మా డెయిరీ... మాగ్గావలే | VIP reporter rajamani | Sakshi
Sakshi News home page

మా డెయిరీ... మాగ్గావలే

Published Sat, Nov 15 2014 11:36 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

VIP reporter rajamani

 రాజమణి: బర్లు పాలిస్తన్నయా దుర్గమ్మా ? పాలు కేంద్రానికే పోస్తున్నారా?
 దుర్గమ్మ: పాల కేంద్రాలది అంత దోపిడుంది మేడం. ఊళ్లె నాలుగు ప్రబేటు(ప్రైవేటు) డెయిరీలున్నయి. నాలుక్కు నాలుగు డెయిరీలు దోసుకునేడేగాని ఏమన్న ఉన్నదా..! బర్రె పాలకు రూ.25, ఆవు పాలకు రూ.12 సొప్పున కూడా కట్టిత్తలేరు. ఇంత మోసం ఉంటదా మేడం. మన డెయిరీ మనకుండాలే. మీరు ముఖ్యమంత్రి సారుకు జెప్పి మన దగ్గర రెండేళ్ల నుంచి మూసేసిన సర్కారు డెయిరీ(విజయ డెయిరీ)ని మళ్లా తెరిపియ్యాలే మేడం.
 
 రాజమణి: ముఖ్యమంత్రి గారు విజయ డెయిరీలో పాలుపోస్తే రూ.4ఎక్కువ కట్టిస్తమని చెప్పారు కదా?
 మహిళలు: విజయ డెయిరీకిపాలుబోస్తే రూ.4 ఎక్కు వ కట్టిత్తమని కేసీఆర్ సారు జెప్పిరి గని... మన ఆ డైరై లేకపాయే. అందుకే మా డెయిరీ మాగ్గావాలే.  బ్యాంకోళ్లు కూడా మంచోళ్లు కాదు మేడం. ప్రబేటు డైరోడు చెప్పంగనే బర్రెలు కొనుక్కొమ్మని లోన్లు ఇత్త రు, అదే సర్కారు చెప్తే మాత్రం మాట చెవులగూడ పెట్టరు. మోసమంతా బ్యాంకొళ్లతోనే ఉంది మేడం.
 
 రాజమణి: అంతా మీటింగు పెట్టుకున్నట్టున్నారు?
 సరస్వతి, నాగమణి: అవును మేడం. మండల సమా ఖ్య మీటింగు పెట్టుకున్నం. అన్ని గ్రామల సమాఖ్యల అధ్యక్షులు, కార్యదర్శులు వచ్చారు. ధాన్యం కొనుగోళ్ల మీదనే లెక్కలు, పత్రాలు చూస్తున్నం.
 రాజమణి: అయితే నేను రావాల్సిన టైంకే వచ్చానన్న మాట (ఆ మాటకు మహిళలంతా చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చారు.. )

 రాజమణి:  కొత్త ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది?
 సుల్తానా: ‘కళ్యాణ లచ్చిమి’ పథకం శానా మంచి పథకవమ్మా... బిడ్డ ఎదుగుతున్నదంటే గుండెల
 మీద కుంపటి పెట్టుకున్నట్టే ఉండే. కేసీఆర్ పథకం మంచిగ పెట్టిండు.
 సంపూర్ణ: (మధ్యలో క ల్పించుకుంటూ) మా బీసీలకు కూడా ఆ పథకం పెట్టమని మీరు జెప్పాలే మేడం. ఆడపిల్ల లగ్గం అంటే అందరికీ ఖర్సేగదమ్మా.
 దేవమ్మ:  తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం... ఇంటి మొగుళ్లు అటీటుపోయినా, మేం కేసీఆర్ సారుకు ఓట్లేసి గెలిపిచ్చినం. మా పేదోళ్లకు పెట్టేకాడా కేసీఆర్ సారు ఎన్కముందాడొద్దు. ఇప్పటిదాకా ఇంకా సర్కారు ఏంజేయలే... పని ఇక షురుజేయిరి.

 రాజమణి: మీకున్న సమస్యలు ఏమిటో చెప్పండి?
 ఎస్.సరస్వతి: మా ప్రాబ్లమ్స్ అంటే... మాకు గ్రామ సంఘాలు  మీటింగ్‌లు పెట్టుకోవడానికి బిల్డిగ్స్ లేవు. అవొకటి  మాకు కంపల్‌సరి కావాలే మేడం. బ్యాంకు లింకేజీతో శానా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేడం.. లోన్లు సరిగా ఇవ్వకపోవడం, క్రాఫ్ లోన్లకు లింకు పెట్టడం వల్ల శానా ప్లాబ్లం అయింతంది.

 శ్రీనిధికి గతంలో వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని చెప్పిండ్రు. అప్పుడు ఇచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టించుకుంటున్నారు. శ్రీనిధికి వడ్డీలేని రుణం వర్తించాలని కోరుతున్నం మేడం. మేన్‌గా ఏదంటే మేడం...వీఓఎల్‌లకు 18 నెలల నుంచి జీతాలు లేవు. అవి కూడా రావాలె మేడం.

 రాజమణి: ఇంకా ఏమేమి సమస్యలున్నాయి?
 నాగమణి:  మేం లీడర్లుగా వచ్చి రెండు ఏళ్లు అయింది. ఈ రెండేళ్లలో అన్ని విషయాలు కరెక్టుగా తెల్వలేదు. వీవో లీడర్స్ రెండు ఏళ్ల కంటే ఎక్కువగా ఉండొద్దని డీఆర్‌డీఏ అధికారులు మా మీద టార్చర్ చేస్తున్నరు. బైలాలో మేం 5 ఏళ్ల వరకు పని చేయవచ్చని ఉంది.

 రాజమణి:  అధికారులు ఎందుకు అలా చేస్తున్నారు?
 నాగ మణి, సరస్వతి:  వాళ్ల భయం ఏమిటంటే... మేం ఎక్కువ రోజులు ఉంటే ఈ కొనుగోళ్లు, ఇతర ఆఫీసు పనులల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటాం కదా మేడం, అన్ని తెలుసుకొని అధికారులను ఎక్కడ నిలదీస్తామోనని భయం మేడం.

 రాజమణి: ఏం యాదమ్మ బాగున్నవా? ఊరు నుంచి ఎప్పుడు బయలుదేరినవ్?
 యాదమ్మ:  బాగున్నమ్మా.. మండల సమాఖ్య మీటింగ్ అంటే కైకిలి ఎగ్గొట్టొచ్చిన. గ్రామ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శిలు మండలాలలకు, జిల్లాకు మీటింగులకు  ఒచ్చినప్పుడు రూ.100 ఇస్తున్నరమ్మా...  మీటింగులకు  ఒచ్చినప్పుడు మాకు కైకిలి పోద్ది... తిండికి తిప్పిలకు సేతిగుంటే పెట్టుకుంటన్నం. ఇట్లదిరగాలే. ఏం లాభం లేదమ్మా.

 రాజమణి: బ్యాంకు రుణాలు బాగా అందుతున్నాయా?
 లక్ష్మి: డిఫాల్టు గ్రూపులతోని పెద్ద సమస్య ఒచ్చింది మేడం. ‘సర్కారేమో మాఫీ అయిందంటున్నరు. మీరేమో  అప్పుగ ట్టమని ఇంటిముందరికి ఒచ్చి అడుగుతున్నరు, మీరు తింటానికేనా’ అని మా మీదికే ఎగబడుతున్నరు. బ్యాంకొళ్లేమో ఆళ్లు అప్పులు గడితేనే మీకు లోన్‌లిత్తం అంటన్నరు. ఏంజేయ్యాలే మేడం.  
 నర్సమ్మ: తెలంగాణ పభుత్వం వస్తే క్రాఫ్‌లోన్లు మాఫీజేస్తమని చెప్పిరి. మహిళా సంఘాలకు రుణం ఇయ్యమని బ్యాంకుకు పోతే, మీరు కాఫ్‌లోన్‌గట్టలేదుకదా.. అవికడితేనే గ్రూపు లోన్లు ఇస్తామని చెప్పుతున్నరు మేడం.   
 వెంటనే మెహర్ ఉన్నీసా అందుకుంటూ....
 మెహర్ ఉన్నీసా: గ్రూపుల్లో రాజకీయ ప్రమేయం ఎక్కువైంది. సర్పంచ్ గ్రూపు సభ్యులు, వార్డు మెంబర్ల గ్రూపు సభ్యులే ఎక్కువ డిఫాల్టర్లుగా ఉన్నారు. ఈ సర్పంచులు, ఎంపీటీసీలే మహిళలను లోన్లు కట్టనిస్తలేరు. కట్టేవారిని కూడా వద్దని చెప్తున్నారు. ప్రభుత్వమే లోన్లు కడుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నర్సాపూర్‌లో డిఫాల్టర్లు ఎక్కువగా ఉండటంతో బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదు.

 జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి హామీలు
 డ్వాక్రా మహిళలకు  భవనం ఏర్పాటు విషయమై తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాం, వీఓఎల్స్ జీతాల విషయం కూడా సీఎం గారి దృష్టికి తీసుకుని తొందరలోనే పరిష్కరిద్దాం.

 నిధికి వడ్డీ లేని రుణాలు అందించమని మీ తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుతా .
 రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుల పంట రుణాలు మాఫీ చేసింది. 25 శాతం డబ్బును కూడా ప్రభుత్వం జమ చేసింది.  ఏ బ్యాంకరైనా గ్రూప్‌లోన్‌కు, క్రాఫ్ లోనుకు ముడిపెడితే వెంటనే నా దృష్టికి తీసుకు రండి. వెళ్లి ఆ బ్యాంకు మెనేజర్‌ను నిలదీద్దాం.

 మంత్రి హరీషన్నతో మాట్లాడి మళ్లీ సర్కారు డెయిరీని తెరిపించేందుకు ప్రయత్నం చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement