
కొల్లాపూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యాన జరిగిన ప్రజాగ్రహ సభకు హాజరైన ప్రజలు. మాట్లాడుతున్న భట్టి విక్రమార్క
కొల్లాపూర్/అచ్చంపేట: ‘తెలంగాణలో దొరల పాలన కావాలో, ప్రజా పాలన కావాలో.. ప్రజలే నిర్ణయించుకోవాలి. ఈ ఎన్నికల్లో దొరలు – ప్రజలకు మధ్య పోరాటం జరగబోతోంది. ఈ పోరాటంలో విజయం ఎవరిదో నిర్ణయించేది మీరే.. తెలంగాణ సమాజం భయంతో బతుకుతోంది. ప్రశ్నించే గొంతుకలు మౌనం వహిస్తున్నాయి. ఈ దొరల పాలనకు చరమగీతం పలికి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం’అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మూడు రోజులుగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజైన శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేటల్లో ‘ప్రజాగ్రహ సభలు’ ఏర్పాటు చేశారు. తొలుత కొల్లాపూర్‌లోని రాజాబంగ్లా ఎదుట కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి హర్షవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో, తర్వాత అచ్చంపేటలో భట్టి విక్రమార్క ప్రసంగించారు.
అప్పుల రాష్ట్రంగా మార్చారు..
రాష్ట్ర బడ్జెట్‌ను కేసీఆర్ కుటుంబం నాలుగేళ్లుగా దోచుకుతింటోందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. సిరిసిల్లలో దళితులను హింసించింది, ఇసుక అక్రమాలకు పాల్పడింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలను కేసీఆర్ మోసం చేశారన్నారు. అటవీ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టాలిస్తే, వాటిని బలవంతంగా లాక్కునేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందన్నారు. వైఎస్సార్ హయాంలోనే పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు నిర్మించి, వాటిని ప్రారంభించామన్నారు. అందులో మిగిలిన కొన్ని పనులను పూర్తిచేసి ప్రాజెక్టులన్నీ తామే నిర్మించామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మంత్రి జూపల్లి కృష్ణారావు పోజులిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దోచేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఒకే దఫాలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని, సోమశిల బ్రిడ్జి నిర్మిస్తామని, బీసీ సబ్‌ప్లాన్‌ను తీసుకొస్తామని అన్నారు.
‘చీప్’మినిస్టర్
రాష్ట్రానికి కేసీఆర్ చీఫ్ మినిస్టర్‌లా పనిచేయడం లేదని, ఆయన వ్యవహారమంతా ‘చీప్’మినిస్టర్‌లా ఉందని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. ‘దొరా అన్నీ గమనిస్తున్నాం.. బడుగులను ఆగం చేస్తున్నవు దొరా... ఇక బాంచన్ బతుకులు మాకొద్దు దొరా’అంటూ ధ్వజమెత్తారు. 2014లో చిన్న తప్పు చేసి రాష్ట్ర ప్రజలంతా పెద్దశిక్షను అనుభవిస్తున్నారన్నారు. అటువంటి తప్పు మరోసారి చేయొద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు మెచ్చే మేనిఫెస్టోతో వస్తోందని పేర్కొన్నారు.
కేసీఆర్‌కు హఠావో
‘కేసీఆర్‌కు హఠావో.. తెలంగాణకొ బచావో’అని ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేసీఆర్ మోసాలపై యువత తిరగబడాల్సిన అవసరం వచ్చిందన్నారు.
టీఆర్‌ఎస్ ఓటమి ఖాయం
టీఆర్‌ఎస్ పార్టీ ఓటమి ఖాయమైపోయిందని, అందుకే ఆ పార్టీ ముందస్తుకు సిద్ధమైందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం, పాలమూరు జిల్లాను జూపల్లి కృష్ణారావు దోచుకుతింటున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఇసుక మాఫియా నడుపుతోంది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. బానిస బతుకులు పోవాలంటే, ప్రజలు స్వేచ్ఛగా బతకాలనుకుంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఓడించాలన్నారు. ఈ సభలో ఎంపీ నంది ఎల్లయ్య, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ తదితరులు ప్రసంగించారు.
అచ్చంపేటలో కూలిన స్టేజీ
కొల్లాపూర్‌లో సభ అనంతరం కాంగ్రెస్ నేతలు హెలికాప్టర్‌లో అచ్చంపేటకు చేరుకున్నారు. ఇక్కడ ప్రజాగ్రహ సభ సందర్భంగా నేతలు స్టేజీపై ఎక్కి ప్రసంగానికి సిద్ధమయ్యారు. అయితే, పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కూడా స్టేజీపైకి ఎక్కడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు తగలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం నాయకులు ప్రచార రథంపైకి చేరుకుని ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment