్రామ సేవకునిపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయగా టీఆర్ఎస్ నాయకుడు భిక్షపతితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు అయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతారెడ్డి ఆమె స్వగ్రామమైన గోమారంలో ఓటు వేశారు. కౌడిపల్లి మండలంలోని అంతారంలో ఈవీఎం పనిచేయక పోవండతో 30 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కౌడిపల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు చేయి చేసుకోవండతో కొంత సేపు గందరగోళం నెలకొంది. హత్నూర మండలంలోని సాదుల్లానగర్‌లో ఈవీఎం పని చేయక పోవడంతో 40 నిమిషాల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. దౌల్తాబాద్‌లో ఆయా పార్టీల ఏజెంట్లు రాకపోవడంతో 20 నిమిషాల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. మంగాపూర్‌లో 12మంది ఓటు వేశాక ఈవీఎం పనిచేయక పోవడంతో 30నిమిషాల పాటు పోలింగ్ నిలిచింది. గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్‌లో బుధవారం తెల్లవారుజామున టీడీపీ నాయకులు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్న క్రమంలో తాము వీడియో చిత్రీకరించేందుకు యత్నించగా దాడి చేశారని టీ-న్యూస్ ఛానెల్ విలేకరి భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు టీడీపీ అభ్యర్థి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. {పతాపరెడ్డిని కొద్దిసేపు పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. అనంతరం వదిలేశారు. తూప్రాన్ మండలం కోనాయిపల్లిలో యాదగిరిపై అతని కుటుంబీకులపై అకారణంగా ఎస్ఐ అనిల్‌రెడ్డి దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులంతా మూకుమ్మడిగా రెండుగంటలపాటు ఎన్నికలను బహిష్కరించి, సదరు ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తహశీల్దార్ స్వామి గ్రామానికి చేరుకొని, విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో పోలింగ్ పునఃప్రారంభమైంది. తూప్రాన్ మండలం కుచారం తండాకు చెందిన గిరిజనులు ఎన్నికల్లో ఎవరు గెలిచినా తమకు రోడ్డు సౌకర్యం కల్పించడంలో విఫలమవుతున్నారని ఆరోపిస్తూ ఓటు వేయడానికి నిరాకరించారు. అధికారులు ఒప్పించి వారితో ఓటు వేయించారు. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో కొత్త ఓటర్ల పేర్లు జాబితాలో గల్లంతు కావడం ఓటు వేయకుండా వెనుతిరిగి వెళ్లారు. పటాన్చెరు నియోజకవర్గం... ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికీ కార్పొరేటు కంపెనీలు కార్మికులకు సెలవు ఇవ్వలేదు. గేట్లకు ‘మూసివేయబడినది’ అనే నోటీసు అంటించి లోపల మాత్రం కార్మికులతో పని చేయించుకున్నట్టు సమాచారం అందింది. పటాన్చెరు మండలం చిట్కుల్లోని జీటీఎన్ టెక్సటైల్ పరిశ్రమను ఎన్నికల టాస్క్ఫోర్సు సీజ్ చేసింది. సెలవు ఇవ్వకుండా పరిశ్రమ నడుపుతుండటంతో సీజ్ చేశారు. పటాన్‌చెరులోని జీహెచ్ఎంసీ పోలింగ్ కేంద్రంలోని 113 పీఎస్ నంబర్లో ఈవీఎం మొరాయించింది. దీంతో 45 నిమిషాల పాటు పొలింగ్ నిలిచింది. సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట మండలం నిజాంపూర్ ఏడవ నంబరు పోలింగ్ బూత్‌లో వెంకటాపూర్ జడ్పీహెచ్ఎస్, వెల్టూరు గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల్లో అరగంటపాటు పోలింగ్ ఆగింది. పోలింగ్ కేంద్రాల్లో సరైన వసతులు లేవు. వెలుతురు లేదు. తాగునీటి సౌకర్యం కల్పించలేదు. ఎండతీవ్రతకు పలుచోట్ల ఓటర్లు ఇబ్బందులు పడాల్సివచ్చింది. నందికందిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఎద్దుమైలారంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలతో కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. జహీరాబాద్ నియోజవర్గం జహీరాబాద్ మండలం అల్గోల్,హోతి(కె),పట్టణంలోని గడి, న్యాల్కల్ మండలంలోని మిరియంపూర్, రత్నాపూర్, డప్పుర్, కోహీర్ మండలంలోని కవేలి పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎం మోరాయించాయి. దీంతో పోలింగ్‌కు కొద్ది సేపు అంతరాయం కలిగింది. జహీరాబాద్, కోహీర్, ఝరాసంఘంలో మధ్యాహ్నం గంట పాటు భారీ వర్షం కురిసింది. అందోల్ నియోజకవర్గం జోగిపేటలో 184, 172, మర్వెళ్లిలోని 97, రెడ్డిపల్లిలోని పోలింగ్‌బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమయ్యింది. రేగోడ్ మండలం వెంకటాపూర్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా 15 నిమిషాలు పోలింగ్‌ను నిలిపివేశారు. పోలీసుల జోక్యంతో తిరిగి ప్రారంభించారు. సిద్దిపేట నియోజకవర్గం సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు, ఎన్జీఓ భవన్, పీఆర్ కార్యాలయం, శుభోదయ, సిద్దిపేట మండలంలోని ఎన్సాన్పల్లి, చిన్నగుండవెల్లి, లింగారెడ్డిపల్లి, బుస్సాపూర్ తదితర పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించాయి. గ్యాస్ గోదాంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 200 ఓట్లు గల్లంతయ్యాయి. మండల పరిధిలోని కోనాయిపల్లి గ్రామంలో 95 శాతం పోలింగ్ నమోదైంది. నారాయణఖేడ్ నియోజకవర్గం ఖేడ్ పట్టణంలోని మంగల్‌పేట్ ప్రాథమిక పాఠశాలలో, మండలంలోని నిజాంపేట్, జూకల్ గ్రామాల్లో అలాగే, మనూరు మండలంలోని ధన్వార్, మనూరు, కరస్‌గుత్తి, ఇరక్‌పల్లి గ్రామాల్లోని ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ధన్వార్‌లో లోక్‌సభకు సంబంధించిన అభ్యర్థి ఈవీఎంలో ఎవరికి ఓటు వేసినా నాలుగో నంబరు అభ్యర్థికే సిగ్నల్ చూయించడంతో ఓటర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. జోనల్ అధికారులు వచ్చి మరో ఈవీఎంను ఏర్పాటు చేశారు. అప్పటికే 70 ఓట్లకు పడ్డాయి. దీనిపై అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం రుద్రారంలో మంగళవారం రాత్రి టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయటంతో గ్రామంలో బుధవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దుబ్బాక మండలం లచ్చపేట, దౌల్తాబాద్ మండలం రాయపోల్,మిరుదొడ్డి మండలం మల్లుపల్లిలో ఈవీఎంలు మోరాయించటంతో ఆలస్యంగా ఓటింగ్ జరిగింది. -
టీఆర్ఎస్ను నమ్మొద్దు
చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ను నమ్మొద్దని, అది దొంగల పార్టీ అని మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి ఆరోపించారు. ఆదివారం ఆమె మండలంలోని శేరిపల్లి, మిర్జాపల్లి, టి.మాందాపూర్, జంగరాయి,ధరిపల్లి, చిన్నశంకరంపేట, కామారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్లో ఇచ్చిన మాటపై నిలబడే వారు లేరన్నారు. మాట మీద నిలబడని వారితో తెలంగాణ పునర్నిర్మాణం ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కాగా శేరిపల్లి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి చెప్యాల స్వాతి తమ మద్దతుదారులతో కాంగ్రెస్‌లో కలిశారు. టి.మాందాపూర్‌లో టీడీపీ నాయకులు మల్కాగౌడ్, యాదగిరిగౌడ్, జంగరాయిలో టీడీపీ సర్పంచ్ వడ్ల శోభ, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రవీందర్‌రెడ్డి, చంద్రారెడ్డిలు తమ మద్దతుదారులతో కాంగ్రెస్‌లో చేరారు. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ఏఏంసీ చైర్మన్ రమణ, తిరుపతిరెడ్డి, శ్రీమన్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రామకిష్టయ్య, ఆకుల రాములు, శేరిపల్లి సర్పంచ్ పద్మ, గొండస్వామి పాల్గొన్నారు. -
మెదక్ కాంగ్రెస్‌లో అసమ్మతి
మెదక్, న్యూస్‌లైన్: మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకుంది. పార్టీ టిక్కెట్‌ను విజయశాంతికి ఖరారు చేస్తూ సోమవారం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దీంతో టికెట్‌ను ఆశించిన పట్లోళ్ల శశిధర్‌రెడ్డి గుర్రుగా ఉన్నారు. అయినా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగానే మంగళవారం నామినేషన్ వేసేందుకు ముహూర్తం నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో విజయశాంతి, శశిధర్‌రెడ్డి వర్గీయులు వేర్వేరుగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. దీంతో కొంతమంది కార్యకర్తలు శశిధర్‌రెడ్డి వైపు, మరికొంతమంది విజయశాంతి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంకొంతమంది కార్యకర్తలు మాత్రం ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడుతున్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అయిన శశిధర్‌రెడ్డి చాలా కాలంగా ఎమ్మెల్యే టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఫలితాలు వెలువడిన మరునాడే యూసుఫ్‌పేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్యకర్తలను పట్టు జారిపోకుండా చూసుకున్నారు. ఓటమిభారం తనను కుంగదీయలేదన్న సంకేతాలను కార్యకర్తలకు పంపి, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. సుమారు ఐదేళ్లుగా జిల్లా ఇన్చార్జి మంత్రి డి.కె.అరుణ, ప్రభుత్వ సహకారంతో నిధులు మంజూరు చేయించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ తనదేనన్న ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడం, ఆపై మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఆశించడం జరిగింది. ఈమేరకు టిక్కెట్ ఆమెకే ఖరారు చేస్తూ అధిష్టానం జాబితా జారీ చేసింది. దీంతో ఈనెల 9న నామినేషన్ వేసేందుకు కూడా ఆమె ముహూర్తం నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శశిధర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి పార్టీ టిక్కెట్కోసం చివరి యత్నాలు చేశారు. ఒకవేళ పార్టీ నుంచి టిక్కెట్ వచ్చినా..రాకున్నా కాంగ్రెస్ పార్టీ నుంచే నామినేషన్ వేసేందుకు నిశ్చయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన స్వగ్రామమైన యూసుఫ్‌పేటలో భారీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కార్యకర్తలంతా పోటీలో ఉండాలని సూచించడంతో మంగళవారం శ్రీరామ నవమి రోజున నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా మరోవైపు మెదక్ మండలానికి చెందిన సుమారు 12 మంది సర్పంచ్‌లు సోమవారం హైదరాబాద్‌కు తరలివెళ్లి విజయశాంతికి తమ మద్దతు ప్రకటించినట్లు తెలిసింది. మాజీ కౌన్సిలర్, జిల్లా కాంగ్రెస్ మహిళా కార్యదర్శి తోటహరిణి, డీసీసీ కార్యదర్శి తోట అశోక్, మెదక్ మాజీ ఏఎంసీ చైర్మన్ మధుసూదన్‌రావులు కూడా పార్టీ నిర్ణయించిన అభ్యర్థినే గెలిపిస్తామని ఇప్పటికే ప్రకటించారు. మెదక్ ఎంపీగా పనిచేసి రైల్వేలైన్ మంజూరులో క్రియాశీలక పాత్ర పోషించినందున తనకు మెదక్ ప్రజలు పట్టం కడతారనే ఆశతో విజయశాంతి ఉన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ఏ ఎంపీ చేయలేని విధంగా తాను కృషి చేశానన్న ధీమాతో ఉన్నారు. పోటాపోటీగా సాగుతున్న ఎన్నికల రేసు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. -
మళ్లీ వారే..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నో మలుపులు.. మార్పులు.. తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసింది. శనివారమే ఇదిగో జాబితా అంటూ ఊరించి జారుకున్న కాంగ్రెస్ అధిష్టానం మొత్తానికి సోమవారం సాయంత్రం విడుదల చేసింది. ఎన్ని మలుపులు తిరిగినా చివరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనే కాంగ్రెస్ అధిష్టానం విశ్వాసం ఉంచిం ది. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి విజయశాంతిని, సిద్దిపేట నుంచి శ్రీనివాస్‌గౌడ్‌ను రంగంలోకి దింపుతున్నారు. నిజానికి జిల్లా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ శుక్రవారమే తుది మెరుగు లు దిద్దింది. ఈ జాబితానే ఢిల్లీలోని విశ్వసనీయ వక్తుల ద్వారా చేజిక్కించుకున్న ‘సాక్షి’ ప్రతినిధి ఆదివారం సంచికలో ‘కాంగ్రెస్ టీం ఖరారు’ అనే శీర్షికన వార్తా కథనాన్ని ప్రచురించింది. ‘సాక్షి’ ముందే వెల్లడించిన పేర్లనే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. జాబితాలో అందోల్ నుంచి దామోదర రాజనర్సింహ, నర్సాపూర్ నుంచి సునీతాలక్ష్మారెడ్డి, జహీరాబాద్ నుంచి గీతారెడ్డి, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, పటాన్చెరు నుంచి నందీశ్వర్‌గౌడ్, గజ్వేల్ నుంచి నర్సారెడ్డి, దుబ్బాక నుంచి చెరుకు ముత్యంరెడ్డి, మెదక్ నుంచి విజయశాంతి, నారాయణఖేడ్ నుంచి కిష్టారెడ్డి, సిద్దిపేట నుంచి శ్రీనివాస్‌గౌడ్ పేర్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. వీరికి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీ ఫారం అందించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన వారిలో ఇప్పటికే చాలామంది నామినేషన్లు సమర్పించారు. -
బెర్తులు బేఫికర్
సాక్షి, సంగారెడ్డి: సిట్టింగ్ లోక్‌సభ సభ్యులనే పార్టీ తరఫున బరిలో దింపాలని కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోంది. పాత రేసు గుర్రాలతోనే పందెం నెగ్గాలని యోచిస్తోంది. మెదక్ నుంచి విజయశాంతి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్ల అభ్యర్థిత్వాన్ని పార్టీ నాయకత్వం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ‘వార్ రూం’లో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై కసరత్తు నిర్వహిస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీలతో పాటు వారికి ప్రత్యామ్నాయంగా ఇతర అభ్యర్థుల పేర్లను సూచిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీ సీసీ), గాంధీభవన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)లు స్క్రీనింగ్ కమిటీకి ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించి ఉన్నాయి. ‘వార్ రూం’ భేటీలో మెదక్, జహీరాబాద్ లోక్‌సభల నుంచి మళ్లీ సిట్టింగ్ అభ్యర్థులనే బరిలో దింపాలని నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. ప్రత్యామ్నాయ అభ్యర్థులతో పోలిస్తే సిట్టింగ్ లోక్‌సభ సభ్యులే ధీటైన పోటీ ఇస్తారనే భావనను పార్టీ నాయకత్వం వెల్లడించినట్లు సమాచారం. తెలంగాణ ప్రాంత లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే ప్రకటించనుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాములమ్మ ధీటైన అభ్యర్థి ఆరునూరైన మెదక్ లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేస్తానని ఎంపీ విజయశాంతి మంకుపట్టు పడుతున్నారు. ఆమెకే టికెట్ కేటాయించాలని టీపీసీసీ ప్రతిపాదిస్తే.. ఆర్ మోహన్ నాయక్, సోమేశ్వర్ రెడ్డి, రాపోలు విజయభాస్కర్, ఉమాదేవిల పేర్లను గాంధీభవన్ సిఫారసు చేసింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నవారిలో విజయశాంతి ధీటైన అభ్యర్థిగా అధిష్టానం భావిస్తోంది. రేసులో ముందుంజలో ఉండటంతో ఆమెకు టికెట్ ఖాయమని చర్చ జరుగుతోంది. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చాగండ్ల నారేంద్రనాథ్పై 6077 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. ప్రారంభంలో టీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరిగా చక్రం తిప్పిన రాములమ్మ.. పార్టీ అధినేత కేసీఆర్‌తో చెల్లమ్మ అని అనిపించున్నారు. ఈసారి ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి విజయశాంతికి బదులు స్వయంగా కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం సాగింది. దీని పర్యావసానాల నేపథ్యంలో ఆమె టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడం.. ఆ కొంత కాలానికి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్ తరఫున మళ్లీ టికెట్ ఆశించిన చాగండ్ల నరేంద్రనాథ్ పార్టీని వీడి బీజేపీలో తీర్థం పుచ్చుకున్నారు. గడిచిన ఏడాది కాలంలో మెదక్ లోక్‌సభ స్థానం ఈ ఆసక్తికర పరిణామాలను చవిచూసింది. ఒక వేళ టీఆర్ఎస్ తరఫున మెదక్ లోక్‌సభ నుంచి కేసీఆర్ బరిలోకి దిగితే ఆయనకు, విజయశాంతికి మధ్య ఆసక్తికరమైన పోరు జరిగే సూచనలున్నాయి. సురేష్‌కు లైన్ క్లియర్ జహీరాబాద్ లోక్‌సభ స్థానం టికెట్టు కోసం సిట్టింగ్ ఎంపీ సురేష్ షెట్కార్, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ ఎం. జైపాల్‌రెడ్డిల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. సుదర్శన్‌రెడ్డి, ఎం. జైపాల్‌రెడ్డిల పేర్లను టీపీసీసీ ప్రతిపాదిస్తే డీసీసీ మాత్రం సురేష్ షెట్కార్ పేరునే ప్రతిపాదించింది. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సైతం సురేష్ షెట్కార్ పేరునే బలపర్చినట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. స్వాతంత్ర సమరయోధులు, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే శివరావు షెట్కార్ కుమారుడు సురేష్ షెట్కార్ 1994లో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆసమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడంతో టీడీపీ అభ్యర్థి ఎం.విజయ్పాల్రెడ్డికి విజయం వరించింది. సురేష్ షెట్కార్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, డీసీసీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీలో పదవులు చేపట్టారు. 2004లో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. సీట్ల సర్థుబాటులో భాగంగా 2009లో సురేష్ షెట్కార్ జహీరాబాద్ లోక్‌సభకు మారాల్సి వచ్చింది. నారాయణఖేడ్ అసెంబ్లీ నుంచి పి.కిష్టారెడ్డి, జహీరాబాద్ లోక్‌సభ నుంచి సురేష్ షెట్కార్‌లు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆనాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఈ సర్దుబాటును మళ్లీ కొనసాగించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.