గవర్నర్ తమిళిసైకి వినతిపత్రం ఇస్తున్న భట్టి. చిత్రంలో జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని, పోలీసులు పోలీసుల్లాగా పనిచేయకపోవడంతో ప్రజల్లో రక్షణ భావం లేకుండా పోతోందని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) ఆరోపించింది. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకుని టీఆర్‌ఎస్ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా రాష్ట్రంలోని పోలీసులు ప్రజల పక్షాన పనిచేసేలా చూడాలని కోరింది. ఈ మేరకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్కలు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, వామనరావు, నాగమణి అడ్వొకేట్ దంపతుల హత్య, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య, దిశ అత్యాచార ఘటన, హాజీపూర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడడం, హన్మకొండలో 9 నెలల బాలికపై అత్యాచారం, మరియమ్మ లాకప్‌డెత్, శీలం రంగయ్య లాకప్‌డెత్ లాంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.
2021లో కేసుల సంఖ్య పెరిగిందని స్వయంగా డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గణాంకాలతో సహా వెల్లడించారని గుర్తుచేశారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఆందోళనలకు పిలుపునిస్తే హౌస్ అరెస్టులు చేసి పార్టీ నేతలను బయటకు రానీయకుండా చేస్తున్నారని, ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో మభ్యపెడుతూ పోలీసులు ప్రతిపక్ష నేతలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment