జిల్లాలో 81 శాతం పోలింగ్ నమోదు | 81 per cent of the recorded polling in the district | Sakshi
Sakshi News home page

జిల్లాలో 81 శాతం పోలింగ్ నమోదు

Published Wed, Apr 30 2014 10:55 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

81 per cent of the recorded polling in the district

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఫలితంగా భారీ పోలింగ్ నమోదైంది. చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. జిల్లాలో 10 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 81 శాతం పోలింగ్ నమోదైంది. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 6 శాతం ఎక్కువ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిత్మా సబర్వాల్ తెలిపారు. అత్యధికంగా నర్సాపూర్ నియోజకవర్గంలో 86 శాతం, అత్యల్పంగా సిద్దిపేట నియోజకవర్గంలో 75 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

నిన్న మొన్నటి వరకు నిప్పులు చెరిగిన సూర్యుడు   ఎన్నికల వేళ ఓటర్లకు సహకరించాడు. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతం కావడంతో వాతావరణం చల్లబడింది. పలు చోట్ల టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. యువ ఓటర్లు భారీగా పోలింగ్‌లో పాల్గొన్నారు. యువ ఓటర్లు రాకతో  అభ్యర్థుల గెలుపు ఓటముల తలకిందులయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 2,678  పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో 20 శాతం కేంద్రాల్లో ఈవీఏంలు మొరాయించడంతో అధికారులు ఉరుగులు పరుగులు పెట్టారు. మనూరు మండలం దన్వాడ గ్రామంలో ఎంపీ అభ్యర్థి కోసం ఏర్పాటు చేసిన  ఈవీఎంలో ఏ బటన్ నొక్కినా చెయ్యి గుర్తుకే ఓటు పడుతుందని ఓటర్లు ఫిర్యాదు చేశారు.

 ఎన్నికల అధికారి పరిశీలనలో కూడా అలానే జరుగుతోందని నిర్ధారణ కావడంతో ఈవీఎంను మార్చారు. అయితే అప్పటికే 71 ఓట్లు పడటంతో వాటిపై ఎన్నికల అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గులాబీ దళపతి కేసీఆర్ హెలికాప్టర్‌లో వచ్చి తన స్వగ్రామం చింతమడకలో ఓటు వేశారు. మెదక్ మండలం మద్దులవాయి గ్రామంలో  ఓ ఎన్నికల అధికారి వృద్ధుల ఓట్లను కారు గుర్తుకు వేయిస్తున్నారని ఆరోపిస్తూ విజయశాంతి పోలింగ్ కేంద్ర ఎన్నికల ప్రిసైడింగ్  అధికారితో వాదనకు దిగారు. ఆయనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం బంజరుపల్లిలో ఓటర్లపై ఎస్‌ఐ కోటయ్య, తూప్రాన్ మండలం కోనాయపల్లి(పిపి) గ్రామంలో ఎస్‌ఐ అనిల్‌రెడ్డి ఓటర్లపై  దురుసుగా ప్రవర్తించారు. అనిల్‌రెడ్డి ఓటర్లపై అకారణంగా దాడి చేశారని గ్రామస్థులు ఆరోపిస్తూ ఆయా గ్రామాలకు చెందిన ఓటర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఓటర్లు కులాల వారీగా విడిపోయి డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని భీష్మించి కూర్చున్న సంఘటనలు పలు నియోజకవర్గాల్లో  కనిపించింది.

   ఇలాంటి సంఘటనతో ఓటర్ల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం, అందోల్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జహీరాబాద్ నియోజకవర్గం కేంద్రం పాటు, కోహీర్, ఝరాసంగం మండలాల్లో సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో ఓటర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

 మెదక్ నియోజకవర్గం
 ఉదయం ఏడుగంటలకే మెదక్, పాపన్నపేట మండలాల్లో స్వల్పంగా వర్షం కురవడంతో ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు.

మెదక్ పట్టణంలోని పిట్లంబేస్, న్యూహైస్కూల్, గీత కాలేజీ, మండలంలోని రాజ్‌పల్లి, పేరూర్, మాచవరం, పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి, చిన్నశంకరంపేట మండలం మడూర్, రామాయంపేట మండలంలో పర్వతపూర్, అక్కన్నపేట, కె. వెంకటపూర్ గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలీంగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

మెదక్ మండల పరిధిలోని మద్దులవాయి గ్రామంలో ప్రిసైడింగ్ అధికారి మదన్‌మోహన్‌రావు ఓపార్టీకి మద్దతుగా ఓటర్లను తప్పుదారి పట్టించి ఓట్లు వేయించారంటూ గ్రామస్థులు ఆరోపించడంతో పోలింగ్ పది నిమిషాల పాటు ఆగిపోయింది. అనంతరం అక్కడికి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి ప్రిసైడింగ్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 నర్సాపూర్ నియోజకవర్గం:
 వెల్దుర్తి మండలం బొమ్మారంలోని 22వ పోలింగ్‌స్టేషన్‌లో 50మంది ఓట్లు వేశాక ఈవీఎం పనిచేయకపోవడంతో 30 నిమిషాల పాటు పోలింగ్ ఆగిపోయింది.

 మాసాయిపేటలో, కుకునూర్‌లో  పోలింగ్ ప్రారంభంలోనే ఈవీఎం పనిచేయక పోవడంతో కొత్తవాటితో పోలింగ్ ప్రారంభించారు.

 కొల్చారం  మండలం ఎనగండ్లలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరగడ ంతో వారిని చెదర గొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.

     రంగంపేటలో ఈవీఎం పనిచేయకపోవడంతో 20 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.

 శివ్వంపేట మండలం గోమారంలో మంగళవారం రాత్రి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. టీఆర్‌ఎస్ దాడిలో కాంగ్రెస్‌కు చెందిన పలువురికి గాయాలయ్యాయి. సర్పంచ్ చంద్రాగౌడ్‌తో పాటు మరో 11మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు పంపారు.

 చెన్నాపూర్ గ్రామ సేవకునిపై టీఆర్‌ఎస్ నాయకులు దాడి చేయగా టీఆర్‌ఎస్ నాయకుడు భిక్షపతితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు అయింది.

     కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతారెడ్డి ఆమె స్వగ్రామమైన గోమారంలో ఓటు వేశారు.

     కౌడిపల్లి మండలంలోని అంతారంలో ఈవీఎం పనిచేయక పోవండతో 30 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.

     కౌడిపల్లికి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు చేయి చేసుకోవండతో కొంత సేపు గందరగోళం నెలకొంది.

     హత్నూర మండలంలోని సాదుల్లానగర్‌లో ఈవీఎం పని చేయక పోవడంతో 40 నిమిషాల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.

     దౌల్తాబాద్‌లో ఆయా పార్టీల ఏజెంట్లు రాకపోవడంతో 20 నిమిషాల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.

     మంగాపూర్‌లో 12మంది ఓటు వేశాక ఈవీఎం పనిచేయక పోవడంతో 30నిమిషాల పాటు పోలింగ్ నిలిచింది.

 గజ్వేల్ నియోజకవర్గం
గజ్వేల్‌లో బుధవారం తెల్లవారుజామున టీడీపీ నాయకులు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్న క్రమంలో తాము వీడియో చిత్రీకరించేందుకు యత్నించగా దాడి చేశారని టీ-న్యూస్ ఛానెల్ విలేకరి భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు టీడీపీ అభ్యర్థి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి, అతని అనుచరులపై పోలీసులు  కేసు నమోదు చేశారు.

 {పతాపరెడ్డిని కొద్దిసేపు పోలీసులు  గృహనిర్భంధంలో ఉంచారు. అనంతరం వదిలేశారు.

 తూప్రాన్ మండలం కోనాయిపల్లిలో యాదగిరిపై అతని కుటుంబీకులపై అకారణంగా ఎస్‌ఐ అనిల్‌రెడ్డి దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులంతా మూకుమ్మడిగా రెండుగంటలపాటు ఎన్నికలను బహిష్కరించి, సదరు ఎస్‌ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

తహశీల్దార్ స్వామి గ్రామానికి చేరుకొని, విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో పోలింగ్ పునఃప్రారంభమైంది.

 తూప్రాన్ మండలం కుచారం తండాకు చెందిన గిరిజనులు ఎన్నికల్లో ఎవరు గెలిచినా తమకు రోడ్డు సౌకర్యం కల్పించడంలో విఫలమవుతున్నారని ఆరోపిస్తూ ఓటు వేయడానికి నిరాకరించారు. అధికారులు ఒప్పించి వారితో ఓటు వేయించారు.  

నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో కొత్త ఓటర్ల పేర్లు జాబితాలో గల్లంతు కావడం ఓటు వేయకుండా వెనుతిరిగి వెళ్లారు.

 పటాన్‌చెరు నియోజకవర్గం...
ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికీ కార్పొరేటు కంపెనీలు కార్మికులకు సెలవు ఇవ్వలేదు. గేట్లకు ‘మూసివేయబడినది’ అనే నోటీసు అంటించి లోపల మాత్రం కార్మికులతో పని చేయించుకున్నట్టు సమాచారం అందింది.

 పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లోని జీటీఎన్ టెక్సటైల్ పరిశ్రమను ఎన్నికల టాస్క్‌ఫోర్సు సీజ్ చేసింది. సెలవు ఇవ్వకుండా పరిశ్రమ నడుపుతుండటంతో సీజ్ చేశారు.

 పటాన్‌చెరులోని జీహెచ్‌ఎంసీ పోలింగ్ కేంద్రంలోని 113 పీఎస్ నంబర్‌లో ఈవీఎం మొరాయించింది. దీంతో 45 నిమిషాల పాటు పొలింగ్ నిలిచింది.

 సంగారెడ్డి నియోజకవర్గం
 సదాశివపేట మండలం  నిజాంపూర్ ఏడవ నంబరు పోలింగ్ బూత్‌లో వెంకటాపూర్ జడ్పీహెచ్‌ఎస్, వెల్టూరు గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల్లో అరగంటపాటు పోలింగ్ ఆగింది.

 పోలింగ్ కేంద్రాల్లో సరైన వసతులు లేవు. వెలుతురు లేదు. తాగునీటి సౌకర్యం కల్పించలేదు. ఎండతీవ్రతకు పలుచోట్ల ఓటర్లు ఇబ్బందులు పడాల్సివచ్చింది.

 నందికందిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.

 ఎద్దుమైలారంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలతో కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు.

 జహీరాబాద్ నియోజవర్గం
 జహీరాబాద్ మండలం అల్గోల్,హోతి(కె),పట్టణంలోని గడి, న్యాల్‌కల్ మండలంలోని మిరియంపూర్, రత్నాపూర్, డప్పుర్, కోహీర్ మండలంలోని కవేలి పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎం మోరాయించాయి. దీంతో పోలింగ్‌కు కొద్ది సేపు అంతరాయం కలిగింది.  
 జహీరాబాద్, కోహీర్, ఝరాసంఘంలో మధ్యాహ్నం గంట పాటు భారీ వర్షం కురిసింది.  

 అందోల్ నియోజకవర్గం
 జోగిపేటలో 184, 172, మర్వెళ్లిలోని 97, రెడ్డిపల్లిలోని పోలింగ్‌బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమయ్యింది.

 రేగోడ్ మండలం వెంకటాపూర్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా 15 నిమిషాలు పోలింగ్‌ను నిలిపివేశారు. పోలీసుల జోక్యంతో తిరిగి ప్రారంభించారు.

 సిద్దిపేట నియోజకవర్గం
 సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు, ఎన్జీఓ భవన్, పీఆర్ కార్యాలయం, శుభోదయ, సిద్దిపేట మండలంలోని ఎన్సాన్‌పల్లి, చిన్నగుండవెల్లి, లింగారెడ్డిపల్లి, బుస్సాపూర్ తదితర పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించాయి.

 గ్యాస్ గోదాంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో  200 ఓట్లు గల్లంతయ్యాయి.

మండల పరిధిలోని కోనాయిపల్లి గ్రామంలో 95 శాతం పోలింగ్ నమోదైంది.

 నారాయణఖేడ్ నియోజకవర్గం
ఖేడ్ పట్టణంలోని మంగల్‌పేట్ ప్రాథమిక పాఠశాలలో, మండలంలోని నిజాంపేట్, జూకల్ గ్రామాల్లో అలాగే, మనూరు మండలంలోని  ధన్వార్, మనూరు, కరస్‌గుత్తి, ఇరక్‌పల్లి గ్రామాల్లోని ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది.

 ధన్వార్‌లో లోక్‌సభకు సంబంధించిన అభ్యర్థి ఈవీఎంలో ఎవరికి ఓటు వేసినా నాలుగో నంబరు అభ్యర్థికే సిగ్నల్ చూయించడంతో  ఓటర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. జోనల్ అధికారులు వచ్చి మరో ఈవీఎంను ఏర్పాటు చేశారు. అప్పటికే  70 ఓట్లకు పడ్డాయి. దీనిపై అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.  

 దుబ్బాక నియోజకవర్గం
 మిరుదొడ్డి మండలం రుద్రారంలో మంగళవారం రాత్రి టీఆర్‌ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయటంతో గ్రామంలో బుధవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

 దుబ్బాక మండలం లచ్చపేట, దౌల్తాబాద్ మండలం రాయపోల్,మిరుదొడ్డి మండలం మల్లుపల్లిలో ఈవీఎంలు మోరాయించటంతో ఆలస్యంగా ఓటింగ్ జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement