సాక్షి, హైదరాబాద్: ‘‘అమ్మా... మీరెక్కడో రాజకుమార్తెగా మళ్ళీ జన్మించే ఉంటారు. అయినప్పటికీ మాకందరికీ తెలిసిన రోజుగా మీకివే పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు పంచిన స్నేహం, అభిమానం, ఆప్యాయత నాకు జీవితకాలపు కానుకలుగా... తీపి గుర్తులుగా ఎప్పటికీ అలాగే ఉంటాయి. మత తీవ్రవాదుల హిట్ లిస్టులో నేను టార్గెట్ అయినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు మీరు నా భద్రత కోసం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ... ఇంకా... పురట్చి తలైవియిన్ అన్బు తంగై (విప్లవ నాయకి జయలలితకు ప్రియమైన చెల్లెలు).... ప్రచార బీరంగి (ప్రచారంలో ఫిరంగి) అంటూ మీరు నాకిచ్చిన గౌరవప్రదమైన పిలుపులు ఈ జన్మంతా జ్ఞాపకాలుగా మిగిలే ఉంటాయి. ఎప్పటికీ...’’ అంటూ సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి ఉద్వేగానికి లోనయ్యారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ‘అమ్మ’ జయలలిత 73వ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు షేర్ చేశారు. ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు.
అమ్మగా చెరగని ముద్ర వేసిన తలైవి
మైసూరు రాష్ట్రంలో 24 ఫిబ్రవరి 1948లో జయరాం- వేదవల్లి(సంధ్య) దంపతులకు జన్మించిన జయలలిత, చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేశారు. నటిగా శిఖరాగ్రాలకు చేరుకున్న ఆమె, ఎంజీ రామచంద్రన్ ఆహ్వానం మేరకు 1982లో రాజకీయాల్లో ప్రవేశించారు. విద్యావంతురాలిగా, న్యత్యకారిణిగా, గొప్ప వక్తగా తనదైన ముద్ర వేసిన జయలలిత.. ఏఐఏడీఎంకేలో ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, రాజ్యసభలో అడుగుపెట్టారు.
ఎంజీఆర్ మరణానంతరం ఎన్నో అవమానాలకు గురైన ఆమె ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ.. ధీటుగా ముందుకు సాగారు. 38 ఏళ్ల వయసులో రాష్ట్ర శాసనసభలో తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా చరిత్రకెక్కారు. ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పురుషాధిక్య రంగంలో నెగ్గుకువచ్చి ఆరు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ప్రజల గుండెల్లో ‘అమ్మ’గా చెరగని ముద్ర వేసుకున్నారు. పురుచ్చి తలైవిగా నీరాజనాలు అందుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు జీవితం అనుభవించిన ఆమె, 2016 డిసెంబరు 5న తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్‌తో అనుబంధం
తమిళనాడు దివంగత సీఎం జయలలితకు భాగ్యనగరంతో విడదీయరాని అనుబంధం ఉంది. నటీమణిగా వెలుగొందుతున్న సమయంలో తరచుగా ఇక్కడకు వచ్చేవారట. షూటింగ్ నిమిత్తం ఇక్కడే బస చేసేవారట. ఈక్రమంలో శ్రీనగర్ కాలనీలో జయలలిత రెండు ఇళ్లు కొనుగోలు చేశారు. ఇక తెలుగు నటీనటులతోనూ ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉండేదట.
Comments
Please login to add a commentAdd a comment