సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల గడువు సమీపిస్తున్నకొద్దీ పొలిటికల్ పార్టీలు ప్లాన్స్ మార్చుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఇక, తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తెలంగాణ బీజేపీలో కీలక పదవుల్లో మార్పులు జరుగుతున్నట్టు అధిష్టానం నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి.
అయితే, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మార్పు ఉంటుందని కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కాగా, ఆ వార్తలు నిజమేనని తెలుస్తోంది. బీజేపీ చీఫ్ మార్పువైపే పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ప్రచార కమిటీ పగ్గాలు అప్పగించే యోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో పార్టీ చీఫ్ బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇందులో భాగంగానే హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. జోడు గుర్రాల వేటలో భాగంగా ఈటలకు సరైన జోడి ఎవరనే దానిపై తీవ్ర చర్చ జరుగుతున్నట్టు పార్టీలో చర్చ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. బండి సంజయ్, ఈటల మధ్య పొసగకపోవడంతోనే పార్టీ చీఫ్ మార్పుపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇక, త్వరలోనే మోదీ కేబినెట్ విస్తరణకు కూడా ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా బండి సంజయ్‌ని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు.. తెలంగాణ బీజేపీ నాయకత్వంపై మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. దున్నపోతుల్ని తన్నుకుంటూ ఓ వ్యక్తి ట్రాలీలో ఎక్కిన వీడియోను పోస్ట్ చేసిన.. ఇది తెలంగాణ బీజేపీకి అవసరమంటూ క్యాప్షన్ ఉంచారు. ఆయన కాసేపటికే దానిని డిలీట్ చేశారు. పైగా ఆ ట్వీట్‌కు అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్ లాంటి అగ్రనేతలను ట్యాగ్ చేశారాయన. అయితే ఆయన ట్విటర్ వాల్‌పై ఆ పోస్ట్ కనిపించకపోవడంతో.. ఆయన దానిని డిలీట్ చేసినట్లు అర్థమవుతోంది. దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్!
Comments
Please login to add a commentAdd a comment