పండగ తెచ్చారు | tollywood heros latest movie releases during diwali festival | Sakshi
Sakshi News home page

పండగ తెచ్చారు

Published Sun, Oct 27 2019 4:16 AM | Last Updated on Sun, Oct 27 2019 11:05 AM

tollywood heros latest movie releases during diwali festival - Sakshi

ఈ దీపావళికి సినిమా అభిమానుల మనసుకి సంతోషమనే వెలుగును అందించింది టాలీవుడ్‌. కొత్త సినిమా ప్రకటనలు, చిత్రీకరణ విశేషాలు, కొత్త పోస్టర్స్‌తో దీపావళి సంబరాలను డబుల్‌ చేసింది. బాలకృష్ణ హీరోగా కేఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న సినిమాకు ‘రూలర్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు బాలకృష్ణ. సి. కల్యాణ్, సి.వి. రావ్, పత్సా నాగరాజు నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబరు 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఆర్మీ మేజర్‌ అజయ్‌కృష్ణ పాత్రలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దాదాపు పదమూడేళ్ల తర్వాత ఈ సినిమాలో నటిస్తున్నారు విజయశాంతి. దీపావళి సందర్భంగా ఈ సినిమాలోని మహేశ్‌ కొత్త పోస్టర్‌తో పాటు, విజయశాంతి ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ‘అల.. వైకుంఠపురమలో..’ని ‘రాములో రాములా’ పాట టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు.

సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరకర్త. ‘రాములో రాములా’ పూర్తి పాటను విడుదల చేశారు. జనవరి 12న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్‌ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వెంకీమామ’. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల నిర్మాతలు. ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఖాకీ తొడిగి, లాఠీ పట్టి మరోసారి పోలీసాఫీసర్‌గా డ్యూటీ చేయనున్నారు రవితేజ.

పూజా హెగ్డే, అల్లు అర్జున్‌

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో హీరోగా తన కొత్త సినిమా మొదలుకానున్నట్లు ప్రకటించారు రవితేజ. బి. మధు నిర్మించనున్నారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’. ‘‘టైటిల్‌ని బట్టి ఇది రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య జరిగే ఇతివృత్తం అనుకుంటారు కానీ, ఈ చిత్రకథాంశం అది కాదు. ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేసి, సినిమాను నవంబర్‌లో విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తున్న ‘ఎంతమంచి వాడవురా’ సినిమా చిత్రీకరణ ఈ నెల 31 నుంచి నవంబరు 10వరకు కేరళలో జరగనుంది.

‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాలో ఓ దృశ్యం

శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 15న విడుదల కానుంది.  సాయితేజ్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌కేఎన్‌ సహ–నిర్మాత. డిసెంబరు 20న విడుదల కానుంది. ఆది పినిశెట్టి నటిస్తున్న చిత్రం ‘క్లాప్‌’. పృథ్వీ ఆదిత్య దర్శకుడు. ఐబీ కార్తికేయన్‌ నిర్మాత. పి. ప్రభాప్రేమ్, మనోజ్, హర్ష సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

కల్యాణ్‌రామ్,  మెహరీన్‌

నిఖిల్‌ హీరోగా నటించిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో రాజ్‌కుమార్‌ అకెళ్ల నిర్మాణంలో టి. సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 29న విడుదల కానుంది. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ నటిస్తున్న ‘సూపర్‌ మచ్చి’ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. రిజ్వాన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు పులివాసు దర్శకుడు. నవీన్‌చంద్ర హీరోగా జి కార్తీక్‌ రెడ్డి దర్శకత్వంలో భార్గవ్‌ మన్నె నిర్మిస్తున్న ‘హీరో హీరోయిన్‌’ కొత్త పోస్టర్‌ రిలీజ్‌ అయింది. ఈ దీపావళి పండగ ఇంకా చాలా పోస్టర్లను మోసుకొచ్చింది. బోలెడన్ని విశేషాలను తెచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement