పరిగి, న్యూస్‌లైన్: వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ చేపట్టిన రైతులకు ప్రోత్సాహకాలు అందజేస్తూ, మంచి ధర చెల్లిస్తూ మదర్ డెయిరీ అండగా నిలుస్తోందని రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం (నార్మాక్స్) చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి పాల శీతలీకరణ కేంద్రం అతిథి గృహంలో నార్మాక్స్ డెరైక్టర్ ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పాడి రైతుల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పాల విక్రయ మార్కెట్‌లో మదర్ డెయిరీ లేకుంటే ప్రైవేట్ డెయిరీల చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోయేవారని పేర్కొన్నారు.
మూసివేయించేందుకు ప్రైవేట్ డెయిరీల
కుట్ర: నార్మాక్స్ చైర్మన్ జితేందర్ రెడ్డి
మదర్ డెయిరీకి నష్టాలు కల్గించి మూసివేయించాలని ప్రైవేటు డెయిరీలు కుట్రలు చేస్తున్నాయని నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి ఆరోపించారు. పాడి రైతులకు అధిక ధర ఆశ చూపించి తమవైపు తిప్పుకుంటున్న ప్రైవేట్ డెయిరీలు చివరకు వారిని మోసం చేస్తున్నాయన్నారు. గతంలో మదర్ డెయిరీ ద్వారా 2.25లక్షల లీటర్ల పాలు సేకరించేవారమని, ప్రైవేటు డెయిరీల కుట్రలతో ఇప్పుడు అది సగానికి పడిపోయిందన్నారు. ఏదేమైనా రైతుకు మంచి ధర, వినియోగదారులకు నాణ్యమైన పాలు అందించే లక్ష్యంతోనే మదర్ డెయిరీ పనిచేస్తోందని స్పష్టం చేశారు.
రంగారెడ్డి జిల్లాలో పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఆవు పాలపై లీటర్‌కు రూ.1.50పైసలు, గేదె పాలపై లీటర్‌కు రూ.2అదనంగా ఇన్సెంటివ్ చెల్లిస్తున్నామన్నారు. గత సీజన్‌లో లీటర్‌కు రూ.1 చొప్పున రైతుల నుంచి కట్ చేసిన డబ్బులు రూ.2.16 కోట్లు ఇప్పుడు తిరిగి వారికి చెల్లిస్తున్నామని తెలిపారు. అదే ప్రైవేట్ డెయిరీలు లీటర్‌కు రూ.5చొప్పున కట్ చేసి, వాటిని రైతులకు తిరిగి ఇవ్వకుండా తమవద్దే ఉంచుకున్నాయన్నారు. కర్ణాటక ప్రభుత్వం పాడి రైతుకు లీటర్‌కు రూ.4 చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తోందని, అలాగే మన రాష్ట్రంలోనూ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆవుపాలపై ప్రచారం జరగాలి: ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి
ఎన్నో పోషక విలువలున్న ఆవుపాలను వ్యాపార దృక్కోణంలో చిన్నచూపు చూడటం తగదని ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి అన్నారు. ఎంతో ఔషధగుణాలు ఆవు పాలలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతుంటే... డెయిరీలు మాత్రం ఫ్యాట్ తక్కువగా వస్తుందనే కారణంతో తక్కువ ధర చెల్లిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవు పాల ప్రాముఖ్యతపై ప్రచారం జరగాల్సిన అవసరం ఉందని, మదర్ డెయిరీ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.
సమావేశంలో భాగంగా గత పాల ఉత్పత్తి సీజన్‌లో రైతుల నుంచి మదర్ డెయిరీ కట్ చేసిన డబ్బులను తిరిగి రైతులకు అందజేశారు. అనంతరం సహకార సంఘంలో సభ్యులైన రైతుల పిల్లల్లో పదో తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఒక్కొక్కరికి రూ.5వేలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయమాల, నార్మాక్స్ డెరైక్టర్లు రాంరెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ డెరైక్టర్ మేడిద రాజేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.పి.బాబయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సురేందర్‌కుమార్, నార్మాక్స్ ఎండీ సురేష్‌బాబు, డీజీఎంలు విజేందర్‌రెడ్డి, రమేష్, పరిగి కేంద్రం మేనేజర్ రవీందర్ పాల్గొన్నారు.
పాడిరైతులకు అండగా మదర్ డెయిరీ
Published Fri, Feb 28 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM
Advertisement
Advertisement