కాంట్రవర్సీలు చేయడం ఆయనకు అలవాటే...
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దిగ్విజయ్ తీరు వల్ల కాంగ్రెస్సే నష్టపోతోందని, కాంట్రవర్సీలు చేయడం ఆయనకు అలవాటు అని డీఎస్ మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, ఇందుకు సంబంధించి దిగ్విజయ్‌పై కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డీఎస్ డిమాండ్ చేశారు.
దిగ్విజయ్ పోలీసులపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ముస్లిం యువకులను ఐసిస్ వైపు పోలీసులు ప్రోత్సహిస్తున్నారనటం అర్ధరహితమన్నారు. దిగ్విజయ్‌వి తెలివితక్కువ మాటలని ఎద్దేవా చేశారు. రోజుకో మాట మాట్లాడే సంస్కృతి దిగ్విజయ్ సింగ్‌ది అన్నారు.
కాగా తెలంగాణ పోలీసులు ఐసిస్ పేరిట నకిలీ వెబ్‌సైట్ ఏర్పాటుచేసి ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారంటూ దిగ్విజయ్ ట్వీటర్‌లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్ర పోలీస్ శాఖపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్‌పై పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.