సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మాటలను చూస్తుంటే రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్టుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని దివాలా తీయించి, పాలన చేయలేక ప్రైవేటీకరణ పాట పాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే రాష్ట్రంలో అతి పెద్దదైన ఆర్టీసీ కార్పొరేషన్ దివాలా తీసిందని ఆరోపించారు. ఆరేళ్లలో ఆర్టీసీని దివాలా తీయించి ఇప్పుడు ప్రైవేటుపరం చేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల మరణాలకు ప్రతిపక్షాలు కారణం కాదని, ప్రభుత్వమేనని భట్టి అన్నారు. ఆర్టీసీ కార్మికుల గురించి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను ప్రజలు అడుగుతున్నారని, కార్మికుల డిమాండ్లు సరైనవి కాబట్టే ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేయడం అంటే ఆర్టీసీని అమ్మేయడమేనని అన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment