రాజాసింగ్ ఫైర్ బ్రాండ్ నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఏం మాట్లాడినా సంచలనం, వివాదాస్పదమే. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతోనే బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. తర్వాత జైలు పాలయ్యారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ నాయకులు కక్కలేక.. మింగలేక ఇబ్బందిపడుతున్నారు. రాములమ్మ మాత్రం భిన్నంగా రియాక్టయ్యారు. ఇంతకీ ఆమె ఏమన్నారు?..
కక్కలేక మింగలేక కమలం..
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో ఏమి చేయాలో అర్థంకాక, కేడర్‌ను సముదాయించలేక తెలంగాణ బీజేపీ నేతలు సతమతం అవుతున్నారు. మహమ్మద్ ప్రవక్త మీద రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా స్పందించింది. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై అప్పటివరకు నమోదైన కేసులను పరిగణలోకి తీసుకుంటూ పీడీ యాక్ట్ పెట్టి.. చర్లపల్లి జైలుకు పంపింది. ప్రస్తుతం రాజాసింగ్ జైలులో ఉన్నారు. సస్పెన్షన్ తొలగించే విషయంలో బీజేపీ హై కమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఎప్పుడొస్తారు సర్..?
రాజాసింగ్ జైలుకు వెళ్లి నెల రోజులు అవుతుంది. జైలు నుండి ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి. రాజాసింగ్ జైల్లో ఉండటంపై బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు, హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడా నిరసనలు, బందులు కూడా జరుగుతున్నాయి. ఈ ఘటనలన్నీ రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. రాజాసింగ్‌ను బీజేపీ నుండి సస్పెండ్ చేసినా కార్యకర్తలు మాత్రం బ్యానర్లు, ఫ్లెక్సీలపైన ఆయన ఫొటోలను తీసివేయడం లేదు. బండి సంజయ్ సంగ్రామ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల మీద కూడా రాజాసింగ్ ఫొటోలు దర్శనమిచ్చాయి.
టైగర్ ఎక్కడ..?
పార్టీ హై కమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్థానిక శ్రేణులు పెద్దగా పట్టించుకోవడంలేదు. వారం క్రితం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్‌లు రాజాసింగ్‌ను విడుదల చేయాలంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. పార్టీ సస్పెండ్ చేసినా కార్పొరేటర్లు మాత్రం ఆయనకు మద్దతుగా కౌన్సిల్ మీటింగ్‌లో తమ అభిమానం చాటుకున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ కార్యకర్తలు, పార్టీ నేతలు మాట్లాడుతున్నప్పుడు ఆటంకం కల్పించారు. టైగర్ రాజా సింగ్ ఎక్కడ అని ప్లకార్డ్స్ ప్రదర్శించారు. స్లోగన్స్ ఇచ్చారు. దీంతో బండి సంజయ్ జోక్యం చేసుకొని వారిని సముదాయించారు.
బండి సంజయ్ ఎక్కడా కూడా రాజాసింగ్ పేరును ప్రస్తావించలేదు. పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఆయన పేరు చెబుతూ మాట్లాడలేరు. రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి జైలులో వేసినా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. పార్టీ బ్యానర్ మీద ఆందోళన చేయలేని స్థితి. అలాగని పార్టీ రాజాసింగ్‌ను సస్పెండ్ చేసింది కాబట్టి ఆయన కోసం ఏమీ చేయలేమని కేడర్‌కు చెప్పలేని సంకట పరిస్థితి. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మాత్రం రాజాసింగ్‌కు మద్దతుగా ఒక ప్రకటన విడుదల చేయడం కలకలం రేపుతోంది. పార్టీ రాష్ట్ర నేతలు రాజాసింగ్ పేరును ప్రస్తావించకుండా సపోర్ట్ చేస్తుండగా.. విజయశాంతి పార్టీ లైన్ దాటి నేరుగా రాజాసింగ్‌ను సపోర్ట్ చేస్తూ ప్రకటన విడుదల చేయడంపై పార్టీలో చర్చ సాగుతోంది. మొత్తం మీద రాజాసింగ్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. రాజాసింగ్‌ను దూరం చేసుకోలేరు. అలాగని హైకమాండ్ ఆదేశాలను అతిక్రమించలేరు.
Comments
Please login to add a commentAdd a comment