High command decision
-
బీజేపీలో పెను మార్పులు!.. కేంద్రమంత్రిగా బండి, ఈటలకు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల గడువు సమీపిస్తున్నకొద్దీ పొలిటికల్ పార్టీలు ప్లాన్స్ మార్చుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఇక, తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తెలంగాణ బీజేపీలో కీలక పదవుల్లో మార్పులు జరుగుతున్నట్టు అధిష్టానం నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మార్పు ఉంటుందని కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కాగా, ఆ వార్తలు నిజమేనని తెలుస్తోంది. బీజేపీ చీఫ్ మార్పువైపే పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ప్రచార కమిటీ పగ్గాలు అప్పగించే యోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో పార్టీ చీఫ్ బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇందులో భాగంగానే హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. జోడు గుర్రాల వేటలో భాగంగా ఈటలకు సరైన జోడి ఎవరనే దానిపై తీవ్ర చర్చ జరుగుతున్నట్టు పార్టీలో చర్చ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. బండి సంజయ్, ఈటల మధ్య పొసగకపోవడంతోనే పార్టీ చీఫ్ మార్పుపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇక, త్వరలోనే మోదీ కేబినెట్ విస్తరణకు కూడా ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా బండి సంజయ్‌ని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు.. తెలంగాణ బీజేపీ నాయకత్వంపై మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. దున్నపోతుల్ని తన్నుకుంటూ ఓ వ్యక్తి ట్రాలీలో ఎక్కిన వీడియోను పోస్ట్ చేసిన.. ఇది తెలంగాణ బీజేపీకి అవసరమంటూ క్యాప్షన్ ఉంచారు. ఆయన కాసేపటికే దానిని డిలీట్ చేశారు. పైగా ఆ ట్వీట్‌కు అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్ లాంటి అగ్రనేతలను ట్యాగ్ చేశారాయన. అయితే ఆయన ట్విటర్ వాల్‌పై ఆ పోస్ట్ కనిపించకపోవడంతో.. ఆయన దానిని డిలీట్ చేసినట్లు అర్థమవుతోంది. దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్! -
బీజేపీ బిగ్ ప్లాన్.. ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్స్ రచిస్తోంది. బీజేపీ హైకమాండ్ ఇప్పటికే తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇక, తెలంగాణ విషయంలో బీజేపీ హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ కమిటీ సారధిగా నియమించినట్టు సమాచారం. ఈ మేరకు బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నాయకత్వాన్ని సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రొజెక్ట్ చేయనున్నట్టు సమాచారం. కాగా, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు, ఈటల రాజేందర్ ఈరోజు(శుక్రవారం) ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఢిల్లీలోనే ఉండి అధిష్టానం పెద్దలతో సమావేశాలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే తెలంగాణ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ మేథోమథనం జరిపింది. రెండు రోజుల పాటు దాదాపు పది గంటలు నేతలు సమాలోచనలు చేశారు. కాగా, అధిష్టానం నిర్ణయంతో తెలంగాణ బీజేపీలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: నా టార్గెట్ బీఆర్ఎస్.. వడ్డీతోసహా చెల్లిస్తా: పొంగులేటి -
బీజేపీలో హాట్‌టాపిక్.. రాజాసింగ్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన విజయశాంతి!
రాజాసింగ్ ఫైర్ బ్రాండ్ నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఏం మాట్లాడినా సంచలనం, వివాదాస్పదమే. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతోనే బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. తర్వాత జైలు పాలయ్యారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ నాయకులు కక్కలేక.. మింగలేక ఇబ్బందిపడుతున్నారు. రాములమ్మ మాత్రం భిన్నంగా రియాక్టయ్యారు. ఇంతకీ ఆమె ఏమన్నారు?.. కక్కలేక మింగలేక కమలం.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో ఏమి చేయాలో అర్థంకాక, కేడర్‌ను సముదాయించలేక తెలంగాణ బీజేపీ నేతలు సతమతం అవుతున్నారు. మహమ్మద్ ప్రవక్త మీద రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా స్పందించింది. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై అప్పటివరకు నమోదైన కేసులను పరిగణలోకి తీసుకుంటూ పీడీ యాక్ట్ పెట్టి.. చర్లపల్లి జైలుకు పంపింది. ప్రస్తుతం రాజాసింగ్ జైలులో ఉన్నారు. సస్పెన్షన్ తొలగించే విషయంలో బీజేపీ హై కమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎప్పుడొస్తారు సర్..? రాజాసింగ్ జైలుకు వెళ్లి నెల రోజులు అవుతుంది. జైలు నుండి ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి. రాజాసింగ్ జైల్లో ఉండటంపై బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు, హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడా నిరసనలు, బందులు కూడా జరుగుతున్నాయి. ఈ ఘటనలన్నీ రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. రాజాసింగ్‌ను బీజేపీ నుండి సస్పెండ్ చేసినా కార్యకర్తలు మాత్రం బ్యానర్లు, ఫ్లెక్సీలపైన ఆయన ఫొటోలను తీసివేయడం లేదు. బండి సంజయ్ సంగ్రామ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల మీద కూడా రాజాసింగ్ ఫొటోలు దర్శనమిచ్చాయి. టైగర్ ఎక్కడ..? పార్టీ హై కమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్థానిక శ్రేణులు పెద్దగా పట్టించుకోవడంలేదు. వారం క్రితం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు రాజాసింగ్‌ను విడుదల చేయాలంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. పార్టీ సస్పెండ్ చేసినా కార్పొరేటర్లు మాత్రం ఆయనకు మద్దతుగా కౌన్సిల్ మీటింగ్‌లో తమ అభిమానం చాటుకున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ కార్యకర్తలు, పార్టీ నేతలు మాట్లాడుతున్నప్పుడు ఆటంకం కల్పించారు. టైగర్ రాజా సింగ్ ఎక్కడ అని ప్లకార్డ్స్ ప్రదర్శించారు. స్లోగన్స్ ఇచ్చారు. దీంతో బండి సంజయ్ జోక్యం చేసుకొని వారిని సముదాయించారు. బండి సంజయ్ ఎక్కడా కూడా రాజాసింగ్ పేరును ప్రస్తావించలేదు. పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఆయన పేరు చెబుతూ మాట్లాడలేరు. రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి జైలులో వేసినా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. పార్టీ బ్యానర్ మీద ఆందోళన చేయలేని స్థితి. అలాగని పార్టీ రాజాసింగ్‌ను సస్పెండ్ చేసింది కాబట్టి ఆయన కోసం ఏమీ చేయలేమని కేడర్‌కు చెప్పలేని సంకట పరిస్థితి. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మాత్రం రాజాసింగ్‌కు మద్దతుగా ఒక ప్రకటన విడుదల చేయడం కలకలం రేపుతోంది. పార్టీ రాష్ట్ర నేతలు రాజాసింగ్ పేరును ప్రస్తావించకుండా సపోర్ట్ చేస్తుండగా.. విజయశాంతి పార్టీ లైన్ దాటి నేరుగా రాజాసింగ్‌ను సపోర్ట్ చేస్తూ ప్రకటన విడుదల చేయడంపై పార్టీలో చర్చ సాగుతోంది. మొత్తం మీద రాజాసింగ్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. రాజాసింగ్‌ను దూరం చేసుకోలేరు. అలాగని హైకమాండ్ ఆదేశాలను అతిక్రమించలేరు. -
హై‘కమాండ్’ కోసం ఎదురుచూపులు
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కర్ణాటక బీజేపీ చీఫ్, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. అయితే ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరులోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) ప్రధాన కార్యాలయం ‘కేశవ కృప’లో బుధవారం సంఘ్ పెద్దలను కలుసుకున్న అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ‘నేను ఢిల్లీ నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నా. ఎప్పుడు అవసరమైనా నేను బీజేపీ శాసనసభా పక్షాన్ని సమావేశపర్చి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ను కలుసుకోగలను. కానీ ఇందుకోసం పార్టీ హైకమాండ్ నుంచి తొలుత స్పష్టత రావాలి’ అని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాసపరీక్షకు అనుకూలంగా 99 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపగా, 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. దీంతో విశ్వాసతీర్మానం వీగిపోయి సీఎం కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఆరెస్సెస్ ఆశీర్వాదం వల్లే.. ఆరెస్సెస్ పెద్దల ఆశీర్వాదం, సహకారం కారణంగానే తాను తాలూకా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేతగా, ముఖ్యమంత్రిగా ఎదిగానని యడ్యూరప్ప తెలిపారు. ‘తదుపరి కార్యాచరణను చేపట్టేముందు ఆరెస్సెస్ పెద్దల ఆశీస్సులు తీసుకునేందుకే ఇక్కడకు వచ్చాను. విశ్వాసపరీక్ష సందర్భంగా మా ఎమ్మెల్యేలు బలంగా, ఐకమత్యంతో నిలిచారు. మాకు రాబోయే కాలంలో కీలకమైన పరీక్షలు ఎదురుకానున్నాయి. ఇలాంటి పరిస్థితులన్నింటిని దీటుగా ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’ అని వెల్లడించారు. మరోవైపు విశ్వాసపరీక్షకు డుమ్మా కొట్టిన 17 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో స్పీకర్ రమేశ్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని బీజేపీ అధిష్టానం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనిపై స్పష్టత వచ్చాకే కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ముందుకెళ్లాలని భావిస్తోంది. కాగా, ముంబైలో ఆందోళన చెందుతున్న రెబెల్ ఎమ్మెల్యేలకు సర్దిచెప్పేందుకు బీజేపీ నేతలు అశ్వంత్ నారాయణ్, ఆర్.అశోక ముంబైకి బయలుదేరివెళ్లారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక దూత.. కర్ణాటకలో నాటకీయ పరిణామాల మధ్య సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను సాఫీగా జరిగేలా చూసేందుకు త్వరలోనే ప్రత్యేక పరిశీలకుడిని పంపనుంది. కర్ణాటకలో విశ్వాసపరీక్షకు మొత్తం 17 మంది అధికార కూటమి సభ్యులు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వీరిపై స్పీకర్ చర్యలు తీసుకునేవరకూ వేచిఉండాలన్న ధోరణితోనే బీజేపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ స్పీకర్ సుప్రీంకోర్టుకెళ్లిన 15 మంది రెబెల్స్ రాజీనామాలను ఆమోదించి లేదా అనర్హత వేటేస్తే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 210కి, కాంగ్రెస్–జేడీఎస్ కూటమి బలం(బీఎస్పీ ఎమ్మెల్యేతో కలుపుకుని) 103కు చేరుకుంటుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106కు తగ్గుతుంది. దీంతో 107 ఎమ్మెల్యేల మద్దతున్న బీజేపీ కూటమి(బీజేపీ 105, ఇద్దరు స్వతంత్రులు) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమౌతుంది. అయితే స్వతంత్రుల దయాదాక్షిణ్యాలపై బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగించాల్సి ఉంటుంది.