
సాక్షి, హైదరాబాద్: సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నారు. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చురుకుగా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఆర్‌సీ కుంతియా తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీతో విజయశాంతి సమావేశం అయినట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె ఈ సందర్భంగా రాహుల్‌కు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో విజయశాంతి చురుకుగా పాల్గొంటారని, కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేస్తారన్నారు.
కాగా విజయశాంతి గత కొన్నాళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే రేవంత్ చేరికపై ఆమె అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమెకు పార్టీలో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయశాంతి రాహుల్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక గత ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయశాంతి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment