సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పుట్టింట్లో పట్టుకోసం టీఆర్‌ఎస్ పాట్లు పడుతోంది. జిల్లాలో రాజకీయంగా ‘ఫాం’లోకి రావడానికి ‘ఫాంహౌస్’ మీదే ఆశలు పెట్టుకుంది. ఉద్యమ పరంగా ముందున్న తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయంగా నియోజకవర్గంలో చాలా వెనుకబడి ఉంది. దాదాపు ఆరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు బలమైన పునాదులు లేవు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే సిద్దిపేట, దుబ్బాక మీదనే ఆ పార్టీకి ఆశలు సజీవంగా ఉన్నాయి. మెదక్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ ఇప్పటికే ఇక్కడ వర్గపోరు మొదలైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు గులాబీ దళపతి వేస్తున్న ఎత్తులు.. జిత్తులు చిత్తయిపోతున్నాయి.
‘హ్యాండిచ్చి’ జారుకున్నారు...
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించడం.. టీఆర్‌ఎస్ నేతల కోసం రెడ్ కార్పెట్ పరవటం... మరోవైపు ‘టీఆర్‌ఎస్ వాళ్లు కాంగ్రెస్‌లోకి పోతారో, కాంగ్రెస్ వాళ్లు టీఆర్‌ఎస్‌లోకి వస్తారో చూద్దాం’ అంటూ ఆ మరుసటి రోజే గులాబీ దళపతి కేసీఆర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అదే ఊపు మీద కేసీఆర్ పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ మీద వల విసిరారు. ఫాంహౌస్ విందుకు పిలిచి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌లో చేరటం దాదాపు ఖాయమనే నందీశ్వర్‌గౌడ్ సంకేతాలు పంపించారు. ఇక గులాబీ కండువా కప్పుకోవడమే తరువాయి అనుకున్న సమయంలో ఆయన హ్యాండిచ్చి జారిపోయారు.
ఇదే జిల్లా నుంచి ఇద్దరు మాజీ మంత్రులకు కూడా కేసీఆర్ గాలం వేశారు. వారిని ఒప్పించి పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డికి అప్పగించినట్టు, ఆయన ఆ ఇద్దరు మాజీ మంత్రులను ఒప్పించే ప్రయత్నం చేసినట్టు సమాచారం. వారిద్దరి చేరిక దాదాపు ఖారారైనట్టే అని, రేపో మాపో పార్టీలో చేరిపోతారని టీఆర్‌ఎస్‌లోనే ఒక వర్గం మీడియాకు లీకుల మీద లీకులు ఇచ్చింది. ఈ లీకులపై స్పందించిన సదరు మాజీ మంత్రి ఒకరు పార్టీ మారే ప్రసక్తి లేదని, మాది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబమేనని, పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. ఇక మరో మాజీ మంత్రి కోసం ప్రయత్నం చేస్తే ముందు పొత్తుల విషయం తేలనివ్వండి ఆ తర్వాత ఆలోచన చేద్దాం అన్నట్లు ప్రచారం జరుగుతోంది.
దళిత నాయకుడు, ముఖ్యమంత్రి రేసులో ఉన్న దామోదర రాజనర్సింహకు చెక్ పెట్టడానికి కేసీఆర్ వేసిన రెండు ఎత్తులు పని చేయలేదు. ముందుగా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రిని పార్టీలోకి ఆహ్వానించారు. మొదటి నుంచి ఆయనకు కేసీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్ని సార్లు పిలిచినా ఆయన పార్టీలోకి రాకపోయేసరికి కేసీఆర్‌కు కోపం వచ్చి సదరు మాజీ మంత్రి పార్టీలోకి వచ్చినా తీసుకునేది లేదని తన అనుచరులతో తెగేసి చెప్పినట్టు సమాచారం. ఆయన బదులుగా ప్రజా కళాకారుడు రసమయి బాలకిషన్‌ను జోగిపేటకు పంపేందుకు కేసీఆర్ సూచనప్రాయంగా ప్రతిపాదించారు. ఇక గతంలో పార్టీని వీడి ఇటీవలే మళ్లీ చేరిన ఆయన్ను జోగిపేట నుంచి పోటీ చేయించాలని ప్రయత్నం చేశారు.
ఆట పాటలతో రాజనర్సింహను కట్టడి చేయాలని టీఆర్‌ఎస్ నేతలు కొందరు రసమయికి సూచించగా... కేసీఆర్ పాచికలను ముందే పసిగట్టిన బాలకిషన్ మానకొండూరు తప్ప మరోచోట పోటీ చేయనని తెగేసి చె ప్పినట్లు సమాచారం.
జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల కంటే ప్రత్యర్థి పార్టీ నేతల వలసల మీదనే కేసీఆర్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ప్రత్యర్థి పార్టీల నుంచి రెండో శ్రేణి నాయకత్వం, అంతకంటే తక్కువ స్థాయి నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. జాక్‌పాట్ కొట్టగలిగే నేతలు పార్టీలో చేరేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో కేసీఆర్ మరింత పదునుతో మరో ఎత్తుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
గు‘లాబీ’!
Published Wed, Mar 19 2014 11:27 PM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM
Advertisement