సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జబితా కసరత్తు కొలిక్కి వచ్చింది. పార్టీ స్క్రీనింగ్ కమిటీ గురువారం తొలి జాబితాకు తుది రూపం ఇచ్చింది. ‘మిస్టర్ కూల్’ శివతాండవం.. ‘ఫైర్‌బ్రాండ్’ మౌనవ్రతం వంటివి మెతుకు సీమ కాంగ్రెస్‌కు సిట్టింగు ఎమ్మెల్యేలకు కలిసొచ్చాయి. నందీశ్వర్‌గౌడ్ విశ్వరూపాన్ని చూసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలను కదిలించడానికి వెనుకడుగు వేసినట్టు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 8 మంది సిట్టింగుల్లో ఒక్క నారాయణఖేడ్ మినహా మిగిలిన అన్ని చోట్ల మళ్లీ పాతకాపులకే టికెట్లు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
అందోల్- దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి- జగ్గారెడ్డి, పటాన్‌చెరు- నందీశ్వర్‌గౌడ్, దుబ్బాక- చెరుకు ముత్యంరెడ్డి, గజ్వేల్- నర్సారెడ్డి, జహీరాబాద్- గీతారెడ్డి, నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప జాబితాలో మార్పు ఉండే అవకాశం లేదని కాంగ్రెస్ కరాఖండికండీగా చెప్తున్నారు. నారాయణఖేడ్ అసెంబ్లీ నుంచి ప్రస్తుత ఎంపీ సురేష్ షెట్కర్‌ను రంగంలోకి దింపి, జహీరాబాద్ ఎంపీ సీటు మైనార్టీ నాయకుడు ఫరీదుద్దిన్‌కు కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అందువల్లే నారాయణఖేడ్ అసెంబ్లీ సీటును ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇవ్వకుండా ఖాళీపెట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సీపీఐ నేతలతో సమావేశమై పొత్తుల విషయంపై చర్చిస్తారు. అదే రోజు సీపీఐ అడిగిన సీట్ల జాబితాను ఢిల్లీ అధిష్టానం ముందుపెట్టనున్నట్లు సమాచారం. సీపీఐ కోరిన సీట్లను ఆ పార్టీకి వదిలేసి మరో జాబితా సిద్ధం చేయనున్నట్లు తెలిసింది.
అయితే జిల్లా నుంచి సీపీఐకి సీట్లు ఇచ్చే అవకాశం లేదని ప్రాథమికంగా తెలుస్తోంది. ఒకేవేళ తప్పని పరిస్థితి తలెత్తితే ఆ పార్టీ బలంగా ఉన్న చోట సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతా సవ్యంగా సాగితే శనివారం సాయంత్రం, లేదా ఆదివారం రోజున తొలి జాబితా వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
ఇదిలా ఉండగా.. అసెంబ్లీ అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుపై అనేక ఊహాగానాలు, అనుమానాలు వెలువడ్డాయి. ముఖ్యంగా పటాన్‌చెరు, సంగారెడ్డి, దుబ్బాక, నర్సాపురం, సీట్లపై పుకార్లు షికార్లు చేశాయి. సంగారెడ్డి నియోజకవర్గంపై డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. తన వర్గానికి చెందిన ఐకేపీ మహిళలతోనూ, అనుచరులతో కలిసి తూర్పు జగ్గారెడ్డిపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. సీటు దాదాపు పద్మినీరెడ్డికే ఖరారు అయిందని ప్రచారం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత మాజీ డిప్యూటీ స్పీకర్, సంగారెడ్డి నుంచి ఐదు పర్యాయాలు గెలిచిన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి కొడుకు నిరూప్‌రెడ్డికి టికెట్ వస్తుందని పుకార్లు వచ్చాయి.
అన్ని అనుమాలకు తెర వేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగ్గారెడ్డికే మళ్లీ టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి టికెట్ కోసం డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి భూపాల్ రెడ్డి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. రాహుల్ గాంధీని కలిసి తనకు సీటు ఇవ్వాలని కోరారు. డీసీసీ అధ్యక్షుని హోదాలో ఏఐసీసీకి పంపిన ముగ్గురు ప్రాపబుల్స్ పేర్లలో తన పేరుతో పాటు తన అనుచరుల పేర్లను మాత్రమే చేర్చి సిట్టింగు ఎమ్మెల్యే పేరు చేర్చక పోవడంతో ఆగ్రహించిన నందీశ్వర్‌గౌడ్ టీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో దిగివచ్చిన అధిష్టానం ఆయనకే కాదు సిట్టింగులందరికి టికెట్ ఇస్తామని సూచన ప్రాయంగా తెలిపింది.
దుబ్బాక నియోజక వర్గంలో ఈసారి చెరుకు ముత్యంరెడ్డితో భూపతి మనోహర్‌రావు, బండి నర్సాగౌడ్ పోటీపడ్డారు. మనోహర్‌గౌడ్ రెండు సార్లు రాహుల్‌గాంధీని కలిసి టికెట్ కోసం ప్రయత్నం చేశారు. ముత్యంరెడ్డిపై ఉన్న వ్యతిరేకతను ఎత్తిచూపించి అధిష్టానం ఒప్పించే ప్రయత్నం చేశారు. ఒక దశలో తనకు టికెట్ రాదేమోనని అనుమానించిన ముత్యంరెడ్డి తనకు కాకుంటే తన కుమారుడు శ్రీనివాసరెడ్డికైనా టికెట్ ఇవ్వాలనే వాదన తెరమీదకు తెచ్చారు. నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీతారెడ్డికి పోటీగా ఎవరు లేనప్పటికీ సీపీఐ పార్టీతో పొత్తుల నేపథ్యంలో ఆమె సీటుకు ప్రమాదం ఉందనే సంకేతాలు వచ్చాయి.
ఆమె సీటుకు ఢోకా లేదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కాగా నర్సాపూర్ టికెట్ కోసం చివరి వరకు పట్టుబడతామని సీపీఐ జిల్లా కమిటీ చెప్తోంది. వారి మాటలను బట్టి చూస్తే సునీతారెడ్డి సీటుకు పొత్తుల ప్రమాదం ఇంకా పొంచి ఉందనే చెప్పొచ్చు. జిల్లాకే చెందిన మరో మాజీ మంత్రి గీతారెడ్డి తన కుటుంబం నుంచి రెండు సీట్ల కోసం ప్రయత్నం చేశారు. జహీరాబాద్ టికెట్‌ను తన కూతురు మేఘనారెడ్డికి, మల్కాజ్‌గిరి అసెంబ్లీ టికెట్ తనకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ దిశగా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఆమె పాత సీటుకే టికెట్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. నారాయణఖేడ్ నియోజకవర్గంపైనే కొంత సందిగ్థత ఏర్పడింది. ప్రస్తుతం ఎంపీ సురేష్ షట్కర్‌ను ఎమ్మెల్యేగా పంపిచే అవకాశాలను అధిష్టానం యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే నారాయణఖేడ్‌పై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చని సమాచారం.
సిట్టింగ్‌లకు గ్రీన్ సిగ్నల్!
Published Thu, Mar 27 2014 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM
Advertisement
Advertisement