నా నియోజకవర్గానికి రండి  | Bhatti Vikramarka Speaks In Debate Of Budget | Sakshi
Sakshi News home page

నా నియోజకవర్గానికి రండి 

Published Mon, Mar 16 2020 3:50 AM | Last Updated on Mon, Mar 16 2020 3:50 AM

Bhatti Vikramarka Speaks In Debate Of Budget - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటింటికి నల్లా నీరు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు చాలా తేడా ఉందని అసెంబ్లీ కాంగ్రెస్‌పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ‘స్పీకర్‌ గారు మీరు నా నియోజకవర్గానికి రండి. గ్రామాల్లో మిషన్‌ భగీరథ అమలు తీరు ఎలా ఉందో తెలుస్తుంది’అని పేర్కొన్నారు. ఆదివారం అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ కూడా వేయలేదని, వయసు మీరుతోందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువతను పట్టించుకోకపోవడం దారుణమని దుయ్యబట్టారు.

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, 2014లో మొదలుపెట్టిన రోడ్లు ఇప్పటికీ అసంపూర్ణంగానే మిగిలిపోయాయని, లింకు రోడ్లు, గ్రామాలను అనుసంధానం చేసే మార్గాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఒక్క అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటు చేయలేదని, ఇప్పటికైనా జిల్లాకో అగ్రి పాలిటెక్నిక్‌ కాలేజీ స్థాపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతుల్లేని కార్పొరేట్‌ విద్యాసంస్థల సంఖ్య పెరిగిపోయిందని, ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి వీటికి ముకుతాడు వేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, దీన్ని ప్రాధాన్యాంశంగా పరిగణనలోకి తీసుకుని తక్షణమే పీహెచ్‌సీల్లో సిబ్బందిని భర్తీ చేయాలని, ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునికంగా తీర్చిదిద్దాలని కోరారు.

సీఎం వ్యాఖ్యలు అభ్యంతరకరం 
కాంగ్రెస్‌ పార్టీనే దేశానికి పట్టిన కోవిడ్‌ వైరస్‌ అని, కొందరు రాజకీయాలు చేస్తూ శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని శనివారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఆదివారం ఉదయం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పార్టీ ఎమ్మెల్యేలతో కలసి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఆయన చాంబర్‌లో కలిశారు. సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, సీఎం తీరును నియంత్రించి తమ కు అండగా నిలవాలని కోరారు. అనంతరం మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడిన భట్టి.. ప్ర పంచ దేశాలన్నీ కోవిడ్‌ పట్ల ఇప్పటికే అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకున్నాయని, అసెంబ్లీ లో కనీస చర్యలు తీసుకోలేదని విమర్శించా రు. అసెంబ్లీ ప్రాంగణంలో శానిటైజర్లు అం దుబాటులో లేకపోవడం సరైందికాదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement