Private dairy
-
విన్న‘పాల’పై సానుకూలం!
♦ సహకార డెయిరీలకు ప్రోత్సాహకం ♦ కరీంనగర్, మదర్, ముల్కనూర్ ♦ డెయిరీలకు ఇచ్చే యోచనలో సర్కారు ♦ మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించిన మంత్రులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు ఇస్తున్న రూ.4 ప్రోత్సాహకాన్ని సహకార డెయిరీలకూ ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. కరీంనగర్, మదర్, ముల్కనూర్ డెయిరీల విన్నపాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. పాల ప్రోత్సాహకాన్ని ప్రైవేటు డెయిరీలకు చెందిన రైతులకు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ప్రభుత్వంపై పడే భారమెంత? తదితర అంశాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరు కాలేదు. భేటీ అనంతరం పోచారం, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 86,515 మంది రైతులకు రూ.4 ప్రోత్సాహకం ఇస్తున్నామని మంత్రి పోచారం చెప్పారు. అందులో 98 శాతం మంది 25 లీటర్ల లోపు పాలు పోసే రైతులేనన్నారు. 2 శాతం మంది 25 లీటర్లకు మించి పాలు పోసే వారున్నారన్నారు. విజయ డెయిరీకి జిల్లాల్లో 8 చిన్న డెయిరీలున్నాయని, వాటిని బలోపేతం చేస్తామన్నారు. కల్తీలేని పాలు విజయ డెయిరీవేనన్నారు. ప్రైవేటు డెయిరీల పాలు కల్తీవన్న విమర్శలున్నాయని వ్యాఖ్యానించారు. మదర్, కరీంనగర్, ముల్కనూర్ సొసైటీ డెయిరీలు తమకూ పాల ప్రోత్సాహకం ఇవ్వాలని కోరుతున్నాయని, దీనిపై మరోసారి జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు పాల ప్రోత్సాహకం బకాయిలను వారంలోగా చెల్లిస్తామన్నారు. పాల ఉత్పత్తికి విధానం తీసుకొస్తామని మంత్రి జగదీశ్ పేర్కొన్నారు. ఇతర దేశాల్లోనూ పాల ఉత్పత్తికి సంబంధించి ఉన్న విధానాలను అధ్యయనం చేస్తామన్నారు. వాటికి ప్రోత్సాహకం ఎలా ఇస్తారు? మదర్, కరీంనగర్ డెయిరీలకు ప్రోత్సాహకం ఎలా ఇస్తారని తెలంగాణ ఆదర్శ పాడి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బాల్‌రెడ్డి విమర్శించారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు మాత్రమే ప్రోత్సాహకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికే డబ్బులు ఇవ్వడానికి నిధులు లేవని చేతులెత్తేసిన సర్కారు పెద్ద ప్రైవేటు డెయిరీలకు కూడా ఇవ్వాలనుకోవడం శోచనీయమన్నారు. పాల ప్రోత్సాహకంపై సలహాలతో వారంలో నివేదిక ఇవ్వాలని తమ సంఘాన్ని మంత్రివర్గ ఉపసంఘం కోరిందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. -
ప్రైవేటు డెయిరీలపై సర్కారు కొరడా
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు డెయిరీలపై సర్కారు కొరడా ఝులిపించనుంది. ఇష్టారాజ్యంగా పాల ధరలు పెంచి వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని నిరోధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా నిత్యావసర సరుకుల చ ట్టాన్ని పాలకు కూడా వర్తింప చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపాదనలు తయారు చేస్తోంది. అవసరమైతే అందుకోసం ఆర్డినెన్స్ తేవడానికి కూడా వెనకాడకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే అమలైతే ప్రభుత్వం చెప్పిన ధరలకే ప్రైవేటు డైయిరీలు పాలను విక్రయించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే ధరలు అధికం! దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలుగు రాష్ట్రాల్లో పాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రైవేటు డెయిరీలు ఇష్టానుసారంగా ధరలు పెంచాయి. పాడిని కేవలం వ్యాపారం చేసే పరిశ్రమగానే గుర్తించాయి. కర్ణాటకలో లీటర్ పాల ధర రూ.29, అహ్మదాబాద్‌లో రూ.35, ముంబైలో రూ. 38 ఉంది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ, వ్రైవేటు డెయిరీలు స్వల్పతేడాతోనే పాలను విక్రయిస్తున్నాయి. అక్కడప్రైవేటు సంస్థలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకునే అవకాశం లేదు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రభుత్వ విజయ పాలు లీటర్‌కు రూ. 38 ఉండగా, ప్రైవేటు డెయిరీలు రూ. 42 నుంచి రూ. 46 వరకు అమ్ముతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం ఎక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ డెయిరీ ఆధ్వర్యంలోనే అన్ని పాడి సహకార సంస్థలు పనిచేసేవి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పాలు అమ్మేవి. అయితే మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్) చట్టం వచ్చాక అనేక సహకార డెయిరీలు ప్రభుత్వ ఆధీనంలో లేకుండా పోయాయి. ప్రస్తుతం అవి కొందరు రాజకీయ నేతల కనుసన్నల్లో నడుస్తూ... వారి సొంత ఆస్తులుగా చలామణి అవుతున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహకాన్ని ఇచ్చింది. అంతేకాక అంగన్వాడీ కేంద్రాలకు విజయ పాలనే సరఫరా చేయాలని నిర్ణయించింది. దీంతో ఆగకుండా ప్రైవేటు డెయిరీలకు ముకుతాడు వేయాలని నిర్ణయించింది. సామాన్యుడికి పాల ధర అందుబాటులో ఉంచేందుకు నిత్యావసర సరుకుల చట్టం కిందకు పాలను తీసుకొచ్చి పాల ధరలను ప్రభుత్వమే నిర్ణయించేలా చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాలమేరకు అధికారులు న్యాయపరమైన అంశాలపై తాజాగా న్యాయశాఖ కార్యదర్శితో చర్చించినట్లు తెలిసింది. న్యాయశాఖతో సంప్రదింపుల అనంతరం పాలను నిత్యావసర సరుకుల చట్టం పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం కూడా లేకపోలేదని ఉన్నతస్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. ఇదే జరిగితే అన్ని డెయిరీల పాల ధరలు ప్రభుత్వ నియంత్రణలోకి వస్తాయి. తద్వారా పాల ధరలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
మా డెయిరీ... మాగ్గావలే
రాజమణి: బర్లు పాలిస్తన్నయా దుర్గమ్మా ? పాలు కేంద్రానికే పోస్తున్నారా? దుర్గమ్మ: పాల కేంద్రాలది అంత దోపిడుంది మేడం. ఊళ్లె నాలుగు ప్రబేటు(ప్రైవేటు) డెయిరీలున్నయి. నాలుక్కు నాలుగు డెయిరీలు దోసుకునేడేగాని ఏమన్న ఉన్నదా..! బర్రె పాలకు రూ.25, ఆవు పాలకు రూ.12 సొప్పున కూడా కట్టిత్తలేరు. ఇంత మోసం ఉంటదా మేడం. మన డెయిరీ మనకుండాలే. మీరు ముఖ్యమంత్రి సారుకు జెప్పి మన దగ్గర రెండేళ్ల నుంచి మూసేసిన సర్కారు డెయిరీ(విజయ డెయిరీ)ని మళ్లా తెరిపియ్యాలే మేడం. రాజమణి: ముఖ్యమంత్రి గారు విజయ డెయిరీలో పాలుపోస్తే రూ.4ఎక్కువ కట్టిస్తమని చెప్పారు కదా? మహిళలు: విజయ డెయిరీకిపాలుబోస్తే రూ.4 ఎక్కు వ కట్టిత్తమని కేసీఆర్ సారు జెప్పిరి గని... మన ఆ డైరై లేకపాయే. అందుకే మా డెయిరీ మాగ్గావాలే. బ్యాంకోళ్లు కూడా మంచోళ్లు కాదు మేడం. ప్రబేటు డైరోడు చెప్పంగనే బర్రెలు కొనుక్కొమ్మని లోన్లు ఇత్త రు, అదే సర్కారు చెప్తే మాత్రం మాట చెవులగూడ పెట్టరు. మోసమంతా బ్యాంకొళ్లతోనే ఉంది మేడం. రాజమణి: అంతా మీటింగు పెట్టుకున్నట్టున్నారు? సరస్వతి, నాగమణి: అవును మేడం. మండల సమా ఖ్య మీటింగు పెట్టుకున్నం. అన్ని గ్రామల సమాఖ్యల అధ్యక్షులు, కార్యదర్శులు వచ్చారు. ధాన్యం కొనుగోళ్ల మీదనే లెక్కలు, పత్రాలు చూస్తున్నం. రాజమణి: అయితే నేను రావాల్సిన టైంకే వచ్చానన్న మాట (ఆ మాటకు మహిళలంతా చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చారు.. ) రాజమణి: కొత్త ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది? సుల్తానా: ‘కళ్యాణ లచ్చిమి’ పథకం శానా మంచి పథకవమ్మా... బిడ్డ ఎదుగుతున్నదంటే గుండెల మీద కుంపటి పెట్టుకున్నట్టే ఉండే. కేసీఆర్ పథకం మంచిగ పెట్టిండు. సంపూర్ణ: (మధ్యలో క ల్పించుకుంటూ) మా బీసీలకు కూడా ఆ పథకం పెట్టమని మీరు జెప్పాలే మేడం. ఆడపిల్ల లగ్గం అంటే అందరికీ ఖర్సేగదమ్మా. దేవమ్మ: తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం... ఇంటి మొగుళ్లు అటీటుపోయినా, మేం కేసీఆర్ సారుకు ఓట్లేసి గెలిపిచ్చినం. మా పేదోళ్లకు పెట్టేకాడా కేసీఆర్ సారు ఎన్కముందాడొద్దు. ఇప్పటిదాకా ఇంకా సర్కారు ఏంజేయలే... పని ఇక షురుజేయిరి. రాజమణి: మీకున్న సమస్యలు ఏమిటో చెప్పండి? ఎస్.సరస్వతి: మా ప్రాబ్లమ్స్ అంటే... మాకు గ్రామ సంఘాలు మీటింగ్‌లు పెట్టుకోవడానికి బిల్డిగ్స్ లేవు. అవొకటి మాకు కంపల్సరి కావాలే మేడం. బ్యాంకు లింకేజీతో శానా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేడం.. లోన్లు సరిగా ఇవ్వకపోవడం, క్రాఫ్ లోన్లకు లింకు పెట్టడం వల్ల శానా ప్లాబ్లం అయింతంది. శ్రీనిధికి గతంలో వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని చెప్పిండ్రు. అప్పుడు ఇచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టించుకుంటున్నారు. శ్రీనిధికి వడ్డీలేని రుణం వర్తించాలని కోరుతున్నం మేడం. మేన్‌గా ఏదంటే మేడం...వీఓఎల్లకు 18 నెలల నుంచి జీతాలు లేవు. అవి కూడా రావాలె మేడం. రాజమణి: ఇంకా ఏమేమి సమస్యలున్నాయి? నాగమణి: మేం లీడర్లుగా వచ్చి రెండు ఏళ్లు అయింది. ఈ రెండేళ్లలో అన్ని విషయాలు కరెక్టుగా తెల్వలేదు. వీవో లీడర్స్ రెండు ఏళ్ల కంటే ఎక్కువగా ఉండొద్దని డీఆర్డీఏ అధికారులు మా మీద టార్చర్ చేస్తున్నరు. బైలాలో మేం 5 ఏళ్ల వరకు పని చేయవచ్చని ఉంది. రాజమణి: అధికారులు ఎందుకు అలా చేస్తున్నారు? నాగ మణి, సరస్వతి: వాళ్ల భయం ఏమిటంటే... మేం ఎక్కువ రోజులు ఉంటే ఈ కొనుగోళ్లు, ఇతర ఆఫీసు పనులల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటాం కదా మేడం, అన్ని తెలుసుకొని అధికారులను ఎక్కడ నిలదీస్తామోనని భయం మేడం. రాజమణి: ఏం యాదమ్మ బాగున్నవా? ఊరు నుంచి ఎప్పుడు బయలుదేరినవ్? యాదమ్మ: బాగున్నమ్మా.. మండల సమాఖ్య మీటింగ్ అంటే కైకిలి ఎగ్గొట్టొచ్చిన. గ్రామ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శిలు మండలాలలకు, జిల్లాకు మీటింగులకు ఒచ్చినప్పుడు రూ.100 ఇస్తున్నరమ్మా... మీటింగులకు ఒచ్చినప్పుడు మాకు కైకిలి పోద్ది... తిండికి తిప్పిలకు సేతిగుంటే పెట్టుకుంటన్నం. ఇట్లదిరగాలే. ఏం లాభం లేదమ్మా. రాజమణి: బ్యాంకు రుణాలు బాగా అందుతున్నాయా? లక్ష్మి: డిఫాల్టు గ్రూపులతోని పెద్ద సమస్య ఒచ్చింది మేడం. ‘సర్కారేమో మాఫీ అయిందంటున్నరు. మీరేమో అప్పుగ ట్టమని ఇంటిముందరికి ఒచ్చి అడుగుతున్నరు, మీరు తింటానికేనా’ అని మా మీదికే ఎగబడుతున్నరు. బ్యాంకొళ్లేమో ఆళ్లు అప్పులు గడితేనే మీకు లోన్లిత్తం అంటన్నరు. ఏంజేయ్యాలే మేడం. నర్సమ్మ: తెలంగాణ పభుత్వం వస్తే క్రాఫ్లోన్లు మాఫీజేస్తమని చెప్పిరి. మహిళా సంఘాలకు రుణం ఇయ్యమని బ్యాంకుకు పోతే, మీరు కాఫ్లోన్గట్టలేదుకదా.. అవికడితేనే గ్రూపు లోన్లు ఇస్తామని చెప్పుతున్నరు మేడం. వెంటనే మెహర్ ఉన్నీసా అందుకుంటూ.... మెహర్ ఉన్నీసా: గ్రూపుల్లో రాజకీయ ప్రమేయం ఎక్కువైంది. సర్పంచ్ గ్రూపు సభ్యులు, వార్డు మెంబర్ల గ్రూపు సభ్యులే ఎక్కువ డిఫాల్టర్లుగా ఉన్నారు. ఈ సర్పంచులు, ఎంపీటీసీలే మహిళలను లోన్లు కట్టనిస్తలేరు. కట్టేవారిని కూడా వద్దని చెప్తున్నారు. ప్రభుత్వమే లోన్లు కడుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నర్సాపూర్‌లో డిఫాల్టర్లు ఎక్కువగా ఉండటంతో బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి హామీలు డ్వాక్రా మహిళలకు భవనం ఏర్పాటు విషయమై తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాం, వీఓఎల్స్ జీతాల విషయం కూడా సీఎం గారి దృష్టికి తీసుకుని తొందరలోనే పరిష్కరిద్దాం. నిధికి వడ్డీ లేని రుణాలు అందించమని మీ తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుతా . రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుల పంట రుణాలు మాఫీ చేసింది. 25 శాతం డబ్బును కూడా ప్రభుత్వం జమ చేసింది. ఏ బ్యాంకరైనా గ్రూప్లోన్కు, క్రాఫ్ లోనుకు ముడిపెడితే వెంటనే నా దృష్టికి తీసుకు రండి. వెళ్లి ఆ బ్యాంకు మెనేజర్‌ను నిలదీద్దాం. మంత్రి హరీషన్నతో మాట్లాడి మళ్లీ సర్కారు డెయిరీని తెరిపించేందుకు ప్రయత్నం చేస్తాం. -
పాల సేకరణ పెంపునకు చర్యలు
సంగారెడ్డి అర్బన్:జిల్లాలో పాల సేకరణను భారీగా పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో బుధవారం నూతనంగా ఏర్పాటైన జిల్లా పాడి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పాలు, పాల సేకరణకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ డెయిరీలకు దీటుగా ప్రభుత్వం విజయ డెయిరీ పాడి రైతులకు పాల సేకరణ ధను లీటరుకు రూ.4లు పెంచిందని, పాడి రైతులు దళారుల బారిన పడి మోసపోకుండా విజయ ఉత్పత్తి సంఘాల్లో చేరి ప్రభుత్వం కల్పిస్తున్న పాడి పశువుల ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 40వేల లీటర్ల పాలను ప్రతిరోజు సేకరిస్తున్నామన్నారు. దీనిని జనవరి నాటికి 80 వేల లీటర్లకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సంఘాలు చురుకుగా పనిచే సి పాల సేకరణ పెంపునకు కృషి చేయాలని, నిరుద్యోగ యువతకు మినీ డెయిరీలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలను కల్పిస్తామన్నారు. సమావేశంలో పశు సంవర్థక శాఖ జేడీ లక్ష్మారెడ్డి, డెయిరీ డీడీ రమేష్, వ్యవసాయ శాఖ జేడీ హుక్యా నాయక్, డ్వామా పీడీ రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్ తదితరులు పాల్గొన్నారు. -
పాడిరైతులకు అండగా మదర్ డెయిరీ
పరిగి, న్యూస్‌లైన్: వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ చేపట్టిన రైతులకు ప్రోత్సాహకాలు అందజేస్తూ, మంచి ధర చెల్లిస్తూ మదర్ డెయిరీ అండగా నిలుస్తోందని రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం (నార్మాక్స్) చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి పాల శీతలీకరణ కేంద్రం అతిథి గృహంలో నార్మాక్స్ డెరైక్టర్ ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పాడి రైతుల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పాల విక్రయ మార్కెట్లో మదర్ డెయిరీ లేకుంటే ప్రైవేట్ డెయిరీల చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోయేవారని పేర్కొన్నారు. మూసివేయించేందుకు ప్రైవేట్ డెయిరీల కుట్ర: నార్మాక్స్ చైర్మన్ జితేందర్ రెడ్డి మదర్ డెయిరీకి నష్టాలు కల్గించి మూసివేయించాలని ప్రైవేటు డెయిరీలు కుట్రలు చేస్తున్నాయని నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి ఆరోపించారు. పాడి రైతులకు అధిక ధర ఆశ చూపించి తమవైపు తిప్పుకుంటున్న ప్రైవేట్ డెయిరీలు చివరకు వారిని మోసం చేస్తున్నాయన్నారు. గతంలో మదర్ డెయిరీ ద్వారా 2.25లక్షల లీటర్ల పాలు సేకరించేవారమని, ప్రైవేటు డెయిరీల కుట్రలతో ఇప్పుడు అది సగానికి పడిపోయిందన్నారు. ఏదేమైనా రైతుకు మంచి ధర, వినియోగదారులకు నాణ్యమైన పాలు అందించే లక్ష్యంతోనే మదర్ డెయిరీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఆవు పాలపై లీటర్‌కు రూ.1.50పైసలు, గేదె పాలపై లీటర్‌కు రూ.2అదనంగా ఇన్సెంటివ్ చెల్లిస్తున్నామన్నారు. గత సీజన్లో లీటర్‌కు రూ.1 చొప్పున రైతుల నుంచి కట్ చేసిన డబ్బులు రూ.2.16 కోట్లు ఇప్పుడు తిరిగి వారికి చెల్లిస్తున్నామని తెలిపారు. అదే ప్రైవేట్ డెయిరీలు లీటర్‌కు రూ.5చొప్పున కట్ చేసి, వాటిని రైతులకు తిరిగి ఇవ్వకుండా తమవద్దే ఉంచుకున్నాయన్నారు. కర్ణాటక ప్రభుత్వం పాడి రైతుకు లీటర్‌కు రూ.4 చొప్పున ఇన్పుట్ సబ్సిడీ ఇస్తోందని, అలాగే మన రాష్ట్రంలోనూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆవుపాలపై ప్రచారం జరగాలి: ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి ఎన్నో పోషక విలువలున్న ఆవుపాలను వ్యాపార దృక్కోణంలో చిన్నచూపు చూడటం తగదని ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి అన్నారు. ఎంతో ఔషధగుణాలు ఆవు పాలలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతుంటే... డెయిరీలు మాత్రం ఫ్యాట్ తక్కువగా వస్తుందనే కారణంతో తక్కువ ధర చెల్లిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవు పాల ప్రాముఖ్యతపై ప్రచారం జరగాల్సిన అవసరం ఉందని, మదర్ డెయిరీ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. సమావేశంలో భాగంగా గత పాల ఉత్పత్తి సీజన్లో రైతుల నుంచి మదర్ డెయిరీ కట్ చేసిన డబ్బులను తిరిగి రైతులకు అందజేశారు. అనంతరం సహకార సంఘంలో సభ్యులైన రైతుల పిల్లల్లో పదో తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఒక్కొక్కరికి రూ.5వేలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయమాల, నార్మాక్స్ డెరైక్టర్లు రాంరెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ డెరైక్టర్ మేడిద రాజేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.పి.బాబయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సురేందర్‌కుమార్, నార్మాక్స్ ఎండీ సురేష్‌బాబు, డీజీఎంలు విజేందర్‌రెడ్డి, రమేష్, పరిగి కేంద్రం మేనేజర్ రవీందర్ పాల్గొన్నారు. -
రోగాల‘పాలు’!
=పడమటి మండలాల్లో యథేచ్ఛగా కల్తీపాల విక్రయాలు =పట్టించుకోని ఫుడ్ ఇన్స్పెక్టర్లు జిల్లాలోని పడమటి మండలాల్లో కల్తీపాల విక్రయాల జోరు పెచ్చుమీరుతోంది. కిలో పాల పొడితో పది లీటర్ల కల్తీ పాలు తయారుచేసి వినియోగదారులకు అంటగడుతున్నారు. ఫలితంగా వ్యాధులు ప్రబలుతాయేమోనని స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు. కల్తీ పాల వ్యాపారాన్ని అరికట్టాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు పట్టీపట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. మదనపల్లె/తంబళ్లపల్లె, న్యూస్‌లైన్ : పడమటి మండలాల్లో ఇటీవల వరుస కరువుల కారణంగా పాడి సంపద తగ్గిపోయింది. అదే స్థాయిలో పాల దిగుబడీ పడిపోయింది. ఇదే అదునుగా కొందరు పాల ఏజెంట్లు కృత్రిమ పాల తయారీకి పూనుకున్నారు. పలు ప్రైవేటు డెయిరీల మేనేజర్లు, సిబ్బంది, సూపర్వైజర్ల అండతో ఈ వ్యాపారాన్ని సులువగా కానిచ్చేస్తున్నారు. బెంగళూరు నుంచి పాల పౌడర్ ప్యాకెట్ల దిగుమతి పాలపౌడర్ ప్యాకెట్లు బెంగళూరు నుంచి గుర్రంకొండకు చెందిన ఓ వ్యాపారి గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేసుకుంటున్నాడు. ఆ వ్యాపారి పాలపొడి పొట్లాలను పడమటి మండలాలకు చేరవేస్తూ కంటపడితే ముడుపులిచ్చి సర్దిపెడుతున్నాడు. దీంతో ఈ అక్రమ రవాణా చాపకింద నీరులా విస్తరిస్తోంది. పదార్థాల నాణ్యతను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఓ బస్తాలో 25 ప్యాకెట్లు ఉంటాయి. ఒక్కో ప్యాకెట్ రూ.64 వరకు విక్రయిస్తున్నారు. పాల తయారీ ఇలా పాలపౌడర్ చూడ్డానికి తెలుపురంగులో ఉంటుంది. ఏ మాత్రం తేమ తగిలినా బంకగా మారుతుంది. పది లీటర్ల నీటిలో ఒక కిలో పౌడర్వేసి చేతితో బాగా కలియతిప్పుతారు. చూడడానికి పాలులాగా కనబడుతాయి. రుచి ఉండదు. పెరుగు చేద్దామన్నా పనికిరాదు. వీటిని మామూలు పాలలో కల్తీ చేస్తేనే వినియోగానికి పనికివస్తాయి. తంబళ్లపల్లె మండలంలోనే రోజుకు 25 క్యాన్ల (వెయ్యి లీటర్లు) కృత్రిమ పాలు వివిధ డెయిరీలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ పౌడర్ కలపడం వల్ల వెన్న శాతం 26 డిగ్రీలు వస్తుంది. దీంతో డెయిరీలలో లీటరు పాలకు రూ.23 ధర లభిస్తోంది. పూటకు ఒక పాల ప్యాకెట్ కలిపి పాలు సరఫరా చేస్తే 15 రోజులకు రూ.5వేల వరకు సంపాదించవచ్చు. ఇలా ఏడాదికి రూ.6 లక్షల వరకు ఏజెంట్లు ఆదాచేస్తున్నట్టు సమాచారం. డెయిరీలకూ నష్టమే కృత్రిమ పాల వ్యాపారంతో ప్రయివేటు డెయిరీలూ నష్టపోతున్నట్టు తెలుస్తోంది. డెయిరీలకు వచ్చిన పాలలో వెన్న తీసిన అనంతరం పాల స్వచ్ఛతను పెంచడానికి నాణ్యమైన మిల్క్ పౌడర్ కలిపేవారు. ఇప్పుడు ఈ కృత్రిమ పాల తంతుతో పాలలో వెన్నె అంతంతమాత్రంగానే వస్తోంది. దీంతో డెయిరీలు నష్టపోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ డెయిరీలో పనిచేసే ఓ అధికారి మాట్లాడుతూ ఎల్ఆర్ (పాల స్వచ్ఛత) పెరిగేందుకు ఇలాంటి పౌడర్‌ను వాడుతారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన నాణ్యమైన పౌడర్లు టీ, కాఫీలకు మాత్రమే వాడవచ్చు. నాణ్యత లేని పౌడర్లు వాడితే అనర్థాలు తప్పవని హెచ్చరించారు. కృత్రిమ పాలతో రోగాలు తథ్యం కృత్రిమ పాలు తాగడం వల్ల మనిషిలోని ప్రతి అవయం మీద దాని ప్రభావం పడుతుంది. చిన్నపిల్లలు తాగడం వల్ల వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. - డాక్టర్ సుబ్బారెడ్డి, చిన్నపిల్లల వైద్యులు, మదనపల్లె